వికారాబాద్, జూన్ 5: ఆరోవిడతలో జిల్లాలో 1855 ఎకరాల అసైన్డ్భూమిని పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం స్థానిక అర్‌అండ్‌బి అతిథి గృహంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వికారాబాద్ డివిజన్‌లోనే అత్యధికంగా 1500 ఎకరాల భూమిని పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. జిల్లాలో 75 ఆధార్ కార్డుల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు.
ఆధార్ కార్డుల ఇచ్చేందుకు జూన్ 15 లేక జూలై మొదటి వారంలో కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో కేంద్రం ప్రభుత్వం కిరోసిన్ తదితర వాటికి బదులు నగదు బదిలీ పథకం, ఇతర పథకాల కోసం బ్యాంకు ఖాతా నెంబర్లు, సెల్‌ఫోన్ నెంబర్లు సేకరిస్తున్నట్టు తెలిపారు. ఖాతాలు లేని వారు తెరచి నెంబర్లు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఆధార్ కార్డులలో బ్యాంకు అకౌంట్ నెంబర్లు నమోదు చేసేందుకు అవి ఉపయోగపడతాని తెలిపారు.
ఎరువులు, విత్తనాలు బ్లాక్‌లో అమ్మకుండా పక్కదారి పట్టకుండా తహశీల్దార్, వ్యవసాయాధికారి, స్వయం సహాయక సంఘాలు, ఆదర్శరైతులు సభ్యులుగా ఉండే బృందం నిఘా ఉంచుతుందని ఎప్పటికపుడు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తుందన్నారు. ఎరువులు, విత్తనాలను రైతులుకు ఎంఆర్‌పి ధరలకు ఇవ్వకుంటే చర్యలు తప్పకుండా ఉంటాయని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 95 మీసేవ కేంద్రాలను ప్రారంభించామని, ఈనెల 15వ తేదీలోపు మరో 50 కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. మీసేవ కేంద్రాలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేలా దృష్టిపెట్టామన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ జాబితాలో రుణ అర్హత కార్డులు పొందిన కౌలు రైతుల పేర్లు లేకుండా భూయజమానుల పేర్లు ఉన్నందునే పంట నష్టపరిహారం పంపిణీ ఆలస్యమవుతోందని, త్వరలో కౌలు రైతుల పేర్లను చేర్చి నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుందని, ఈ మేరకు అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. బంటారం మండలంలో వాటర్‌షెడ్‌కు సంబంధించిన నిధుల దుర్వినియోగం విషయంలో విచారణకు డ్వామా పిడిని ఆదేశించనున్నట్లు తెలిపారు. మీసేవ కేంద్రాలలో చిన్న చిన్న సమస్యలు పరిష్కరించబడుతున్నాయని, ఇప్పటి వరకు 13 వేల వరకు లావాదేవీలు జరిగాయన్నారు.
పర్యావరణ పరిరక్షణకు కంకణబద్ధులు కావాలి
ఘట్‌కేసర్, జూన్ 5: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రతిఒక్కరూ నిరంతరం కృషి చేయాలని తెలంగాణ పర్యావరణ పరిరక్షణ సమితి మండల అధ్యక్షుడు బూడిద కృష్ణమూర్తి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఘట్‌కేసర్‌లోని జాతీయ రహదారిపై మంగళవారం భారీ ర్యాలీ జరిపారు. ప్లాస్టిక్‌ను నిషేధిద్దాం-పర్యావరణాన్ని కాపాడుకుందాం అంటూ నినాదాలు చేశారు. మండల కేంద్రంలోని ఆర్టీసి బస్టాండ్ నుండి పెట్రోల్ బంక్ వరకు ర్యాలీ జరిపి రోడ్డుపై పడవేసిన ప్లాస్టిక్ సంచులు, పర్యావరణానికి హాని కలిగించే ఇతర వస్తువులను సంచులలో సేకరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా క్యాంపుకార్యాలయాలకే పరిమితం అయిందని, ప్రజలలోచైతన్యం తీసుకువచ్చి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటునందించాలని కోరారు. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణకు తమ సంస్థ విశేష కృషి చేస్తోందని ఆయన తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ఏ ఒక్కరితో జరగదని ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ప్రజలను చైతన్యపరుస్తూ భావితరాలకు మంచి భవిష్యత్తు అందించాలని ఆయన కోరారు. ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించటంతో పాటు, చెరువులు, కుంటల పరిరక్షణకు పాటు పడాలన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధానకార్యదర్శి గుర్రం రమేశ్, సభ్యులు గౌలికార్ సునీల్ లాల్, ఉపేందర్, లతీఫ్, సోను, కుమార్, నవీన్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.
8న ఆస్తమా రోగులకు ఆయుర్వేద మందు
జీడిమెట్ల, జూన్ 5: ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ఈనెల 8వ తేదీన ఉచితంగా ఆయుర్వేద మందును పంపిణీ చేస్తున్నామని ఆదిజాంబవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గజ్జెల రాజయ్య తెలిపారు. మంగళవారం కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని జగద్గిరిగుట్టలో ఆయన విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యంలో భాగంగా ప్రకృతిలో లభించే వివిద వన మూలికలపై పరిశోధన చేసి తద్వారా దీర్ఘకాలిక రోగాలకు ఆయుర్వేద మందులను తయారు చేస్తున్నామన్నారు. శ్రీ శక్తి సాయి ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో పచ్చకామెర్లు, ఆర్షమొలలు, కుష్ఠువ్యాధి వంటి రోగాలను ఆయుర్వేద మందులతో తగ్గించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఆస్తమా వ్యాధి బారి నుండి శాశ్వతంగా విముక్తి చేసేందుకు నూతన మందును కనుగొన్నామన్నారు.
ఈ నెల 8వ తేదీన నిజాంపేట్ రాజీవ్ గృహకల్ప ప్రక్కనే గల ఆదిజాంబవుని ఆలయం వద్ద ఉదయం 8 గంటల నుండి ఉచితంగా ఆస్తమా వ్యాధి నియంత్రణ మందును అందజేస్తున్నామన్నారు. రాజధాని పాఠశాల యాజమాన్యం, జైభీమ్ యూత్ అసోసియేషన్ వారి సౌజన్యంతో ఈ మందు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
రికార్డుల కంప్యూటరీకరణపై సమీక్ష
వికారాబాద్, జూన్ 5: రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి మంగళవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో అసైన్‌మెంట్ భూములు, భూ రికార్డుల కంప్యూటరీకరణపై డివిజన్‌లోని తహశీల్దార్‌లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు ఆదేశాలు చేసి, సూచనలు, సలహాలు ఇచ్చారు.
సమావేశంలో వికారాబాద్ ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఆన్‌లైన్ లాగిన్ తీసుకుని కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా కంప్యూటరీకరణ చేయించాలని, లేనిఎడల రికార్డులను ఆర్డీవో కార్యాలయానికి పంపాలని తహశీల్దార్‌లకు సూచించారు. ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి సంబంధించిన ఫైలును పంపాలని సూచించారు. ఆపరేటర్లకు ఇచ్చిన లక్ష్యాలను పూర్తిచేయాలన్నారు. ఆరో విడత అసైన్‌మెంట్ భూమి మహిళల పేర్ల మీద పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వికారాబాద్ డిఎవో కిషన్‌రావు, వికారాబాద్ డిప్యూటి తహశీల్దార్ బాల్‌రెడ్డి పాల్గొన్నారు.
శిక్షణలోని అంశాలను పాఠశాలల్లో బోధించాలి
జీడిమెట్ల, జూన్ 5: శిక్షణా తరగతుల్లో ఉపాధ్యాయులు నేర్చుకుంటున్న అంశాలను పాఠశాలల్లో బోధించాలని కుత్బుల్లాపూర్ మండల విధ్యాధికారి, కోర్సు డైరెక్టర్ చంద్రప్ప సూచించారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని గాంధీనగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనిరంతర సమగ్ర మూల్యాంకనంపై రాజీవ్ విద్యామిషన్ ద్వారా 7 రోజుల శిక్షణా తరగతులు కొనసాగుతున్నాయి. మంగళవారం రెండో రోజు తరగతులు జరిగాయి. ఈ తరగతులకు శిక్షణ డైరెక్టర్, ఎంఇఓ చంద్రప్ప మాట్లాడుతూ జిల్లాలో శిక్షణ పొందిన 12 మంది రిసోర్స్ పర్సన్‌లతో ఈ తరగతులు జరుగుతున్నాయని తెలిపారు. తెలుగు, గణితం, ఆంగం భాషలపై ఈ తరగతులు జరుగుతున్నాయని, సబ్జెక్టుకి ముగ్గురు రిసోర్స్‌పర్సన్‌ల ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణను ఇస్తున్నామన్నారు. నిరంతరంగా ఈ శిక్షణా తరగతుల్లో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో బోధించాలన్నారు. ఈ తరగతులు మండల ప్రైమరీ పాఠశాలల ఉపాధ్యాయులకు జరుగుతున్నాయని, మొదటి రోజు 165 మంది ఉపాధ్యాయులు హాజరు కాగా రెండవ రోజు 180 మందికి పైగా ఉపాధ్యాయులు హాజరైనట్లు చంద్రప్ప తెలిపారు. ఈ శిక్షణా తరగతుల్లో ఉపాధ్యాయులు, ఎంఎల్‌ఓ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల్లో గొఢవలకు మద్యం అమ్మేవారే కారకులు: డిఎస్పీ
వికారాబాద్, జూన్ 5: ఏ గ్రామంలో గొడవ జరిగినా ఆ గ్రామంలో మద్యం అమ్మేవారే గొడవకు కారకులుగా గుర్తించాల్సి వస్తుందని, మద్యం అమ్మడం మానుకోవాలని వికారాబాద్ డిఎస్పీ కందుల చౌడేశ్వరి హెచ్చరించారు. మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మద్గుల్‌చిట్టంపల్లి, బుర్గుపల్లి, గుడుపల్లి, పుల్సుమామిడి, గొట్టిముక్ల తదితర గ్రామాల్లో మద్యం అమ్ముతున్న వారిని పిలిపించి హెచ్చరికలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో మద్యం అమ్మటం మూలాన సంసారాలు పాడవుతున్నాయని మహిళలు ధర్నాలు చేస్తున్నారని, రోజుకు వచ్చే కూలీ వంద రూపాయలు తాగుడుకు ఖర్చవుతున్నాయని ఆందోళనలు చేస్తున్నారన్నారు. జూలై నుండి కొత్త ఎక్సైజ్ పాలసీ ఉన్నందున మద్యం అమ్మేందుకు ప్రయత్నించరాదన్నారు. మద్యం అమ్మినట్లు తెలిసినా, పేకాట లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగినా తమ నెంబర్లు తీసుకుని ఫోన్ చేయాలని సూచించారు. అలా సహకారమందిస్తే సమాచారమందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని, బహుమతి, ప్రశంసా పత్రాన్ని ఇస్తామని తెలిపారు. దానికి స్పందించిన వారు మాట్లాడుతూ తాము మద్యం అమ్మడం మానేసామని సమీప తండాలలో సారా విపరీతంగా అమ్ముతున్నా పట్టించుకునే వారే లేరని తెలిపారు. సారా తాగి చాలామంది ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నారని తెలిపారు. సమావేశంలో వికారాబాద్ ఎస్‌ఐ నాగరాజు పాల్గొన్నారు.
తాగునీరు అందించేందుకు ప్రయత్నించాలి
గచ్చిబౌలి, జూన్ 5: భూగర్భ జలాలు అడుగంటి పోయాయి.. మంజీరా నీరు సరఫరా అంతంత మాత్రంగానే వస్తోంది.. వేసిన బోర్లు ఎండిపోతున్నాయి.. ప్రజలకు తాగునీరు అందించడానికి అధికారులు ప్రయత్నించాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ సూచించారు. నియోజకవర్గంలోని మున్సిపల్ వాటర్ వర్క్స్ అధికారులతో ఎమ్మెల్యే మంచినీటి సమస్యపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాభావ ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటి పోయాయని, దీంతో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని అన్ని కాలనీలకు తాగునీరు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. గత వారం సింగూరులోని పంప్‌హౌస్‌లో సాంకేతిక లోపం కారణంగా రెండురోజులు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని, రెండు మూడు రోజుల్లో సమస్య కొలిక్కి వస్తుందని వాటర్ వార్క్స్ జిఎం సురేష్ బాబు వివరించారు. వేసవి ఎద్దడిలో భాగంగా వెస్ట్‌జోన్ పరిధిలో 146 నూతన బోర్లు వేయగా 106 బోర్లలో నీరు పడగా 40 బోర్లలో నీరు పడలేదని జోనల్ కమిషనర్ అలీం బాషా చెప్పారు. తారానగర్‌లోని శివాజీనగర్, వీకర్‌సెక్షన్ కాలనీలలో ఉన్న రెండు బోర్లు ఎండిపోయాయని దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చందానగర్ వార్డు మెంబర్ రామస్వామి అధికారులకు సూచించగా సర్కిల్ 12 కమిషనర్ మనోహర్ కలగజేసుకొని కాలనీలను సందర్శించి తగిన పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. గచ్చిబౌలిలోని న్యూపిజెఆర్ నగర్‌లో మూడు వారాల క్రితం బోర్లు వేశారని ఇప్పటి వరకూ పైపులైన్ ఏర్పాటు చేయలేదని వార్డు సభ్యుడు మల్లేష్ చెప్పగా అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్విన్‌కాలనీ, జగద్గీరిగుట్ట, శివమ్మ పాపిరెడ్డి నగర్, దత్తత్రేయ కాలనీలో మంజీర నీటి పైపులైన్లకు మోటార్లు పెట్టడం వలన చాలా కాలనీలకు నీటి సరఫరా జరగడం లేదని చెప్పడంతో విజిలెన్స్ అధికారులతో దాడులు చేయించి మోటార్లు సీజ్ చేస్తామని జిఎం హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఉప కమిషనర్లు కృష్ణయ్య, సురేష్‌కుమార్, మనోహర్ పాల్గొన్నారు.