పాట్నా, జూన్ 11: బిజెపి, బీహార్ సిఎం నితీష్ కుమార్ మధ్య విభేదానికి గుజరాత్ సిఎం నరేంద్ర మోడీ మరోసారి కారణమయ్యారు. కుల రాజకీయాల వల్ల బీహార్ అభివృద్ధిలో అట్టడుగున నిలిచిందని మోడీ గత వారం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే, మోడీ వ్యాఖ్యలపై నితీష్ ఘాటుగా ప్రతిస్పందించారు. తమకు మోడీ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని నితీష్ ద్వజమెత్తారు. ఆయన గుజరాత్‌లో ఏమి చేశారో ఒక సారి జ్ఞప్తికి తెచ్చుకోవాలని 2002లో జరగిన మతకలహాలను ఉద్దేశించి పరోక్షంగా అన్నారు. కాగా, గతంలో బీహార్ రాజకీయంగా, ఆధ్యాత్మికంగా దేశానికి మార్గనిర్దేశకత్వం చేసిందనీ, కుల రాజకీయాలు మొదలైనప్పటి నుంచి సామాజికంగా, ఆర్థికంగా ఆ రాష్ట్రం వెనకబడాల్సి వచ్చిందనీ మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే, అవకాశం వచ్చిన ప్రతీసారి నరేంద్ర మోడీపై నితీష్ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. బీహార్‌లో జెడి (యు), బిజెపి సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ 2010లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రచారానికి రాకుండా అడ్డుకున్నారు. ఆయన ప్రచారానికి వస్తే బిజెపితో తెగతెంపులు చేసుకుంటామని బెదిరించారు. కాగా, బిజెపి నుంచి సంజయ్ జోషీ తొలగింపు వ్యవహారంలో బీహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ కూడా నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
మోడీపై నితీష్ విసుర్లు
english title:
dont teach lessons
Date:
Tuesday, June 12, 2012