న్యూఢిల్లీ, జూన్ 11: పద్దెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు, నెల్లూరు లోకసభ నియోజకవర్గానికి మంగళవారం జరగనున్న ఉపఎన్నికల్లో ప్రజలు తమకు మద్దతు ఇస్తారనే పూర్తి విశ్వాసం తమకున్నదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనీష్ తివారి అన్నారు. సోమవారం ఇక్కడ జరిగిన ఏఐసిసి విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఒక ప్రశ్నకు బదులిస్తూ మంగళవారం పోలింగ్ జరగనున్న తరుణంలో ఎన్ని సీట్లు గెలుస్తామనేది చెప్పటం భావ్యం కాదన్నారు. అయితే ఉపఎన్నికలు జరగనున్న నియోజకవర్గాల ప్రజలు కాంగ్రెస్ను విశ్వసిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇదిలాఉంటే ఉపఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. నర్సాపూర్, రామచంద్రాపురం, తిరుపతి అసెంబ్లీ నియోకవర్గాల్లో తమ గెలుపు ఖాయమని కాంగ్రెస్ నాయకులు అనధికారికంగా చెబుతున్నారు.
పద్దెనిమిదిలో ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ గెలుచుకోదంటూ వస్తున్న వార్తలను వారు కొట్టివేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పత్తిపాడు, పాయకరావుపేట, పోలవరం, ఎమ్మిగనూరు నియోజకవర్గాలపై ఆశ పెట్టుకున్నప్పుడు తాము మూడు నియోజకవర్గాలను గెలుచుకోలేమా? అని ఏఐసిసి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. కనీసం ఓకటో,రెండో సీట్లు తప్పకుండా గెలుచుకుంటామని వారు అంటుండటం గమనార్హం.
-కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారి
english title:
manish tiwari
Date:
Tuesday, June 12, 2012