న్యూఢిల్లీ, జూన్ 11: రాష్టప్రతి పదవికి యుపిఏ తరపున పోటీ చేసే అభ్యర్థి ఎంపిక వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనీష్ తివారీ సోమవారం విలేఖరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీశాయి. రాష్టప్రతి పదవికి యుపిఎ తరపున ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ పోటీ చేయనున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యంలో మనీష్ తివారీ ఈరోజు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. యుపిఎ మిత్రపక్షాలు దాదాపుగా అన్ని కూడా ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వానికి ఓటు వేయటం తెలిసిందే. డిఎంకె, ఎన్‌సిపి, ఆర్‌ఎల్‌డితో పాటు ఇతర చిన్నా చితక మిత్ర పక్షాలన్నీ ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వాన్ని సమర్థించటం తెలిసిందే. యుపిఎకు చెందిన మెజారిటీ మిత్రపక్షాలు ప్రణబ్ ముఖర్జీని రాష్టప్రతి భవన్‌కు పంపించాలని స్పష్టం చేయటంతో తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వాన్ని లోపాయికారిగానైనా సమర్థించక తప్పటం లేదు. ఈ పరిస్థితుల్లో యుపిఎ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు, సోనియా గాంధీ ఈ అంశంపై మిత్ర పక్షాలతో ఇంకా చర్చలు జరుపుతున్నారని మనీష్ తివారీ చెప్పటం పలువురిని ఆశ్చర్యపరిచింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో గత శుక్రవారం జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో రాష్టప్రతి పదవికి యుపిఎ అభ్యర్థి ఎంపికపై లోతుగా చర్చించి ఒక అవగాహనకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. సమావేశానంతరం సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ నార్త్ బ్లాక్‌లోని ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వెళ్లి ప్రణబ్ ముఖర్జీతో కొద్ది సేపు చర్చలు జరిపారు. అహ్మద్ పటేల్ ఆ తరువాత అక్కడి నుంచి సోనియా గాంధీ నివాసానికి వెళ్లి ప్రణబ్ ముఖర్జీతో జరిపిన చర్చల గురించి వివరించారు. రాష్టప్రతి పదవి చేపట్టటం గురించే ప్రణబ్ ముఖర్జీతో అహ్మద్ పటేల్ చర్చించారని వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల దృష్ట్యా రాష్టప్రతి పదవికి యుపిఎ తరపున ప్రణబ్ ముఖర్జీ దాదాపుగా ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రణబ్ ముఖర్జీని రంగంలోకి దించటం గురించి ఏమీ చెప్పలేమని మనీష్ తివారీ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
మనీష్ తివారీ వ్యాఖ్యానంపై సర్వత్రా చర్చ
english title:
manish tiwari
Date:
Tuesday, June 12, 2012