హైదరాబాద్ నుండి, బొంబాయి అంతర్జాతీయ విమానాశ్రయానికి బాగా ముందుగా చేరింది, ఆ యూరోపియన్ వనిత. తాను ప్రయాణించే విమానం బయలుదేరడానికి కొన్ని గంటలు వ్యవధి ఉన్నది. అందువల్ల కాలక్షేపం చేయడానికి అనుకూలంగా, ఒక పుస్తకం, ఒక బిస్కెట్ పాకెట్ కొనుక్కొని, కుర్చీలో కూచున్నది.
పుస్తకంలోని కథ ఆవిణ్ణి చాలా ఆకర్షించింది; అందులో మునిగిపోయింది. ఎప్పుడో తన పక్కకే వచ్చి కూచున్న ఓ యువకుడు తనకీ అతనికీ మధ్యనున్న బిస్కెట్ పాకెట్ నుండి బిస్కట్లు తీసుకు తింటున్నాడని అకస్మాత్తుగా గమనించింది. ఒకటి వెంబడి ఒకటి, చక్కగా చేయి చాచి తీసుకుని నోట్లో వేసుకుంటున్నాడు.
ఈ విషయం గురించి అల్లరి పడడం ఇష్టంలేక ఆవిడ అతడి దుశ్చర్యను చూసీ చూడనట్లు ఊరకుండిపోయింది. ఆ సిగ్గుమాలిన యువకుడు మిగిలి వున్న బిస్కట్లను నిస్సంకోచంగా తినేస్తూనే ఉన్నాడు. ఆవిడకు ఇప్పుడు నిజంగానే కోపం వచ్చేసింది. ‘నేనే గనక విద్యావంతురాలిని, ఇంత మంచిదానిని కాకపోయినట్లయితే వీడికి ఒక గుణపాఠం నేర్పి వుండేదాన్ని’ అనుకున్నది. చివరకు ఒక్క బిస్కటే మిగిలి వున్నప్పుడు ‘ఇప్పుడేమి చేస్తాడా?’ అని ఆలోచిస్తున్నది. ఆ యువకుడు చిరునవ్వుతో ఆ బిస్కెటును రెండుగా తుంచి, ఒక ముక్క ఆవిడకిచ్చి, మిగతా సగం తన నోట్లో వేసేసుకున్నాడు. అతడిచ్చిన ముక్క తీసుకున్న ఆవిడ, ‘ఎంత పనికిరానివాడు! ఆఖరికి నాకు థాంక్స్ కూడా చెప్పలేదు’ అనుకున్నది. ఈలోగా తన విమానం బయలుదేరడానికి సిద్ధంగా వున్నదని ప్రకటన వినిపించింది.
తన బాగ్ తీసుకొని బోర్డింగ్ గేటు వద్దకు వెళ్లింది. ప్లేన్‌లోకి వెళ్లి తిన్నగా కూచొని, పుస్తకం కోసం బాగ్‌లో వెతికింది. చేతికి తాను చదువుతూ వుండిన పుస్తకం తగిలింది; దానితోబాటు, తాను అక్కడి విమానాశ్రయంలో కొన్న బిస్కట్ పాకెట్, తెరవకుండా, పై పాకింగ్ చింపకుండా, కొన్నప్పటిలాగా అట్లానే ఉన్నది. ఆశ్చర్యపోయింది. ‘నా బిస్కెట్ పాకెట్ నా వద్దనే వుంటే..’ అనే ఆలోచన కలిగేసరికి, ఆవిడకు కొద్దిపాటి భీతి జనించింది. అంటే తాను తిన్నవన్నీ అతడి బిస్కెట్ పాకెట్ నుంచి తీసుకున్నవన్నమాట! ఆవిడ తీసుకుంటూ వుంటే, ‘పోనీలే, పంచుకుంటే తప్పేమిటి?’ అని ఆ యువకుడు అనుకున్నాడన్నమాట. పనికిరాని మనిషి, దొంగ తానే కానీ అతడు కాదని తెలుసుకున్నది.
‘మన జీవితాల్లో ఎన్నిమార్లు మనం ఒకదానికొకటి ఊహించి ఉంటాం? మన మీద మనకు నమ్మకం లేదు కాబట్టి, ఈ అపనమ్మకాన్ని ఇతర్లకు అంటగట్టి ప్రవర్తిస్తుంటాం. ఇంకొకర్ని గురించి తీర్మానించేప్పుడు కాస్త ఆలోచిస్తే, ఇంతకన్నా నయంగా ఉంటుందేమో’ అన్నాడు మిత్రశ్రీ.
‘ఆ మాటకొస్తే మనమందరం దొంగలమే’నని ప్రకటించాడు ఉత్కళరావు. ‘ఈ భార్యాభర్తల సంభాషణ వినండి:
భార్య: ఈ కొత్త పనిమనిషి, మనవి రెండు టవల్స్ కొట్టేసిందండీ.
భర్త: ఏవి తీసుకెళ్లింది?
భార్య: ఊటీలో మనమా హోటల్ రూమ్ నుండి తెచ్చినవి.
*
హైదరాబాద్ నుండి, బొంబాయి అంతర్జాతీయ విమానాశ్రయానికి
english title:
neelamraju
Date:
Sunday, June 3, 2012