అనకాపల్లి, జూన్ 19: ఉప ఎన్నికల్లో పాయకరావుపేట ఫలితం తనకు తీవ్ర నిరాశను కలిగించిందని జిల్లామంత్రి గంటా శ్రీనివాసరావు వాపోయారు. తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ ఉపఎన్నికల ఫలితాలపై పైవిధంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి లక్షకు పైగా ఓట్లు రావాల్సిఉండగా 35 వేలకు ఆ సంఖ్య తగ్గిపోవడం తనను నిరాశకు గురిచేసిందన్నారు. వై.ఎస్. జగన్ అరెస్టుకావడం, ఆయన తల్లి, సోదరి ప్రజల్లో బాధను వ్యక్తం చేస్తూ ప్రచారం చేయడంతో బాగా సానుభూతి పవనాలు వీచాయన్నారు. ఈ సానుభూతి ప్రభంజనంలో కాంగ్రెస్ అభ్యర్థులు పరాజయం చవిచూడాల్సివచ్చింది. పాయకరాపేటలో ఓటమికి గల కారణాలపై త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి సమీక్ష జరుపుతామన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీతోపాటు ప్రభుత్వ పథకాలను వేగవంతం చేయడం, కోట్లాది రూపాయల నిధులతో వివిధ అభివృద్ధి పనులు చే పట్టడం ద్వారా స్తబ్దతగా ఉన్న పార్టీ కేడర్‌లో నూతనోత్తేజం తీసుకువచ్చేందుకు కృషిచేస్తానన్నారు. ప్రైవేటు బస్సుల్లో కండిషన్ లేకపోవడం, నిబంధనలు ఉల్లంఘిస్తున్న విషయంపై జిల్లాస్థాయిలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్యలు తీసుకోనున్నామన్నారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు కె.జగన్, కె.రాంజీ, మార్కెట్ కమిటీ మాజీ వైస్‌చైర్మన్ బుద్ధ సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ తాడి రామకృష్ణ, బొడ్డేడ అప్పారావు పాల్గొన్నారు.
ఉప ఎన్నికల్లో పాయకరావుపేట ఫలితం తనకు తీవ్ర నిరాశను కలిగించిందని
english title:
disappointment
Date:
Wednesday, June 20, 2012