కడప, మే 26 : జిల్లా మొత్తం పోలీసుల పహారాలో ఉంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, శనివారం సాయంత్రం నుంచి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని సిబిఐ అధికారులు రెండు రోజులుగా విచారిస్తుండడంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లా సరిహద్దులతో పాటు కర్నూలు-చిత్తూరు, చెన్నై-ముంబయ్ జాతీయ రహదారులపై వచ్చి, పోయే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందుల పోలీసు నీడలో జనజీవనం కొనసాగుతోంది. స్వయానా ఎస్పీ మనీష్‌కుమార్ సిన్హా పులివెందుల వీధుల్లో తిరుగుతూ గస్తీ నిర్వహించారు. శుక్రవారం డిజిపి దినేష్‌రెడ్డి, రాష్ట్ర, రేంజ్, సీమ జిల్లాలకు చెందిన పోలీసు అధికారులతో సమీక్షించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్నూలు డిఐజి అనిల్‌కుమార్ ఎప్పటికప్పుడు జిల్లా పరిస్థితులను సమీక్షిస్తున్నారు. కడప ఎస్పీ మనిష్‌కుమార్ సిన్హా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలను, ఆర్టీసీ, ప్రైవేటు బస్సులతో పాటు అన్ని వాహనాలను సోదా చేయిస్తున్నారు. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలకు పాల్పడరాదని, సిబిఐ కోర్టు పరిధిలో జగన్ వ్యవహారం నడుస్తోందని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నట్లు తెలిసింది. అలాగే అన్ని పత్రికా కార్యాలయాల వద్ద కూడా పోలీసు బందోబస్తు నిర్వహించారు. మరోవైపు సిబిఐ విచారణ నుంచి జగన్ బయటకు వచ్చే వరకు జిల్లాలో ఆ పార్టీకి చెందిన నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ జరగరాందే జరిగితే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు కూడా సర్వం సిద్ధం చేసుకుని ఉన్నారు.
వైఎస్సార్‌సీపీలోకి
ఇరువురు ఎమ్మెల్యేలు?
ఆంధ్రభూమి బ్యూరో
కడప, మే 26: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. శుక్రవారం రాజ్యసభ మాజీ సభ్యుడు, జిల్లాలో సీనియర్ నేత డాక్టర్ ఎంవి.మైసూరారెడ్డి వైఎస్సార్‌సిపిలోకి చేరడంతో ఆ పార్టీకి నేతల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందనే చెప్పవచ్చ. దీంతో గతంలో జగన్ వెంట నడిచిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు వారి అనుచర గణం తిరిగి వైఎస్‌ఆర్‌సిపి తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.ప్రస్తుతం వైఎస్సార్ పార్టీలోకి చేరే నేతలు మాత్రం ఉపఎన్నికలలోపు కానీ, ఎన్నికల అనంతరం కానీ వెళ్లనున్నట్లు తెలిసింది. అలాగే మైసూరారెడ్డికి సమకాలికులైన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నేతలు కూడా జంప్ చేసే అవకాశాలు ఉన్నాయి. మైసూరా రాజకీయంగా సిద్ధాంతాలు కలిగి అపార అనుభవం, గల్లీ నుంచి ఢిల్లీ స్థాయికి ఎదిగిన నేత అయినందున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో రాజకీయ భవిష్యత్తుకు ఢోకా ఉండదని భావించి ఈ ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మైసూరా వర్గంలో నియోజకవర్గం, జిల్లా స్థాయిలో రాజకీయ పరపతి కలిగిన కడప, కమలాపురం, జమ్మలమడుగు నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు రాజధానికి బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలో అనూహ్యంగా రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఈ తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత బలపడనుందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.