బళ్ళారి, జూన్ 11: కర్నాటకలోని బళ్ళారి లోక్‌సభ సభ్యురాలు బోయ శాంత సభ్యత్వాన్ని రద్దుచేస్తూ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు ప్రకటించింది. అదే విధంగా అక్కడ నాలుగు వారాల్లో రీకౌంటింగ్ జరపాలని ఆదేశించింది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో శాంత బళ్ళారి ఎన్నికల్లో సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఎన్‌వై.హనుమంతప్పపై 2,243 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆమె విజయాన్ని సవాలుచేస్తూ హనుమంతప్ప హైకోర్టును ఆశ్రయించారు. దాదాపు మూడు సంవత్సరాల తరువాత కర్నాటక హైకోర్టు సింగిల్ బెంచి జడ్జి శైలేంద్రకుమార్ శాంతపై అనర్హత వేటు వేస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. బళ్ళారి ఎంపి శాంతపై అనర్హత వేటు పడడం చర్చనీయంగా మారింది. భారతీయ జనతా పార్టీ టికెట్‌పై పోటీచేసిన శాంత బిఎస్‌ఆర్ పార్టీ అధ్యక్షుడు, బళ్ళారి గ్రామీణ శానససభ్యుడు శ్రీరాములు సోదరి (చిన్నమ్మ కూతురు). శాంత అనంతపురం జిల్లా గుంతకల్లులో చదువుకున్నారు. అక్కడే పెళ్లి చేసుకున్నారు. గత ఎన్నికల్లో బిజెపి తరఫున బళ్ళారి ఎంపిగా పోటీచేసి గెలిచారు. తదనంతర పరిణామాలతో పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం బిఎస్‌ఆర్ పార్టీలో కొనసాగుతున్నారు. బోయ కులానికి చెందిన శాంత తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించి ఎన్నికల్లో పోటీచేశారని కాంగ్రెస్ అభ్యర్థి కోర్టును ఆశ్రయించారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో బోయ కులస్థులు బిసిలు, అదే కర్నాటకలో ఎస్‌టిలు. ఆమె గత ఎన్నికల్లో ఎస్‌టి కుల ధ్రువీకరణ పత్రం సమర్పించి గెలిచారు. గత ఎన్నికల్లో బళ్ళారిలో హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో విజయం అటు శాంత, ఇటు హనుమంతప్ప మధ్య దోబూచులాడింది. చివరకు శాంత 2,243 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. శాంత గెలుపుపై అనుమానాలున్నాయని, ఆమె తప్పుడు కులధ్రువీకరణపత్రం సమర్పించారని, అదే విధంగా ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ హనుమంతప్ప, బళ్ళారి చంగ్రెగౌడ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి శాంతను అనర్హురాలిగా ప్రకటించారు. అదే విధంగా నాలుగు వారాల్లోగా బళ్ళారిలో రీకౌంటింగ్ జరపాలని ఆదేశించారు. శాంతపై వేటు పడడంతో గాలి వర్గానికి మరో షాక్ తగిలినట్టయింది. కాగా సింగిల్ బెంచి జడ్జి తీర్పుపై ఫుల్‌బెంచ్‌ను ఆశ్రయించాలని శాంత నిర్ణయించుకున్నట్లు సమాచారం.
కర్నాటక హైకోర్టు సంచలన తీర్పు
english title:
judgement
Date:
Tuesday, June 12, 2012