అరకులోయ, మే 2: మండలంలోని డింగ్రిపుట్టు, గద్యగుడ గ్రామాల్లో మం చినీటి సదుపాయం కల్పించాలని కోరు తూ గిరిజనులు బుధవారం ఆందోళన నిర్వహించారు. స్థానిక మండల పరిష త్ కార్యాలయం ఎదుట ఆయా గ్రా మాల గిరిజనులు ధర్నా చేపట్టి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఎం.పి.డి.ఒ., గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీర్లను గిరిజనులు నిలదీసి మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం నాయకులు కిల్లో సురేంద్ర, పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ వేసవిలో గ్రామాలలో మంచినీటి సమస్య తలెత్తకుండా చర్య లు తీసుకున్నట్టు అధికారులు ప్రకటించడంలో అర్థం లేదని అన్నారు. వేసవికాలం ముందు నుంచే అనేక గ్రామాలలో నీటి ఎద్దడి ఏర్పడినప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదని వారు విమర్శించారు. గ్రామాలలో నిరుపయోగంగా పడి ఉన్న బావులు, బోర్‌వెల్స్‌ను మరమ్మతులు చేయించి నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతు న్నా అధికారులు పట్టించుకోకపోవడంతో గిరిజనులు దాహార్తిని తీర్చుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారని వారన్నారు. ప్రజాపథంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికైనా మంచినీటి సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు కె.రామారావు, కె.రామన్న, పరశురాం, హరి, రాజారావు, గిరిజనులు పాల్గొన్నారు.
నియోజకవర్గానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించండి
* కాంగ్రెస్ అభ్యర్థి సుమన
కోటవురట్ల, మే 2: పాయకరావుపేట నియోజకవర్గానికి సేవచేసే అవకాశాన్ని కల్పించాలని కాంగ్రెస్ అభ్యర్థి గంటెల సుమన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం కోటవురట్లలో ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజును కలిసి సుమన ఆశీస్సులను కోరారు. అనంతరం సుమన, ఎమ్మెల్సీ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుమన మాట్లాడుతూ 20 సంవత్సరాలపాటు తెలుగుదేశం ఎమ్మెల్యేలుగా ఉన్న వారు నియోజకవర్గానికి వౌలిక సదుపాయాలను కల్పించలేక పోయారన్నారు. నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో మంచినీటి సమస్యతో అల్లాడుతున్నాయన్నారు. కొన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం లేదన్నారు. నియోజకవర్గంలో ఇంకా విద్యుత్ సౌకర్యంలేని గ్రామాలు చాలా ఉన్నాయన్నారు. తనను గెలిపిస్తే వౌలిక సదుపాయాలతో పాటు ప్రాజెక్టుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కబర్లు చెప్పే వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి గొల్ల బాబూరావు కూడా మూడేళ్ళలో నియోజకవర్గానికి ఎమీ చేయలేకపోయారన్నారు. మళ్ళీ గెలిపిస్తే ఏదో చేస్తానని మభ్యపెడుతున్న బాబూరావు మాటలను నమ్మవద్దన్నారు. తాను పదవిలో లేకపోయినా నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నానన్నారు. అంబటి విజయారావు నిరసనపై సుమన మాట్లాడుతూ టిక్కెట్ రాని వారిలో అసంతృప్తి ఉండడం సహజమేనన్నారు. విజయారావు తన సోదరి వంటిదన్నారు. తనకు టిక్కెట్ ఇప్పించడానికి కృషి చేసిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పి.సి.సి. అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ, జిల్లాకు చెందిన మంత్రులు గంటా శ్రీనివాసరావు, పసుపులేటి బాలరాజు, ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు, ఎమ్మెల్సీ డి.వి. సూర్యనారాయణరాజు, డి.సి.సి. అధ్యక్షుడు తోటనగేష్, గెడ్డం బుజ్జిలకు సుమన కృతజ్ఞతలు తెలియజేశారు.
కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారం - ఎమ్మెల్సీ
అనంతరం ఎమ్మెల్సీ డి.వి. సూర్యనారాయణరాజు మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎమ్మెల్సీ డి.వి. సూర్యనారాయణరాజు ఖండించారు. రైతులకు ఏదో జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత పదేపదే చేస్తున్న విమర్శల్లో నిజం లేదన్నారు. రైతులకు ఆ పార్టీ ఏం చేస్తుందో స్పష్టంగా ప్రజలకు చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి సంబంధించి వివరాలతో సహా తాము లెక్కలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. దీనిపై ఆ పార్టీ నాయకులు బహిరంగ చర్చకు వస్తారా అంటూ సవాల్ విసిరారు. 2004 నుంచి ఇంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే ఎన్నికల్లో తమ ప్రధాన ఎజెండా అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలే తమ అభ్యర్థి గెలుపునకు సోపానాలన్నారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి వెంకట్రావు పాల్గొన్నారు.
శారదానది చెంతనున్నా తప్పని మంచినీటి వెతలు
అనకాపల్లి, మే 2: శారదానది చెంతన ఉన్నా పట్టణవాసులతోపాటు పల్లెవాసులకు సైతం మంచినీటి వెతలు తప్పడం లేదు. గుక్కెడు నీళ్లకోసం మైళ్లదూరం పల్లెవాసులు పరుగులు తీస్తున్నారు. పురపాలక సంఘంలో మంచినీటి కోసం ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. ఎండల తీవ్రత పెరుగుతున్న కొద్ది మంచినీటి సమస్య మరింత తీవ్రతరం అవుతుండడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. మంచినీటి సమస్య పరిష్కరించేందుకు ప్రతియేటా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నుండి కోట్లాది రూపాయల నిధులు ఖర్చుచేస్తున్నప్పటికీ సమస్య పరిష్కారం కాకపోగా మరింత జఠిలమవుతుంది. మంచినీటికోసం ప్రజలు అనేక అవస్థలు పడాల్సి వస్తుంది. శారదా నదీపరివాహక ప్రాంతంలో అనకాపల్లి పురపాలక సంఘంతోపాటు అనకాపల్లి, కశింకోట, మునగపాక తదితర మండలాలకు చెందిన గ్రామాల్లో మంచినీటి ఎద్దడి తీవ్రతరంగా ఉంది. భూగర్భజలాలు అడుగంటి పోతుండడంతో మంచినీటిబావుల్లో చుక్కనీరు లేకపోగా, గొట్టపుబోరుల్లో గంటల సమయం వెచ్చిస్తే తప్ప గుక్కెడు నీరు రాని పరిస్థితి ఏర్పడింది. అనకాపల్లి పురపాలక సంఘంలో మంచినీటి సమస్య పరిష్కరించేందుకు ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన మంచినీటి పథకం వలన ప్రయోజనం కానరాలేదు. అనకాపల్లితోపాటు పరిసర మూడు మండలాల ప్రజలకు పరిశుభ్రమైన మంచినీటిని అందించే లక్ష్యంతో మండలంలోని వేటజంగాలపాలెం వద్ద 22 కోట్ల రూపాయల వ్యయంతో రెండేళ్లక్రితం ప్రారంభించిన మెగా మంచినీటి ప్రాజెక్టు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. భారీ మంచినీటి పథకాలపై ప్రజలు ఆశలు కోల్పోతున్నారు. పురపాలక సంఘం పరిధిలో రెండు ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా జరుగుతుండగా, నీటి ఎద్దడి ప్రాంతాల సంఖ్య పెరిగిపోతుండడంతో మరో రెండు ట్యాంకర్లను ఏర్పాటుచేసి ప్రజలకు మంచినీరు అందించే చర్యలకు మున్సిపల్ అధికారులు శ్రీకారం చుట్టారు. మున్సిపల్ ట్యాంకర్ల కోసం మహిళలతోపాటు బాలలు బిందెలతో గంటల సమయం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మున్సిపాలిటీ పరిధిలో దాదాపుగా పది మినీ మంచినీటి పథకాలు మరమ్మతులకు గురయ్యా యి. గొట్టపుబోర్లు సైతం అడుగంటిపోయాయి. మండలంలో మంచినీటి పథకాలతోపాటు గొట్టపుబోర్లు సైతం మరమ్మతులకు గురికాగా, ఉన్న మంచినీటి పథకాలు భూగర్భజలాలు అడుగంటి పోయి వాటిద్వారా మంచినీరు అందని పరిస్థితి ఏర్పడింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పల్లెల్లోని ప్రజలు పంటపొలాల్లోని వ్యవసాయ బావుల వద్దకు మైళ్లదూరం వెళ్లి తాగునీటిని తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రతియేటా మండువేసవికి ముందు మంచినీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు, అదనంగా నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రజాప్రతినిధులు, అధికారులు చేసే ప్రకటనలు వాస్తవ రూపంలో అమలుకు నోచుకోని పరిస్థితి ఏర్పడింది.
వెంకన్న కల్యాణానికి పోటెత్తిన భక్తజనం
అరకులోయ, మే 2: అరకులోయలో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు భక్తజనం బుధవా రం పోటెత్తారు. భక్తుల కోలాహలంతో శ్రీనువాసుని ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. దీంతో దేవాలయం వెం కన్న నామస్మరణతో మారుమ్రోగింది. అలివేలు మంగ, పద్మావతి, శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని వందలాది మంది భక్తులు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్చారణలతో సాగిన పూజలు, అభిషేకాలు, అర్చనలు భక్తులను ఆధ్మాత్మిక చింతనలో నిమగ్నం చేశాయి. వెంకన్న కల్యాణ ఉత్సవాలలో భాగంగా స్వామివారిని పెండ్లి కుమారుడిగా, పద్మావతి, అలివేలు మంగ అమ్మవార్లను పెండ్లి కుమార్తెలగా చేసి వివాహ ముహూర్తంలో ఘనంగా కల్యాణం చేశారు. శ్రీదేవి, భూదేవిల సమేతంగా స్వామివారు పల్లకినెక్కి వీధులలో ఊరేగుతూ ఆలయంలో ప్రవేశించడంతో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య వైభవం గా కల్యాణం జరిపారు. మండపంలో స్వామి, అమ్మవార్ల మధ్య ఎదుర్కోలు, పూలబంతులాట, నూతన వస్త్త్ధ్రారణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా అర్చకులు నిర్వహించారు. శ్రీ వెంకన్న స్వామివారి వార్షిక లీలా కల్యాణోత్సవాలు ఈనెల 1వతేదీ నుంచి ఘనంగా జరుగుతున్నా యి. భక్తజన సందోహం నడుమ ఉత్సా హభరిత వాతావరణంలో ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల ప్రారం భం రోజు నుంచి దేవాలయంలో భక్తి శ్రద్ధలతో పూజలు, హోమాలు, అర్చనలు, అభిషేకాలతోపాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈనెల 6వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు విశాఖ మన్యం నలుమూలల నుంచి వందలాది మంది భక్తులు తరలివస్తున్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణంలో పలువురు ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, వ్యాపారులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, గిరిజనులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటున్నారు. కల్యాణోత్సవాలలో పలువురు దంపతులు పాల్గొన్నారు.
గురుకులాల్లో ప్రవేశానికి 5లోగా దరఖాస్తు చేసుకోవాలి
పాడేరు, మే 2: గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలల్లో ఐదు నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రవేశం పొందగోరు గిరిజన విద్యార్థులు ఈ నెల 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బి.మల్లిఖార్జునరెడ్డి తెలిపారు. పాడేరు ఐ.టి.డి.ఎ. ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పది గురుకుల పాఠశాలల్లో ఐదు నుంచి తొమ్మిదో తరగతి వరకు 1,228 సీట్లు ఖాళీగా ఉన్నట్టు ఆయన చెప్పారు. ఐదో తరగతిలో 736, ఆరులో 203, ఏడులో 85, ఎనిమిదిలో 127, తొమ్మిదో తరగతిలో 77 వంతున సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అనంతగిరి మండలం గుమ్మకోట బాలుర గురుకుల పాఠశాలలో 237, గూడెంకొత్తవీధి మండలం ఎగువ సీలేరు బాలుర పాఠశాలలో 172, కొయ్యూరు బాలుర పాఠశాలలో 156, పెదబయలు బాలుర పాఠశాలలో 134, జి.మాడుగుల బాలుర పాఠశాలలో 95, అరకులోయ ఆదిమజాతి గిరిజన బాలుర పాఠశాలలో 68, బాలికల పాఠశాలలో 90, పాడేరు బాలికల పాఠశాలలో 87, గూడెంకొత్తవీధిలోని ఏకలవ్య గురుకుల బాలికల పాఠశాలలో 92, విశాఖలోని మారికవలస పాఠశాలలో 97 వంతున సీట్లు ఉన్నట్టు ఆయన వివరించారు. అర్హులైన విద్యార్థులు తెల్ల కాగితంపై తమ పూర్తి వివరాలతో దరఖాస్తు రాసి రెండు ఫొటోలను జతచేసి పాఠశాలలు, లేదా పాడేరులోని గురుకులం సెల్‌కు నిర్ణీత గడువులోగా అందజేయాలని సూచించారు. 2011-12 విద్యా సంవత్సరంలో విద్యార్థులు ఉత్తీర్ణులైన తరగతిని పరిగణనలోకి తీసుకుని తరువాత తరగతిలో సీటుకు దరఖాస్తు చేసుకోవాలని, ఈ సంవత్సరం చదివిన పాఠశాలల ప్రధానోపాధ్యాయునితో దరఖాస్తుపై తప్పనిసరిగా సంతకం చేయించాలని ఆయన చెప్పారు. గురుకుల పాఠశాలల్లో ప్రవేశం పొందగోరు గిరిజన విద్యార్థులు ఈ విషయమై ఐదో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని మల్లిఖార్జునరెడ్డి కోరారు.
గిరిజన అభ్యర్థులకు న్యాయవాద వృత్తి శిక్షణ
పాడేరు, మే 2: న్యాయవాద విద్యను అభ్యసించిన గిరిజన విద్యార్థినీ విద్యార్థులకు మూడు సంవత్సరాల కాలపరిమితి గల న్యాయవాద వృత్తి శిక్షణ ఇవ్వనున్నట్టు గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బి.మల్లిఖార్జునరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన గిరిజన విద్యార్థులు ఈనెల 7వ తేదీలోగా తమ దరఖాస్తులను ఐ.టి.డి.ఎ. కార్యాలయానికి సమర్పించాలని ఆయన సూచించారు. దరఖాస్తు చేసుకునే వారు న్యాయవాద విద్యను పూర్తి చేసిన గిరిజన విద్యార్థులై ఉండాలని, కుల ధ్రువీకరణ పత్రాన్ని దరఖాస్తుతో తప్పకుండా జత చేయాలని ఆయన కోరారు. న్యాయవాద వృతి శిక్షణకు ఎంపికైన విద్యార్థులకు నెలకు వెయ్యి రూపాయల స్ట్ఫైండ్‌తోపాటు పుస్తకాల కోసం ఆరు వేల రూపాయలు చెల్లించనున్నట్టు ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని న్యాయవాద విద్యను అభ్యసించిన గిరిజన విద్యార్థినీ విద్యార్థులు వినియోగించుకోవాలని ఆయన కోరారు.
అతిసారంతో గిరిజనుల అస్వస్థత
ముంచంగిపుట్టు, మే 2: పెదబయలు మండలం పర్రెడ పంచాయతీ వంచెడపుట్టు గ్రామంలో అతిసార వ్యాధి సోకడంతో పలువురు గిరిజనులు అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలోని జి.రేకమ్మ, జి.మచ్చమ్మ, జి.పద్మ, జి.రాంబాబు, కె.సా యికుమార్, కె.పండు అనే గిరిజనులు గత నాలుగు రోజులుగా అతిసారంతో బాధపడుతున్నారు. అతిసార వ్యాధితో బాధపడుతున్న వీరు స్థానిక కమ్యూనిటీ ఆసుపత్రిలో బుధవారం వైద్య చికిత్సలు పొందారు. రూఢకోట ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సక్రమంగా విధులను నిర్వహించక పోవడంతో తమకు వైద్య సేవలు అందడం లేదని వారు చెప్పారు. ఆరోగ్య కేంద్రంలో మందులు లేకపోవడంతో తాము ముంచంగిపుట్టు కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి రావాల్సి వచ్చిందని వారు అన్నారు. ముంచంగిపుట్టు ఆరోగ్య కేంద్రంలో మందులు లేకపోవడంతో మందుల దుకాణాలలో కొనుక్కోవలసి వస్తోందని వారు వాపోయారు. ఈ విషయమై ఉన్నత అధికారులు దృష్టి సారించి రూఢకోట ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని, మందులు అందుబాటులో ఉంచాలని గిరిజనులు కోరుతున్నారు.
ఆశ్రమ కార్మికులకు వేతనాలు చెల్లించాలి
పాడేరు, మే 2: ఏజెన్సీలోని ఆశ్రమ పాఠశాలల్లో దినసరి వేతనంపై పనిచేస్తున్న కార్మికులకు బకాయి ఉన్న వేతనాలు చెల్లించాలని సి.ఐ.టి.యు. పాడేరు డివిజన్ కార్యదర్శి ఆర్.శంకరరావు కోరారు. గిరిజన ప్రాంతంలోని 115 ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కార్మికులకు ఎనిమిది నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు. కార్మికులకు వేతనాలు చెల్లించడానికి బడ్జెట్ లేదంటూ అధికారులు కుంటి సాకులు చెప్పి కాలయాపన చేస్తున్నారని ఆయన విమర్శించారు. సంవత్సరాల తరబడి దినసరి వేతనంపై పనిచేస్తున్న కార్మికుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని అనేకసార్లు ఉద్యమాలు చేపట్టినా ఫలితం లేకపోయిందని ఆయన అన్నారు. కార్మికులకు బకాయి ఉన్న వేతనాలు చెల్లించి వారిని క్రమబద్ధీకరించాలని కోరుతూ ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారికి వినతిపత్రం అందజేసినట్టు ఆయన తెలిపారు. బకాయి ఉన్న ఎనిమిది నెలల వేతనాలలో రెండు నెలల వేతనాలు చెల్లించేందుకు ప్రాజెక్టు అధికారి అంగీకరించినట్టు శంకరరావు చెప్పారు.
ఆరిపాక ఎస్సీ ల్యాండ్ సీలింగ్ భూముల ఆక్రమణపై ఫిర్యాదు
* దర్యాప్తు చేస్తామని తహశీల్దార్ అనిత హామీ
సబ్బవరం, మే 2: మండలంలోని ఆరిపాక పంచాయతీ పరిధిలోని చినయాతపాలెం ఎస్సీకాలనీ రైతులకు ప్రభుత్వం ల్యాండ్ సీలింగ్ భూములను గతంలో కేటాయించింది. ఒక్కో లబ్ధిదారుడికి సుమారు 1.33 ఎకరాల భూమిని కేటాయిస్తూ వారికి డి-్ఫరం పట్టాలు పంపిణీ చేయడంతోపాటు తర్వాత వారికి పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేశారు. ఆ భూముల్లో ఎస్సీకార్పొరేషన్, డుమా అధికారులు గతంలో పలు రకాల పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ఇక్కడి భూములు చౌడు భూములు కావడంతో విజయవంతం కాలేకపోతున్నాయి. ఇందిర జల ప్రభ పథకం ప్రవేశపెట్టారు. ఈ భూములను సరిహద్దునగల ఒక అగ్రకులానికి చెందిన వ్యక్తి,మరో రియల్ వ్యాపారి ఆక్రమించుకోవడంతోపాటు తమకు కేటాయించిన భూముల్లో జెసిబిలతో జీడిచెట్లను, తాడిచెట్లను తొలగించి అదేమని ప్రశ్నిస్తే దూషించారంటూ తహశీల్దార్ ఎస్.డి. అనితకు బుధవారం లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన తహశీల్దార్ అనిత తాను గతంలో సర్వేయర్‌ను పంపించి సరిహద్దులు నిర్ణయించినప్పటికీ మీ స్థలాన్ని ఆక్రమించే హక్కు అతనికి లేదని, దానిపై మీకు న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చారు. గతంలో అధికారులు కేటాయించిన ల్యాండ్ సీలింగ్ భూముల వివరాలను తెలిపే పత్రాలను తీసుకురమ్మన్నారు. తాను స్వయంగా భూమి మీదకు వచ్చి పరిశీలించాక ఆక్రమణ దారుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సర్వే నెంబర్లు తేడా ఉన్నాయా? లేక జిరాయితీ భూమిని లబ్ధిదారులు తెలియకుండా సాగు చేస్తున్నారా? అనే విషయాలను పరిశీలించాల్సి ఉందన్నారు.
నిలిచిపోయిన టీచర్ల జీతాలు
సబ్బవరం, మే 2: స్ధానిక మండల విద్యాశాఖాధికారి టి.మధుమూర్తి నెల రోజులపాటు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లటంతో మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్త్తున్న 110 మంది ఉపాధ్యాయులకు 23 లక్షల రూపాయల మేర ఏప్రిల్ నెల జీతాలు నిలిచిపోయాయి. దీంతో ఉపాధ్యాయ కుటుంబాలు ఆవేదనకు గురవుతున్నారు. ఈవిషయంపై విద్యాశాఖ అధికారులను సంప్రదించగా ఇక్కడి ఎం.ఇ.ఒ.మధుమూర్తి ఏప్రిల్ 19వ తేదీన నెలరోజులపాటు సెలవుపై వెళ్లారు. దీంతో జిల్లావిద్యాశాఖాధికారి వారం రోజుల్లోగా మరో అధికారికి తాత్కాలిక బాధ్యతలు అప్పగించి ఉపాధ్యాయుల జీతభత్యాలు, తదితర కార్యనిర్వహణకు చర్యలు తీసుకోవాల్సి ఉండగా, ఇప్పటివరకు అధికారిని నియమించక పోవడంతో ఉపాధ్యాయులకు విడుదలైన జీతాల చెక్కులపై సంతకాలు, వాటిని ట్రెజరీల నుంచి తెచ్చుకునే ప్రక్రియ నిలిచిపోయిందంటున్నారు. ఇప్పటికైనా డి.ఇ.ఒ. స్పందించి ఇక్కడి ఉపాధ్యాయుల జీతాలు విడుదలకు మార్గం సుగమం చేయాలని పలు గ్రామాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఈవిషయంపై ఇక్కడి ఎంఆర్‌పి బి.వి.రమణను వివరణ కోరగా ఈ సమాచారం నిజమేనని అంగీకరిస్తూ డిఇఒ త్వరలో చర్యలు తీసుకుంటారని తెలిపారు.
కార్యకర్తల అభీష్టం మేరకే అభ్యర్థ్ధి ఎన్నిక
* మంత్రి బాలరాజు
పాయకరావుపేట, మే 2: రానున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థ్ధిగా కార్యకర్తలు కోరుకున్న గంటెల సుమననే అధిష్టానం ఖరారు చేసిందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పసుపులేటి బాలరాజు అన్నారు. బుధవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీ అభివృద్ధి చేయాలన్నారు. 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడిచిందని, తరువాత మూడేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న బాబూరావు అభివృద్ధి గురించి పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు హామీలు నెరవేరేవి కావని, ప్రజలు వాటిని నమ్మే స్థితిలో లేరన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డి.వి. సూర్యనారాయణరాజు, డి.సి.సి. అధ్యక్షుడు తోటనగేష్, కాంగ్రెస్ అభ్యర్థి గంటెల సుమన, గెడ్డం బుజ్జి, గూటూరు శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఎంసెట్ సమాచారం లీక్ కాకుండా జామర్లు
* కన్వీనర్ రమణారావు వెల్లడి
విశాఖపట్నం, మే 2: పరీక్షా కేంద్రాల నుంచి సమాచారం లీక్ కాకుండా ఉండేందుకు ప్రత్యేక జామర్లు ఏర్పాటు చేస్తున్నట్టు ఎంసెట్ కన్వీనర్ ఎన్‌వి రమణారావు వెల్లడించారు. ఈమేరకు ఆ యన బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసి న విలేఖరుల సమావేశంలో మాట్లాడా రు. పరీక్షా కేంద్రాలకు సెల్‌ఫోన్‌లు, ఇత ర ఎలక్ట్రానిక్ పరికరాలు తేకూడదని, వాటితో పట్టుబడితే, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను చేసేటప్పుడు తీసుకున్న స్లిప్‌లతోపాటు, డౌన్‌లోడ్ చేసి తీసుకున్న హాల్ టిక్కెట్‌లపై ఈమధ్య తీయించుకున్న పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు అతికించాలని అన్నారు. వ యో పరిమితి కారణంగా కొందరు సీనియర్ విద్యార్థులు దరఖాస్తులు పంపారని రమణారావు చెప్పారు. వారు ఎందుకు దరఖాస్తు చేశారో, ఎవరికోసం చేశారో తెలుసుకునేందుకు ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా ఆ అభ్యర్థి వివరాలు సేకరిస్తున్నామని అన్నారు. సమస్యాత్మక పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ ఇంటిలిజెన్స్ నిఘా ముమ్మరంగా ఉంటుందన్నారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించడం వలన అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా దేశాల నుంచి కూడా 202 దరఖాస్తులు వచ్చాయని అన్నారు. పరీక్ష రోజుకు ముందు రోజు వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. హైదరాబాద్ నుంచి అత్యధికంగా ఇంజనీరింగ్‌కు 62 వేలు, మెడిసిన్‌కు 22 వేల దరఖాస్తులు వచ్చాయని రమణారావు వెల్లడించారు. ద్వితీయ స్థానంలో విశాఖ జిల్లా ఉందని అన్నారు. రంగారెడ్డి నుంచి అతి తక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు.
మోదకొండమ్మ జాతరకు ఏర్పాట్లు
* ఐ.టి.డి.ఎ. పి.ఒ. శ్రీకాంత్
పాడేరు, మే 2: పాడేరులో ఈనెల 13వ తేదీ నుంచి మూడు రోజులపాటు నిర్వహిస్తున్న శ్రీ మోదకొండమ్మ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి కె.శ్రీకాంత్ ప్రభాకర్ కోరారు. స్థానిక ఐ.టి.డి.ఎ. కార్యాలయం లో వివిధ శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోదకొండమ్మ జాతరకు వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం ఏర్పడకుండా ఉత్సవ కమిటీ, అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అధికారులు, ఉత్సవ కమిటీ సమన్వయంతో వ్యవహరించి ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆయన సూచించారు. మోదకొండమ్మ అమ్మవారి జాతరను విజయవంతం చేసేందుకు పూర్తి సహకారాన్ని అందిస్తామని ఆయన చెప్పారు. ఉత్సవాల మూడు రోజులు పాడేరులో నిరంతరం పారిశుధ్ధ్య పనులు చేపట్టాలని, ఇందుకోసం మైదాన ప్రాంతాల నుంచి అదనంగా కార్మికులను రప్పించాలని ఆయన ఆదేశించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ళలో తాత్కాలిక మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయాన్ని కల్పించాలని ఆయన చెప్పారు. మోదకొండమ్మ జాతరలో ఎటువంటి హింసాయుత సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకోవాలని పోలీసు అధికారులను ఆయన ఆదేశించారు. విద్యుత్‌కు అంతరాయం ఏర్పడకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని, అదనపు ట్రాన్స్‌ఫార్లను అందుబాటులో ఉంచుకోవాలని ఆయన చెప్పారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రధాన కూడళ్లలో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని, అంబేద్కర్ సెంటర్‌లో 108, 104 వాహనాలను అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. ఉత్సవాలలో మంచినీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా పట్టణ వాసులకు నీటి సరఫరా చేసేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. మోదకొండమ్మ జాతరను పురస్కరించుకుని ఐ.టి.డి.ఎ. కార్యాలయంలో కంట్రోలు రూంను ఏర్పాటు చేస్తున్నామని, ఎక్కడ ఎటువంటి సమస్య తలెత్తినా సమాచారం అందించవచ్చునని ఆయన చెప్పారు. కంట్రోలు రూం ఫోన్ నెంబరును త్వరలోనే ప్రకటించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. మోదకొండమ్మ జాతర ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఇందిరాక్రాంతి పథం అదనపు సంచాలకులు జె.వెంకటరావు నేతృత్వంలో అధికారులతో కమిటీని నియమిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను ఉత్సవ కమిటీ సభ్యులను శ్రీకాంత్ అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమ శాఖల పాడేరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఎస్.రణదేవ్, కె.అశోక్, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్.వి.రమణమూర్తి, ఎం.పి.డి.ఒ. జి.వి.చిట్టిరాజు, తహశీల్దార్ పి.రామలింగస్వామి, పాడేరు పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎస్.బాలసూర్యారావు, సబ్ ఇన్‌స్పెక్టర్ జి.అప్పన్న, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సయ్యపురెడ్డి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బిక్కవోలు హరినాధ్, ప్రతినిధులు రొబ్బి రాము, సల్లంగి నారాయణ పాల్గొన్నారు.
మంత్రి ఆదేశాలకు తిలోదకాలు?
అనకాపల్లి, మే 2: నిబంధనలు నిబంధనలే.. ఉల్లంఘన ఉల్లంఘనే... అనే చందంగా ఉంది అనకాపల్లి ప్రాం తంలో ఇసుక అక్రమ తరలింపుపై జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు ఇతర జిల్లాస్థాయిలోని ఉన్నతాధికారులు చేసిన హెచ్చరికలు, జారీచేసిన ఆదేశాలు అమలుతీరు. రాష్టవ్య్రాప్తంగానే ఇసుక అక్రమ తరలింపుపై గట్టినిఘా ఉంది. దాదాపుగా అన్నిజిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో నదులు, వాగుల్లోను ఇసుక అక్రమ తరలింపుపై రెవెన్యూ, పోలీస్ ఇరిగేషన్ అధికారులు ఉక్కుపాదం బిగిస్తున్నారు. ఇటువంటి తరుణంలో అనకాపల్లిని అనుసరించి ఉన్న శారదానదిలో అనధికారిక ఇసుక తవ్వకాలు యథావిథిగానే సాగుతున్నాయి. పగటివేళ ఇసుక అక్రమ తరలింపుపై నిఘా గట్టిగా ఉండడంతో అక్రమార్కులు అర్ధరాత్రివేళ ఇసుక అక్రమ తరలింపుకు పాల్పడుతున్నారు. రెవెన్యూ, పోలీస్ వర్గాలు కళ్లుగప్పి ఒకింతగా అధికార వర్గాల్లో కొందరిని మంచి చేసుకుని అర్ధరాత్రి 12గంటల నుండి తెల్లవారు మూడు గంటల సమయాన్ని ఇసుక అక్రమ తరలింపునకు అనువుగా ఉపయోగించుకుంటున్నారు. గ్రామస్థాయిలోని రెవెన్యూ సిబ్బంది ప్రోత్సాహంతోనే అక్రమ తరలింపుప్రక్రియ సాగుతుందని స్థానికులు, రైతులు అధికారులకు, అనధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. అర్ధరాత్రివేళ ఇక్కడ ఇసుక అక్రమ తరలింపు జరిగితే పగలు తమకు ఫిర్యాదు చేసినా ఏమి చేయగలమనే సమాధానం రావడంతో గత్యంతరం లేని స్థితిలో రాత్రివేళల్లో ప్రజాప్రతినిధులకు, స్థానిక రెవెన్యూ, పోలీస్ వర్గాల వారికి అక్రమ తరలింపుపై ఫిర్యాదులు చేస్తున్నారు. అనధికారిక ఇసుక అక్రమ తవ్వకాలపై ఎమ్మెల్యే, మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్రంగానే స్పందించారు. నదిలో అక్రమ ఇసుక తవ్వకాల వలన గ్రోయిన్లు ధ్వంసం కావడం, భూగర్భజలాలు అడుగంటిపోయి పంటభూములకు సాగునీరు అందని పరిస్థితి ఉందని, ఇటీవల తుమ్మపాల ఫ్యాక్టరీని మంత్రి గంటా శ్రీనివాసరావు సందర్శించే సమయంలో ఆ ప్రాంతరైతులు ఫిర్యాదు చేసారు. దీనిపై తీవ్రంగా స్పందించిన మంత్రి అవసరమైతే అర్ధరాత్రివేళ జిల్లా కలెక్టర్‌తో కలసి నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలపై ఆకస్మిక తనిఖీలు జరుపుతామని హెచ్చరించారు. దీంతో ఇసుక అక్రమ తవ్వకాలకు అర్ధరాత్రి సమయాన్ని ఉపయోగించుకునే విధానానికి అక్రమార్కులు స్వస్తిపలుకుతారని రైతులు భావించారు. మంత్రి హెచ్చరికలు సైతం పట్టించుకోకుండా అర్ధరాత్రివేళ మండలంలోని సీతానగరం, వెంకుపాలెం, ఉమ్మలాడ, కశింకోట మండలంలోని వెదురుపర్తి ప్రాంతాల్లో అర్ధరాత్రివేళ గజదొంగలను తలపించే రీతిలో శారదానదిలోని ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నట్లు తనకు ఫోన్లు వస్తున్నాయని మంత్రి గంటా సోదరుడు, అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రత్యూష భాస్కరరావు బుధవారం తనను కలసిన విలేఖర్ల ఎదుట తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అర్ధరాత్రివేళ అక్రమ ఇసుక తరలింపు ఎంత తీవ్రంగా ఉందో స్పష్టమవుతుంది. సిబ్బంది కొరతతో సతమతమవుతున్న తమకు 24గంటలూ ఇసుక అక్రమ తరలింపును నిరోధించడం ఎంతవరకు సాధ్యమవుతుందని రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూపరమైన సమస్యలు పరిష్కరించడానికే ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు చాలని పరిస్థితుల్లో ఇసుక అక్రమ తరలింపుని నివారించేందుకు ప్రత్యేక సిబ్బందిని కేటాయించడం ఎంతవరకు సమంజసమవుతుందని తహశీల్దార్‌లు తమ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సర్కిల్ ఇనస్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్లు కూడా ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తమవుతుంది.
నిర్బంధంలో టెక్నికల్ అసిస్టెంట్, వి.ఆర్.పి.
గూడెంకొత్తవీధి, మే 2: గ్రామీణ ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్, వి. ఆర్.పి.లను గుమ్మిరేవులు గ్రామస్థులు నిర్బంధించారు. మంగళవారం గుమ్మిరేవుల ప్రాంతంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించడానికి టెక్నికల్ అసిస్టెంట్ మెట్టడం రామకృష్ణ గుమ్మిరేవుల పంచాయతీ వి.ఆర్.పి. పోతురాజు, బుజ్జిబాబు కలిసి గుమ్మిరేవులు వెళ్ళారు. అక్కడ గ్రామస్థులు 2010లో రాతి కట్లకు వారం రోజుల ఉపాధి పనికి కూలీ డబ్బులు చెల్లించలేదని ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. సిబ్బందిని నిలదీశారు. ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. సిబ్బందికి మాటలు పెరిగి వి.ఆర్.పి. పోతురాజుకు దేహశుద్ధి చేశారు. ఇతనితోపాటు ఉన్న టెక్నికల్ అసిస్టెంట్ రామకృష్ణ, మరో వి.ఆర్.పి. బుజ్జిబాబును గ్రామస్థులను నిర్బంధించారు. సాయంత్రం సమయంలో వి.ఆర్.పి. పోతురాజు గ్రామస్థుల నుండి తప్పించుకుని బుధవారం మండల కేంద్రానికి చేరుకున్నాడు. 2010లో జరిగిన రాతికట్టు పనికి కూలి డబ్బు చెల్లిస్తే గాని మిమ్మల్ని విడిచిపెట్టేది లేదంటూ రామకృష్ణ, బుచ్చిబాబులను గ్రామస్థులు హెచ్చరించినట్లు తెలిసింది. ఈ సంఘటనపై ఎన్.ఆర్.ఇ.జి. ఎస్.ఎ.పి. ఓ.కొండబాబును వివరణ కోరగా గుమ్మిరేవులలో ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. పనులకు తమ సిబ్బంది వెళ్ళిన మాట వాస్తమేనని అక్కడ 2010 రాతికట్టు పనులకు సంబంధించి డబ్బులు చెల్లించాలని నిర్బంధించినట్లు తప్పించుకుని వచ్చిన వి.ఆర్.పి. గోదురాజు తమకు తెలిపాడని ఆయన అన్నారు. ఆ సమయంలో ఈ పనులను ఎవరు చేయించారు, వాటికి ఈ డబ్బులు చెల్లించారనే విషయం పరిశీలించి కూలీ డబ్బులు చెల్లించడానికి సిద్ధమని ఎ.పి.ఓ. కొండబాబు పేర్కొన్నారు.