Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఉపఎన్నికల్లో మద్యం పంపిణీని నివారించాలి

$
0
0

నెల్లూరు , మే 2: నెల్లూరు పార్లమెంట్, ఉదయగిరి అసెంబ్లీ నియోజక వర్గాలకు వచ్చే నెల్లో నిర్వహించనున్న ఉప ఎన్నికల్లో మద్యం పంపిణీని నివారించేందుకు సమగ్ర తనిఖీలు నిర్వహించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి శ్రీ్ధర అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ చాంబర్‌లో ఎక్సైజ్, రవాణా, ఆర్టీసి అధికారులతో ఎన్నికల నిబంధనలపై అనుసరించాల్సిన మార్గదర్శక సూత్రాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనల కారణంగా నూతనంగా లైసెన్స్‌లు ఇవ్వడం, మద్యం రవాణా చేయడం నిషిద్ధమన్నారు. ఇతర ప్రాంతాలనుండి మద్యం రవాణా కాకుండా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు, అధికారుల సమన్వయంతో చెక్‌పోస్టులు ఏర్పాటుచేయాలని, వాహనాలను తనిఖీ చేసి రోజువారీ నివేదికలను జిల్లా ఎన్నికల అధికారికి పంపాలన్నారు. నియోజకవర్గ సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి తనిఖీలు నిర్వహించాలన్నారు. ఇందుకోసం అవసరమైన సిబ్బందిని ఏర్పాటుచేసి నివేదికలు పంపాలన్నారు. బెల్ట్‌షాపులు లేకుండా చేయాలని, ప్రతి స్టాక్ పాయింట్ వద్ద 24గంటలు వీడియోతో నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఇతర ప్రాంతాలనుండి వచ్చే వాహనాలు తనిఖీ చేసేందుకు ప్రత్యేక నిఘాను ఏర్పాటుచేయాలన్నారు. రవాణా, పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహించి సీజ్ చేసిన విషయాలపై నివేదికలు పంపాల్సి ఉంటుందని చెప్పారు. జిల్లా స్థాయిలో ఎక్సైజ్‌శాఖకు సంబంధించిన నోడల్ అధికారిని నియమించి ఎన్నికల నిబంధనలకు సంబంచిన విషయాలపై తక్షణమే స్పందించేలా చూడాలన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆర్టీసి బస్సుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు, ప్రజాప్రతినిధుల ఫోటోలు లేకుండా చూడాలని, అదేవిధంగా ఇందుకు సంబంధించిన రాతలు కూడా ఉండరాదన్నారు.
ఎన్నికల సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు పంపేందుకు అవసరమైన బస్సులను సిద్ధం చేయాలని ఆయన పేర్కొన్నారు. ఇతర సరిహద్దులనుండి వచ్చే వాహనాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ జెసి లక్ష్మీకాంతం, డిఆర్‌ఓ రామిరెడ్డి, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగేశ్వరరావు, నరసింహం, ఆర్టీసి ఆర్‌ఎం కొమరయ్య, ఆర్టీఓ రాంప్రసాద్ పాల్గొన్నారు.

పెంచలకోనలో వైభవంగా ధ్వజారోహణ
రాపూరు, మే 2 : దక్షిణభారత దేశంలోని ప్రముఖ వైష్ణవాలయాల్లో ఒకటైన జిల్లాలోని రాపూరు మండల పరిధిలో వున్న శ్రీ పెంచల లక్ష్మి నృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజైన బుధవారం ధ్వజారోహణ కార్యక్రమంతో పాటు పలు అభిషేకాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఐదు గంటలకు స్వామి వారికి పట్టువస్త్రాల సమర్పణ, స్వామి అమ్మవార్లు ఆంజనేయ స్వామి పూలంకిసేవ నిర్వహించారు. అలాగే ఉదయం 8 గంటలకు తిరుచ్చిపై ఉత్సవమూర్తులను ఉంచి వివిధ పుష్పాలు, ఆభరణాలతో శోభయమానంగా అలంకరించి గిరి ప్రదర్శన నిర్వహించారు. దీంతో పాటు గరుత్మంతుడి చిత్రపటాన్ని క్షేత్రోత్సవం నిర్వహించారు. అలాగే 11 గంటల 20 నిమిషాలకు స్వామివారి ధ్వజస్తంభానికి వేదపండితుల మంత్రోచ్ఛరణలతో ధ్వజారోహణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు స్వామి అమ్మవార్ల విగ్రహాలకు పాలు, తెనే, పెరుగు, చందనంతో పాటు వివిధ రకాల పళ్ల రసాలతో స్నపన తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు. అలాగే సాయంత్రం సహస్ర దీపాలంకరణ మండపంలో స్వామి అమ్మవార్లను ఉంచి ఊంజల్‌సేవ కార్యక్రమాన్ని కన్నులపండువగా నిర్వహించారు. అలాగే రాత్రి స్వామివార్లకు అత్యంత ప్రీతికరమైన శేషవాహనంపై స్వామి అమ్మవార్లను ఉంచి కోన మాడావీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. ఈ సందర్భంగా ఈ బ్రహ్మోత్సవాల్లో సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ నెల్లూరు రవీంద్రరెడ్డి, సహాయ కమిషనర్ శనగవరపు శ్రీరామమూర్తి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు. అలాగే శాంతిభద్రతల్లో భాగంగా వెంకటగిరి సి ఐ ఆధ్వర్యంలో డక్కిలి, రాపూరు ఎస్సైలు సుధాకర్, సురేష్‌బాబుతో పాటు అధికసంఖ్యలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులందరికి స్వామి వారి ప్రసాదాలను ఉచితంగా అందజేశారు.

ఇవిఎంలను పరిశీలించిన జెసి
నెల్లూరు, మే 2: త్వరలో జరగనున్న ఉప ఎన్నిలకు సంబంధించి ఇవిఎంలను బుధవారం ఆర్‌డివో కార్యాలయం ఆవరణలో జిల్లా జాయింట్ కలెక్టర్ సౌరబ్‌గౌర్ పరిశీలించారు. వాటి స్థితిగతులను ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 2500 ఇవిఎంలు అవసరం అవుతాయన్నారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఎన్నిలకు సిద్ధంగా చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెసి వెంట ఆర్‌డివో మాధవీలత, తహశీల్దార్ అంకారావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించండి
ఉప ఎన్నికలలో ఎలాంటి ఇబ్బందులు రానీయకుండా పకడ్బందీగా నిర్వహించాలని నెల్లూరుమండల జోనల్ అధికారులను జాయింట్ కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఆదేశించారు. బుధవారం నెల్లూరు ఆర్‌డివో కార్యాలయంలో అధికారులతో సమీక్షించి అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి బూత్‌ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. సమస్యలు ఎమైనా ఉంటే జిల్లా అధికారుల దృష్టికి తీసుకోరావాలని సూచించారు. బూత్‌స్థాయి అధికారులను సమన్వయం పర్చుకుంటూ సమస్యలను అధిగచడానికి ప్రయత్నించాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో నియమించిన ప్రతి అధికారి అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కిందిస్థాయి అధికారులకు సలహా ఇస్తూ సమన్వయంతో ఎన్నికల కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్‌డివో మాధవీలత, అధికారులు పాల్గొన్నారు.

లభించని హామీ అయినా.. వైఎస్‌ఆర్‌సిలో చేరికకే కొమ్మి సిద్ధం
నెల్లూరు టౌన్, మే 2: ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు నేడో రేపో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రెండురోజుల క్రితం హైదరాబాద్‌లో ఆయన వైఎస్ జగన్‌ను కలిసి వచ్చారు. జగన్ ఆ సందర్భంలో భవిష్యత్ ప్రాధాన్యతకు సంబంధించి కొమ్మికి ఎలాంటి హామీ ఇవ్వలేదని సమాచారం. అయినాసరే తమ భవిష్యత్ రాజకీయానికి ఏకైక ప్రత్యామ్నాయంగా ఉన్న ఆ పార్టీలోకే వెళ్లేందుకు నిర్ణయించుకుంటున్నారు. ఇందుకోసం తాజాగా తన అనుచరగణాన్ని నెల్లూరులోని తన ఇంటికి పిలిపించుకుని పార్టీలో చేరిక అంశంపై తుది సమాలోచనలు జరుపుతున్నారు. ఇలాంటి సమాలోచనల్లో మాత్రం వైఎస్‌ఆర్‌సిలో చేరితేనే తమ ప్రాధాన్యత పదిలమనే కోణంలో చర్చించుకుంటున్నారు. కాగా, కొమ్మికి ఆ పార్టీలో చేరినా ప్రాధాన్యత సందేహంపై వివరాలిలా ఉన్నాయి. జగన్‌తో అత్యంత సన్నిహితంగా వ్యవహరించే మేకపాటి సోదరులే వైఎస్‌ఆర్‌సి జిల్లా సారథులుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఉదయగిరి ఉపపోరులో బరిలో నిలిచిన మేకపాటి చంద్రశేఖరరెడ్డి వచ్చే సాధారణ ఎన్నికల్లో మాత్రం తన నియోజకవర్గాన్ని ఆత్మకూరుకు మార్చుకోవాలని భావిస్తున్నారు. తమ సొంత మండలమైన మర్రిపాడు గత ఎన్నికల నుంచి ఆత్మకూరు నియోజకవర్గంలోకి చేరినందునే ఈ భావన కనిపిస్తున్నట్లు ప్రచారం. గత ఎన్నికల్లోనే ఇలా మారాలని ప్రయత్నించి విఫలమయ్యారు. ఇప్పటికే మూడవ పర్యాయం ఉదయగిరి పోటీ అవుతున్నందున భవిష్యత్‌లో నియోజకవర్గం మార్చుకోకుంటే కష్టమే అనేది మేకపాటి భావన. అలా జరిగితే ఇప్పుడు కొమ్మి చేరినా వచ్చే ఎన్నికల్లో మొండిచేయే మిగులుతుందని రాజకీయ విశే్లషణ. ఇంతటి ముందు చూపుమేకపాటి సోదరుల అభిప్రాయం ప్రాతిపదికగా గత నెల 29వ తేదీ కొమ్మి కలిసిన సందర్భంలో ప్రాధాన్యతపై జగన్ నుంచి హామి లభించలేదని భోగట్టా. ప్రాధాన్యత లేకుండా ప్రవేశానికి ద్వారాలు తెరుస్తున్న మేకపాటి సోదరులు ఇప్పటి ఉప ఎన్నికల్లో కొమ్మిని ఉపయోగించుకోవడానికేనని తెలియవస్తోంది. కాగా, కొమ్మి రాకనే వైఎస్‌ఆర్‌సిని ఇప్పటి వరకు మోస్తున్న కేడర్ తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తుండటం గమనార్హం. నియోజకవర్గ పరిధిలోని దాదాపుఅన్ని మండలాల కన్వీనర్లది ఇదే పరిస్థితి. తమను కాదని చేర్చుకుంటే ఆయన నేతృత్వంలో తాము పనిచేయలేమంటూ మొరాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొమ్మికి, ఇప్పటి వరకు కీలకంగా వ్యవహరిస్తున్న కేడర్‌కు సమన్వయ ధోరణి సాధించడం పార్టీ పెద్దలకు కత్తిమీద సామే.

వ్యతిరేకత దారి మళ్లించేలా...అభ్యర్థుల భిన్న వ్యూహాలు
నెల్లూరు టౌన్, మే 2: నెల్లూరు ఎంపి, ఉదయగిరి నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అభ్యర్థులు తమ విజయం కోసం భిన్న వ్యూహాలు అనుసరించనున్నారు. ఇటీవల జరిగిన కోవూరు ఉప ఎన్నికల్లో మాదిరే ఈ పంథా కొనసాగవచ్చని తెలుస్తోంది. ప్రజల్లో తమ పట్ల వ్యతిరేకత కనిపిస్తుంటే పార్టీ పేరు చెప్పుకుని ఓట్లు అడగాలని భావిస్తున్నారు. అలాకాకుండా పార్టీపై వ్యతిరేకత ఉంటే అభ్యర్థులు తమ వ్యక్తిగత ప్రచారంపై మొగ్గు చూపనునున్నారు. కోవూరులో వలే నెల్లూరు ఎంపి, ఉదయగిరి ఎమ్మెల్యే స్థానాలకు తాజా మాజీలే వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు బరిలో నిలిచారు. నెల్లూరు ఎంపి 2009 ఎన్నికల్లో పునర్విభజనతో ఏర్పడిన కొత్త స్థానంలోకి మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజకీయం వలస వచ్చింది. మేకపాటిది సొంత జిల్లా అయినా గతంలో నెల్లూరు ఎంపిగా పోటీ చేసేందుకు రిజర్వేషన్ అడ్డుగా ఉండేది. పునర్విభజనతో జనరల్ స్థానంగా మారడంతో నెల్లూరు ఎంపి అభ్యర్థిగా బరిలో నిలచి గెలుపొందారు. అందులో ప్రకాశం జిల్లా కందుకూరుతో సహా ఉదయగిరి, కావలి నియోజకవర్గాలకు ఆయన సుపరచితులే. గతంలో ఓ పర్యాయం (1989లో) ఎంపిగా, మరో రెండుమార్లు (1996,98ల్లో)బరిలో నిలచి ఓటమి చెందడంతో ఆ మూడు నియోజకవర్గాలతోనూ ఆయనకు పూర్వ సంబంధాలున్నాయి. అయితే గత ఎన్నికల్లో నుంచి కలసిన నెల్లూరు నగరం, గ్రామీణం, కోవూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లోని చాలా ప్రాంతాలకు ఈయన కొత్తముఖమే. ఇదిలాఉంటే గత ఎన్నికల నుంచే పరిచయాలు ఏర్పడటంతో సహా మూడేళ్లకే మళ్లీ ఉప పోరుతో బరిలో నిలవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. మొత్తమీద నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలో మేకపాటి రాజమోహనరెడ్డి విస్తృత పర్యటనలైతే నిర్వహించలేదు. కాగా, 2010 అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగిన జగన్ ఓదార్పు యాత్ర సమయంలో తన పార్లమెంటరీ స్థానం పరిధిలో దాదాపుగా పర్యటించేందుకు అవకాశాలు ఏర్పడ్డాయి. అంతేతప్ప అంతకుముందు, ఆ తరువాత పర్యటించడం అంతంత మాత్రమే. ఈ క్రమంలో అందుబాటులో లేని నేతగా ముద్రపడే అవకాశాలుండటం, ప్రత్యేకంగా చేసిన అభివృద్ధి అంటూ పెద్దగా లేకపోవడంతో తమ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, అధినేత జగన్ పేరు చెపుతూ ఓట్లు అడగనున్నారు. ఆయన సోదరుడైన మేకపాటి చంద్రశేఖరరెడ్డి పరిస్థితి కూడా ఉదయగిరిలో దాదాపుగా ఇంతే. నియోజకవర్గ పరిధిలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసినా ప్రజల్లో అసంతృప్తి వెంటాడుతూనే ఉంది. ఈయన కూడా తన అన్న మాదిరిగానే జగన్ పేరు చెపుతూనే ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఇదిలాఉంటే అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రం తమ సొంత పార్టీ పేరు చెప్పుకునేందుకు కొంతమేర వెనకడుగే . కేంద్ర ప్రభుత్వం చీటికిమాటికి పెట్రో ధరలు, రాష్ట్రంలో తాజాగా పెరిగిన విద్యుత్ చార్జీలతో సహా నిత్యావసరాలన్నీ నింగినంటుతుండటంతో అభ్యర్థి పేరు మాత్రమే ఘనంగా ప్రచారం చేసుకుంటూ పార్టీ ఘనత తక్కువగా చెప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంపి అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న కళాబంధు టి సుబ్బరామిరెడ్డి తన సేవాతత్పరత అంశం విస్తృతంగా ప్రచారం కానుంది. ఉదయగిరి ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి కంభం విజయరామిరెడ్డి తనకు స్వతహాగా నియోజకవర్గ పరిధిలో ఉన్న వర్గానే్న నమ్ముకుని ప్రచారం చేయనున్నారు. ఒక్క ప్రధాన తెలుగుదేశం అభ్యర్థులుగా బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్న వంటేరు వేణుగోపాలరెడ్డి, బొల్లినేని రామారావుమాత్రం తమ, పార్టీ పేర్లు చెప్పుకుని ఓట్లడిగే అవకాశాలున్నా పరిస్థితులు ఎంత మేర ఆయనకు అనుకూలిస్తాయో వేచి చూడాలి.

నెల్లూరు వాకిట కుంటుపడిన పారిశ్రామిక ప్రగతి
నెల్లూరు , మే2: పాలకులు, పారిశ్రామికవేత్తలు ఎంతో ఆర్భాటంగా ప్రకటించి రైతులపై ఒత్తిడి తీసుకొచ్చి స్వాధీనపరచుకున్న భూముల్లో ప్రగతికి అధోగతి. దాదాపుగా అన్నింటికీ శంకుస్థాపనల తంతు పూర్తి చేసినా ఆ తరువాత పారిశ్రామిక ప్రగతి నత్త నడకన సాగుతోంది. ముందుగా ఊరడించినట్లుగా స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు నామమాత్రమే. స్థాపించే ముందు 30వేలకుపైగా ఉద్యోగాలు ఇస్తామని హామి ఇచ్చిన సూళ్లూరుపేట ప్రాంతంలో ఒక బూట్ల తయారీ కంపెనీ ఇప్పటికీ పట్టుమని నాలుగువేల మందికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించలేదు. జిల్లా వ్యాప్తంగా 13 సెజ్‌లు (ఆర్థిక ప్రత్యేక మండళ్లు), వాటి పరిధిలో నిర్మిస్తున్న 66 కంపెనీలకు సంబంధించి మొత్తం 30 వేల ఎకరాల వరకు భూ విస్తీర్ణం కేటాయించారు. అయితే ఇప్పటి వరకు పట్టుమని ఐదారు సెజ్‌లు కూడా క్రియాశీలక రూపం దాల్చుకోలేదు. ఆసియాలోనే ఎగుమతులు దిగుమతులపరంగా ఎంతో అనువైనదిగా జిల్లాలోని కృష్ణపట్నం ఓడరేవుంది. ఐదవ నెంబర్ జాతీయ రహదారి చెంతనే ఉన్నా...రోడ్డుకు ఇరువైపులా వరిపండే భూముల్ని పారిశ్రామికంగా కేటాయించినా అవి బీడుభూములుగానే కొనసాగుతున్నాయి. అటు సేద్యం అటకెక్కింది. పారిశ్రామిక ప్ర‘గతీ’ తప్పింది. ఆంధ్రప్రదేశ్ వౌలిక సదుపాయాల సంస్థ, రెవిన్యూ శాఖ భూములు అప్పగించడమే తప్ప ఆ తరువాత క్రియాశీలతపై దృష్టి సారించడం లేదని తెలుస్తోంది. దీంతో జిల్లావ్యాప్తంగా లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చేసిన ప్రకటనలు కాస్తా ఆచరణలో నీరుగారుతున్నాయి. ఇప్పటి వరకు అన్ని కంపెనీలు కలిపినా కల్పించిన ఉద్యోగ అవకాశాల సంఖ్య ఎనిమిదివేలకు లోబడే. వాటిలో కూడా చాలావరకు ప్రతిభ పేరిట స్థానికేతరులకే ఎక్కువగా దక్కుతున్నాయి. రైతుల ల నుంచి చాలా చోట్ల మార్కెట్ ధరలకంటే చాలా చౌకగానే భూములు స్వాధీనపరచుకున్నారు. సూళ్లూరుపేట వద్ద ఏర్పడిన అపాచీ సెజ్ కోసం కేటాయించిన భూములకు ఏడాదికి ఎకరా కేవలం ఒకే ఒక్క రూపాయి వంతున లీజుకు కేటాయించడం గమనార్హం. ఇదే ప్రాంతంలో మరికొన్ని సెజ్‌లకు మాత్రం ఎకరా 30లక్షల రూపాయల వరకు కూడా గరిష్టంగా విక్రయాలు జరిపి ఉన్నారు. ఇతర ప్రాంతాల్లో ఎకరా ఏభై వేల నుంచి మూడు లక్షల రూపాయలకు మించని దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. నాయుడుపేట మేనకూరు ప్రాంతం వద్ద ఏర్పడిన సెజ్‌కు ఎనిమిది లక్షల రూపాయలు, సముద్ర తీర ప్రాంతమైన కృష్ణపట్నం వద్ద ఏర్పడిన సెజ్‌కు ఏడు నుంచి తొమ్మిది లక్షల రూపాయల వంతున భూములు కేటాయించారు. మొత్తమీద ఈ భూముల స్వాధీనంలో, కేటాయింపుల్లో అడుగడుగునా ప్రామాణికాలకు తూట్లు పడ్డాయి. రెండుదశాబ్ధాల నుంచి సందిగ్ధంగా మారిన ఇఫ్కో కిసాన్ సెజ్ ఇప్పుడిప్పుడే బాలారిష్టాలు అధిగమిస్తున్నా ప్రభుత్వ యంత్రాంగం తీరుతెన్నులు సమస్యాత్మకంగా మారుతున్నాయి. ప్రధానంగా ఈ సెజ్‌కు సంబంధించి డిటిసిపి అప్రూవల్ వ్యవహారం గుదిబండ. డిటిసిపి అప్రూవల్ లభిస్తేగాని ఈ సెజ్ సంగతిలో స్పష్టత ఏర్పడదు. రైతుల భూములు ఎప్పుడో స్వాధీనపరచుకుని ఇవ్వడంతో సహా నెల్లూరుజిల్లాకు వరప్రసాదినిగా ఉన్న సోమశిల జలాశయం నుంచి అర్ధ టిఎంసి నీటిని ఈ సెజ్ కోసం ప్రభుత్వం కేటాయింపులు జరిపిందని అధికారిక సమాచారం. ఇలా మొత్తమీద రైతుల భూములు, సాగునీరు అన్నీ ఫణంగా పెట్టినా సెజ్‌లు గాడిన పడి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో మాత్రం వెనుకబడిపోతుండటం విమర్శలకు తావిస్తోంది.

వెంటాడుతున్న వౌలిక సదుపాయాల కొరత
సెజ్‌ల్లో రోడ్లు, నీటి వసతి, విద్యుత్, తదితర కీలకమైన సదుపాయాల కల్పనలో ప్రభుత్వం పరంగా తీవ్ర జాప్యం జరుగుతోందని ఔత్సాహిక పారిశ్రామికుల వాదన. గత కొనే్నళ్లుగా రోడ్ల అభివృద్ధికై రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ బహుస్వల్పం. ఇదిలాఉంటే ఇటీవలకాలంలో ఎడాపెడా విధిస్తున్న కరెంట్ కోతతో రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రాలేకపోతున్నారు. ఒకదానితో మరొకటి ముడి పడి ఉన్న పారిశ్రామికాభివృద్ధిలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించడంతో సహా సెజ్‌ల్ని కూడా అదే స్థాయిలో ముందుకు నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నెల్లూరు పార్లమెంట్, ఉదయగిరి అసెంబ్లీ నియోజక వర్గాలకు వచ్చే నెల్లో
english title: 
liquor distribution

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>