సంబేపల్లె, మే 26: రాయచోటి నియోజకవర్గ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి రాంప్రసాద్‌రెడ్డిని గెలిపించాలని కేంద్ర మాజీ మంత్రి, ఎంపి సాయిప్రతాప్ కోరారు. శనివారం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ జడ్పీటీసీ కుంచపు సురేంద్రను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బిసి నాయకులకు మంచి గుర్తింపునిస్తోందన్నారు. బిసి నాయకులకు గుర్తింపు ఇవ్వడానికి తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోయిన దాఖలు ఎక్కడా కనపడలేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నాయకత్వం సజావుగా సాగుతోందని, ఇతరత్రా పార్టీ నాయకులు కాంగ్రెస్‌ని విమర్శిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఉపాధిహామీ, 108, పెన్షన్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలు సజావుగా సాగుతున్నాయన్నారు. మైనార్టీలకు ప్రత్యేక నిధులను కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసిలకు లక్షా 22 కోట్లతో ప్రత్యేక నిధులను ఇచ్చిందన్నారు. అవాస్తవ విమర్శలకు తావివ్వకుండా నిజా నిజాలతో అనాధిగా కాంగ్రెస్ పార్టీ చేసిన కృషితోనే మంచి గుర్తింపు వచ్చిందన్నారు. రైతులకు లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను, పావలావడ్డీ, ఇందిర జలప్రభ, రాజీవ్ ఉద్యోశ్రీ, మీసేవ వంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చొరవతోనే ముందుకెళ్తున్నాయన్నారు. రైతులకు 72 వేల కోట్ల రుణ మాఫీని వర్తింపజేసింది కాంగ్రెస్‌పార్టీ అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకుడు హసన్‌బాషా, చెంచురెడ్డిగారిపల్లె గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాజంపేటలో ఏడు నామినేషన్లు తిరస్కృతి
రాజంపేట టౌన్, మే 26: రాజంపేట నియోజకవర్గానికి సంబంధించి ఏడుగురు అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించినట్లు శనివారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ కె.శ్రీనివాసులు తెలిపారు. స్థానిక ఆర్డీఓ సభాభవనంలో ఎన్నికల పరిశీలకులు ఏకె మోనప్ప ఆధ్వర్యంలో నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్వో శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధన ప్రకారం నామినేషన్లు పరిశీలించి, అభ్యర్థులను గుర్తించామన్నారు. రాజంపేట అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి వివిధ పార్టీలకు చెందినవారు, ఇండిపెండెంట్లు 27 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారన్నారు. వీటిలో ఏడుగురి నామినేషన్లు తిరస్కరించగా, 20 మంది బరిలో ఉన్నారు. వీరిలో స్వతంత్ర అభ్యర్థులు పసుపులేటి పవన్‌కుమార్, పసుపులేటి ప్రదీప్‌కుమార్, మేడా సుచరితారెడ్డి, చల్లా అమర్‌నాధ్‌రెడ్డి, వీరబల్లి శంకరయ్య, పిరమిడ్ పార్టీ అభ్యర్థి మద్దిపట్ల ఆంజనేయులునాయుడు, భారతీయ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోటపాటి పెంచలయ్యలు ఫారమ్ ఎ,బిలు సమర్పించక పోవడం, ఆఫిడ్‌విట్‌లు సక్రమంగా లేకపోవడంవల్ల వారి నామినేషన్లు తిరస్కరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాసులు, డిఎస్పీ మునిరామయ్య, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థుల ప్రతినిధులు పాల్గొన్నారు.