Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

బాబు షో ప్లాప్!

$
0
0

అనంతపురం, మే 2 : ఉప ఎన్నికల ప్రచార నిమిత్తం రెండు రోజుల జిల్లా పర్యటనకు వచ్చిన టిడిపి అధినేత చంద్రబాబు రెండు రోజుల పర్యటన ప్లాప్‌గా ముగిసింది. దీంతో ఖిన్నుడైన బాబు బుధవారం ఉదయం రెండు నియోజకవర్గాలకు చెందిన నాయకులతో పాటు జిల్లా నాయకులకూ క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. రెండు రోజుల పర్యటనలో బాబు ప్రచార పర్యటన నిర్వహణ, కార్యకర్తలను సమీకరించిన తీరు, రెండు నియోజకవర్గాల్లోనూ నాయకుల వ్యవహార శైలిపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డట్లు తెలిసింది. ముఖ్యంగా రెండు నియోజకవర్గాల ప్రచార పర్యటనల్లో ఆయన ముఖ్యమైన నాయకులు, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రెండు నియోజకవర్గాల్లోనూ నెలకొని ఉన్న అసమ్మతిపై ఆయనకు ఒక స్పష్టత వచ్చినట్లు తెలిసింది. దీంతో ఆ రెండు నియోజకవర్గాల్లోని అసమ్మతి నేతలను ఆయన పిలిపించి మాట్లాడి తనదైన శైలిలో హెచ్చరికలు జారీ చేసినట్లు పార్గీవర్గాలు వెల్లడించాయి. మొదటిరోజు రాయదుర్గం నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలను సమీకరించిన తీరు బహిరంగ సభలో పాల్గొన్న ప్రజల సంఖ్యను ఆయన లెక్కలోకి తీసుకుని క్లాస్ తీసుకున్నారు. ఆరు ఏడు నెలల క్రితం తను రాయదుర్గంలో పర్యటనకు వచ్చినపుడు వచ్చిన కార్యకర్తలెందరు .. ప్రస్తుతం వచ్చిన కార్యకర్తలెందరు అన్న విషయాలపై ఆయన ఆరా తీసినట్లు సమాచారం. అంతేకాకుండా నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నాయకులు, ముఖ్య కార్యకర్తలు చేసిన ఫిర్యాదులను కూడా ఆయన పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. దీంతో అభ్యర్థి దీపక్‌రెడ్డిపై పెద్ద ఎత్తున విరుచుకుపడినట్లు తెలిసింది. నీవు నియోజకవర్గానికి కొత్త అయినా టికెట్ ఇచ్చాము .. యువకుడు, ఉత్సాహవంతుడు .. పార్టీకి ఉపయోగపడగలడన్న కారణంతోనే నీకు టికెట్ ఇచ్చాము. కానీ నీవు మాత్రం సీనియర్ లీడర్ లా వ్యవహరిస్తూ కార్యకర్తలను, సీనియర్ నాయకులను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. వారి బాగోగులపై ఎలాంటి దృష్టి పెట్టడం లేదు. ఎవరయినా ఏదయినా అడిగినే పార్టీకోసం అభిమానంతో పనిచేయాలి .. స్వచ్చంధంగా పనిచేయాలంటూ లెక్చర్లు ఇస్తున్నావట ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని ఆయన క్లాస్ తీసుకున్నట్లు తెలిసింది. నీకు ఇంకా మంచి భవిష్యత్తు ఉంది .. కార్యకర్తలను నాయకులను అందరినీ కలుపుకుని వెళ్లాలి. వారి బాగోగులు చూసుకోవాలి . అంతే కాని నీకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం పద్దతి కాదని హెచ్చరించినట్లు తెలిసింది. ఇంకోసారి ఇలాంటి ఫిర్యాదులు నాయకుల నుంచి కాని, ముఖ్య కార్యకర్తల నుంచి కాని రాకూడదని కూడా ఆయన హెచ్చరించినట్లు తెలిసింది. రాయదుర్గం నియోజకవర్గంకు సంబంధించి అభ్యర్థికి, అసమ్మతి నాయకునికి క్లాస్ తీసుకునేటప్పటికి జిల్లా నాయకులందరూ అలర్ట్ అయిపోయారు. వెంటనే ఇద్దరినీ కలిపి ప్రెస్‌మీట్ ఏర్పాటుచేయించి తమ మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవని పార్టీ కోసం కలసి పనిచేస్తామని తెలియచెప్పేలా చేశారు. ఇక అనంతపురం నియోజకవర్గం విషయానికి వచ్చేటప్పటికి అభ్యర్థి మహాలక్ష్మి శ్రీనివాస్‌తో చంద్రబాబు దాదాపుగా అరగంట సేపు వ్యక్తిగతంగా మాట్లాడినట్లు తెలిసింది. అనంతరం అసమ్మతి నేతలు అందరితోనూ విడి విడిగా మాట్లాడినట్లు తెలిసింది. ఈ సందర్భంగా అసమ్మతి నేతలకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో మీ పనితీరు ఏమీ బాగాలేదు .. మీరు సీనియర్ నాయకులు .. మీవల్ల పార్టీకి లాభం చేకూరుతుందనుకుంటే మీ ప్రవర్తనవల్ల పార్టీకి నష్టం కలుగుతోంది .. మీరే కార్యకర్తలను గ్రూపులుగా విభజించినట్లు నివేదికలు వస్తున్నాయని అసమ్మతి నాయకున్ని హెచ్చరించినట్లు సమాచారం. ఇప్పటికే మీరు పలుపార్టీలు మారారు .. ఇకనైనా టిడిపిలోనే ఉంటే మీకు తప్పకుండా గుర్తింపునిస్తాం .. అనవసరంగా ఇలాంటి వ్యవహారాలు చేయకండని హెచ్చరించినట్లు తెలిసింది. నియోజకవర్గానికి చెందిన ఒక అసమ్మతి నాయకునికి దాదాపుగా అరగంట సేపు క్లాస్ తీసుకున్నట్లు తెలిసింది. అనంతరం అసమ్మతి నాయకులను, పార్టీ అభ్యర్థిని పిలిపించి మాట్లాడినట్లు తెలిసింది. రెండు నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులు, అసమ్మతి నేతలు, జిల్లా నాయకులకు బాబు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఉప ఎన్నికలు పార్టీ పరువుప్రతిష్టలకు చెందినవి. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ఎట్టి పరిస్థితుల్లోనైనా పార్టీ అభ్యర్థులు తప్పకుండా విజయం సాధించాలి. మీ వ్యక్తిగత ప్రతిష్టల కోసం పార్టీ అభ్యర్థులను ఓడించడానికి యత్నిస్తే అందుకుతగ్గ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించినట్లు తెలిసింది. అలా గెలుపు సాధించలేదంటే అసమ్మతి నాయకులపై వేటు పడుతుందని హెచ్చరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతపురం నియోజకవర్గంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంపట్ల కూడా ఆయన కొంత నిరాసక్తత వ్యక్తం చేసినట్లు సమాచారం. నియోజకవర్గవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు రాకపోయేటప్పటికి నాయకులకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. కార్యకర్తల ముగింపు సమావేశంలో మాట్లాడిన బాబు అభ్యర్థి విజయం కోసం భేదాభిప్రాయాలు లేకుండా ఉండాలని అభ్యర్థి విజయం కోసం ప్రతి ఒక్కరూ శ్రమించాలని ఆదేశించారు. అనంతరం ఆఖరుగా వేదికపై ఉన్న నేతలందరితోనూ మహాలక్ష్మి శ్రీనివాస్‌ను తప్పకుండా గెలిపిస్తామని ప్రమాణం చేయించడం గమనార్హం. ఇలా నియోజకవర్గంలో అసమ్మతి లేదని చెప్పడానికి శతవిధాలా బాబు యత్నించారు. కానీ వ్యక్తిగత ప్రతిష్టలకు పెద్దపీట వేసే నాయకులు అధినేత ఆదేశాలను పట్టించుకుంటారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అసమ్మతి నాయకుల వ్యవహార శైలిపట్ల చంద్రబాబు పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరి ఈసారి చేసిన హెచ్చరికలను, ఆదేశాలను అసమ్మతి నేతలు ఏ మేరకు పాటిస్తారో వేచి చూడాల్సిందే.
బడుగుల పార్టీ టిడిపి -బాబు
అనంతపురం కల్చరల్, మే 2: తెలుగుదేశం పార్టీ పేద, బడుగు బలహీన వర్గాల పార్టీ అని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం నగరంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం, రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, లేకున్నా పేద ప్రజల పక్షాన పోరాటం చేస్తుందన్నారు. టిడిపి అధికారంలో ఉన్నపుడు మహిళలు, యువత, విద్యార్థులు, రైతులు కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేశామని, దీపం పథకం ద్వారా 32 లక్షల మంది గ్యాస్ సరఫరాను అందించామని తెలిపారు. చదువుకునే ఆడ పిల్లలకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశామని తెలిపారు. ఎన్‌టిఆర్ సిఎంగా ఉన్నప్పుడు మహిళలకు ఆస్తిహక్కు కల్పించామన్నారు. సామాజిక న్యాయానికి మారుపేరు తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ దొంగల పార్టీఅని, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గజదొంగల పార్టీ అని ఎద్దేవా చేశారు. లక్షల కోట్లు రూపాయులతో సంక్షేమ పథకాలతో గాదికింద పంది కొక్కుల్లా దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఒరగబెట్టింది ఏమి లేదన్నారు. సబ్ ప్లాన్ నిధులు 17వేల కోట్లు పక్కదారి పట్టించారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు గృహ నిర్మాణంలో 50శాతం కేటాయించాల్సి ఉండగా ఎక్కడా దానిని అమలు పరచలేదన్నారు. హత్య రాజకీయాల్లో వైయస్‌ఆర్ కుటుంబం అరితేరిందన్నారు. భానుకిరణ్, మంగళి కృష్ణలు వైయస్ జగన్ అనుచరులేనన్నారు. భూగర్భ సంపద, భూ సంపద, ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టిన జగన్ డబ్బు కోసం హత్యలు కూడా చేయించారన్నారు. లక్ష కోట్ల ఆస్తులతో దేశంలో అనేక నగరాల్లో ప్యాలస్‌లు నిర్మించుకున్న జగన్ మరింత దోచుకోవడానికే పార్టీని ఏర్పాటు చేశారన్నారు. ఇలాంటి అవినీతి పరులను ఈ ఉప ఎన్నికల్లో ఓడించి, తగిన బుద్ధి చెప్పాలన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వెయ్యి రూపాయలు ఇస్తామన్నారు. పేద ప్రజలకు ఉచిత విద్యను అందిస్తామని, ఉచితంగా బియ్యం అందిస్తామని, నగదు బదిలీని ప్రవేశపెడతామని ఆయన వాగ్ధానం చేశారు. ఇళ్లు లేని పేదలకు మూడు సెట్లు స్థలంలో లక్ష రూపాయలతో ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుత ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మహాలక్ష్మి శ్రీనివాసులును గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పార్థసారథి, ప్రధాన కార్యదర్శి వరదాపురం సూరి, ఎంపి నిమ్మల కిష్టప్ప, పోలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు, పార్టీ అభ్యర్థి మహాలక్ష్మి శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, పయ్యావుల కేశవ, అబ్ధుల్ ఘని, కందికుంట వెంకటప్రసాద్, పల్లే రఘునాథ్‌రెడ్డి, పార్టీ నాయకులు శమంతకమణి, హనుమంతరాయచౌదరి, ప్రభాకర్ చౌదరి, సైపుల్లా, జకీవుల్లా, నదీం అహ్మద్, సాయినాథ్ గౌడ్, ఆలం నరసనాయుడు, బుగ్గయ్య చౌదరి, పేరం నాగిరెడ్డి, బివి.వెంకటరాముడు, చంద్రదండు ప్రకాష్ నాయుడు, జైరాం నాయుడు, నాగార్జున, నాగన్న, రాయల్ మురళీ, కృష్ణకుమార్, మహేష్, వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు రోడ్ షోకు భారీ స్పందన
అనంతపురం , మే 2: ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బుధవారం నగరంలో నిర్వహించిన రోడ్ షోకు ప్రజల నుండి భారీ స్పందన లభించింది. బాబు రాక కోసం జనం రోడ్లుకు ఇరువైపులా బారులు తీరి నిలబడ్డారు. మొదట చంద్రబాబునాయుడు కొట్టాల నుండి ప్రారంభమైన రోడ్ షోకు తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు సిపిఐ నాయకులు జిల్లా కార్యదర్శి డి.జగదీష్, నారాయణస్వామి, కాటమయ్యలు తమ కార్యకర్తలతో బాబుకు స్వాగతం పలికారు. అక్కడ నుండి రుద్రంపేట, రాంనగర్, లక్ష్మినగర్, నడిమివంక, 5వ రోడ్డు మీదుగా ఎర్రనేల కొట్టాల వరకు ఈ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో బాబుతో పాటు పార్టీ అభ్యర్థి మహాలక్ష్మి శ్రీనివాసులు, పరిటాల సునీత, సిపిఐ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
చంద్రదండు కార్యకర్తలకు పోలీసులకు మధ్య ఘర్షణ : చంద్రబాబు రోడ్‌షో సందర్భంగా పోలీసులు రక్షణలో భాగంగా చంద్రదండు కార్యకర్తలను పక్కకు నెట్టటంతో వారు పోలీసులపై తిరగబడడంతో ఇద్దరి మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా వారి మధ్య తోపులాట జరిగి, నాయకుల జోక్యంతో సద్దుమణిగింది.

చెక్‌పోస్టుల్లో తనిఖీలు
13 లక్షల నగదు పట్టివేత
అనంతపురం, మే 2 : ఉప ఎన్నికల్లో అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేయడానికి ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో బుధవారం ఒక్కరోజే దాదాపుగా రూ. 13 లక్షల వరకూ నగదు పట్టుబడింది. వివరాలిలా ఉన్నాయి ... కలెక్టర్ కార్యాలయంలో సమీపంలో ఏర్పాటుచేసిన చెక్‌పోస్టు వద్ద బుధవారం పోలీసులు వాహనాల తనిఖీ చేపడుతుండగా కారులో వెళ్తున్న నలుగురి వద్ద నుంచి రూ. 10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ పది లక్షలకు సంబంధించి సరైన ఆధారాలు చూపిస్తే వాటిని తిరిగి అప్పగిస్తామని వన్‌టౌన్ సిఐ భాస్కరరెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం నడిమివంక సమీపంలో వాహనాల తనిఖీల్లో భాగంగా తనిఖీలు చేపడుతుండగా ఒక కారు నుంచి 3 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని మూడవ పట్టణ ఇన్‌చార్జి సిఐ మహబూబ్‌భాషా తెలిపారు. సరైన సాక్ష్యాధారాలు చూపించిన పక్షంలో పట్టుబడ్డ సొమ్మును తిరిగి చెల్లిస్తామని ఆయన తెలిపారు.

తుపాకి పేలి కానిస్టేబుల్ దుర్మరణం
అనంతపురం, మే 2 : ప్రమాదవశాత్తూ తుపాకి పేలిన ఘటనలో ఒక కానిస్టేబుల్ దుర్మరణం పాలయ్యాడు. వివరాలిలా ఉన్నాయి ... గుత్తి పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులు(42) ఐదు నెలల నుంచి నిందితులకు రక్షణ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా బుధవారం సబ్ జైలు నుంచి ఒక వాహనంలో నిందితులను తీసుకుని జిల్లా కోర్టుకు చేరుకున్నాడు. నిందితులతో పాటు జిల్లా కోర్టు ఆవరణలోనే వాహనాన్ని ఉంచుకుని వారికి కాపలాగా వాహనంలోనే ఉన్నాడు. తల కింద తుపాకీని ఉంచుకుని ఉన్న సమయంలో ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడంతో గొంతులోంచి బుల్లెట్ పైకి వెళ్లింది. గొంతులోంచి పైకి వచ్చిన బుల్లెట్ తల పై భాగంలోంచి బయటకు వెళ్లిపోయింది. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. నిందితుల రక్షణగా వచ్చిన ఇన్‌చార్జి గౌస్ మొయినుద్దీన్ ఫిర్యాదు మేరకు టు టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.

రాజ్యాధికారం కోసమే
బీసీలపై బాబు కపటప్రేమ
రాయదుర్గం,మే 2: రాష్ట్రంలో రాజ్యాధికారం కోసమే నారా చంద్రబాబునాయుడు బిసిలపై కపటప్రేమను వల్లిస్తూ ఊసరవెల్లి రాజకీయాలను ఆడటానికి ప్రయత్నిస్తున్నాడని వైకాపా జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ అన్నారు. పట్టణంలో బుధవారం విలేఖరుల సమావేశంలో వైకాపా జిల్లానాయకులు శంకరనారాయణ, పైలా నరసింహయ్య, జొన్నా రామయ్య, గిరిరాజు నగేష్, సిపి.వీరన్న, ముస్తాక్‌అహ్మద్‌లు మాట్లాడారు. రాయదుర్గం పర్యటన చేసిన తెలుగుదేశంపార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తమ ప్రసంగంలో బిసిలమీద వల్లమాలిన ప్రేమను ఒలకబోస్తూ బిసిల సంక్షేమం కోసమే తాను నిరంతరం శ్రమిస్తానని నాటకీయంగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. అలనాడు తెలుగుదేశంపార్టీని స్థాపించిన ఎన్‌టి రామారావు బిసిలకు ప్రాధాన్యత ఇవ్వడం వాస్తవమయినప్పటికీ బాబు తన హయాంలో బిసిలను కేవలం ఓటుబ్యాంకుగా వాడుకున్నాడని ఎద్దేవా చేశారు. వైఎస్‌ఆర్ తనయుడిగా ఆయన ఆశయాలకు అనుగుణంగా చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు జగన్ ముందడుగు వేస్తున్నాడని ఇలాంటి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ సమర్థించి వైకాపాకు విజయం చేకూర్చాలని కోరారు. అధికారంలో ఉన్నప్పుడు బిసిలకు ఏమాత్రం న్యాయం చేయని బాబు నేడు మాయమాటలు వల్లించడం సిగ్గుచేటని కేవలం జగన్ పేదప్రజల పక్షపాతిగా పోరాటం చేస్తున్నాడని వివరిస్తూ వైకాపా విజయానికి మద్దతు పలకాలని వారు కోరారు. ముస్తాక్ అహ్మద్ సి.పి.వీరన్న మాట్లాడగా కలుగోడు మహేష్,జగన్నాథ్, వరికూటి అంపారెడ్డి పాల్గొన్నారు.

చిరంజీవిని విమర్శించే అర్హత జగన్‌కు లేదు
హిందూపురం టౌన్, మే 2: రాజ్యసభ సభ్యులు చిరంజీవిని విమర్శించే అర్హత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఏమాత్రం లేదని స్థానిక యువజన కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. చిరంజీవి స్వయంకృషితో కష్టపడి రాజకీయాల్లో ఎదుగుతున్నారన్నారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా ఛైర్మెన్ ఇందాద్, యువజన కాంగ్రెస్ నాయకులు ఎంపి దీపక్, ప్రసాద్‌రెడ్డి, శివశంకర్, బండ్లపల్లి జబీలు మాట్లాడారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిరంజీవిపై అనవసరంగా విమర్శలు చేయడాన్ని మానుకోవాలన్నారు. అంచలంచెలుగా ఉన్నతస్థాయికి చేరుకొన్న తమ నాయకుడిపై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి గతంలో తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల ప్రజాధనాన్ని వెనకేసుకొని ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలందరికీ సామాజిక న్యాయం చేయడం ప్రాంతీయ పార్టీతో సాధ్యం కాదని భావించి ప్రజాశ్రేయస్సును దృష్టిలో వుంచుకొని ప్రజారాజ్యం పార్టీని జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌లోకి విలీనం చేయడం జరిగిందన్నారు. చిరంజీవి పదవికోసం రాజీనామా చేశారని జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నీతి, నిజాయితీ గురించి మాట్లాడే అర్హత జగన్‌కు ఏమాత్రం లేదన్నారు. తమ నాయకుడు చిరంజీవి నీతి, నిజాయితీ, కష్టాన్ని నమ్ముకొని ఎదుగుతున్నారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా అమలు చేసిన పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని చెబుతున్నారని, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన అన్ని పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని, ఏ పథకాన్ని నిలిపివేశారో జగన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పేదల కష్టాలను తెలిసిన వ్యక్తి చిరంజీవని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విద్యుత్ చార్జీలను పెంచితే ఇందుకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి లేఖ రాశారన్నారు. తిరుపతి నియోజకవర్గంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారంతోపాటు డ్రైనేజీలు, రహదారులు తదితర వౌలిక సదుపాయాల కోసం రూ.400 కోట్లను ప్రభుత్వం నుండి మంజూరు చేయించారన్నారు. దీనికి తోడు తిరుపతిలో మైనార్టీల కోసం ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న షాదీమహల్‌ను నిర్మింప చేశారన్నారు. చిరంజీవి లాంటి ప్రజల మనిషిని విమర్శించే ముందు నేతలు తమ స్థాయిని తెలుసుకోవాలన్నారు. అనవసరంగా విమర్శలుచేస్తే కాంగ్రెస్ నాయకులతోపాటు అభిమానుల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో నాయకులు జమీల్, ఇనాయత్, ప్రకాష్, షఫీ, ఇషాక్, కలీం తదితరులు పాల్గొన్నారు.

విద్యుదాఘాతానికి వ్యక్తి మృతి
కదిరిరూరల్, మే 2: పట్టణంలోని శివాలయం వెనుక వీధిలో నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి ఆలయంలో విద్యుదాఘాతంతో రామ్మోహన్ (50) బుధవారం ఉదయం మృతిచెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలు. ఓడిసి, ముదిగుబ్బ, ఎన్‌పి కుంటలో హౌసింగ్ ఎఈగా రామ్మోహన్ పని చేశాడు. అయితే ఇటీవల అతనిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. కాగా అయ్యప్ప స్వామి ఆలయంలో నేడు విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా గత మూడు రోజుల నుండి అయ్యప్ప స్వామి ఆలయంలో ఏర్పాట్లను రామ్మోహన్ చేస్తుండేవాడు. దీనిలో భాగంగా బుధవారం మైక్‌సెట్‌కు కనెక్షన్ ఇస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. ఇతనిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై జాకీర్ హుసేన్ కేసు నమోదు చేసుకొని, శవాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
నల్లచెరువు, మే 2: మండల పరిధిలోని అల్లుగుండు దగ్గర బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో బాబాఫకృద్ధీన్ (18) అనే యువకుడు మృతి చెందగా, ఆనంద్ అనే యువకునికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. వివరాలు కదిరి నానాదర్గా వెనుక వీధికి చెందిన బాబాఫకృద్ధీన్, గజ్జలరెడ్డి పల్లికి చెందిన ఆనంద్‌లు నల్లచెరువు నుంచి కదిరికి ద్విచక్ర వాహనంలో వస్తుండగా అల్లుగుండు దగ్గర ఎదురుగా వస్తున్న లారీ లైట్ల వెలుతురుకు అదుపు తప్పి మరొక వాహనాన్ని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే స్థానికులు 108 వాహనంలో కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తుండగా బాబాఫకృద్దీన్ మృతి చెందాడని, ఆనంద్‌ను మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహమ్మద్ రఫిక్ తెలిపారు.
ఇళ్లు దగ్ధం
మలకవేమల, మే 2: ముదిగుబ్బ మండల పరిధిలోని సానేవారి పల్లిలో విద్యుదాఘాతంతో మల్లేసుకు చెందిన ఇళ్లు దగ్ధమైన సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. విద్యుదాఘాతం వల్ల టివిలో మంటలు వచ్చి కిందపడడంతో కిందనే వున్న కిరోసిన్ అంటుకుంది. దీంతో ఇంట్లో మంటలు వ్యాప్తి చెంది మూడు బస్తాల వేరుశెనగ, నిత్యావసరాలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని బాధితుడు కోరారు.
నిందితుడి అరెస్టు
పామిడి, మే 2: పట్టణంలోని సంతమార్కెట్ వద్ద వృద్దుడిని ఆటో ఢీకొన్న సంఘటనలో నిందితుడు పూజారి రాజేష్‌ను బుధవారం అరెస్టు చేసినట్లు ఏ ఎస్‌ఐ సుబ్రమణ్యం తెలిపారు. ఐదు రోజులక్రితం వృద్దుడు మస్తాన్‌సాహేబ్ సంతమార్కెట్లో కూరగాయల కొనుగోలుకు వెళ్తుండగా డిజల్ ఆటో ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడన్నారు. సంఘటనపై కేసు నమోదుచేసి విచారణ అనంతరం ఆటో డ్రైవర్‌ను అరెస్టుచేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు ఏఎస్‌ఐ వెల్లడించారు.
ఐషర్ వాహనం బోల్తా- ఇద్దరికి తీవ్ర గాయాలు
యాడికి, మే 2: మండల పరిధిలోని వేములపాడు-రాయలచెరువు 63 జాతీయ రహదారి మధ్య బుధవారం ఐషర్ బోల్తాపడడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గుత్తి వైపు నుండి చెన్నైకు వెళుతున్న ఐషర్ వాహానం ముందర గుంతలను తప్పించడానికి ప్రయత్నిస్తుండగా ఎదురుగా ఉన్న మహిళలను ఢీ కొట్టింది. కొద్దిగా ముందరికి వెళ్లగానే ఐషర్ బోల్తాపడింది. మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి. లారీలో ఉన్న వ్యక్తికి బలమైన గాయాలు కావడంతో వారిని 108 వాహనం సహయంతో తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు.
జూదరులు అరెస్టు- నగదు స్వాధీనం
గుంతకల్లు రూరల్, మే 2: మండల పరిధిలోని కసాపురం గ్రామంలో పేకాట అడుతున్న 6 మంది జూదరులను అరెస్టు చేసినట్లు కసాపురం ఎస్సై సునీత తెలిపారు. అరెస్టు చేసిన వీరి వద్ద నుండి రూ. 7000లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

రౌడీ రాజకీయాలను ప్రోత్సహించేందుకే బాబు పర్యటన: కాపు
రాయదుర్గం,మే 2: ప్రశాంతమైన నియోజకవర్గంలో రౌడీరాజకీయాలను ప్రోత్సహించేందుకే తెలుగుదేశంపార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పర్యటన చేశారని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. పట్టణంలోని వైకాపా కార్యాలయంలో బుధవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాబు పర్యటనకు ముందురోజు బొమ్మనహాళ్ మండలంలో తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు శాసనమండలి చీఫ్‌విప్ శివరామరెడ్డిపై దాడి చేయడంతోనే ఈ నియోజకవర్గంలో రౌడీరాజకీయాలు ప్రారంభమయ్యాయన్నారు. ఎన్నడూ లేనివిధంగా నియోజకవర్గంలో ఇలాంటి సంఘటనలు జరుగడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని అన్నారు. నియోజకవర్గంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి రౌడీ రాజకీయాలపట్ల సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడిగా గుర్తింపుపొందిన చంద్రబాబునాయుడు త్వరలో నిర్ధోషిగా విడుదలయ్యే గాలి జనార్ధనరెడ్డిని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన బాబు కేవలం జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకుని కాలయాపన చేస్తున్నాడని ప్రజలను మభ్యపెట్టి స్వార్థ ప్రయోజనాలను సాధించడానికి ప్రయత్నిస్తున్న బాబుకు ప్రజలే బుద్ధి చెప్పడం తథ్యమని అన్నారు. నియోజకవర్గంలో అనేక సేవ కార్యక్రమాలు చేస్తూ ప్రతియేడూ వందలాదిమంది జంటలకు ఉచిత వివాహాలుచేస్తూ పేద కుటుంబాలలో వెలుగులను నింపడానికి ప్రయత్నిస్తున్న తనను బాబు విమర్శించడం ఎంతవరకు సమంజసమో ప్రజలే నిర్ణయించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈ ఉప ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకోవడం వల్లనే ప్రజలను మభ్యపెట్టడానికి మాయమాటలతో వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఓట్లుదంచుకోడానికి ప్రయత్నిస్తున్నారని ఇలాంటి మోసపూరిత రాజకీయ నాయకులను ప్రజలు గుర్తించి బుద్ధి చెప్పాలని కాపు రామచంద్రారెడ్డి కోరారు. ఈ సమావేశంలో వైకాపా నాయకులు సిపి.వీరన్న, బుజ్జిరెడ్డి, కలుగోడు మహేశ్, జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు.

ఉప ఎన్నికల ప్రచార నిమిత్తం రెండు రోజుల జిల్లా పర్యటనకు వచ్చిన టిడిపి అధినేత
english title: 
flop show

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>