శ్రీకాకుళం, మే 2: వాపును చూసి బలుపు అనుకునే భ్రమలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చంకలు గుద్దుకుంటున్నారని, జిల్లా నలుమూలల నుంచి జనాన్ని రప్పించుకుని జగన్మోహన్‌రెడ్డి బహిరంగసభ నిర్వహించుకుని ఓటర్లను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు ఎద్దేవా చేశారు. జగన్ బహిరంగసభను ఇరుకైన స్థలంలో ఏర్పాటు చేసి ఆహా, ఓహో అంటూ ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ బహిరంగసభ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేయగా నియోజకవర్గానికి చెందిన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కుటుంబసభ్యులు హాజరైన విషయాన్ని మరిచి జగన్ పార్టీ నేతలు జనాన్ని ప్రలోభ పెట్టేందుకు అసత్య ప్రచారం సాగిస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. నరసన్నపేటలో తన క్యాంపు కార్యాలయంలో బుధవారం డెడికేటెడ్ నెట్‌వర్క్ ప్రతినిధులు, ముఖ్యనేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నరసన్నపేట ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాందాసు విజయం తథ్యమని, అందుకు మారుతున్న సమీకరణాలే ఓ తార్కాణమన్నారు. కంచుకోటగా నిలిచే తెలుగుదేశం పంచాయతీలు కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో అనూహ్యంగా పార్టీ బలం నియోజకవర్గంలో పెరిగిందన్నారు. జలుమూరు మండలంలో 61పోలింగు కేంద్రాల పరిధిలో 54 కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉన్నట్లు సర్వేలు స్పష్టం చేశాయని గుర్తుచేశారు. పోలాకి మండలంలో కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించే దిశలో ఉందన్నారు. తొలుత కాంగ్రెస్ పార్టీ మూడోస్థానంలో ఉన్న విషయం వాస్తవమేనని, నాలుగైదు నెలల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను పార్టీ శ్రేణులు ఓటర్ల ముందు ఉంచడంతో వారంతా ప్రభావితమయ్యారని, తద్వారా పార్టీ బలం పుంజుకుందన్నారు. పావలావడ్డీ నుంచి వడ్డీలేని రుణాలవరకు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని, అంతేకాకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు వడ్డించడంలో పారదర్శకత పాటిస్తుందన్న విషయాన్ని ఓటర్లు గుర్తెరగాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ వర్గాలు అభ్యున్నతికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అందువల్లే దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీతో ఆ వర్గాలు అనుబంధాన్ని పెనవేసుకున్నాయని గుర్తుచేశారు. నరసన్నపేట కాంగ్రెస్ అభ్యర్థి రాందాసుకు మద్దతుగా కేంద్ర మంత్రులు పురంధ్రీశ్వరి, పల్లంరాజు, ఉండవల్లి అరుణ్‌కుమార్, నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తారని స్పష్టం చేశారు. రాందాసు నామినేషన్ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు, సినీనటులు కె.చిరంజీవి హాజరవుతారని ఆయన వెల్లడించారు. నరసన్నపేట పట్టణంలో వైశ్యులకు తాను పూర్తి సహకారాన్ని అందించానన్నారు. తొమ్మిదేళ్లుముఖ్యమంత్రిగా పనిచేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు రైతుల బాధలు తెలియవని, నేడుఓట్లు కోసం వేదికలపై నాగలి పట్టడాన్ని ఎవరు నమ్మే స్థితిలో లేరన్నారు. తొలుత మంత్రి ధర్మాన తనయుడు రామ్‌మనోహరనాయుడు కార్యక్రమంలో కార్యకర్తలనుత్తేజపరిచేలా మాట్లాడటం తీవ్రచర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు జుత్తు జగన్నాయకులు, కొర్ల భారతి, మాజీ ఎమ్మెల్యేలు శిమ్మ ప్రభాకరరావు, డోల సీతారాములనాయుడు, కెఎల్‌ఎన్ గుప్తా, కాంగ్రెస్ అభ్యర్థి ధర్మాన రాందాసు, డిసిఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, డోలజగన్, టంకాల బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ అడ్రస్ గల్లంతే..
శ్రీకాకుళం, మే 2: దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశయసాధనకు ప్రతీ ఒక్కరూ కృషిచేసి నరసన్నపేట ఉపఎన్నికలో విజయం సాధించేందుకు కార్యకర్తలంతా కుటుంబంలా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు అన్నారు. స్థానిక హోటల్‌లో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కృష్ణదాసు మాట్లాడుతూ వైఎస్ నేతృత్వంలో రెండుసార్లు ప్రభుత్వం ఏర్పాటైందని, వ్యక్తిగత ప్రతిభ కంటే వైఎస్ వలనే తామంతా విజయం సాధించినట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 18 స్థానాల్లో ఉపఎన్నికలు జరుగనున్నాయని, ఇందులో 11 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు గల్లంతవుతున్నాయన్నారు. నరసన్నపేట నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రథమ స్థానంలో ఉందని స్పష్టం చేశారు. పేట ఎన్నికలు జిల్లాకు, రాష్ట్రానికి తలమానికం కావాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీకి వారసులని కడప ఉపఎన్నిక జరిగే సమయాల్లో కాంగ్రెస్ నేతలు చెప్పేవైనం మరిచిపోలేదన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు విశాల దృక్పథంతో పేదరికమే ప్రాతిపదికగా వైఎస్ రూపొందిస్తే కాంగ్రెస్‌ప్రభుత్వం దానికి గండికొట్టిందన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యక్తులకు జిల్లాలో సోకాజ్ నోటీసులు కూడా అందుతున్నాయని, ఎందుకిలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో జగన్ ప్రభంజనం నడుస్తోందని, నరసన్నపేట నియోజకవర్గంలో జగన్ పర్యటనలో ప్రజలు ఘనస్వాగతం పలికారన్నారు. నరసన్నపేట ఉపఎన్నిక కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక కావాలన్నారు. కడప, కోవూరు ఫలితాలు జగన్ ప్రభంజాన్ని రుజువు చేశాయన్నారు. 2013లో ఎన్నికలు జరగవచ్చునన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ పట్ల అభిమానులే తనను గెలిపిస్తారని, ఖచ్చితంగా విజయం సాధిస్తామని, అయితే మెజారిటీ తెచ్చుకునేందుకు కృషిచేయాలన్నారు. మాజీ ఎంపి కణితి విశ్వనాథం, మాజీ జెడ్పీ చైర్మన్ పాలవలస రాజశేఖరంలు మాట్లాడుతూ గెలుపు ముఖ్యం కాదని, మెజార్టీ తెచ్చుకోవాలని ఉపఎన్నిక రాబోవు ఎన్నికలకు నాందిగా నిలవాలని సూచించారు. సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి కుంబా రవిబాబు, పైడి మహేశ్వరరావు, హనుమంతు కిరణ్‌కుమార్, బొడ్డేపల్లి పద్మజ, వైవి సూర్యనారాయణ, ధర్మాన ఉదయ్‌భాస్కర్, ఎన్నిధనుంజయ్‌రావు, వజ్జ బాబూరావు, దువ్వాడ శ్రీనివాస్, వరుదు కల్యాణి తదితరులు పాల్గొన్నారు.
‘థర్మల్’కు అనుమతులిచ్చింది వైఎస్సే..
నరసన్నపేట, మే 2: సోంపేట థర్మల్ పవర్‌ప్లాంట్లకు అప్పటి మఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డే అనుమతి ఇచ్చారని కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు ఆరోపించారు. జిల్లాలో థర్మల్ పవర్‌ప్లాంట్ల నిర్మాణాలను నిలిపివేయాలంటూ కాగ్ నివేదికలో వెల్లడించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమని బుధవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. కాకరాపల్లి, సోంపేట థర్మల్ పవర్‌ప్లాంట్లకు అప్పటి మఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డే అనుమతి ఇచ్చారని, వాటిని నిలిపివేయాలంటూ ప్రజాగ్రహం వెలువెత్తినా పట్టించుకోని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. వేలాది ఎకరాల భూములను చేతులు మార్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి దానికి వత్తాసు పలికిన మంత్రి ధర్మాన ప్రసాదరావు కారణమని, దీనిపై కూడా కాగ్ నివేదిక ఇచ్చిన బుట్టదాఖలైందని ఎద్దేవా చేశారు.
పవర్‌ప్లాంట్లను నిలుపుదల చేయాలంటూ తమ పార్టీ అధినేత నారాచంద్రబాబునాయుడు పర్యావరణ శాఖకు లేఖ పంపించారని గుర్తుచేశారు. ప్రజాగ్రహ, ఆందోళనల్లో ప్రజలపై లాఠీలు, తూటాలతో సమాధానం చెప్పారే తప్ప వారిని చర్చలకు పిలిచి ఉన్నవాస్తవాలను తెలుసుకోలేకపోయారని ఇది దారుణమని విమర్శించారు. ఈ ఘటనలపై మరోసారి కేంద్ర పర్యావరణ శాఖకు లేఖను తమపార్టీ తరపున పంపుతామని తెలిపారు. ఇటీవలి సోంపేటను సందర్శించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి వచ్చి మాట్లాడినప్పుడు జిల్లాలో ఉపాధి కల్పించేందుకు తన తండ్రి వీటికి అనుమతులు ఇచ్చారని చెప్పుకున్నారని, అయితే తాను అధికారంలోకి వస్తే వాటిని రద్దుచేస్తానని చెప్పుకున్న తీరు చూస్తే హాస్యాస్పదంగా ఉందన్నారు. సంతబొమ్మాళి మండలం కాకరాపల్లిలో నిర్మిస్తున్న పవర్‌ప్లాంట్లకు తమ పార్టీ మద్దతు ఉందనే ప్రచారాన్ని ఖండించారు. ఈ సమావేశంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు చౌదరి నారాయణమూర్తి, ఉపాధ్యక్షులు బలగ నాగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎరుపిల్లి కృష్ణారావు, పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగపు సభ్యుడు కోరాడ రమేష్, పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి చింతు పాపారావు, గొద్దు చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
రైతులను చైతన్యపరచండి
శ్రీకాకుళం, మే 2: ఈనెల 10వ తేదీ నుంచి 31వ తేదీవరకు జరుగనున్న రైతు చైతన్యయాత్రలు విజయవంతంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ భాస్కర్ తెలిపారు. రైతు చైతన్య యాత్రల నిర్వహణపై వ్యవసాయ అనుబంధ శాఖాధికారులతో బుధవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా మండల స్థాయి వ్యవసాయాధికారులు, వ్యవసాయ అనుబంధ శాఖాధికారులతో కోఆర్డినేషన్ చేసుకోవాలని సూచించారు. సదస్సులు నిర్వహించేముందు మండల స్థాయి అధికారులు ఆయా శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆయా శాఖల ద్వారా అమలు జరుపుతున్న పథకాలు, వాటి ఉపయోగాల గూర్చి రైతులకు వివరించాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం ముందుగా షెడ్యూల్ తయారు చేసుకోవాలని పేర్కొన్నారు. మండలవ్యవసాయాధికారులు కోఆర్డినేషన్ చేసుకుని 8వ తేదీన మండలస్థాయిలో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. ప్రతీ గ్రామంలో చైతన్యయాత్రలు నిర్వహించాలన్నారు. ముందురోజున విఆర్వోలు దండోరా ద్వారా గ్రామాల్లో ప్రచారం చేయించాలని తెలిపారు. రైతు చైతన్య యాత్రల షెడ్యూల్ వివరాలు నియోజకవర్గం పరిధిలో ఉన్న మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిథులకు తెలియజేయాలని చెప్పారు. రైతులకు ఇన్‌పుట్‌సబ్సిడీలు చెల్లింపు జరగనవి ఉంటే వెంటనే చెల్లించాలని ఆదేశించారు. ఖరీఫ్ పంటకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, భూసార పరీక్షలు విత్తనశుద్ది, యంత్ర పరికరాలు ఉపయోగించడం వల్ల కలిగిన లాభాల గూర్చి రైతులకు తెలియజేయాలని చెప్పారు. 2012 ఖరీఫ్ పంటకు అవసరమైన ఎరువుల గూర్చి ముందుగా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులను ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జెడి మురళీకృష్ణ, జెడ్పీ సిఇఓ సుధాకర్, నాబార్డు ఎజిఎం సుబ్రహ్మణ్యం, ఆర్డీఓలు సత్యనారాయణ, విశే్వశ్వరరావు, వెంకటేశ్వరరావు, పశుసంవర్ధక శాఖ జె.డి నర్సింహులు, మత్స్యశాఖ డిడి కోటేశ్వరరావు, ఇతర అనుబంధ శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.
సిబ్బంది సహకారంతో గ్రంథాలయాల అభివృద్ధి
పాతశ్రీకాకుళం, మే 2: సిబ్బంది సహాయ సహకారాలతోనే జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధి జరుగుతాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోట నందకుమార్ పేర్కొన్నారు. బుధవారం కేంద్ర గ్రంథాలయంలో జరిగిన అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే శ్రీకాకుళం జిల్లా గ్రంథాలయ సంస్థ అభివృద్ధిలో అగ్ర స్థానంలో ఉండడమే కాకుండా ఇతర జిల్లాలకు అదర్శంగా నిలిచిందని, ఇదే తరహాలో మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు సిబ్బంది సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఏ జిల్లాలో కూడా లేని విధంగా అత్యధికంగా శాఖా గ్రంథాలయాలకు సొంత భవనాలను నిర్మించుకున్న ఖ్యాతి మన జిల్లాకు దక్కిందన్నారు.
కోల్‌కతా రాజారామ్మోహనర్‌రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ సహకారంతో నూతన భవనాల నిర్మాణం పూర్తి చేయడంతో పాటు ఫర్నిచర్, పుస్తకాలు కూడా సమకూర్చుకోగలుగుతున్నామన్నారు. సంస్థ కార్యదర్శి విద్యాసాగర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రంథాలయాలకు వచ్చే పాఠకులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, దానికి అవసరమైన పుస్తకాలను కూడా అందచేస్తున్నామన్నారు. అనంతరం కోల్‌కతా రాజారామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో రూ.2.50లక్షల విలువైన ప్లాస్టిక్ టేబుల్లు, కుర్చీలు, స్టీలు అలమరాలు 35 శాఖా గ్రంథాలయాలకు, పుస్తకాలు 42 గ్రంథాలయాలకు అందించారు. అంతే కాకుండా 201011లో గ్రంథాలయ బడ్జెట్‌లో ఆమోదించిన నిధులతో కొనుగోలు చేసిన మైక్‌సెట్‌లు, ఫ్యాన్లు ఐదు గ్రంథాలయాలకు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాధికారి డి.గోపాలరావు, సిబ్బంది శంకరరావు, ఆచార్యులు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
గుది‘బండ’
ఎచ్చెర్ల, మే 2: వంటగ్యాస్ సిలిండర్ల బుకింగ్ విషయంలో తాజా నిబంధనలు వినియోగదారులను ఇక్కట్లు గురిచేస్తున్నాయి. ఒకే ఒక్క సిలిండర్‌తో రోజులు నెట్టుకురావాల్సి ఉండటంతో దీపం గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారులు, సాధారణ వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో సిలిండర్ సరఫరా చేసిన 21రోజుల తరువాత కొత్త సిలిండర్‌ను బుక్ చేసేందుకు అవకాశం ఉండేది. నిబంధనల మార్పు చేయడంతో 30రోజులకు దీనిని పెంచారు. మరోవైపు బుక్ చేశాక సిలిండర్ సరఫరా చేసేందుకు వారం నుంచి పదిరోజులు సమయం పట్టడంతో వినియోగదారులకు అవస్థలు తప్పడం లేదు. అంతేకాకుండా గతంలో ఫోన్‌ద్వారా గ్యాస్ బుక్‌చేయడం వినియోగదారులకు అలవాటు. ప్రస్తుతం ఆన్‌లైన్ బుకింగ్‌ను తెరమీదకు తేవడంతో గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్‌వినియోగదారుల పాట్లు అన్ని ఇన్నీ కాదు. దీనికి తోడు ఒకే సిలిండర్ ఉన్న వినియోగదారులు ఆరుమాసాల వరకు తిరిగి బుక్ చేయకుంటే కనెక్షన్ రద్దయ్యే పరిస్థితి కూడా ఉత్పన్నం కావడంతో అటువంటి వినియోగదారులు లబోదిబోమంటూ గ్యాస్ ఏజన్సీల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.
1.29లక్షల దీపం లబ్ధిదారులు
జిల్లాలో 15 గ్యాస్ ఏజన్సీల పరిధిలో 3,40,553మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో 1,29,441మంది దీపం లబ్ధిదారులు. వీరందరికి ఒకే సిలిండర్ పంపిణీ చేశారు. మిగిలిన 2,11,112మంది వినియోగదారుల్లో దాదాపు లక్షమందికి ఒకే సిలిండర్ ఉన్నట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 21 రోజుల తరువాత కొత్తసిలిండర్ బుక్ చేయడానికి వీలుండేది. తాజాగా ఈ వ్యవధిని 30రోజులకు పెంచడంతో వారి ఇబ్బందులు అన్ని ఇన్నీ కావు. ఇదిలా ఉండగా బుక్ చేసినవారం పదిరోజులకు గాని గ్యాస్ ఏజన్సీలు సిలిండర్లను సరఫరా చేయడం లేదు. దీంతో జనం నానా అవస్థలు పడుతున్నారు. ప్రత్యామ్నాయంగా గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యితో కాలక్షేపం చేస్తున్నారు. పట్టణాల్లో మాత్రం కిరోసిన్ స్టవ్‌పై ఆధారపడక తప్పడం లేదు. అయితే కిరోసిన్ ధరలు ఆకాశనంటడంతో వారంతా ఆర్థిక భారాలు మోయాల్సివస్తోంది. ప్రస్తుతం బ్లాక్‌మార్కెట్‌లో లీటరు కిరోసిన్ 50రూపాయలకు లభించడంతో వారి ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. ఇలా గ్యాస్ వినియోగదారులు అవస్థలు ఎదుర్కొంటూ కట్టెల పొయ్యిలే నయమన్న పరిస్థితి ఎదురుకావడం విచారకరం.
అణువిద్యుత్ ప్లాంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
శ్రీకాకుళం , మే 2: జిల్లాలో కొవ్వాడ సమీపంలో అణువిద్యుత్ కేంద్ర నిర్మాణాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బవిరి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అణువిద్యుత్‌కేంద్రానికి సంబంధించి పబ్లిక్ హియరింగ్ ఇంతవరకు జరుపలేదని పేర్కొన్నారు. భూసేకరణకు అధికారులను నియమించారని, మోసపూరితంగా పనులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అణుపార్కు ఏర్పాటుపై జిల్లాకేంద్రంలో నిర్వహించే ఎగ్జిబిషన్‌లో ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారన్నారు. సర్వే దరఖాస్తును విడుదల చేసి అనేక ప్రశ్నలకు సమాధానాలు రాబెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం సమాచారం సేకరిస్తూ తన పని చేస్తుందని, దీనిని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. 270 జివోను వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేశారు. అమెరికా ప్రయోజనం కోసం అణువిద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో ఉండే మంత్రులు ఈ విషయమై నోరుమెదపడంలేదన్నారు. సోంపేట, కాకరాపల్లి ధర్మల్‌ప్లాంట్లకు అనుమతులిస్తూ జయంతి నటరాజన్ ప్రకటన తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. రెండోదశ పోరాటానికి సిపిఎం పార్టీ సిద్ధమన్నారు. పవర్‌ప్లాంట్ల నిర్మాణం ఆపేవరకు పోరాటం ఆగదని పేర్కొన్నారు. సమావేశంలో సిపిఎం కార్యదర్శి వర్గసభ్యులు డి.గోవిందరావు, కె.శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
థర్మల్ రద్దయ్యే వరకు పోరాటం
సోంపేట: సోంపేట బీల భూముల్లో థర్మల్ పవర్‌ప్లాంటు నిర్మాణానికి ఎన్ సిసి కంపెనీకి ప్రభుత్వం దొడ్డిదారిన ఇచ్చిన అన్ని అనుమతులు రద్దు అయ్యేవరకు పోరాటం కొనసాగిస్తామని ఉద్యమనేత, పర్యావరణ పరిరక్షణ కమిటి అధ్యక్షుడు డాక్టర్ కృష్ణమూర్తి, బీన ఢిల్లీరావు, ఎం.్ధర్మారావు స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం సోంపేటలో జరిగిన అత్యవసర సమావేశంలో వారు మాట్లాడుతూ థర్మల్ పవర్‌ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నా, ఈ ప్లాంటుకు అనుమతులు మంజూరు చేసినట్లు పార్లమెంట్‌లో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జయంతినటరాజన్ ప్రకటన చేయడం దురదృష్టకరమన్నారు. సోంపేటలో ప్లాంటు నిర్మాణానికి అనువైన స్థలం కాదని, మేథావులు, శాస్తవ్రేత్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక దపాలుగా వినతులు సమర్పించినా కేంద్రం వాటిని ప్రక్కన పెట్టి ఎన్ సిసి కంపెనీ యజమాన్యానికి అనుకూలంగా వ్యవహరించడంపై వారు మండిపడ్డారు. సోంపేట బీలపై వేలాది మంది రైతులు, మత్స్యకారులు ఆధారపడి బతుకుతున్నారన్నారు. ఎన్ సిసి కంపెనీకి ఇచ్చిన అన్ని అనుమతులు రద్దు చేసేంతవరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ నెల 3వ తేది నుంచి ప్రతి గ్రామంలో పర్యటించి ప్రజలను చైతన్యం చేస్తు రోజుకో గ్రామంలో ర్యాలీ చేపట్టి ప్రభుత్వానికి నిరసనను తెలియజేస్తామన్నారు. ఈ సమావేశంలో పలు కార్మిక సంఘాలు, ఆటో యూనియన్‌లు, పట్టణ వ్యాపారులు, తీరమత్స్యకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
మందసలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
మందస, మే 2: మండలంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సుడిగాలి పర్యటన చేసారు. మండలంలోని ఉపాధి పనులు, రోడ్లు పనులను పరిశీలించారు. బుడంబో గ్రామం వద్ద 12 లక్షల వ్యయంతో చేపట్టిన డంబుగాం చెరువును పరిశీలించారు. చెరువు విస్తీర్ణం, నీటి నిల్వ పనులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాబకోట, సింగుపురం, ఎం ఎస్ రోడ్డు పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. తారు రోడ్డు పనులు నాణ్యతతో చేపట్టాలని గుత్తేదారులు అధికారులకు ఆదేశించారు. సింగుపురం గ్రామంలో రక్షిత మంచినీటి పథకం ట్యాంకు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, మంచినీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులు చాలడం లేదని, గిరిజనులకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి వ్యయం ఎక్కువు అవుతుందని, నిధులు పెంచాలని గిరిజనులు కోరారు. ఈయనతోపాటు అప్పలనాయుడు, తహశీల్దార్ పి.వరభూషణరావు, ఎంపిడివో రమేష్‌నాయుడు, ఉపాధి హామీ పథకం ఎపివో హరికృష్ణ, ఇతర అధికారులున్నారు.
వేడుకగా ఆదిత్యుని కల్యాణం
శ్రీకాకుళం, మే 2: ప్రత్యక్ష నారాయణుడైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి కల్యాణోత్సవం వేడుకగా జరిపించారు. వైశాఖ బహుళ ఏకాదశి బుధవారం ఉదయం ఆలయంలోని అనివెట్టి మండపంలో ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ పర్యవేక్షణలో స్వామివారి కల్యాణోత్సవం జరిపించారు. ఉషా, ఛాయా, పద్మినీ సమేతుండైన ఆదిత్యుని ఉత్సవ మూర్తులకు కల్యాణం నిర్వహించారు. ఈ వేడుకలు తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా పాలిటెక్నిక్ ప్రవేశపరీక్ష
ఎచ్చెర్ల, మే 2: పాలిటెక్నిక్ ప్రవేశానికి నిర్వహించిన ఎంట్రన్స్ పరీక్ష బుధవారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. 22 కేంద్రాలను పరీక్ష నిర్వహణకు ఏర్పాటు చేశారు. 8,043మంది అభ్యర్థులు హాజరయ్యారు. సీప్ పరీక్ష నిమిత్తం 8,231మంది దరఖాస్తు చేసుకోగా బాలురు 6249, బాలికలు 1982మంది ఉన్నారు. అయితే పరీక్షకు మాత్రం 6130మంది బాలురు, 1913మంది బాలికలు హాజరయ్యారు. 188మంది అభ్యర్థులు ఎంట్రన్స్ పరీక్షకు హాజరుకాలేదు. ఇందులో బాలికలు 69మంది, బాలురు 119మంది ఉన్నట్లు జిల్లా కోఆర్డినేటర్ డా.కె.ప్రసాద్, అడ్మిషన్ ఇన్‌చార్జి మేజర్ కె.శివకుమార్‌లు స్పష్టం చేశారు. 97.7 శాతం సీప్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంతంగా ప్రవేశ పరీక్ష ముగియడంతో సంబంధిత అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఎచ్చెర్లలో పలు కేంద్రాలను ఈ ఎంట్రన్స్ పరీక్షకు ఏర్పాటు చేశారు.
నవోదయ ప్రవేశపరీక్ష తేదీ మార్పు
శ్రీకాకుళం , మే 2 : జిల్లాలోని వెనె్నలవలసలో ఉన్న జవహర్‌నవోదయ పాఠశాలలో తొమ్మిదవ తరగతి ప్రవేశపరీక్ష ఈ నెల ఆరవ తేదిన నిర్వహించాల్సి ఉండగా 12వ తేదికి మార్పు చేసినట్లు ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ ఎం.ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. పరిపాలనా పరమైన కారణాలతో నవోదయ విద్యాసమితి ఆదేశాల మేరకు పరీక్ష తేదీని మార్పు చేస్తున్నట్లు వెల్లడించారు. పరీక్షాసమయం , కేంద్రం మార్పు లేదని, దీనిని విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలని స్పష్టం చేశారు. ఖాళీల భర్తీకి గాను 567దరఖాస్తులు వచ్చాయన్నారు.
పావలావడ్డీ రాయతీలో లావేరు అగ్రగ్రామి
లావేరు, మే 2: మహిళా స్వయం శక్తి సంఘాలకు పావలావడ్డీ రాయతీ అందించడంలో జిల్లాలో లావేరు మండలం అగ్రగ్రామిగా నిలిచిందని ఐకెపి ఎపిఎం ధనలక్ష్మీ తెలిపారు. స్థానిక ఐకెపి భవన్‌లో బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ 1,086 సంఘాలకు రూ. 11.03కోట్ల అందించామన్నారు. బ్యాంకు లింకేజీ రూ. 13.84 కోట్లు అందించి లక్ష్యం అధిగమించి జిల్లాలో రెండవస్థానంలో ఉన్నామని తెలిపారు. 12పంచాయితీల్లో సుస్థిర వ్యవసాయం అమలు చేస్తున్నామని చెప్పారు. 98 వికలాంగ సంఘాల్లో 992మంది సభ్యులను చేర్పించామన్నారు. 47 సంఘాలకు 37.40లక్షలు, సామాజిక పెట్టుబడిగా 13సంఘాలకు ఎనిమిది లక్షల రుణంగా ఇచ్చామన్నారు. 24మంది వికలాంగులకు శస్త్ర చికిత్సలు నిర్వహించామని తెలిపారు. 21మందికి ట్రైసైకిళ్లు, 21మందికి చేతికర్రలు, ఐదుగురికి కృత్రిమ అవయవాలు, ఏడుగురికి టేప్‌రికార్డులు సరఫరా చేశామని వివరించారు. 1047మందికి ఆమ్‌ఆద్మీ, 1153మందికి అభయహస్తం పింఛన్లు అందించామని చెప్పారు.
కాలువలు ఇలా.. సాగునీరందేదెలా?
ఎచ్చెర్ల, మే 2: సాగునీటి కష్టాల నుంచి రైతులను గట్టెక్కిస్తామని ప్రజాప్రతినిధులు, అధికారుల మాటలు నీటిమూటలుగా మిగులుతున్నాయి. నారాయణపురం ఆధునికీకరణ పనుల్లో భాగంగా చేపట్టాల్సిన కాలువల్లో పూడిక తీతలు నేటికి ఆరంభించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత నాలుగేళ్ల నుంచి మండలంలోని 11పంచాయతీలకు సాగునీరందిస్తున్న కుడికాలువ స్థితి మారకపోవడంతో ఈ ఏడాది కూడా సాగునీటి ఇక్కట్లు తప్పేటట్లు లేవని రైతులంతా దిగులు చెందుతున్నారు. వివిధ సందర్భాల్లో శాసన సభ్యులు, ఇరిగేషన్ ఉన్నతాధికారులు ఇచ్చిన హామీలు ప్రకటనలకే పరిమితమయ్యాయే తప్ప కాలువ పనులు చేపట్టి సాగునీరందించే చర్యలకు శ్రీకారం చుట్టలేకపోయారని అన్నదాతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇబ్రహీంబాద్, పూడివలస, తమ్మినాయుడుపేట, కుశాలపురం, దుప్పలవలస, తోటపాలేం, కొంగరాం, కొత్తపేట, ముద్దాడ, బొంతలకోడూరు, ధర్మవరం, భగీరధపురం, రామజోగిపేట తదితర గ్రామాల్లో ఆయకట్టు రైతుల పాలిట సాగునీరు ప్రతీ ఏటా శాపంగా మారింది. 55కిలోమీటర్లు పొడవున ఉన్న ప్రధానకాలువ పనులు పూర్తి స్థాయిలో చేపట్టకపోవడం వల్ల టైయిలాండ్ రైతులంతా ఉబాలు పూర్తిచేసినప్పటికీ పొట్టదశలో ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరం. ఈ ప్రాంత రైతాంగం సాగునీటి సమస్యను విన్నవిస్తున్నప్పటికీ ఇరిగేషన్ అధికారులు ముందుచూపుతో వ్యవహరించకుండా పనులు నత్తనడకన సాగించడంతో సాగునీటి కష్టాలు నిత్యకృత్యంగా మారాయి. ప్రధానకాలువతో పాటు పొన్నాడ, కొంగరాం, కుశాలపురం, పూడివలస, బ్రాంచి ఛానల్స్ పరిస్థితి కూడా అద్వాన్నంగా తయారైంది. సుమారు 8,326 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సిన కాలువ పూడిక తీతపై కనీస శ్రద్ధ కనబర్చకపోవడంతో రైతులు నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. వ్యవసాయమదుపులు కూడా రాని దుస్థితి ఏర్పడింది. ఖరీఫ్‌లో సాగునీరు అందించకుండా నీటితీరువా మాత్రం చెల్లించాలని రెవెన్యూ అధికారులు రైతులపై ఒత్తిడి తేవడం సరికాదని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా బ్రాంచి ఛానల్స్ పనులు నిర్వహించకుండా చెరువుల పనులు కూలీలు చేపట్టడం విడ్డూరంగా ఉంది. ఏడాది పొడుగునా ఇంటిల్లపాది అవసరాలు తీర్చుకునేందుకు వరిసాగుకు కావాల్సిన సాగునీటి వనరులను అభివృద్ధి చేయడంలో అధికార యంత్రాంగం కనీస శ్రద్ధ కనబర్చకపోవడంతో రైతు కుటుంబాలు నానాఅవస్థలు ఎదుర్కొంటున్నాయి. అన్నదాతల గోడును పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మరికొద్దిరోజుల్లో ఖరీఫ్ ఆరంభంకానున్నతరుణంలో ఇప్పటికీ కాలువల్లో పూడిక తీతలు చేపట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అన్నదాతల కష్టాలు గుర్తెరిగి సాగునీటి ఇబ్బందులు ఎదురుకాకుండా కాలువల్లో పూడిక తీత పనులు ప్రారంభించి సత్వరంగా పూర్తిచేయాలని రైతు కుటుంబాలు వేడుకుంటున్నాయి.