విశాఖపట్నం, జూన్ 19: 2012-13 మద్యం అమ్మకాలు, దుకాణాల కేటాయింపునకు సంబంధించి జిల్లా గజిట్ నోటిఫికేషన్ మంగళవారం జారీ అయింది. జిల్లా కలెక్టర్ లవ్ అగర్వాల్ నోటిఫికేషన్ నెం.47ను జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 406 మద్యం దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు. 32.50 లక్షల రూపాయల విలువగ దుకాణాలు జిల్లాలో 179 రానున్నాయి. 34 లక్షల రూపాయల విలువ కలిగిన దుకాణాలు 32, 42 లక్షల రూపాయల విలువ కలిగిన దుకాణాలు 53, 64 లక్షల రూపాయలు విలువ కలిగిన దుకాణాలు 142 రానున్నాయి. మొత్తం ఈ దుకాణాలన్నింటిపైనా లైసెన్స్ ఫీజ్ కింద ఈ ఒక్క ఏడాదికి 182 కోట్ల రూపాయలు వస్తుందని అంచనా వేశారు. ఇదిలా ఉండగా దుకాణాలను లాటరీ విధానంలో కేటాయిస్తారు. దీనికి సంబంధించి దరఖాస్తులను బుధవారం నుంచి మద్దిలపాలెంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం నుంచి పొందవచ్చు. వీటిని 25వ తేదీ సాయంత్రం ఐదు గంటలో లోపు సూపరింటెండెంట్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. 26వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి స్థానిక బుల్లయ్య కళాశాల పక్కనున్న అంబేద్కర్ భవనంలో డ్రా తీయనున్నారు.
జూలై నెలాఖరుకు పిసిపిఐఆర్ మాస్టర్ ప్లాన్
* ఆగస్ట్‌లో ప్రజాభిప్రాయ సేకరణ
* వుడా విసి వెల్లడి
విశాఖపట్నం, జూన్ 19: విశాఖపట్నం-కాకినాడ పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్ ఇనె్వస్ట్‌మెంట్ రీజియన్(వికెపిసిపిఐఆర్)కు సంబంధించి మాస్టర్ ప్లాన్‌ను జూలై నెలాఖరుకు సిద్ధం చేయనున్నామని వుడా విసి కోన శశిథర్ తెలియజేశారు. ఈ మాస్టర్ ప్లాన్‌పై ఆగస్ట్‌లో ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేయనున్నామని అన్నారు. విశాఖపట్నం, కాకినాడల్లో వీటిని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. పిసిపిఐఆర్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై కెనడా, నెదర్లాండ్ దేశాలు అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేసేందుకు ఇటీవల ఒక బృందం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో విసి శశిథర్ కూడా ఉన్నారు. మంగళవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆయా దేశాలు అనుసరిస్తున్న విధానాలను, కెనడా, నెదర్లాండ్ దేశాల్లో ఇటువంటి రీజియన్‌లు ఏర్పాటు చేసేటప్పుడు భూసేకరణకు ఎటువంటి ఇబ్బంది లేనప్పటికీ, అక్కడ ఆందోళనలు జరిగాయని అన్నారు. అక్కడి ప్రజల్లో అధికారులు ఏవిధంగా అవగాహన కల్పించారన్న వివరాలు తెలుసుకున్నామని చెప్పారు. పెట్రోలియం ప్రాజెక్ట్‌లు రావడం వలన కాలుష్య సమస్య ఉత్పన్నమవుతుందని, దాన్ని ఎదుర్కొనేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నది కూడా తెలుసుకున్నామన్నారు. వీటన్నింటినీ మాస్టర్ ప్లాన్‌లో పొందుపరచనున్నామని శశిథర్ వెల్లడించారు. తమ పర్యటనలో భాగంగా నెదర్లాండ్‌లోని రోటర్ డామ్ పోర్టును సందర్శించామని, అక్కడి రోటర్ డామ్ ఇనె్వస్ట్‌మెంట్ ఏజెన్సీ, ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో సమావేశమయ్యామని అన్నారు. వోపాక్ అనే ప్రైవేటు పోర్టును, టొరంటాలోని ఒంటారియో ఇనె్వస్ట్‌మెంట్ అండ్ ట్రేడ్ సెంటర్‌ను సందర్శించి, అక్కడి అధికారులతో చర్చలు జరిపామని అన్నారు. టొరంటో వాటర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ మాస్టర్ ప్లాన్ అంశాలను పరిశీలించి, అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నామని ఆయన చెప్పారు.
వికెపిసిపిఐఆర్ వలన విశాఖ-కాకినాడ మధ్య 3,43,000 కోట్ల రూపాయల విలువైన కంపెనీలు రానున్నాయని అన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 11.90 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనున్నాయని ఆయన తెలిపారు. దీనివలన వేలాది ఎకరాల భూములు కోల్పోతామన్న భయం తీర ప్రాంత ప్రజలకు అక్కర్లేదన్నారు. ఇప్పటికే చాలా కంపెనీలు ఏర్పాటయ్యాయని, మరికొన్ని కంపెనీలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. పిసిపిఐఆర్ వెంబడి రోడ్ల నిర్మాణానికి అక్కడక్కడ భూసేకరణ జరిపే అవకాశం మాత్రమే ఉందని విసి స్పష్టం చేశారు.