న్యూఢిల్లీ, జూన్ 11: భారతీయులు విదేశాల్లో దాచుకున్న నల్లధనంపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించేందుకు ఆదాయ పన్ను శాఖ విదేశీ యూనిట్లను (ఐటిఒయు) ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నల్లధనాన్ని ఎదుర్కొనేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యవస్థను సమీక్షించిన అనంతరం మరి కొన్ని ఐటిఒయులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు. ఆదాయ పన్ను శాఖ సీనియర్ అధికారుల వార్షిక సమావేశంలో సోమవారం ఈ విషయాన్ని తెలిపారు. విదేశాల్లో జరిగే లావాదేవీలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకునేందుకు గాను సైప్రస్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, యుఎఇ, బ్రిటన్, అమెరికా, జపాన్ దేశాల్లో మరో ఎనిమిది ఐటిఒయులను ప్రభుత్వం నెలకొల్పిందని ఆయన వెల్లడించారు. విదేశాలతో కుదుర్చుకున్న ద్వంద్వ పన్నుల ఎగవేతను నిరోధించే ఒప్పందం (డిటిఎఎ), పన్ను సమాచారం పంచుకునే ఒప్పందం (టిఐఇఎ) సహాయంతో భవిష్యత్తులో విలువైన సమాచారాన్ని పొందగలమని ఆయన తెలిపారు. పైన పేర్కొన్న దేశాల్లో వ్యక్తులు గానీ, సంస్థలు గానీ చేసే పెట్టుబడుల సమాచారాన్ని ఐటిఒయులు సేకరిస్తాయని చెప్పారు. ఆ దేశాలకు ఏ మార్గంలో డబ్బును చేరవేశారో తెలుసుకుంటాయని, అలాగే మనదేశంలోకి వచ్చే పెట్టుబడులకు సంబంధించిన సమాచారాన్ని కూడా పరిశీలిస్తాయని ప్రణబ్ పేర్కొన్నారు. నల్లధనంపై శే్వతపత్రాన్ని ఇప్పటికే విడుదల చేశామని, ఈ సమస్యను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన పాలసీను రూపొందించామని తెలిపారు. నల్లధనం, పన్నుల ఎగవేతను నిరోధించిందేకు ఆదాయ పన్ను శాఖ తీవ్ర కృషి సలుపుతోందని ప్రణబ్ కితాబిచ్చారు. మన దేశంలో, విదేశాల్లో ఉన్న లెక్కల్లోకి రాని సంపదపై అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని నియమించినట్లు తెలిపారు. ఈ అధ్యయనం వచ్చే సెప్టెంబరులో పూర్తవుతుందని చెప్పారు. నల్లధనాన్ని నిరోధించేందుకు చట్టంలో చేయాల్సిన మార్పులను సూచించడానికి ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను సమర్పించిందనీ, ఆ నివేదిక ప్రభుత్వ పరిశీలనలో ఉందనీ ఆయన పేర్కొన్నారు. చట్టంలో ఉన్న లోపాలను గుర్తించడంతో పాటు నల్లధనాన్ని రూపుమాపేందుకు సమర్థవంతమైన విధానాన్ని రూపొందించడంలో ఈ రెండు అధ్యయనాలు తోడ్పడతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అంతేగాకుండా ‘బినామీ లావాదేవీల నిరోధక బిల్లు-2011’ను లోక్‌సభలో ప్రవేశపెట్టామని చెప్పారు. ఈ బిల్లు ప్రస్తుతం అర్థిక వ్యవహారాలపై ఏర్పాటు చేసిన స్థారుూ సంఘం పరిశీలనలో ఉందని ప్రణబ్ తెలిపారు. నల్లధనాన్ని నిరోధించేందుకు అవసరమైన విస్తృత ఏర్పాట్లు ఈ బిల్లులో ఉన్నాయని ఆయన చెప్పారు. (చిత్రం) ఢిల్లీలో ఆదాయ పన్ను శాఖ చీఫ్ కమిషనర్లు, డైరెక్టర్ జనరళ్ల సమావేశంలో సోమవారం ఒక పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ
విదేశాల్లో ఐటి విభాగాలు *ఆర్థిక మంత్రి ప్రణబ్ వెల్లడి
english title:
pranab mukherjee
Date:
Tuesday, June 12, 2012