న్యూఢిల్లీ, జూన్ 11: భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బిఇఎమ్‌ఎల్) చీఫ్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ నటరాజన్‌ను రక్షణ మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. టట్రా ట్రక్కుల వ్యవహారంలో నటరాజన్‌పై వచ్చిన ఆరోపణలపై సిబిఐ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. నిష్పాక్షిక విచారణ జరిగేందుకు వీలుగా నటరాజన్‌ను విధుల నుంచి తప్పించాలని సిబిఐ చేసిన విజ్ఞప్తి మేరకు రక్షణ శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. టట్రా ట్రక్కుల కొనుగోలు ఒప్పందాన్ని ఆమోదించినట్లయితే తనకు 14 కోట్ల రూపాయల లంచమివ్వజూపారని భారత సైన్య మాజీ ప్రధానాధికారి వికె సింగ్ చేసిన ఆరోపణలపై సిబిఐ విచారణ జరుపుతున్న విషయం కూడా విదితమే. అయితే, తనపై నిరాధార ఆరోపణలు చేసి పరువుకు భంగం కలిగించారంటూ వికె సింగ్‌పై కోర్టులో నటరాజన్ దావా వేశారు. కాగా, అనుమతి తీసుకోకుండా ఆర్మీ చీఫ్‌పై పరువునష్టం దావా వేసినందుకు ఆయనకు రక్షణ శాఖ కొద్ది రోజుల క్రితమే షోకాజు నోటీసులు జారీ చేసింది. నటరాజన్‌పై సిబిఐ జరుపుతున్న విచారణను ప్రభావితం చేయకుండా ఉండేందుకు ఆయనను విధుల నుంచి తప్పిస్తున్నామని రక్షణ శాఖ కార్యదర్శి శంతను కుమార్ వెల్లడించారు. ఆయనపై వచ్చిన వివిధ ఆరోపణలపై సిబిఐ ప్రస్తుతం విచారణ జరుపుతోందని తెలిపారు. ఆయన స్థానంలో బిఇఎమ్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆ సంస్థలో సీనియర్ డైరెక్టర్ అయిన ద్వారకానాథ్‌ని నియమిస్తున్నట్లు శంతను కుమార్ తెలిపారు.
- టట్రా ట్రక్కుల వ్యవహారం -
english title:
beml chief sacked
Date:
Tuesday, June 12, 2012