Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

మల్లాది మిరియాలు - నేను ఎవర్ని?

$
0
0

రోజంతా కష్టపడి పనిచేశాక ఎప్పటిలానే రాస్ ఐవి ఆఫీస్ నించి బయలుదేరి తన కారుని తన ఇంటి డ్రైవ్ వేలోకి పోనించాడు. కారులోంచి గేరేజ్ మీదకి ఎదిగిన చెట్టు కొమ్మని చూసి విస్మయం చెందాడు. ఒక్కరోజులో అది అంత పెద్దగా ఎలా ఎదిగింది? బహుశా ఇటీవల తను దాన్ని పెద్దగా గమనించి ఉండడు అనుకున్నాడు. కారు ఇగ్నీషన్‌ని ఆర్పి తాళం చెవుల గుత్తిని బయటకి లాగాడు. తన బ్రీఫ్‌కేస్‌ని అందుకుని కారు దిగి తన ఇంటి గుమ్మం వైపు నడిచాడు.
తలుపుకి ఉన్న నంబర్‌ని చూసి అతని భృకుటి మరోసారి ముడిపడింది. పూర్వం చెక్క అంకెలు అతికించి ఉండేవి. కాని ఇప్పుడు 3218 అని తలుపు మీద రంగుతో రాసి ఉంది. చిత్రంగా తలుపు రంగు కూడా ఆఫ్ వైట్ బదులుగా బూడిద రంగులో ఉంది. తను ఆఫీస్‌కి వెళ్లి వచ్చేలోగా ఇదెలా సాధ్యం? రంగు కూడా తాజాగా లేదు. వేసి చాలాకాలం అయినట్లుంది.
ఇంటి తాళం చెవిని రంధ్రంలోకి పోనించి తిప్పాడు. తిరగలేదు. బయటకి తీసి మరోసారి పెట్టి తిప్పాడు. ఐనా తెరుచుకోలేదు. తాళం చెవి నంబర్ని చూశాడు. 3218. అదే, కావాలని దాని మీద తన ఇంటి నంబర్‌నే చెక్కించాడు. తలుపు గుమ్మానికి ఉన్న బటన్‌ని నొక్కాడు. గంటలు వినపడ్డాయి! టింగ్ టాంగ్ బెల్ కాదు!! సందేహం లేదు. అది తన ఇల్లే. ఐనా ఒక్కరోజులో...
‘డార్లింగ్’ తలుపు తెరుచుకుంటూండగా లోపల నించి తన భార్య గ్వైన్ కంఠణం విన్పించింది.
‘డార్లింగ్. ఇవాళ మీరింత తొందరగా...’
అతన్ని చూసి ఆమె నిర్ఘాంతపోయి ఓ అడుగు వెనక్కి వేసింది. అతని పెంపుడు కుక్క ఎప్పటిలా రాలేదు. లోపలకి వచ్చి తలుపు మూసి అడిగాడు.
‘ఫ్రిడ్జి ఎక్కడా?’
ఆమె అరవబోయి చేతిని నోటికి అడ్డు పెట్టుకుని ఆగి రెండు అడుగులు వెనక్కి వేసింది. ఆమె మొహంలోని భయాన్ని రాస్ స్పష్టంగా గమనించాడు.
‘నా తాళం చెవి ఎందుకో పని చేయలేదు. ఐనా కొన్ని గంటల్లో ఇన్ని మార్పులు ఏమిటి?’
బ్రీఫ్‌కేస్‌తో లోపలికి వెళ్లి లివింగ్ రూం లైట్ ఆన్ చేసి బార్ విభాగానికి వెళ్లి అలమార తెరిచి, తను నిత్యం తాగే బౌర్బన్ కోసం చూశాడు. ఆ బాటిల్ లేదక్కడ! తల తిప్పి భార్య వంక చూశాడు. ఆమె నాటకంలో తన నటన మర్చిపోయిన నటిలా నిర్ఘాంతపోయి గోడకి అతుక్కుని అతని వంక కళ్లప్పగించి చూస్తోంది.
‘ఫ్రిడ్జి ఏది? నా బౌర్బన్ సీసా ఏది? ఏమిటలా నిలబడి వింత చూస్తున్నావ్?’ కోపంగా అరిచాడు అతను.
‘రాస్?’ గొంతు పెగుల్చుకుని ఆమె మాట్లాడింది.
‘అవును. ఫ్రిడ్జి ఏది?’
‘చచ్చిపోయింది’ భయంగా చూస్తూ చెప్పింది గ్వెన్.
‘ఎలా చచ్చిపోయింది?’
‘కారు ఏక్సిడెంట్‌లో.. ఏడేళ్ల క్రితం..’
‘ఏడేళ్ల క్రితం పోవడం ఏమిటి? ఉదయం నేను ఆఫీస్‌కి వెళ్లేప్పుడు ఉందిగా? నీకేమైంది ఇవాళ?’ రాస్ ఆమె వంక చిత్రంగా చూస్తూ ప్రశ్నించాడు.
‘ఆ కారు ప్రమాదంలో నువ్వు కూడా మరణించావనే మేము అనుకున్నాం’
‘ఏ కారు ఏక్సిడెంట్‌లో? నేను ఉదయం ఇంట్లోంచి బయలుదేరి నప్పటి నుంచి ఈ క్షణం దాకా నేను ఏ కారు ప్రమాదంలో చిక్కుకోలేదు. ఆ తప్పుడు సమాచారం నీకు ఎవరు చెప్పారు?’
‘మీకేం గుర్తులేదా?’
‘ఏం గుర్తు ఉండాలి?’ రాస్ ప్రశ్నించాడు.
‘మీరు పోయారనే మేం అనుకున్నాం. మీ శరీరం దొరకలేదు కాని...’
‘మళ్లీ మేము? ఎవరా మేము?’
‘ఏడేళ్ల క్రితం మీరు ఫ్రిడ్జితో ఇండియానా నించి కెనడా వెళ్తూంటే జరిగిన కారు ఏక్సిడెంట్‌లో పోయారు. ఇది 2006. మీరనుకుంటున్నట్లు 1999 కాదు.’
అతని దృష్టి కేలండర్ మీదకి మళ్లింది. దాని దగ్గరికి వెళ్లి పరిశీలనగా చూసి, తన భార్య వంక చూస్తూ చెప్పాడు.
‘అరె! చిత్రంగా ఉందే?’
‘అవును. నేను, ఆర్థర్, మీ వ్యాపార భాగస్థులు, మీ క్లయింట్స్.. అంతా మీరు మరణించారనే అనుకున్నాం. గేనె్నట్ ఫాల్స్‌లోని జనాభా అంతా అదే అనుకున్నారు.’
తను ‘గేనె్నట్ ఫాల్స్, ది సూపర్బ్ సబర్బ్’ అన్న బోర్డుని చూసి తన ఇంటికి సాయంత్రం ఎగిరివచ్చే పావురంలా వచ్చాడని అతనికి గుర్తుకు వచ్చింది. తను కొంత మర్చిపోయాడని అతనికి స్ఫురించింది. మరి తను ఎక్కడికి బయలుదేరినట్టు? ఈ ఏడేళ్ల తన జీవితం తను మర్చిపోయాడు. అంటే ఏడేళ్ల క్రితం తన జీవితం తనకి ఇవాళ గుర్తొచ్చింది. ఎందుకు గుర్తొచ్చింది? ఆ బోర్డ్‌ని చూడబట్టా?
అతనికి బ్రాంది ఇష్టం లేకపోయినా ఆ బాటిల్ అందుకుని మూత తెరచి నోటికి కరుచుకుని కొన్ని గుటకలు తాగాడు.
‘మిమ్మల్ని ఏడేళ్ల తర్వాత ఇక్కడ చూడటం నాకు పెద్ద షాక్’ గ్వెన్ చెప్పింది.
‘నేను తిరిగి రావడం నీకు ఆనందంగా లేదా?’
‘మీకు ఏదీ గుర్తులేదా?’ గ్వెన్ అడిగింది.
రాస్ కొద్దిసేపు కళ్లు మూసుకుని ఆలోచించాడు.
‘నాకో కేబిన్ లీలగా గుర్తుంది. దాని ఎదురుగా ఓ సరస్సు. అందులో సదా చిమ్మే ఫౌంటెన్. ఆ సరస్సు ఎదురుగా ఓ రెండంతస్థుల ఇల్లు. మనకి ఇల్లు ఇంకా ఉందా?’
‘మనకా ఇల్లు ఎప్పుడూ లేదు. బహుశా ఈ ఏడేళ్లల్లో మీరు ఉన్న ఇల్లయి ఉండచ్చది. మీరు మాయం అయ్యాక ఇంతకాలం ఎక్కడో నివసించారు కదా? మీకది జ్ఞాపకం వచ్చి ఉండచ్చు. మీరు ఎక్కడ నించి వచ్చారో గుర్తుందా? ఈ ఏడేళ్లు ఎక్కడ ఉన్నారో గుర్తుందా?’
అతను ఆలోచించి తల విదిలించాడు.
‘చిత్రంగా నాకదేం గుర్తు లేదు’
‘మీరు ఇక్కడికి వస్తున్నట్లు ఎవరికైనా తెలుసా?’
‘ఊహు. ఆ బోర్డ్ చూసేదాకా ఇక్కడికి వస్తానని నాకే తెలీదు’
ఆమె మొహంలో కొంత రిలీఫ్ కనపడింది.
‘ఆ ప్రమాదం గురించి చెప్పు. ఏదైనా గుర్తొస్తుందేమో?’ రాస్ అడిగాడు.
‘మీరు, నేను, మన ఫ్రిడ్జి కారులో కెనడాకి వెళ్తూండగా మీ కారు అదుపు తప్పి లోయలో పడిపోయింది. అది గుర్తులేదా?’
‘లేదే?’
‘నుదుటి మీద ఆ కోసుకున్న మచ్చ మీకు పూర్వం లేదు. కావాలంటే చూడండి. మీ పాత ఫొటో తెస్తాను’ గ్వెన్ తన బెడ్‌రూంలోకి వెళ్లింది.
రాస్ ఏం చెయ్యాలా అన్నట్లుగా ఆలోచిస్తూ నిలబడ్డాడు. అతను తన ఐడెంటిటీ తెలుసుకోడానికి తన జేబులని వెదికి పర్స్‌ని తీశాడు. తన డ్రైవర్స్ లైసెన్స్ జేమ్స్ డీన్ పేర ఉంది. టెక్సాస్ రాష్ట్రంలోని సేన్ ఏంటోనియో అనే చిన్న ఊళ్లో ఆ లైసెన్స్ జారీ చేయబడిందని గుర్తించాడు. ఓ విజిటింగ్ కార్డుని చూశాడు. అది ఆస్టిన్‌కి చెందిన వేడ్ మిల్లర్ అనే అతని కార్డ్. అతనికి ఫోన్ చేసి జేమ్స్ డీన్ గురించి మాట్లాడితే ఫలితం ఉండవచ్చు అని అనుకున్నాడు.

గోడకి వేలాడే టెలిఫోన్ రిసీవర్‌ని అందుకున్నాడు. తన భార్య కంఠం ఎవరితోనో ఆదుర్దాగా చెప్పేది వినపడింది.
‘ఆర్థర్, నే చెప్పేది విను. ఇది నిజం’
‘మళ్లీ ఆర్థర్. ఎవరీ ఆర్థర్?
‘నేను నమ్మను’ ఓ మగ కంఠం వినిపించింది. అతనికి ఆ కంఠం పూర్వం విన్నానని లీలగా అనిపించింది.
‘కావాలంటే నువ్వే వచ్చి చూడు’
‘ఎలా బతికొచ్చాడు? అంతా సవ్యంగానే చేశానే? నిజంగా రాసేనా?’
‘ఈసారి పొరపాటు చేయక. కార్లో పెట్టి తోయడం కాదు. తుపాకీని ఉపయోగించి తర్వాత జలపాతం మీద నించి కిందకి తొయ్యి. బాడీ సరాసరి సముద్రంలోకి వెళ్లిపోతుంది’
‘అవును. గేనె్నట్ ఫాల్స్‌లో ఆత్మహత్య చేసుకున్న ఎవ్వరి బాడీ ఇంతదాకా దొరకలేదు. అతనికి చికెన్ సూప్‌ని కలిపివ్వు. రాత్రి పదకొండున్నరకి వస్తాను’
రాస్‌కి ఆ మాటలు సమ్మెట పోటుల్లా తగిలాయి. అంటే గ్వెన్, ఆర్థర్ కలిసి తన మీద హత్యా ప్రయత్నం చేశారన్నమాట! ఎందుకు? మళ్లీ చేయడానికి పథకం వేశారని తనకి అదృష్టవశాత్తు తెలిసింది. రాస్ ఈసారి జాగ్రత్తగా ఉండదలిచాడు. అంతా తను మరణించారనే అనుకుంటున్నారు. ఈ ఇంటికి వచ్చేప్పుడు కూడా తనని ఎవరూ చూడలేదు. చూసి ఉంటే ఈపాటికి తనని చూడటానికి వచ్చేవారు. లేదా ఫోన్ చేసి తెలుసుకునేవారు.
గ్వెన్ తన దగ్గరికి వచ్చే సవ్వడి విని రిసీవర్‌ని యధాస్థానంలో ఉంచి వెళ్లి బార్ దగ్గర నిలబడి విస్కీ గ్లాస్‌ని అందుకున్నాడు.
‘రాస్! ఆకలిగా ఉందా?’ ‘ఉంది’
‘నీకిష్టమైన చికెన్ సూప్‌ని చేస్తాను ఉండు’
ఫ్రిజ్ తెరిచి చికెన్‌ని తీసి, గ్వెన్ పది నిమిషాల్లో చికెన్ సూప్‌ని చేసింది. ఆమె చేసేంతసేపు అక్కడే నిలబడి చూశాడు రాస్.
‘ఆర్థర్ ఎవరు?’ అడిగాడు.
‘నీ మిత్రుడు. గుర్తు లేదా? నీ వ్యాపారంలో భాగస్థుడు’
‘గుర్తు రావడంలేదు’ ‘చూస్తే గుర్తు పడతారు. రేపు వస్తాడు. ముందు ఈ సూప్ తాగండి. ముందుగా ఈ మాత్ర వేసుకోండి. రిలాక్స్ అవుతారు’ మందుల పెట్టెలోంచి ఓ మాత్రని తీసిచ్చింది.
‘ఇదివరకటిలా ఇది కలిపే అవకాశం లేక సరాసరి ఇస్తున్నావా?’ నవ్వుతూ అడిగాడు.
గ్వెన్ మొహంలోకి వెంటనే ఆందోళన ప్రవేశించింది.
‘ఇదివరకటిలానా? అంటే?’
‘అవును. నువ్వు మోటెల్‌లో వేచి ఉంటే, నేను ఆర్థర్, ఫ్రిడ్జిలు కారులో వెళ్లాం. వెళ్లబోయే ముందు నువ్వు నాకు చాక్లెట్ మిల్క్ ఇచ్చావు. అందులో ఇలాంటిదే కలిపావు కదూ?’
గ్వెన్ మొహం వివర్ణం అయింది. రాస్ ఆమె వెనక వైపు వెళ్లి నిలబడి ఆమె మెడ చుట్టూ చేతులు వేశాడు. క్రమంగా అవి బిగుసుకోసాగాయి. ఆమె గింజుకున్నా లాభం లేకపోయింది.
‘ఆర్థర్‌తో నువ్వు మాట్లాడింది ఫోన్‌లో విన్నాక నాకు కొంత అర్థమైంది.’ ఆమె చెవిలో చెప్పి ఆమె గొంతుని పిసకగలిగినంత పిసికి తర్వాత అరచేతులని తీయకుండా అలాగే పట్టుకున్నాడు. మూడు వందల దాకా లెక్క పెట్టి తర్వాత వదిలేశాడు. ఆమె బాడీ దబ్బున అచేతనంగా కింద పడింది.
జేబులోని సిగరెట్ తీసి వెలిగించి ఆలోచించసాగాడు. తనెవరు? తనకి పెళ్లయిందా? తన భార్యా పిల్లలు ఇప్పుడు తన కోసం ఆందోళనగా ఎదురు చూస్తూంటారా? అసలు తనకి పిల్లలు ఉన్నారా? గత స్మృతులు ఎలా తనకి తప్పాయి?
రాత్రి పదకొండుకి ముందు గదిలోని లైట్స్ ఆర్పి రాస్ కదలకుండా తలుపు పక్కన చేతిలో మెలిపెట్టిన టవల్‌తో నించున్నాడు. సరిగ్గా ఐదు నిమిషాల తక్కువ పదకొండుకి ఫోన్ మోగింది. రాస్ దాన్ని ఆన్సర్ చేయలేదు. మరో పది నిమిషాల తర్వాత బయట కారు ఆగిన శబ్దం వినిపించింది. తయారుగా నిలబడ్డాడు.
‘గ్వెన్.. రాస్’ ఇందాక ఫోన్‌లో విన్న గొంతు వినిపించింది.
తలుపుని తాళం చెవితో తీస్తున్న చప్పుడు. అతను లోపలికి రాగానే రాస్ అతని మీదికి దూకాడు. అతను మోచేత్తో డొక్కలో పొడవగానే రాస్ వెళ్లి దూరంగా పడ్డాడు. లేచి మళ్లీ అతనికి మీదకి దూకాడు. అప్పటికే అర్థర్ చేతిలోకి జేబులోంచి పిస్తోలు ప్రత్యక్షం అయింది. పెనుగులాటలో సేఫ్టీ కేచ్ తీయని అది వెళ్లి దూరంగా పడింది. ఆర్థర్ రాస్ తల మీద బలంగా మోదాడు. రాస్ కూడ ఆర్థర్ తల మీద బలంగా మోదాడు. ఐతే ఆర్థర్‌లా చేత్తో కాదు. బరువైన పింగాణీ ఫ్లవర్ వేజ్‌తో. ఆర్థర్ ఆ దెబ్బకి నేల కూలాడు. రాస్ లైట్ వెలిగించి చూశాడు. కపాలం పగిలి లోపల నించి ఏదో ద్రవం కారుతోంది.
గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి రాస్ తన టైని సవరించుకున్నాడు. వెళ్లి తన వెంట తెచ్చిన బ్రీఫ్‌కేస్‌ని అందుకున్నాడు. తలుపు తెరచుకుని బయటకి వెళ్తూ తల తడుముకుంటూ చెప్పాడు.
‘నువ్వు వచ్చి నాకో మంచి సహాయం చేసావు’
తన కారు ఎక్కి స్టార్ట్ చేసి దాన్ని రోడ్డు మీదకి పోనిస్తూ తన కోసం ఆదుర్దాగా ఎదురుచూసే తన భార్య ఎలిజబెత్‌కి దారిలో కారాపి పబ్లిక్ ఫోన్ బూత్‌లో కాయిన్స్ వేసి ఫోన్ చేశాడు. అవతలి వైపు ఒకసారి మోగగానే ఎత్తారు.
‘హలో..’ ఆదుర్దాగా వినపడింది ఎలిజబెత్ కంఠం.
‘నేనే జేమ్స్‌ని. పిల్లలు పడుకున్నారా? సారీ కొంత ఆలస్యం అయింది. వస్తున్నాను’
పోలీసులు హంతకుల కోసం వెదుకుతారు కానీ రాస్ కోసం వెదకరని అతనికి తెలుసు.
*
(పోలైన్ సి స్మిత్ కథకి స్వేచ్ఛానువాదం)

====

రోజంతా కష్టపడి పనిచేశాక
english title: 
who am i?
author: 
మల్లాది వెంకట కృష్ణమూర్తి

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>