Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి!

$
0
0

కడప, మే 2 : జిల్లా కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకుంది. సామాజిక సమతుల్యాన్ని పాటించక పోవడం పట్ల అభ్యర్థుల భవితం ఫలితాలు అయోమయం కాగలవని, దీంతో ఎన్నికల బాధ్యతలు అంటే జిల్లా మంత్రులతో పాటు నేతలు సైతం జడుసుకుంటున్నారు. ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి ఒంటెద్దు పొకడతో అభ్యర్థులను ఎంపిక చేశారని, ఎన్నికల ప్రచార బాధ్యతలతో పాటు పోలింగ్ ప్రక్రియ వరకు ఆయనే చూసుకోవాలని నేతలే డిమాండ్ చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో తెలుగుదేశం పార్టీ సంబంధిత సామాజిక వర్గాలకు పెద్దపీట వేసిందని రాజకీయ పరిశీలకుల అంచనా. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విషయానికి వస్తే ఆ మూడు నియోజక వర్గాల అభ్యర్థులు తమ పదవులకు త్యాగం చేసినందున ఆ అభ్యర్థుల ఎంపికపై అన్ని వర్గాలు సబబే అంటున్నాయి. ఈ పరిస్థితుల్లో మైనార్టీలు అధికంగా ఉన్న రాయచోటి, బలిజ కులస్థులు అధికంగా ఉన్న రాజంపేట అసెంబ్లీ స్థానాల్లో సంబంధిత సామాజిక వర్గాలకు పెద్దపీట వేయలేదని హైకమాండ్‌పై సంబంధిత నేతలు తీవ్ర అసంతృప్తి వెల్లబుచ్చుతున్నారు. కేవలం ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయించిన అభ్యర్థులకే టిక్కెట్లు కేటాయించారని రాజకీయ మేథావులు అంటున్నారు. అభ్యర్థులను పిఆర్పీ నేతలు, జిల్లా మంత్రులు డాక్టర్ డీఎల్. రవీంద్రారెడ్డి, సి. రామచంద్రయ్య, ఎస్‌ఎండి. అహ్మదుల్లా, మాజీ వైఎస్. వివేకానందరెడ్డి తదితరుల ప్రమేయం లేకుండా ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. అలాగే ఆ మూడు నియోజక వర్గాలు రాజంపేట ఎంపి, కేంద్ర మాజీ మంత్రి ఎ. సాయిప్రతాప్ నియోజక వర్గ పరిధిలో ఉన్నా ఆయన్ను ముఖ్యమంత్రి ఖాతరు చేసిన దాఖలాలు లేవనే ఆరోపణలు ఉన్నాయి. చివరికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాకం అశోక్‌కుమార్‌ను మచ్చుకైన అడిగిన పాపాన పోలేదని ఆ పార్టీ నేతలే బహిరంగంగా అంటున్నారు. ఈ పరిస్థితుల్లో అభ్యర్థుల రాజకీయ భవిత గాలిలో దీపం చందంగా ఉందని పలువురు భావిస్తున్నారు.

పోటాపోటీగా ఫిర్యాదుల పర్వం
కడప , మే 2 : జిల్లాలో జరుగుతున్న ఉప ఎన్నికల సమరంలో అప్పుడే పార్టీలకు చెందిన నేతలు ఎత్తులకు పైఎత్తులు మొదలు పెట్టారు. ఇందుకు సంబంధించి పరస్పరం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుల పర్వానికి శ్రీకారం చుట్టారు. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ నేతల తీరుపై అప్పుడే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు ఎదురుదాడులకు దిగాయి. తమ ప్రాంతంలో పోలింగ్ కేంద్రాలను మారుస్తున్నారంటూ ఒకరు, దొడ్దదారిన ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నారని మరొకరు ఫిర్యాదులు మొదలు పెట్టారు. గత వారం రోజులుగా రైల్వేకోడూరులోని పలు ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను మార్చి రిగ్గింగ్ చేసుకోవాలన్న ప్రయత్నంలో భాగంగా తమకు అనుకూలంగా కేంద్రాలను మార్చుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న కొరముట్ల శ్రీనివాసులు ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారికి మొదలుకుని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సైతం ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగానే ఇటీవల కోడూరులో ఎన్నికల అధికారి నిర్వహించిన సమావేశాల సైతం కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకున్న విషయం విధితమే. ఆ మేరకు మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి అనిల్‌కుమార్ నిర్వహించిన రాజకీయ పార్టీల సమావేశంలో సైతం ఈ ఫిర్యాదులు అందాయి. అదే విధంగా రైల్వేకోడూరు, రాజంపేట ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాల పేరిట పలు పనులు చేపడుతున్నారని తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలకు సాక్ష్యాలుగా పలు ప్రాంతాల్లో జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధించిన పనులపై ఫొటోలు సేకరించి ఎన్నికల కమిషన్‌కు నివేదించారు. ఇందులో ఉప ఎన్నికల మునుపు ప్రజాపథం పేరుతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మూడు నియోజకవర్గాల్లో పర్యటించి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ మూడు నియోజకవర్గాల్లోనే సుమారు 400 కోట్ల రూపాయల పనులకు శ్రీకారం చుట్టారు. అదే కాకుండా ఎన్నికలకు నెల రోజుల మునుపే ఈ నియోజకవర్గాల నేతల అభ్యర్థనల మేరకు వివిధ పథకాల కింద ఒక్కొక్క నియోజకవర్గానికి రెండు కోట్లు మొదలుకుని 10 కోట్ల వరకు నిధులు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పథకాల అమలుపై కూడా తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేసథ్యంలో ఇప్పటికే ప్రచార రంగంలో వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కొంత ముందంజలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ముందుగా నిర్ణయించిన అభ్యర్థులనే బరిలో దించేందుకు కొంత దృష్టి సారించింది. ఫలితంగా ఈ మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చేపడుతున్న అనేక కార్యక్రమాలపై ఈ రెండు పార్టీలు డేగ కన్ను పెట్టాయి. ఎక్కడ ఎలాంటి పనులు చేపట్టినా వాటిపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ఈ రెండు పార్టీలు సమయాత్తమవుతున్నాయి. ఈ ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎన్నికల అధికారి అనిల్‌కుమార్ ఈ మూడు నియోజకవర్గాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకునేందుకు వీలుగా ప్రతి మండలానికి ఒకటిద్దరు పర్యవేక్షకులను, నియోజకవర్గానికి మరో ప్రత్యేక అధికారిని నియమించారు. ఏది ఏమైనా జిల్లాలో ఫిర్యాదుల పర్వం జోరందుకుంది.

వాహనాల తనిఖీ.. రెండు లక్షలు స్వాధీనం
రాయచోటి, మే 2: ఉప ఎన్నికల సందర్భంగా వాహనాలు తనిఖీ చేస్తుండగా చిన్నమండెం మండలం దేవళంపేట సమీపంలో రెండు లక్ష లు నగదు స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సిఐ రాజేంద్రప్రసాద్ తెలిపా రు. గుర్రంకొండకు చెందిన మహబూబ్‌బాషా నగదుపై ఎలాంటి ఆధారాలు చూపించక పోవడంతో ఇన్‌క మ్ టాక్స్ అధికారులకు సమాచారం అందజేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ముమ్మరంగా వాహనాలు తనిఖీ చేస్తున్నామని, ఎలాంటి మొత్తాలను తీసుకెళ్లాలన్నా వాటికి సంబంధించిన పత్రా లు వెంట తీసుకెళ్లాలని తెలిపారు. ఈ తనిఖీలో చిన్నమండెం ఎస్‌ఐ యోగేంద్ర, పోలీసులు తెలిపారు.

నేటి నుంచి జగన్
’ఉప ప్రచారం‘
కడప, మే 2: ఉప ఎన్నికల్లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి 3,4,5 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. 3, 4 తేదీల్లో రాజంపేట, 5వ తేదీ రాయచోటి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా సంబంధిత నియోజక వర్గాల్లో ఆ పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పది రోజుల క్రితం పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలో పర్యటనలు చేయగా వారం క్రితం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పర్యటించి వెళ్లారు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం వచ్చినట్లయింది. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి జగన్ జిల్లా పర్యటన చేస్తున్నట్లు తెలిసింది. జగన్ సొంత జిల్లాలో జరిగే ఉప ఎన్నికలను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు సమాచారం. అందుకోసం అవసరం అనుకుంటే రెండు, మూడు పర్యాయాలు జిల్లాలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గురువారం నుంచి జరిగే పర్యటనలో ఆయన వీలైన ప్రాంతాల్లో రోడ్ షోలు, సభలు నిర్వహించి ఎన్నికల వ్యూహాన్ని రచించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆ మూడు నియోజక వర్గాల్లో జగన్ కుటుంబ సభ్యులు ఎన్నికల బాధ్యతలు తీసుకుని ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా కాంగ్రెస్, తెలుగుదేశం వర్గీయులతో మంతనాలు చేసి వారిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా జగన్ రాకతో జిల్లాలో వివిధ పార్టీల నేతల ప్రచార కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి.

ఆదర్శవంతమైన ఎన్నికలు నిర్వహించాలి
* ఎన్నికల నిఘావేదిక సూచన
కడప, మే 2 : ఉప ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో మద్యం, డబ్బు పంపిణీ, ఇతర ఎన్నికల వ్యతిరేక కార్యక్రమాలు జరగని విధంగా ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేలా ఎన్నిల కమిషన్ తగు చర్యలు తీసుకోవాలని ఎన్నికల నిఘావేదిక రాష్ట్ర కన్వీనర్ వి. లక్ష్మీరెడ్డి సూచించారు. బుధవారం స్ధానిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత మూడు శతాబ్ధాలుగా ఎన్నికల నిర్వహణను పరిశీలిస్తే చేదు సంఘటనలు తారసపడుతాయన్నారు. కొంతమంది స్వార్థపర రాజకీయ నాయకులు వారి ప్రయోజనాల కోసం ఎన్నిక వ్యయాన్ని పెంచి ధనవంతులకే రాజకీయాలు అన్న విధంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య మనుగడకు తూట్లు పోడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో జరిగే ఉప ఎన్నికల స్ధానాల్లో మద్యం, డబ్బుల పంపిణీని నివారించేలా ఆయా పార్టీలు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఎన్నిక నిఘా వేదిక ఆధ్వర్యంలో కూడా ఈ దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందుకు కమటీలను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నిక కారణంగా ఉచితంగా పంపిణీ చేసే మద్యానికి యువత, విద్యార్థులు బలై వారి భవిష్యతును నాశనం చేసుకుంటున్నారన్నారు. ఇటీవల జరిగిన కోవూరు ఉప ఎన్నికలో మూడు పార్టీలు కలిపి మద్యం పంపిణీకి 10కోట్లు, మరో 30 కోట్లను ఓటర్లకు పంపిణీ చేశారన్నారు. ఇదే లెక్కన 18 స్థానాల్లో జరిగే ఉప ఎన్నికల్లో కూడా అభ్యర్థులు పంపిణీకి సిద్ధమవుతున్నారన్నారు. దీన్ని నిలువరించేందుకు ప్రజాస్వామ్యవాదులందరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఆరుకోట్ల మంది ఓటర్లు ఉండగా వీరిలో కేవలం వెయ్యి మందే రాజకీయాలను శాసిస్తున్నారని ఈ సంస్కృతికి కారణం మద్యం, డబ్బుల పంపిణీయో అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నిక నిఘావేదిక జిల్లా కన్వీనర్ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఊపందుకున్న ఉప ఎన్నికల ప్రచారం
రాయచోటి, మే 2: నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఖరారు కావడంతో ప్రచారాలు ఊపందుకున్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక మండలంలో ఏదో ఒక పార్టీకి సంబంధించిన అభ్యర్థులు లేదా వారికి సహకారం అందిస్తున్న కుటుంబ సభ్యులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు, అభ్యర్థి తమ్ముడు ప్రసాద్‌బాబు ఒక్కొక్క మండలం చొప్పున ప్రచారం చేస్తున్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ తరపున మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి, ఆయన తమ్ముడు లక్ష్మీప్రసాద్‌రెడ్డి, సోదరుడు ఆనంద్‌రెడ్డి ఇలా ఒక్కొక్క మండలంలో వారు ప్రచారం చేస్తున్నారు. ఇక వైఎస్‌ఆర్‌సిపి విషయానికొస్తే మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఒక మండలంలో ప్రచారం చేస్తుండగా, ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్‌రెడ్డి మరొక మండలంలో ప్రచారం చేస్తున్నారు. మూడు పార్టీలకు చెందిన అభ్యర్థులు యువకులు, విద్యావంతులు కావడంతో ఏ గ్రామానికి వెళ్లినా వారికి మద్దతు పలుకుతున్నారు. ఒక్కరోజు ఒక్క పార్టీకి మద్దతు పలికితే మరుసటి రోజు మరొక పార్టీకి మద్దతు పలుకుతుండటం విశేషం. దీంతో ప్రజలు ఏ పార్టీకి ఓట్లు వేస్తారో అంతు పట్టడం లేదని పలువురు రాజకీయ నాయకులు చెబుతున్నారు. ఏ పార్టీ అభ్యర్థులు ప్రచారానికి వెళ్లినా వారి వెంటే ఉండడం, తమ ఓట్లన్నీ మీకే అని చెప్పడం తిరిగి మరసటి రోజు మరో పార్టీ అభ్యర్థికి అలాగే చెప్పుతుండటంతో నాయకులే కంగుతినాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నిన్నటి వరకూ రామాపురానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం విధితమే. అయితే నేడు తిరిగి వైఎస్‌ఆర్‌సిపిలోకి వెళ్తున్నట్లుగా పుకార్లు రావడంతో తిరిగి తెలుగుదేశం పార్టీకి గడ్డుకాలం ఎదురవుతోందని పలువురు అంటున్నారు. ఎవరు ఎటు ఉన్నా, లేకున్నా ఆయా పార్టీల అభ్యర్థులు సుగవాసి సుబ్రమణ్యం, మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఇంటింటికీ తిరిగి ఎండలు సైతం లెక్కచేయకుండా ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న తపనతో ప్రచారం చేస్తున్నారు. నిన్నటి వరకు అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడడంతో అభ్యర్థి ఎవరన్నది రెండు పార్టీలు ఎదురు చూశాయి. చివరకు మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డికే ఖరారు చేయడంతో నియోజకవర్గంలో త్రిముక పోటీ ఏర్పడింది.
ఉప ఎన్నికల్లో విజయం మాదే
* 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ తులసిరెడ్డి
వేంపల్లె, మే 2: రానున్న ఉప ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ పార్టీదే అని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ తులసిరెడ్డి తన ధీమా వ్యక్తం చేశారు. బుధవారం వేంపల్లెలో ఆయన స్వగృహంలో విలేఖరులతో మాట్లాడుతూ ఉప ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో కేవలం ఎమ్మెల్యే నిర్ణయమే తప్ప ప్రభుత్వానికి ఎటువంటి డోకా ఉండదన్నారు. అభివృద్ధి కోరుకునే ప్రజలు అధికార పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. అధికార పార్టీ అభ్యర్థులు గెలిస్తే ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఓటు వేస్తే ఎటువంటి అభివృద్ధి జరగదన్నారు. వైఎస్‌ఆర్ సిపికి ఓటు వేస్తే రాష్ట్రం చిన్నాభిన్నం అవుతుందన్నారు. వైఎస్‌ఆర్ పార్టీ ఓటు వేస్తే కెసిఆర్‌కు ఓటు వేసినట్లేనన్నారు. వేంపల్లెలో నేటి నుండి బ్రహ్మోత్సవాలు జరగడం హర్షణీయమన్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్య పాత్ర వహిస్తున్న ఆ దేవస్థాన అద్యక్షుడు బసు శివారెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్రమణ్యం, వెంకటరమణారెడ్డి, భాస్కరరెడ్డి, చలపతి, వై.వి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇసుక కొరతతో
నత్తనడకన ఆర్టీపీపీ సివిల్ పనులు
ప్రొద్దుటూరు, మే 2:రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు ( ఆర్టీపిపి)లో ప్రారంభమైన 600యూనిట్ల 6వయూనిట్ నిర్మాణపు పనులకు ఇసుక కొరత ఏర్పడింది. రూ. 3,500కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టిన పనులు ప్రస్తుతం ప్రారంభదశలో ఉన్నాయి. గత నెల రోజులుగా ప్రారంభమైన సివిల్ పనుల కోసం అవసరమైన ఇసుక కొరత ఏర్పడడంతో కాంట్రాక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఇల్లూరు, కమలాపురం, తదితర ప్రాంతాల నుండి ఇసుక రవాణాకు అధికారులు అనుమతి ఉండేది. ఆర్టీపిపికి కావాల్సిన ఇసుకను కూడా అక్కడ నుండి సరఫరా చేసుకునేవారు. అయితే ఇటీవల హైకోర్టు ఇసుక తరలింపుకు ఆంక్షలు విధించడంతో ఇసుక రవాణా చేసుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక దొరకక పనులు నత్తనడకన నడుస్తున్నాయి. ఇప్పుడిప్పుడే సివిల్ పనులు పుంజుకుంటున్న సమయంలో ఇసుక కొరత ఏర్పడడంతో కాంట్రాక్టర్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం ఎదురుచూస్తున్నారు. కొందరు కాంట్రాక్టర్లు గతంలో ఇసుక రవాణా చేసిన ప్రాంతాల నుండి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు, రెవెన్యూ అధికారుల కారణంగా ఇసుక తరలింపు సాధ్యం కావడం లేదు. ఈ పరిస్థితుల్లో పనులు ఎలా కొనసాగించాలో తెలియక అటు కాంట్రాక్టర్లు, ఇటు అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. సివిల్ పనులు ఆలస్యమైతే మిగతా పనులలో కూడా జాప్యం జరిగి అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తి అయ్యే అవకాశాలు లేవని ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీపిపికి అవసరమైన ఇసుక కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కాంట్రాక్టర్ అధికారులను కోరుతున్నారు.

ఘనంగా సీతారాముల కల్యాణం
వీరబల్లె, మే 2: మండల పరిధిలోని మట్లి గ్రామ పంచాయతీలోని మాండవ్య నది ఒడ్డున వెలసిన శ్రీకోదండరామస్వామి దేవాలయ ప్రాంగణంలో గత వారం రోజులుగా మహాభారత యజ్ఞం నిరాటంకంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బాగంగా బుధవారం స్వాముల వారి కల్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గత 30 సంవత్సరాలుగా మట్లి తొగటపల్లెకు చెందిన చెలంగాండ్ల కుటుంబీకులు ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఈ సంవత్సరం కూడా వారు సీతారాముల కల్యాణం నిర్వహించారు. భక్తాదులు వేలాదిగా తరలి వచ్చి స్వాముల వారికి నారికేళాలు, పూలమాలలు సమర్పించారు.
అంగరంగ వైభవంగా బ్రహ్మరథోత్సవం
బ్రహ్మంగారిమఠం, మే 2: భూత భవిష్యత్‌వర్తమాన కాలజ్ఞాని జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహేంద్రస్వాముల ఆరాధన ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన బుధవారం స్వామివారి బ్రహ్మరథోత్సవాన్ని వేలాది మంది భక్తుల మద్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంతకుముందు ఈశ్వరీదేవి మఠం మఠాధిపతులు శ్రీ శివకుమార్ స్వాముల వారు రథం దగ్గరకు వచ్చి పూజలు నిర్వహించారు. తరువాత బ్రహ్మంగారి మఠం మఠాధిపతులు శ్రీ వీరబోగ వసంత వెంకటేశ్వరస్వామి రథం మద్యకు వచ్చి రథానికి పూజలు నిర్వహించి రథోత్సవ కార్యక్రమాన్ని ఆయన చేతులమీదుగా ప్రారంభించారు. తరువాత మైదుకూరు డిఎస్పీ ప్రవీణ్‌కుమార్, తహశీల్దార్ పుల్లయ్య , దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్‌లకు మఠం తరుపున తాళమేళ వాయిద్యాలతో తీసుకొచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం జై వీరబ్రహ్మజై, గోవిందమాంబజై అనే నామసంకీర్తనలతో ఒక్కసారిగా జేజేలు పలికించి రథాన్ని ముందుకు కదిలించారు. ఈ రథంపైన బ్రహ్మంగారి మఠం వీరభద్రాచారి, ప్రధాన అర్చకులతో కలిసి రథాన్ని ముందుకు కదలించారు. ఆవిధంగా ఐదుగంటలకు ప్రారంభమైన రథం రింగ్ రోడ్డు ద్వారా తిరిగి 6.30గంటలకు యధాస్థానానికి రథం చేరుకున్నది. ఈ రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతరరాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో డిఎస్పీ ప్రవీణ్‌కుమార్, సిఐ ఆరోహణరావు ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎటువంటి ఆటంకాలు జరగకుండా రథోత్సవాన్ని బ్రహ్మండంగా నిర్వహించారు. ఈ రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తాదులు పురవీధులు, మేడలు పైకి ఎక్కి ఈ రథోత్సవాన్ని తిలకించారు.
కెయంఆర్ ట్రావెల్స్ ఎద్దులకు ప్రథమ బహుమతి
ఆరాధన గురుపూజ మహోత్సవాల సందర్భంగా తోట్లపల్లెలోని అచలానంద ఆశ్రమంలో తోట్లపల్లె గ్రామస్థులు ఏర్పాటు చేసిన బండలాగుడు పందానికి మొత్తం ఏడు జతలు పాల్గొన్నాయి. ఈ పోటీలలో ప్రొద్దుటూరుకు చెందిన కెయంఆర్ ట్రావెల్స్‌అధినేత కందుల రామమునిరెడ్డి చెందిన ఎద్దులు 923.5 అడుగులు లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. మైదుకూరు మండలం కేశవాపురం గ్రామానికి చెందిన వనం సుధాకర్‌రెడ్డికి చెందిన ఎద్దులు 917.3 అడుగులు లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. మైదుకూరు మండలం కేశవాపురం గ్రామానికి చెందిన త్యాగం శివారెడ్డి ఎద్దులు 792.6 అడుగులు లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. మైదుకూరు మండలం వనిపెంట గ్రామానికి చెందిన పెద్దమాబు ఎద్దులు 759.5 అడుగులు లాగి నాలుగవ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లె రామకృష్ణారెడ్డికి చెందిన ఎద్దులు 735 అడుగులు లాగి ఐదవ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఈ పోటీలలో గెలుపొందిన ఎద్దుల యజమానులకు అచలానంద ఆశ్రమ నిర్వాహకులు విరజానందస్వామి చేతుల మీదుగా తొట్లపల్లె గ్రామస్థులు ప్రథమ బహుమతిగా రూ. 40వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 30వేలు, తృతీయ బహుమతిగా రూ. 20వేలు, నాలుగవ బహుమతిగా రూ. 10వేలు , ఐదవ బహుమతిగా ఐదువేల రూపాయలు నగదును వారికి అందజేశారు. ఈ కార్యక్రమానికి డిఎస్పీ ప్రవీణ్‌కుమార్ పర్యవేక్షణలో ఈ బండలాగుడు పందాలు నిర్వహించారు. ఈ పోటీలను చూసేందుకు చుట్టు ప్రక్కల గ్రామీణ ప్రజలతోపాటు, ఉత్సవాలకు వచ్చిన భక్తాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జిల్లా కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకుంది
english title: 
dissent

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>