పెద్దపప్పూరు, మే 26: చాగల్లు రిజర్వాయర్ ముంపు గ్రామం తబ్జూల గ్రామంలోని అతి పురాతనమైన శివాలయంలోని శివపార్వతుల విగ్రహాలను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఆరు నెలల క్రితం రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా తబ్జూల గ్రామం ముంపునకు గురైంది. దీంతో పునరావాసంలో భాగంగా రెండు కిలోమీటర్ల దూరం కొత్త ఇళ్లు నిర్మించి పునరావాస గ్రామాన్ని ఏర్పాటుచేశారు. ఆ గ్రామస్థులు ప్రస్తుతం కొత్త ఇళ్లలో ఉంటున్నారు. దీంతో పాత గ్రామం ఖాళీ కావడంతో ఆలయంలో గుప్తనిధులు ఉన్నాయని భావించిన దొంగలు శివాలయంలోని శివపార్వతుల విగ్రహాలను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. జనమేజయుని కాలంలో ఈ శివలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. పునరావాస గ్రామంలో కొత్తగా నిర్మించిన ఆలయంలో విగ్రహాలను ప్రతిష్టించాలనుకుంటున్న సమయంలో చోరీకి గురవడంతో గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం శనివారం గ్రామస్థుల దృష్టికి వచ్చింది. దీంతో గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదుచేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
4 కార్పొరేట్ పాఠశాలలు సీజ్
తాడిపత్రి, మే 26: ప్రభుత్వ అనుమతి లేకుండా పట్టణంలో నిర్వహిస్తున్న రెండు కార్పొరేట్, మరో రెండు ప్రైవేట్ పాఠశాలలను శనివారం డిఇఓ ప్రేమానందం, సర్వశిక్షా అభియాన్ పిడి రామచంద్రారెడ్డి సీజ్ చేశారు. ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతి లేకుండా కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలా గే ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా బి.ఎడ్ క్వాలిఫైడ్ అభ్యర్థుల చేత విద్యాబోధన సాగించాలన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేట్ పాఠశాలల్లో పని చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పిడి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ధేశించిన జీఓ నెంబర్-1 ప్రకారం విధ్యార్థుల నుండి ఎంత మెత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు, టీచింగ్, నాన్‌టీచింగ్ జీతభత్యాలు, తదితర వివరాలు పాఠశాలల్లో బోర్డులో ప్రదర్శించాలన్నారు. అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో బడుగు, బలహీన వర్గాల కోసం 25 శాతం రిజర్వేషన్ తప్పక పాటించాలన్నారు. ముఖ్యంగా జూన్ 12వ తేదీ కంటే ముందుగా అడ్మిషన్లు నిర్వహిస్తే అలాంటి పాఠశాలలపై చర్యలు తప్పవని హెచ్చిరించారు.
2ప్రధాన పార్టీలు
రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాయి
* సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు గపూర్
అనంతపురం సిటీ, మే 26: ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, టిడిపి, వైయస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీలు రాష్ట్ర రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్నాయని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూరు పేర్కొన్నారు. శనివాంర స్థానిక గణేనాయక్ భవనంలో సిపిఎం ఆధ్వర్యంలో విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నికల తరువాత రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వానికి లేక ఇస్తామని టిడిపి, తెలంగాణ ఇచ్చేది తామేనని కాంగ్రెసు ప్రకటిస్తున్నాయన్నారు. తెలంగాణలో ఒక మాట, సీమాంధ్రలో ఒకమాటను ఈ పార్టీల నాయకులు మాట్లాడం శోచనీయమన్నారు. రెండు నాలుగలు కలిగిన నాయకులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. తెలంగాణలోనైనా, సీమాంధ్రలోమైనా భాషా ప్రయుక్త రాష్ట్రాలకు సిపిఎం కట్టుబడి ఉందని సృష్టం చేశారు. కాంగ్రెస్, టిడిపి, వైయస్‌ఆర్‌సిపిలు మూడు అవినీతిలో కూరుకుపోయాయన్నారు. రాజకీయాలను ఒక వ్యాపారం చేశాయన్నారు. డబ్బులతో సీట్లు తెచ్చుకోవడం, ఓట్లు కొనుక్కోవడం, నోట్లు సంపాదించుకోవడం అన్న చందంగా తయారయిందని విమర్శించారు. ఈ ఉప ఎన్నికలలో మూడు పార్టీలు భారీగా డబ్బు, మద్యం ప్రజలకు పంచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. సిపిఎం ప్రజాసేవ కోసం నిబద్దతతో పనిచేసే కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. తమ వైఖరిని ఈ ఉప ఎన్నికలలో ప్రజల్లోకి తీసుకెళుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఓబుళకొండారెడ్డి, కార్యవర్గ సభ్యులు ఎం.ఇంతియాజ్, నల్లప్ప తదితరులు పాల్గొన్నారు.