హైదరాబాద్, సైదాబాద్, జూన్ 5: అక్రమాస్తుల కేసులో చంచల్‌గూడ జైలులో విచారణ ఖైదీగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఎంపి జగన్మోహన్‌రెడ్డిని సిబిఐ అధికారులు మూడవరోజు కస్టడీలోకి తీసుకుని విచారించారు.
మంగళవారం ఉదయం జైలు పరిసరాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటుచేసి బాంబ్‌స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పరిశీలించారు. ఉదయం 9.20 నిమిషాలకే సిబిఐ అధికారులు జైలులోనికి వెళ్లారు. అయితే, జగన్ దైవప్రార్థన చేసుకుని, అల్పాహారం తీసుకున్న తర్వాత నిబంధనల ప్రకారం జైలు వైద్యులు ఆయనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేసరికి 10.20 అయింది. విచారణకు ఆలస్యమవుతోందని సిబిఐ అధికారులు జైలు వర్గాలను తొందరపెట్టినట్లు సమాచారం. జగన్ జైలు నుంచి బయటకు వచ్చిన సమయంలో చిరునవ్వుతో అందరికీ తనదైన మార్కు అభివాదం చేస్తూ ముందుకు సాగాడు. అనంతరం సిబిఐ అధికారులు ఏర్పాటు చేసిన వాహనంలో భారీ కాన్వాయ్ భద్రత మధ్య కోఠిలోని సిబిఐ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఎటువంటి ట్రాఫిక్ ఆంక్షలను విధించలేదు. అయితే, వరుసగా రెండోరోజూ జగన్ కాన్వాయ్ నల్లగొండ చౌరస్తాలో ట్రాఫిక్‌లో చిక్కుకుంది. విచారణ ముగిసిన అనంతరం సాయంత్రం 5.10గంటలకు సిబిఐ అధికారులు జగన్‌ను మళ్లీ చంచల్‌గూడ జైలుకు తరలించారు. మూడు రోజుల విచారణలో జగన్ నుంచి కీలక విషయాలను రాబట్టే ప్రయత్నం చేసిన సిబిఐ అధికారులకు చుక్కెదురైనట్లు తెలుస్తోంది.
కస్టడీకి భాను..?
సైబరాబాద్ పోలీసుల యత్నం
గచ్చిబౌలి, జూన్ 5: సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌ను సైబరాబాద్ పోలీసులు మరో సారి కస్టడీకి కోరనున్నట్లు తెలిసింది. గత వారం రెండు రోజుల కస్టడీకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు విచారించి కోర్టు ముందు హాజరుపరిచారు. 8న కేసును న్యాయమూర్తి వాయిదా వేశారు. అయితే అదే రోజు పిటి వారెంట్ వేసి కస్టడీకి తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు యోచిస్తున్నట్లు తెలిసింది.
కస్టడీ సమయంలో కొంత సమాచారం సేకరించిన పోలీసులు మరింత సమాచారం కోసం కస్టడీకి తీసుకోవాలని అనుకుంటున్నారు. సూరి జైల్‌లు ఉన్న సమయంలో భానుకిరణ్ శేరిలింగంపల్లిలో పలు ల్యాండ్ సెంటిల్మెంట్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. శేరిలింగంపల్లి మండల పరిధిలోని ఖానామెట్‌లోని ఓ సర్వేలోని ఎకరా భూమిని తక్కవ ధరకు అమ్మమని ఒత్తిడి చేసినట్లు సమాచారం.
ఈ భూ వివాదంలో మస్తాన్‌రావు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు భానుకిరణ్, మంగలి కృష్ణతో పాటు వారి గ్యాంగ్ తమని బెదిరించినట్లు సూసైడ్ నోట్‌లో మస్తాన్‌రావు పేర్కొన్నాడు. మాదాపూర్, రాయదుర్గం పోలీసుస్టేషన్ల పరిధిలో పోలీసు అధికారుల సహాయంతో పలు సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈనేపథ్యంలో మరో మారు భానును కస్టడీకి తీసుకొని పూర్తి సమాచారం స్వీకరించాలని పోలీసులు యోచిస్తున్నారు.
ఆరుగంటలకు పెరిగిన కరెంటు కోత!
* తాగునీటి సరఫరా అంతంత మాత్రమే
* బురద, మట్టితో కూడిన నీరు సరఫరా
హైదరాబాద్, జూన్ 5: వేసవి కాలం ‘నీటి’కష్టాలను అధిగమించేందుకు రూ. 5 కోట్లతో ప్రత్యేక కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేశామని జలమండలి, నగరవాసులకు రోజుకి రెండు గంటలు మాత్రమే కరెంటు కోత విధిస్తున్నామంటూ సిపిడిసిఎల్ అధికారులు..చేస్తున్న ప్రకటనలు వాస్తవానికి విరుద్దంగా తయారయ్యాయి.
కోతలు అమలు చేస్తున్న కొత్తలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా వేర్వేరుగా రెండు గంటల పాటు కరెంటు కోతను విధించిన అధికారులు ఇపుడు కోతలు అనధికారికంగా తీవ్రం చేస్తూ ప్రజలను వెతలకు గురి చేస్తున్నారు. వేసవి కాలం చివరి దశలో ఉన్నా, ఎండలు మండిపోతుండటం, దానికి తోడు వేడిగాలులు, ఉక్కపోతకో జనం ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నారు. రెండురోజుల క్రితం సోమవారం నగరంలోని మెహిదీపట్నం, బంజారాహిల్స్, కోఠి, కాచిగూడ, రాంనగర్‌తో పాటు సికింద్రాబాద్‌లోని మరికొన్ని ప్రాంతాల్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పనె్నండున్నర గంటల వరకు వేర్వేరుగా ఆరు గంటల పాటు కరెంటు కోతను విధించారు. ఫలితంగా ఇంట్లో ఫ్యాన్‌లు కూడా పనిచేయకపోవటంతో జనం ఉక్కపోతతో అల్లాడిపోయారు. మంగళవారం కూడా కరెంటు సరఫరాలో దాదాపు అదే పరిస్థితి కొనసాగింది. ఫలితంగా హమ్మయ్య ఈ సారి వేసవి కాలం గట్టెక్కామని భావిస్తున్న నగరవాసులకు కాలం చివర్లో కష్టాలు రెట్టింపయ్యాయనే చెప్పవచ్చు. అంతేగాక, రానున్న నాలుగైదు రోజుల్లో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశామున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించినప్పటికీ, అంతలోపు మరో మూడు,నాలుగు రోజుల పాటు ఎండలు మరింత మండిపోయి నిప్పుల వర్షం కురిసే అవకాశముందని కూడా ప్రకటించటంతో కరెంటు, మంచినీటి సమస్యలతో ఎలా గట్టెక్కాలన్న ఆందోళన నగరవాసుల్లో నెలకొంది. వేసవి కాలం మంచినీటి కొరత ఉన్నందున రెండురోజులకోసారి నీటిని సరఫరా చేస్తామని జలమండలి అధికారులు ప్రకటన చేసినా, అదీ సక్రమంగా జరగటం లేదని పలు ప్రాంతాల వాసులు లబోదిబోమంటున్నారు.
ముఖ్యంగా ఎండలు మండిపోతున్నందున నగర ప్రజల దాహార్తీని తీర్చే అయిదు ప్రధాన జలాశయాల్లో నీటి మట్టాలు అంతంతమాత్రంగా ఉండటంతో జలమండలి అధికారులు నీటిని పంపింగ్ చేసి మరీ సరఫరా చేస్తున్నారు. అయితే ఈ పంపింగ్‌కు కూడా ప్రతిరోజు కరెంటు కట్ కట తలెత్తటంతో అధికారులు ఆశించిన స్థాయిలో మంచినీటిని సరఫరా చేయలేకపోతున్నారు. అయితే అంతంతమాత్రంగా సరఫరా అవుతున్న నీటిలో ఎక్కువ ప్రాంతాల్లో బురద , మట్టి, దుర్వాసనతో కూడిన నీరు సరఫరా అవుతుండటంతో తాగునీటికి ప్రజలు గత్యంతరం లేక ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషిస్తున్నారు. అదే జలమండలి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీటికి, ట్యాప్ ద్వారా సరఫరా అవుతున్న నీటి ఎంతో తేడా ఉంది. ట్యాంకర్ల ద్వారా సరఫరా అవుతున్న నీరు కొంత శుభ్రంగానే కన్పిస్తున్నా, ట్యాప్‌ల ద్వారా సరఫరా అయ్యే నీటిలో బురద వాసన, మరికొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ దుర్వాసన కూడా వస్తుంది. ఫలితంగా ఆర్థికంగా కాస్త స్తోమత కల్గిన వారు మినరల్ వాటర్‌ను కొనుగోలు చేసి మరీ సేవిస్తుండగా, గత్యంతరం లేని మురికివాడలకు చెందిన ప్రజలు నల్లాల ద్వారాసరఫరా అవుతున్న నీటినే సేవించి అనారోగ్యం పాలవుతున్న సంఘటనలు కూడా ఉన్నాయి.
1.3 కోట్ల రూపాయల పట్టివేత
హైదరాబాద్, సెదాబాద్, జూన్ 5: అక్రమంగా తరలిస్తున్న నగదును పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని మలక్‌పేట ప్రాంతం నుంచి ఒక వాహనంలో దాదాపు ఒక కోటి ముప్పై లక్షల రూపాయలను తరలిస్తున్న సమాచారం తెలుసుకున్న సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు సలీంనగర్ చౌరస్తావద్ద పట్టుకున్నారు. ఈ వాహనం షేక్‌బాబా అనే వ్యక్తికి చెందినదిగా ఐటి, టాస్క్ఫోర్స్ అధికారులు గుర్తించారు. ఈ డబ్బు ఎక్కడకు తరలిస్తున్న విషయంపై డ్రైవర్ సరైన సమాధానం చెప్పకపోవడంతో అతడిని అదుపులోకి తీసుకుని డబ్బును స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో డబ్బు తరలించడం కష్టతరంగా మారింది.
అయోమయం...గందరగోళం
* ‘స్థాయీ ’ కాంగ్రెస్ అధికారిక అభ్యర్థులెవరు
* కాంగ్రెస్‌లో తప్పని క్రాస్ ఓటింగ్
* అదే అదునుగా టిడిపి వ్యూహం
* 7న పోలింగ్, స్పష్టత కోసం నేడు కాంగ్రెస్ నేతల భేటీ
హైదరాబాద్, జూన్ 5: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విధి విధానాల్లో కౌన్సిల్ తర్వాత ముఖ్యమైన పాత్ర పోషించే స్థాయీ
సంఘం మూడో కమిటీ ఎన్నిక ఈనెల 7వ తేదీన జరగనున్న సంగతి తెల్సిందే! కౌన్సిల్‌లో సభ్యుల సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల అవగాహన ఒప్పందం ప్రకారం ఈ రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులు 15 మంది నామినేషన్లు సమర్పించాల్సి ఉండగా, కాంగ్రెస్ నుంచి నామినేషన్లు దాఖలు చేసినవారిలో ఇద్దరు అదనంగా పోటీకి దిగారు.
వారిని ఉపసంహరింప జేయటంలోనూ అధిష్టానం వైఫల్యం చెందిన కారణంగా ప్రస్తుతం బరిలో ఉన్న పది మందిలో ఎనిమిది మందిని ఎన్నుకోవల్సి ఉంది. వీరిలో పార్టీ అధిష్టానం అధికారికంగ ప్రకటించిన ఎనిమిది మంది అభ్యర్థులెవరు? అధిష్టానం నిర్ణయాన్ని కాదని నామినేషన్లు సమర్పించిన మరో ఇద్దరు అభ్యర్థులెవరన్న విషయంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన 52 మంది కార్పొరేటర్లు అయోమయానికి గురవుతున్నారు. ఈ క్రమంలో తాము ఓటు వేసి గెలిపించాల్సిన ఎనిమిది మంది అభ్యర్థులెవరు మహాప్రభో అంటూ అధినాయకుల చుట్టూ తిరుగుతున్న కార్పొరేటర్లకు ఇటు పిసిసి చీఫ్‌గానీ, మంత్రులుగానీ, ఎమ్మెల్యేలు సైతం స్పష్టత ఇవ్వకపోవటంతో 7న జరిగే స్థారుూ సంఘం పోటీ ఆసక్తికరంగా మారింది. అయితే కౌన్సిల్‌లో 45 మంది సభ్యులున్న తెలుగుదేశం పార్టీకి ఇతర పార్టీలైన బిజెపికి చెందిన అయిదుగురు, ఎంబిటి ఒకరు, ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఒకరు ఓట్లు వేసినా గెలుపు సాధ్యం కాదని తెలిసినా, ఉనికి చాటుకునేందుకు మురళీగౌడ్, జితేంద్రనాథ్ అనే కార్పొరేటర్లను బరిలో దింపిన సంగతి తెల్సిందే! అయితే ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న పది మందిలో కాంగ్రెస్‌కు చెందిన 52 మంది కార్పొరేటర్లు, మజ్లిస్‌కు చెందిన 43 మంది ఎవరికి ఓటు వేయాలన్న అయోమయ వాతావరణం నెలకొంది. దీన్ని ఆసరాగా చేసుకుని రాజకీయంగా లబ్దిపొందేందుకు తెలుగుదేశం పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తుంది. గత సంవత్సరం జరిగిన స్థాయీ సంఘం ఎన్నికలో కూడా కాంగ్రెస్ సభ్యులు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన మాదిరిగానే ఈసారి కూడా క్రాస్ ఓటింగ్ జరిగి తమకు లాభం చేకూరుతోందన్న ఆశతో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పటికే పలువురు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను కలిసి మద్దతను అభ్యర్థించినట్లు తెల్సింది.
ఇదే అయోమయం!
స్థాయీ సంఘం ఎన్నికకు సంబంధించి మొత్తం 15 మందిని ఎన్నుకోవల్సి ఉండగా, కాంగ్రెస్ నుంచి ఎనిమిది, మజ్లిస్ నుంచి ఏడుగురికి ఉభయపార్టీల సభ్యుల పరస్పర ఓటింగ్‌తో స్థానం దక్కనుంది. కానీ ఈ సారి కాంగ్రెస్ అధిష్టానం నిర్లక్ష్యం, పరోక్ష ప్రోత్సాహం ఫలితంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పదిమంది నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెల్సిందే! అయితే మే 24న కాంగ్రెస్ పార్టీ జారీ చేసిన షెడ్యూల్డ్ ప్రకారం అడిక్‌మెట్ కార్పొరేటర్ సి.సనీతా ప్రకాశ్‌గౌడ్ పేరు విన్పించింది. కానీ ఆమె అభ్యర్థిత్వంపై స్థానిక ఎమ్మెల్యే మణెమ్మ, అనుచరులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినా ఆమెకు అధిష్టానం నుంచి పరోక్షంగా వచ్చిన సంకేతాల కారణంగా ఆమె కూడా నామినేషన్ దాఖలు చేసి బరిలో ఉంది. ఇక ప్రస్తుతమున్న స్థారుూ సంఘంలో సభ్యురాలిగా కొనసాగుతున్న బి. చంద్రమ్మకు మరోసారి స్థానం కల్పించాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే పి. విష్ణువర్థన్‌రెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెల్సింది. ఇందులో భాగంగానే ఆమెతో ఎమ్మెల్యే నామినేషన్ దాఖలు చేయించి పోటీలో నిలిపినట్లు తెల్సింది. ఈ క్రమంలో ఈ ఇద్దరు మహిళా కార్పొరేటర్లలో అధికారిక అభ్యర్థి ఎవరన్న అయోమయానికి తెరదించేందుకు కాంగ్రెస్ అధినాయకులు నేడు కార్పొరేటర్లతో సమావేశమయ్యే అవకాశమున్నట్లు తెల్సింది.
దోపిడీ దొంగల స్వైరవిహారం
హైదరాబాద్, జూన్ 5: దోపిడీ దొంగలు తమ నేరసామ్రాజ్యాన్ని విస్తరించడానికి నగరాన్ని అనువైన ప్రదేశంగా ఎంచుకున్నారు. ఇటీవలి కాలంలో దోపిడీలతో పాటు హత్యలకు కూడా తెగబడుతూ నగరంలో అరాచకం సృష్టిస్తున్నారు. ఇళ్ళలో ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్‌గా చేసుకుని దోపిడీలు చేస్తూ సహకరించని వారిని దారుణంగా తుదముట్టిస్తున్నారు.
నగరంలో రెండు రోజుల వ్యవధిలో రెండు హత్యలు చేసి దొంగలు సంచలనం సృష్టిస్తున్నారు. అయితే, దొంగలను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించే సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌కు చెందిన పోలీసులు ఏం చేస్తున్నారు అంటే చాలా మంది చెప్పే సమాధానం లైట్ తీసుకుంటున్నారు అని... పోలీసుల నిర్లిప్త వైఖరి కారణంగానే, ఇటీవలి కాలంలో చోరీలు మరీ పెచ్చుమీరుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నగరంలో పెరుగుతున్న దోపిడీ దొంగతనాలను అరికట్టడంలో సిసిఎస్ పోలీసుల తీరును ఇటీవల కమిషనర్ అనురాగ్‌శర్మ ఓ సమావేశంలో ఎండగట్టారు.
ఇళ్ళ చోరీలు, గొలుసు దొంగతనాలు తరచూ జరుగుతుండడంతో నగర పౌరులు అభద్రతా భావానికి లోనవుతున్నారు. ఇంటికి తాళం వేసి వచ్చేలోపు ఇల్లు గుల్ల అవుతుందని భయపడుతున్నారు. గత రెండేళ్ళుగా చూస్తే నేరాల సంఖ్య ఎక్కువగానే నమోదవడం పోలీసుల పనితీరుకు దర్పణం పడుతోంది. కేవలం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 2010లో 13954, 2011లో 13814 నేరాలు నమోదయ్యాయి. చిన్నా, చితకా దొంగతనాలు కలుపుకుని ఈ ఏడాది ఇప్పటికే ఐదు వేల వరకు జరిగాయి. సైబరాబాద్‌లోనూ పరిస్థితి ఇదే మాదిరిగా ఉంది. ముంబై వంటి మహానగరాల్లో దొంగతనాలు చేయడంలో ఆరితేరిన చోర శిఖామణుల కన్ను తాజాగా నగరంపై పడినట్లు తెలుస్తోంది. రాజస్థాన్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాలు నగరంలో సంచరిస్తున్నాయి.
ఒక పథకం ప్రకారం ఎవరికీ అనుమానం రాకుండా సామాన్య ప్రజల మాదిరిగా సంచరిస్తూ తాళం వేసి ఉన్న ఇళ్ళతో పాటు మహిళలు ఒంటరిగా ఉంటున్న ఇళ్ళ వద్ద రెక్కీ నిర్వహిస్తూ దొంగతనాలు చేస్తున్నారు. అంతర్రాష్ట్ర దొంగలతో పాటు మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ముఠాలు కూడా జతకలుస్తూ రాజధానిలో తిష్ఠ వేశాయి. కేవలం ఇళ్ళనే కాకుండా, నగరంలోని పలు నగల దుకాణాలను కూడా లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు తెగబడుతున్నారు.
లోపం ఎక్కడ.
హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సంపన్నులు నివాసముంటున్న ప్రాంతాలతో పాటు నిశ్శబ్దంగా ఉండే కాలనీలను దొంగలు ఎంచుకుంటున్నారు. ఇటువంటి ప్రాంతాలపై పోలీసులు కూడా పెద్దగా శ్రద్ధ వహించరు. తాజాగా, లంగర్‌హౌజ్, నాచారం పరిధుల్లో ఇటువంటి ప్రదేశాలనే ఎంచుకుని దోపిడీ దొంగలు నగలు ఎత్తుకెళ్ళడంతో పాటు మహిళలను హత్య చేశారు. సోమవారం నాచారం హెచ్‌ఎంటినగర్‌లో మంజులను దుండగులు హత్య చేశారు. భర్త విధులకు వెళ్ళడంతో ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్న సమయం చూసి దొంగలు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధుల్లో గజదొంగలుగా ముద్రపడి సిడి షీట్ ఉన్నవారు ఇతర ప్రాంతాల్లో చోరీలు చేస్తూ తమపై అనుమానం రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
దొంగల ముఠాలో ఒకరిద్దరు సభ్యులు పోలీసులకు పట్టుబడుతున్నప్పటికీ వారి నుంచి సరైన రీతిలో పూర్తి వివరాలను రాబట్టడంలో పోలీసులు విఫలమవుతున్నట్లు తెలిసింది. నేర పరిశోధనలో సుశిక్షితులైన అధికారుల కొరత ఉండడం కూడా దీనికి ప్రధాన కారణంగా ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ విషయంపై నగర కమిషనర్ అనురాగ్‌శర్మ కీలక దృష్టి సారించినట్లు తెలిసింది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో చోరీలు ఎక్కువగా జరుగుతున్న పశ్చిమ, మధ్య మండలంలో ఫిర్యాదు ఇవ్వడానికి వెళుతున్న బాధితులకు పోలీసులు అందుబాటులో ఉండడం లేదన్న విషయం ఆయన దృష్టికి రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
దొంగలపై ప్రత్యేక నిఘా...
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న ఐదు జోన్లలో ప్రతి జోన్‌కు ప్రత్యేకంగా ఒక నేర పరిశోధన బృందాన్ని ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అదనపు డిసిపి పర్యవేక్షణలో ఈ బృందం పనిచేసేలా చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం పాత దొంగలు, కొత్తగా నమోదైన నేరాలు, నేరస్థులకు అనువుగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఒక నివేదికను సిద్ధం చేయాలని ఇప్పటికే సంబంధిత శాఖాధికారులకు ఆదేశాలు అందాయి. అంతేకాకుండా, మఫ్టీలోనూ సమస్యాత్మక ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తే దొంగతనాలను అరికట్టవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
జాబ్‌మేళాలను సద్వినియోగం చేసుకోండి: అసదుద్దీన్
హైదరాబాద్, జూన్ 5: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న జాబ్‌మేళాలను నిరుద్యోగ యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్ధీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. నగరంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు గ్రేటర్ ఆధ్వర్యంలో మంగళవారం రియాసత్‌నగర్‌లో నిర్వహించిన జాబ్‌మేళాను ఎంపి ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు దొరకని నిరుద్యోగులు ఎలాంటి నిరాశ నిస్పృహాలకు లోనుకారాదని సూచించారు. అలాంటి యువతను ఆదుకునేందుకే గ్రేటర్ ఈ జాబ్‌మేళాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం గ్రేటర్ మేయర్ మహ్మద్ మాజీద్ హుస్సేన్ మాట్లాడుతూ నగరంలోని వివిధ ఐటి, ఇతరాత్ర కార్పొరేట్‌సంస్థల్లో రెండేళ్లలో సుమారు పదివేల పోస్టులను భర్తీ చేయాలన్న లక్ష్యంతో ఈ జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఈ జాబ్‌మేళాల ద్వారా నమోదయ్యే అభ్యర్థులకు వారి అర్హతలను బట్టి వివిధ కోర్సుల్లో జాబ్ గ్యారెంటెడ్‌తో చక్కటి శిక్షణనిప్పించనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా నగరానికి చెందిన యువతుకు అండగా నిలిచేందుకు ఇప్పటికే పలు ఐటి,కార్పొరేట్ సంస్థలు ముందుకొచ్చినట్లు మేయర్ వివరించారు. ఈ మేళాల ద్వారా ఉద్యోగాలు పొందుతున్న నిరుద్యోగులకు తొలుత కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా, మనోధైర్యంతో ముందుకుసాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఇకపై గ్రేటర్ బల్దియా ఆధ్వర్యంలో ఇలాంటి జాబ్‌మేళాలను నిరంతరం నిర్వహించి, వివిధ కంపెనీలకు కావల్సిన ఉద్యోగులను నగరంలోని నిరుద్యోగ యువతీయువకుల నుంచే భర్తీ చేయనున్నట్లు వివరించారు. గ్రేటర్‌లోని జోన్ల వారీగా ప్రతి రెండు నెలలకోసారి మేళాలను నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ విషయంలో ఇప్పటికే దాదాపు 35 కార్పొరేట్ సంస్థలు కూడా సిద్దంగా ఉన్నట్లు మేయర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గ్రేటర్ కమిషనర్ ఎం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ నగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్య ఈ మేళాల ద్వారా కొంతమైరకైనా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత అర్హతలను బట్టి, వివిధ కార్పొరేట్ సంస్థల అవసరాలను ఒక వేదికపైకి తీసుకువచ్చి, నిరుద్యోగులకు ఆసక్తి ఉన్న రంగాల్లో ఉద్యోగం కల్పించటమే ఈ జాబ్‌మేళాల ముఖ్య ఉద్ధేశ్యమని ఆయన వివరించారు. మూడువేల పోస్టుల భర్తీని లక్ష్యంగా పెట్టుకుని నిర్వహించిన ఈ జాబ్‌మేళాకు సుమారు ఆరు నుంచి ఆరున్నర వేల మంది నిరుద్యోగులు హజరుకాగా, 6200 మంది నిరుద్యోగులు తమ అర్హతలను బట్టి మేళాలో వివరాల్ని నమోదు చేసుకున్నారు. వీరిలో 1200 మందికి వారి అర్హతలు, నైపుణ్యతను బట్టి అక్కడికక్కడే ఉద్యోగాలు కూడా ఖరారైనట్లు గ్రేటర్ అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మజ్లిస్ ఎమ్మెల్యేలు ముంతాజ్‌ఖాన్, కార్పొరేటర్లు సలీంబేగ్, సమద్ అహ్మద్ ఆబ్‌దాద్, కో ఆప్షన్ సభ్యురాలు అయేషా రుబీనా, అదనపు కమిషనర్లు ఎల్. వందన్‌కుమార్, రఘు, జోనల్ కమిషనర్ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
బత్తిన సోదరులకు షాక్
హైదరాబాద్, జూన్ 5: పాపం ఈ ఏడాది చేప మందు పంపిణీ చేసే బత్తిన సోదరులకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. కాటేదాన్‌లోనూ పంపిణీకి అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేశారు. ఏటా వీరు నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఉబ్బస వ్యాధిగ్రస్థులకు చేపమందు పంపిణీ చేస్తుండగా ఈ ఏడాది ప్రభుత్వం నిరాకరించింది. దీంతో రాజేంద్రనగర్ మండలం కాటేదాన్ స్టేడియంలో మందు పంపిణీకి బత్తిన సోదరులు సంకల్పించారు. అయితే, మంగళవారం స్ఫూర్తి భవన్‌లో సమావేశం నిర్వహించిన ఇన్‌చార్జి కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి భద్రతా కారణాల దృష్ట్యా కాటేదాన్‌లో మందు పంపిణీకి అనుమతి ఇవ్వలేమన్నారు. ఈ ఏడాది కూడా చేపమందు పంపిణీని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోనే కొనసాగించాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖకు లేఖ రాస్తామని తెలిపారు. సైబరాబాద్ డిసిపి సుధీర్‌బాబు మాట్లాడుతూ తాము మందు పంపిణీకి వ్యతిరేకం కాదని కేవలం భద్రతా కారణాల వల్లే ఇక్కడ సాధ్యం కాదని చెబుతున్నామన్నారు. ఈ సమావేశంలో డిఆర్‌ఓ మాణిక్యాలరావు, చేవెళ్ళ ఆర్‌డిఓ రవీందర్‌రెడ్డి, రాజేంద్రనగర్ డిప్యూటీ కలెక్టర్ ముకుంద్‌రెడ్డితో పాటు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.