బెంగళూరు, జూన్ 11: వివాదాస్పద స్వామీజీ నిత్యానందను రెండు రోజుల్లో అరెస్టు చేయనున్నట్టు కర్నాటక ముఖ్యమంత్రి డి.వి.సదానంద గౌడ వెల్లడించారు. రామనగర జిల్లా బిదాడీలోని ఆశ్రమం నుంచి పరారైనట్టు చెప్పబడుతున్న నిత్యానందను అరెస్టు చేసేందుకు కర్నాటక పోలీసులు సోమవారం సెర్చ్ వారెంట్‌ను జారీచేశారు. ఈ ఆశ్రమం వద్ద గత వారం నిత్యానంద అనుచరులకు, మీడియా సిబ్బందికి మధ్య చోటుచేసుకున్న ఘర్షణ గురించి సదానంద గౌడ ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించారు. డిజిపి లాల్‌రోకుమా పచావు సహా పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం సదానంద గౌడ విలేఖర్లతో మాట్లాడుతూ, నిత్యానందను రెండు రోజుల్లో అరెస్టు చేయనున్నట్టు తెలిపారు. నిత్యానంద ఆశ్రమం వద్ద చోటుచేసుకున్న ఘర్షణపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సిందిగా రీజినల్ కమిషనర్ శంభు దయాళ్ మీనాను ఆదేశించినట్టు ఆయన చెప్పారు. అలాగే ధ్యానపీఠం ప్రాంగణాన్ని అదుపులోకి తీసుకుని సాక్ష్యాధారాలను సేకరించాలని, అక్కడ జరుగుతున్న కార్యకలాపాలపై ఆరాతీసి ఆశ్రమానికి సీలు వేయాలని జిల్లా కలెక్టర్‌ను, ఎస్పీని కోరినట్టు సదానంద గౌడ వివరించారు.
అత్యాచారం, బెదిరింపులకు సంబంధించిన కేసులో నిత్యానందకు కర్నాటక హైకోర్టు మంజూరు చేసిన బెయిలును రద్దు చేయించేందుకు న్యాయ విభాగంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపనుంది. నిత్యానంద అత్యాచారానికి, బెదిరింపులకు పాల్పడినట్టు కొందరు మాజీ భక్తులు ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇంతకుముందు ఒకసారి అరెస్టయిన నిత్యానంద ఆ తర్వాత బెయిలుపై విడుదలయ్యాడు. ఇటీవల నిత్యానంద ఆశ్రమంలో జరిగిన విలేఖర్ల సమావేశం సందర్భంగా ఆయన అనుచరులు ఒక విలేఖరిపై దాడికి పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో నిత్యానందపైన, ఆయన అనుచరులపైన పోలీసులు ఈ నెల 8వ తేదీన క్రిమినల్ కేసులు దాఖలు చేశారు. ఆ ముందు రోజు రాత్రి ఆశ్రమం వద్ద జరిగిన ఘర్షణకు సంబంధించి ఒక టెలివిజన్ చానల్ విలేఖరి, నవనిర్మాణ్ సేన కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో ఈ ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయి. అలాగే ఇదే సంఘటనకు సంబంధించి నిత్యానంద అనుచరులు కూడా కౌంటర్ ఫిర్యాదు దాఖలు చేయడంతో సదరు విలేఖరిపైన, నవనిర్మాణ్ సేన కార్యకర్తలపైన పోలీసులు పోలీసులు మరో రెండు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేశారు.
కర్నాటక ముఖ్యమంత్రి సదానంద గౌడ వెల్లడి
english title:
nityananda
Date:
Tuesday, June 12, 2012