Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఆధిపత్య పోరులో... వీధినపడ్డ బడుగులు

$
0
0

ఆదోని, మే 2: ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కోటేకల్లు గ్రామంలో నెలకొన్న రాజకీయ ఆధిపత్య పోరులో వందల కుటుంబాలు నలిగిపోతున్నాయి. ప్రత్యర్థులు దాడులు చేసి ఇండ్లు తగులబెట్టి మారణ హోమం సృష్టించడంతో బతుకుజీవుడా అంటూ కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పిల్లాపాపలతో ఉన్న ఊరు, గూడు, పొలాలు వదిలి వందల కుటుంబాలు వలసబాట పట్టాయి. ఎన్నికలు వచ్చినప్పుడల్లా కోటేకల్లు గ్రామం తెరమీదకు వస్తుంది. ఎన్నికలైన తరువాత వారిని పట్టించుకునే వారే లేరు. సొంత ఊరికి వెళ్తామంటే పోలీసులు అనుమతించ లేదు. న్యాయస్థానాన్ని ఆశ్రయించినా ఫలితం లేకుండాపోయింది. ఎమ్మిగనూరు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రావడంతో మళ్లీ కోటేకల్లు కక్షల కుంపటిలో నలిగిన కుటుంబాల సమస్య తెరమీదకు వచ్చింది. కోటేకల్లు వదిలిన వారు ఆదోని డివిజన్‌లోని పలు గ్రామాల్లో తలదాచుకుంటున్నారు. అలాంటిదే మృత్యుంజయ కుటుంబం. ఆదోనిలో తలదాచుకుంటున్న ఆ కుటుంబాన్ని కదిపితే కన్నీటి గాథలే వినవస్తాయి. తమకు కక్షలతో, సంజీవయ్య హత్యతో ఎలాంటి సంబంధం లేదని కోటేకల్లు నుంచి వెలివేయబడ్డ మృత్యుంజయ, ఆయన భార్య ఆవేదన వ్యక్తం చేశారు. సంజీవయ్య కేసులో ముద్దాయిగా ఉన్న చంద్రశేఖర్‌కు బంధువైనందుకే తమకు ఈ గతి పట్టిందని వాపోయారు. గతంలో కోటేకల్లులో చిన్న వ్యాపారం పెట్టుకొని జీవించే వారమని మృత్యుంజయ తెలిపారు. సంజీవయ్య హత్య జరిగిన రోజు తమ దుకాణాన్ని పోలీసుల సమక్షంలోనే తగులబెట్టి ఇండ్లను లూటీ చేశారని తెలిపారు. రూ. 5 లక్షల వరకు నష్టం జరిగిందని, కట్టుబట్టలతో ఆదోనిలో వచ్చి అద్దె ఇంట్లో నివసిస్తున్నామని మృత్యుంజయ చెప్పారు. మృత్యుంజయలాంటి 250 బాధిత కుటుంబాలను కోటేకల్లు గ్రామం నుంచి ప్రత్యర్థులు తరిమేశారు.
ఓసారి గతంలోకి వెళ్తే.. కోటేకల్లు గ్రామంలో లింగాయత్ బసవన్నగౌడు, బోయ బసన్నల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. వీరిద్దరి మధ్య పోరులో ఏడుగురు చనిపోయారు. 1979లో కిరాయి హంతకుడు బోయ బసన్న, అతని అల్లుడు సంగమయ్య ఒక కేసులో మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల కోర్టుకు పోలీస్ ఎస్కార్ట్‌తో వెళ్తుండగా ప్రత్యర్థులు పోలీసుల కళ్లలో కారం చల్లి రైల్వేస్టేషన్‌లోనే బసన్న, సంగమయ్యను చంపారు. ఈ కేసులో చిన్న బసవన్నగౌడు, మరో 14 మంది నిందితులు. చిన్న బసవన్నగౌడు చేతికి గ్రామాధిపత్యం వచ్చింది. 1983లో గడ్డం తాయన్న, సంజీవయ్య మరో 13 మంది కలిసి చిన్న బసవన్నగౌడును చంపేశారు. ఈ కేసులో సంజీవయ్య నిందితుడు. ఆ తరువాత చాలాకాలం వరకు గ్రామం ప్రశాంతంగా ఉంది. ప్రత్యర్థులు కక్షలు మాని గ్రామంలో దేవాలయం నిర్మాణానికి నిధులు సేకరించారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కోటేకల్లు గ్రామంలో మళ్లీ రాజకీయ ఆధిపత్యం కోసం రెండు వర్గాలు పోటీ పడ్డాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన చెన్నబసప్పగౌడు వర్గం తెలుగుదేశంలోను, సంజీవయ్య వర్గం కాంగ్రెస్ పార్టీలోను ఉండిపోయింది. గ్రామానికి చెందిన తిప్పన్న సంజీవయ్య వర్గానికి చెందిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు పెట్టడంతో మళ్లీ గ్రామకక్షలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన సంజీవయ్యను 2006లో గ్రామ సమీపంలో చంపేశారు. దీంతో చంద్రశేఖర్, మరి కొంతమందిపై కేసు పెట్టారు. సంజీవయ్య హత్య కేసులో ముద్దన్నగౌడు, చంద్రశేఖర్‌తో పాటు మరికొంత మందికి యావజ్జీవ శిక్ష పడింది. అయితే సంజీవయ్య హత్య అనంతరం ముద్దన్నగౌడు, చంద్రశేఖర్ వర్గీయులు, బంధువులుగా భావిస్తున్న 250 కుటుంబాలను గ్రామం నుంచి ప్రత్యర్థులు తరిమేశారు. వారి ఇండ్లు తగులబెట్టారు. దుకాణాలను లూటీ చేశారు. దీంతో ముద్దన్నగౌడు వర్గీయులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పిల్లాపాపలతో గ్రామం వదిలారు. ఫలితంగా వీరికి చెందిన వందల ఎకరాల భూమి బీడుగా మారింది. అయినా పోలీసులు ఏమీ చేయలేకపోయారు. తాజాగా ఎన్నికలు రావడంతో గ్రామం నుంచి తరిమేసిన బాధితులు సొంత ఊరు వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో వారు రాజకీయ నాయకులను ఆశ్రయించారు. ఎన్నికలు ఉండడంతో వీరి ఓట్ల కోసం నాయకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. స్వయంగా చంద్రబాబునాయుడు కోటేకల్లు కక్షలను ప్రస్తావించి కాంగ్రెస్ పార్టీని బహిరంగంగా విమర్శించారు. ఈ విధంగా రాజకీయ నాయకుల చేతిలో కోటేకల్లు బాధితుల సమస్య ఒక ఆయుధంగా మారిందే తప్ప బాధితులకు ఎలాంటి న్యాయం చేకూర్చలేకపోయింది. గ్రామ ఆధిపత్య పోరులో సర్వం కోల్పోయిన తమ కన్నీళ్లు ఎవరు తుడుస్తారని బాధితులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

గుబులు పుట్టిస్తున్న ఉప పోరు..!
కర్నూలు, మే 2: జిల్లాలో జరుగనున్న రెండు శాసన సభ స్థానాల ఉప ఎన్నికలు ప్రజలను, అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. గతంలో కంటే ఈ సారి ఎన్నికలు ఆయా రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఎత్తులు, పై ఎత్తులు వేస్తూ విజయం కోసం శ్రమిస్తున్నారు. ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు దాడులకు దిగడం శోచనీయమని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో జెండాలను కడుతున్న తమ పార్టీ కార్యకర్తలపై వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం తగదని ఆ పార్టీ అభ్యర్థి ఇరిగెల రాంపుల్లా రెడ్డి ఆరోపించడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భూమా నాగిరెడ్డితో పాటు ఆయన అనుచరులపై కేసులు నమోదు చేశారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పర్యటనకు వచ్చిన రోజే ఆళ్ళగడ్డలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి అదనపు బలగాలను పంపించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఆ తరువాత కూడా ఆళ్లగడ్డలో శాంతి, భద్రతలకు భంగం కలుగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఎమ్మిగనూరులో తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్న విషయాన్ని టిడిపి అభ్యర్థి బివి. మోహన రెడ్డి కార్యకర్తల సమావేశంలో పేర్కొంటూ ఇక ముందుకు అలాంటి దౌర్జన్యాలను అంగీకరించబోమని హెచ్చరించారు. ఇక ముందు తమ కార్యకర్తలపై దాడి చేస్తే ప్రతి దాడులు తప్పవని కూడా ఆయన తన ప్రత్యర్థులకు సూచించారు. ఆ తరువాత మాట్లాడిన చంద్రబాబు నాయుడు కూడా కార్యకర్తలకు తాము అండగా ఉంటామని దౌర్జన్యాలను సహించాల్సిన అవసరం లేదని భరోసా ఇవ్వడంతో అక్కడ కూడా పరిస్థితులు చేయి దాటి పోయే ప్రమాదం ఉందన్న అంచనాతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఆళ్ళగడ్డ, ఎమ్మిగనూరు నియోజకవర్గాల విషయంలో ఎస్పీ ఎప్పటికపుడు అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులతో సంప్రదిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికలకు ఇంకా సుమారు 40రోజుల సమయం ఉన్నా ఇప్పటి నుంచే పోలీసులు రంగంలోకి దిగడం ఇదే ప్రథమమని ఆ నియోజకవర్గాల ప్రజలు భావిస్తున్నారు. ఎన్నికలకు గడువు సమీపించే కొద్దీ ఎపుడు ఏం జరుగుతుందో ఆందోళన వారిలో కనిపిస్తోంది. శాంతి, భద్రతలకు భంగం కలుగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ కలెక్టర్ రాంశంకర్ నాయక్, ఎస్పీ చంద్ర శేఖర్ రెడ్డిలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించడంతో ఇద్దరు అధికారులు సైతం ప్రత్యేక దృష్టిని సారించారు. కలెక్టర్ కూడా రెండు నియోజకవర్గాల్లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులతో సమీక్ష నిర్వహించాలని నిర్ణయించుకొని బుధవారం ఆళ్ళగడ్డ నియోజకవర్గ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎన్నికల సందర్భంగా ఏ చిన్న పొరపాటు ఆస్కారం లేకుండా ఎన్నికల కోడ్, శాంతి, భద్రతలకు విఘాతం కలుగకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అవసరమైన చర్యలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. ఏ రాజకీయ పార్టీ అయినా నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. పోలీసు అధికారులు ప్రధానంగా ఎప్పటికపుడు తనిఖీలు, సోదాలు నిర్వహించడం వంటి చర్యలు తీసుకోవడం ద్వారా అక్రమాలను అరికట్టాలని సూచించారు. అవసరమైతే అదనపు బలగాలను పంపడానికి సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ ఆళ్ళగడ్డ పోలీసు అధికారులకు స్పష్టం చేశారు. మరో రెండు రోజుల్లో ఎమ్మిగనూరులో కూడా ఇలాంటి సమావేశం నిర్వహించి అక్కడి అధికారులకు కూడా తగిన సూచనలు, సలహాలు, ఆదేశాలు జారీ చేయనున్నారు. ఉప ఎన్నికలే అయినా నిబంధనలు అమలులో ఉండే కాలం ఎక్కువగా ఉండటంతో ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవడం పోలీసులకు, ఇతర అధికారులకు తలనొప్పిగా తయారైంది. జరుగరాని సంఘటన జరిగితే ఉద్యోగాలకు ముప్పు తప్పదన్న భయం కూడా వారిలో నెలకొని ఉంది. ప్రజల్లో సైతం రాజకీయ పార్టీ నాయకుల ప్రకటనలు, సవాల్‌లు, హెచ్చరికలు చూసి ఎపుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఉంది. అధికారులు కఠినంగా వ్యవహరించి శాంతియుత వాతావరణం నెలకొనేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

ఎపిఎండిసి ద్వారా ఇసుక రవాణాకు ప్రతిపాదనలు పంపండి
కర్నూలు, మే 2: ఇసుక నిషేధంపై రాష్ట్ర హైకోర్టు స్టే ఉన్నందు వల్ల ఎపిఎండిసి ద్వారా ఇసుక సరఫరా చేసేందుకు జిల్లాకు అవసరమైన ప్రతిపాదనలు ఇవ్వాలని మైనింగ్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ డి.శ్రీనివాసులు అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు ఆయన హైదరాబాదు నుండి వీడియో కాన్ఫరెన్స్‌ను ఎపిఎండిసి వైస్ చైర్మన్ ముఖేష్ కుమార్ మీనా, మైనింగ్ అండ్ జియాలజీ డైరెక్టర్ సురేష్ కుమార్, భూగర్భజల శాఖ డైరెక్టర్ మురళీ మోహన్‌తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇసుక సమస్య పరిష్కారంపై జిల్లాలకు అవసరమైన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ బుద్ద ప్రకాశ్ మాట్లాడుతూ జిల్లాలో నాలుగు ఫీజుబుల్ పాయింట్స్ అందుబాటులో ఉన్నాయని వీటి ద్వారా 8 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తీసుకోవచ్చన్నారు. అయితే జిల్లాకు 18 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం ఉందని అన్నారు. ఇందులో 13 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక ప్రభుత్వ నిర్మాణ పనులకు, 5 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక ప్రైవేటు నిర్మాణ పనులకు అవసరం ఉందని ఆయన తెలిపారు. గత ఏడాది రెండు ఫీజుబుల్ రీచెస్ పాయింట్లకు వేలం జరిగిందని జాయింట్ కలెక్టర్ నివేదించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ట్రైనీ కలెక్టర్ ప్రీతి మీనా, మైనింగ్ డిడి రంగారావు, డిపిఓ శోభాస్వరూప రాణి, భూగర్బజల శాఖ డిడి లక్ష్మా, మైనింగ్ ఎడి చంద్ర వౌళి, ఇరిగేషన్ ఎస్‌ఇ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మేలో భగభగలు..!
కర్నూలు, మే 2: వాతావరణంలో వచ్చిన అనూహ్య మార్పుల కారణంగా గత కొద్ది రోజులుగా తగ్గిన ఉష్ణోగ్రత తిరిగి పుంజుకుంది. జిల్లాలో బుధవారం మధ్యాహ్నం 41.4డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై ప్రజలను బెంబేలెత్తించింది. వేసవి ప్రారంభమైన తరువాత మార్చి నెలలోనే సూర్య ప్రతాపం భారీగా కనిపించింది. ఆ మాసంలో 40డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదు అయింది. అదే స్థాయిలో ఏప్రిల్ మాసంలో కూడా ఉష్ణోగ్రత పెరిగి 42డిగ్రీల స్థాయి వరకు నమోదు అయి ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. అయితే వాతావరణంలో నెలకొన్ని మార్పుల దృష్ట్యా ఏప్రిల్ మాసాంతంలో అప్పుడప్పుడూ కురిసిన వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలో తగ్గుదల కనిపించింది. గత కొద్ది రోజులుగా 40డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదు కావడంతో కొంత ఉపశమనం కనిపించింది. అయితే బుధవారం ఒక్కసారిగా వేడి పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టడంతో సంతోషించిన ప్రజలు ఇపుడు ఆ ఉష్ణోగ్రతల్లో కూడా మార్పు వచ్చి 28డిగ్రీలకు చేరుకుంది. ఒక వైపు ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా మరో వైపు గాలిలో తేమ శాతం తగ్గడంతో వేడి తాపం ఎక్కువగా ఉందని వాతావరణ నిపుణులు వెల్లడిస్తున్నారు. జిల్లాలో గాలిలోని తేమ శాతం 25శాతానికి పడిపోయిందని పేర్కొంటున్నారు. రెండు రోజుల క్రితం వరకు గాలిలో తేమ సుమారు 40శాతం వరకు ఉండేదని దాంతో మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ గాలిలో తేమ కారణంగా వేడి ఎక్కువగా కనిపించకపోవచ్చని వెల్లడిస్తున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు క్రమేణా పెరుగుతాయని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.

ఓటుహక్కు నిర్భయంగా వినియోగించుకోండి
ఆళ్ళగడ్డ, మే 2: నియోజకవర్గంలోని ప్రతి ఓటరు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంశంకర్‌నాయక్ అన్నారు. పట్టణంలోని అమ్మవారిశాలలో బుధవారం ఉప ఎన్నికలపై అన్ని శాఖల అధికారులతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ శంకర్ అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రాలలో ర్యాంపులు ఏర్పాటు చేయాలని, విద్యుత్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసి ఒకపోలింగ్ కేంద్రంలో రెండు ఫ్యాన్లు అమర్చాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలను సంబంధిత అధికారులు కల్పించకపోతే వేటు తప్పదని హెచ్చరించారు. ప్రింటర్లు, పబ్లిషర్లు రాజకీయ పార్టీ నాయకులకు సంబంధించిన కరపత్రాలు, గోడపత్రికలు తయారు చేసేటపుప్పడు ఆర్డరు తీసుకునే సమయంలో వారి పేరు, చిరునామా అలాగే ఎన్ని ప్రింట్లు కావాలో తెలుసుకొని తమకు సమాచారం అందించాలన్నారు. నిబంధనలు పాటించని పబ్లిషర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 27 పోలింగ్ కేంద్రాలలో విద్యుత్ సౌకర్యం లేదని ఉప విద్యాశాఖాధికారి తాహెరాసుల్తానా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వారం రోజుల్లోగా విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కిటికీల వద్ద ఈవిఎం పెడుతున్నారని అలా కాకుండా మందంపాటి బట్టను వాడాలన్నారు. ఈ నెల 18కల్లా పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. అనంతరం నాటుసారా, చీఫ్‌లిక్కర్ లాంటివి సరఫరా కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే ముగ్గురు పోలీసు అధికారులతో కలిసి ఫ్లైయింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశామన్నారు. నియోజకవర్గంలో ప్రతి మండలానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించామన్నారు. నియోజకవర్గానికి ముగ్గురు కేంద్ర పరిశీలకులు వస్తారన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం లో మైక్రో పరిశీలకున్ని, డిజిటల్ వీడియో గ్రాఫర్‌ను పెట్టడంతో పాటు, వెబ్ కెమరాలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేకాధికారి గోవిందప్ప, పోలీస్ అధికారులు, అన్ని శాఖల అధికారులు, తాహశీల్దార్లు, ఎంపిడిఓలు, మండల విద్యాధికారులు, వి ఆర్వోలు, అంగన్‌వాడీ కార్యర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఆళ్ళగడ్డయినా కుప్పంలోనైనా బాబుపై పోటీ చేస్తా : భూమా
శిరివెళ్ళ, మే 2: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆళ్ళగడ్డలో పోటీ చేసినా సరే, కుప్పంలో పోటీ చేసినా ఆయనపై పోటీ చేస్తానని వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర గవర్నింగ్ సభ్యులు భూమా నాగిరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కోటపాడులో శ్రీనివాసరెడ్డి గృహంలో కార్యకర్తలతో మాట్లాడుతూ ముఠా తగాదాలను పోషించే హక్కు చంద్రబాబుకే ఉందన్నారు. నీతిమాలిన హత్యలు చేయడం సబబు కాదన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని నేరచరితునిగా, కోట్ల విజయభాస్కర్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. టిడిపి అభ్యర్థులకు డిపాజిట్ గల్లంతైన విషయాన్ని గుర్తుచేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి గుర్తుకు రాలేదని ఇప్పుడు గుర్తుకు వస్తుందా? అని ప్రశ్నించారు. జగన్‌పై అసత్య ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పదవిపై ఆకాంక్షతో పిచ్చిపిచ్చిగా మాట్లాడడం జరుగుతోందన్నారు. 2014లో జగన్ ముఖ్యమంత్రి కావడం తధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు ఉందన్నారు. కార్యక్రమంలో సేవాదళ్ జిల్లా కన్వీనర్ లక్ష్మికాంతరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, గుర్రెడ్డి, శ్రీకాంతరెడ్డి, శ్రీనివాసరెడ్డి, రామ, సత్యనారాయణ, గణపతిరెడ్డి, వాసుదేవరెడ్డి, నాగేశ్వరరెడ్డి, సూర్యనాగశేషిరెడ్డి, అధిక సంఖ్యలోకార్యకర్తలు పాల్గొన్నారు.
కార్యకర్తలకు అండగా ఉంటా...
కార్యకర్తలకు అండగా ఉంటామని ఆళ్ళగడ్డ మాజీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి అన్నారు. కోటపాడులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమా నాగిరెడ్డి సమక్షంలో శ్రీనివాసరెడ్డి, గణపతిరెడ్డి ఆధ్వర్యంలో శేషిరెడ్డి, పుల్లారెడ్డి, వాసుదేవారెడ్డి, నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 మంది కార్యకర్తలు పార్టీలో చేరారు.

వైభవంగా పెద్దమ్మ జాతర
ఉయ్యాలవాడ, మే 2: కోవెలకుంట్ల మండల పరిధిలోని అమడాల గ్రామంలో పెద్దమ్మ జాతర ఘనంగా జరిగింది. 45 సంవత్సరాల అనంతరం నిర్వహించిన జాతరకు భక్తులు వేలాది సంఖ్యలో హాజరయ్యారు. మంగళవారం అర్ధరాత్రి పెద్దమ్మ దేవతను ప్రతిష్ఠించారు. దీంతో జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతిష్ఠ అనంతరం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ప్రముఖులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. నంద్యాల పార్లమెంట్ సభ్యులు ఎస్‌పివైరెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసానిరామిరెడ్డి, బనగానపల్లె టిడిపి ఇన్‌చార్జి బిసి జనార్ధన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి యర్రబోతులవెంకటరెడ్డి, చల్లాభగీరథరెడ్డి తదితర రాజకీయప్రముఖులు హాజరై పెద్దమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కోవెలకుంట్ల సిఐ రామాంజనేయులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

రాయలసీమలో ఉప ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించండి
కర్నూలు, మే 2: రాయలసీమ జిల్లాలోని కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలో జరిగే ఉప ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని రాయలసీమ ఐజి గోవింద్ సింగ్ ఆదేశించారు. బుధవారం కర్నూలు నగరంలోని డిఐజి కార్యాలయంలో రాయలసీమ జిల్లాలో జరిగే ఉప ఎన్నికలపై డిఐజిలు, ఎస్పీలు, డిస్పీలతో శాంతి భద్రతలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఐజి గోవింద్ సింగ్ మాట్లాడుతూ ఉప ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ఎన్నికల కోడ్‌ను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రధానంగా ఉప ఎన్నికలు జరిగే నియోజవర్గంలోని సరిహద్దుల్లో చెక్ పోస్టు ఏర్పాటు చేసి డబ్బు, మధ్యం రవాణను అరికట్టాలని అన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో ముందు జాగ్రత్త చర్యగా కేసులు వున్న వ్యక్తులను అరెస్టు చేయాలన్నారు. శాంతి భద్రతలను విఘాతం కలిగించే ఎంతటి వారినైన శిక్షించడానికి వెనుకాడే ప్రశక్తే లేదని చెప్పారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసే అన్ని పార్టీ అభ్యర్థులు, ఓటర్లు ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే వాతావరణం కల్పించాలన్నారు. అన్ని పార్టీల అభ్యర్థులు పోలీసు, రెవెన్యూకు సహకరించాలని అన్నారు. ఈ సమావేశంలో కర్నూలు డిఐజి అనీల్‌కుమార్, అనంతపురం డిఐజి చారు సిన్హా, కర్నూలు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, అనంతపురం ఎస్పీ షహనవాజ్ ఖాసీం, కడప ఎస్పీ, డిఎస్పీలు, ఎస్‌బి సిఐలు పాల్గొన్నారు.

ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కోటేకల్లు గ్రామంలో నెలకొన్న రాజకీయ ఆధిపత్య పోరులో వందల కుటుంబాలు
english title: 
adhipatya poru

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>