కదిరిరూరల్, మే 26: మండల పరిధిలోని రాచినే పల్లి తండా సమీపంలో శనివారం మధ్యాహ్నం ఆటో బోల్తాపడడంతో పగడాల వెంకట రమణ (33) మృతి చెందగా అంజినమ్మ, లక్ష్మి, రామ్మోహన్‌లు తీవ్రంగా గాయపడ్డారు. మృతుని బంధువులు తెలిపిన వివరాల మేరకు ముదిగుబ్బ మండలం గుంజే పల్లికి చెందిన పగడాల వెంకటరమణ బావమరిదికి పెళ్లి సంబంధం చూసేందుకు అదే మండలంలోని కోటి రెడ్డి పల్లికి వెళ్లి వస్తుండగా రాచినేపల్లి వద్ద ఆటో అదుపు తప్పి పడి పోయింది. దీంతో 108 వాహనంలో వెంకటరమణ కదిరికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ప్రమాదంలో గాయపడిన అంజినమ్మ, లక్ష్మి, రామ్మోహన్‌లను చికిత్స కోసం బత్తలపల్లిలోని ఆర్డీటి ఆసుపత్రికి తరలించినట్లు మృతుని బంధువులు తెలిపారు. పట్నం పోలీసులు కేసు నమోదు చేసుకొని, శవాన్ని పోస్టుమార్టం నిమిత్త కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
బెళగుప్ప, మే 26: మండల పరిధిలోని కాలువపల్లి తండాకు చెందిన నాగభూషణనాయక్ (32) శుక్రవారం రాత్రి విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. కాలువపల్లి తండాకు చెందిన నాగభూషణనాయక్ శుక్రవారం రాత్రి ఇంటికి విద్యుత్ కనెక్షన్ లేకపోవడంతో సరిచేసే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే అతడిని అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. హెడ్ కానిస్టేబూల్ రామచంద్రారెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వ్యక్తిపై వేట కొడవలితో దాడి
* పరిస్థితి విషమం
ముదిగుబ్బ, మే 26: మండలంలోని పెద్దచిగుళ్ల రేవు గ్రామంలో బోయ లక్ష్మినారాయణపై శనివారం అదే గ్రామానికి చెందిన రాజారెడ్డి వేట కొడవలితో దాడి చేసి తీవ్రంగా గాయపరచినట్లు గ్రామస్థులు తెలియజేశారు. వారు తెలిపిన మేరకు వివరాలు ఇలా వున్నాయి. లక్ష్మినారాయణ, గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి సోదరుడు రాజారెడ్డి గత సంవత్సరం నుండి తరచూ ఘర్షణ పడుతుండేవారని అయితే శనివారం లక్ష్మినారాయణ వ్యక్తి గత పని మీద ముదిగుబ్బకు వెళ్లి ఆటోలో పిసి రేవుకు చేరుకోగానే పథకం ప్రకారం రాజారెడ్డి గ్రామ ప్రాథమిక పాఠశాల వద్ద కాపుకాచి వుండగా అదే దారి గుండా వెళ్తున్న లక్ష్మినారాయణపై రాజారెడ్డి ఒక్క సారిగా దాడి చేసి వేట కొడవలితో గాయపరచినట్లు తెలిపారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న లక్ష్మినారాయణను గ్రామస్థులు గుర్తించి 108కు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం బత్తల పల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కొరకు కర్నూలుకు తరలించినట్లు తెలిసింది. జరిగిన సంఘటన పై ఎస్సై క్రిష్ణారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి వచ్చారు. ఈ సంఘటనపై తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు వచ్చిన అనంతరం వివరాలు వెల్లడిస్తామని విలేఖర్లతో ఎస్సై తెలిపారు.