కడప, మే 26 : జిల్లాలో ఉపఎన్నికలు జరిగే రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల పరిశీలకులు శనివారం చేరారు. మూడు నియోజకవర్గాలకు వ్యయ పరిశీలకులుగా ఎం.కె.జైన్, పోలీసు విభాగం వి.కె.పాండ్యను నియమించారు. వీరు గత సాధారణ ఎన్నికల్లో కూడా జిల్లాలో కట్టుదిట్టంగా పనిచేశారు. అలాగే నియోజకవర్గాలకు సంబంధించి రాయచోటికి డాక్టర్ అలేక్ చంద్ర పెడియార్, రాజంపేటకు ఎ.కె.మొన్నప్ప, రైల్వేకోడూరుకు తంగస్వామిని నియమించారు. వీరంతా సంబంధిత నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తారు. సాయంత్రం 4.00 గంటల నుంచి జిల్లా కేంద్రంలోని రాష్ట్ర అతిథి గృహంలోని చిత్రావతి వసతి గృహంలో అందరికీ అందుబాటులో ఉంటారు. ఈ నేపథ్యంలో వీరిని ప్రభుత్వ పనిరోజుల్లో ప్రతి రోజు సాయంత్రం 4.00 గంటల నుంచి 6.00 గంటల వరకూ వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను స్వీకరిస్తారు. ఆ ఫిర్యాదులను వీరు పరిశీలించి కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులకు సమాచారం ఇచ్చి అనంతరం చర్యలు తీసుకోనున్నారు.
మొబైల్ సాయంతో కరెంటు బిల్లుల చెల్లింపు
* గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల ఆవిష్కరణ
ఆంధ్రభూమి బ్యూరో
కడప, మే 26 : ఇక నుంచి మొబైల్ ఫోన్ ద్వారానే విద్యుత్ వినియోగం, రీడింగ్ కనుగొని బిల్లులు చెల్లించే ప్రక్రియను జిల్లా కేంద్రంలోని గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాల ఇసిఇ (ఎలక్ట్రానిక్స్) విభాగం విద్యార్థులు కనుగొన్నారు. ఆ మేరకు పేటెంట్ హక్కులు పొందడానికి కళాశాల ఎండి. సోమశేఖర్‌రెడ్డి, ముఖ్య సలహాదారు కె.జనార్ధన్‌రెడ్డి శనివారం సంబంధిత భారత ప్రభుత్వ శాఖకు దరఖాస్తు చేసుకుంటున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాల డైరెక్టర్ గౌతమ్, ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణకాంత్, ఇసిఇ హెచ్‌ఓడి కె.మహేశ్వరరెడ్డి నేతృత్వంలో విద్యార్థులు విద్యుత్ వినియోగం, మీటర్ రీడింగ్‌పై గత ఏడాదిగా పరిశోధన చేసి మొబైల్ ద్వారానే బిల్లు చెల్లించే విధానాన్ని కనుగొన్నారు. మొబైల్ ఫోన్‌ను విద్యుత్ మీటర్‌కు అమర్చినట్లయితే విద్యుత్ వాడకం ఎన్ని యూనిట్ల మేరకు జరిగిందో ఆ రీడింగ్‌కు చెల్లించాల్సిన బిల్లుల వివరాలను కూడా తెలుసుకోవచ్చు. విద్యుత్ వినియోగంలో రీడింగ్ మీటర్‌లో తప్పుల తడకలు దొర్లినట్లయితే మొబైల్ విద్యుత్ వాడకం, యూనిట్ల వివరాలను, బిల్లును తెలియజేస్తుంది. ముఖ్యంగా పరిశ్రమలకు, ప్రభుత్వ కార్యాలయాలకు, ఇళ్లకు, ఫ్యాక్టరీలకు ఈ మొబైళ్లను అమర్చుకున్నట్లయితే రీడింగ్ తెలుసుకుని బిల్లును మొబైల్ ద్వారా చెల్లించవచ్చు. ఇవి ఇళ్లకు కూడా అమర్చుకోవచ్చు. దీనివల్ల వ్యయప్రయాసలు లేకుండా కరెంటు బిల్లును చెల్లించవచ్చు. త్వరలో గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాలలో అన్ని విభాగాల్లో అన్ని విద్యుత్ మీటర్లకు మొబైల్ ఫోన్లను ఏర్పాటు చేయనున్నట్లు కళాశాల యాజమాన్యం పేర్కొ ంది. ఈ మొబైల్ పనిచేసే విధానంపై ఆ కళాశాల ఎం.డి. డాక్టర్ సోమశేఖర్‌రెడ్డి నేతృత్వంలో శనివారం సాంకేతిక నిపుణులకు, విద్యుత్‌శాఖ అధికారులకు, ప్రముఖులకు చూపారు. దీంతో అందరూ సంతృప్తి వ్యక్తం చేసి పలువురు అభినందించారు.