విశాఖపట్నం, జూన్ 19: స్వపక్షీయులే కాంగ్రెస్ పార్టీ విజయాన్ని దెబ్బతీశారు. పాయకరావుపేట నియోజకవర్గంలో గతంలో మాదిరి మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ఘోరంగా ఓడించిన ఘనత పార్టీ నాయకులదేనట. శ్రేణులన్నీ కలిసి కాంగ్రెస్ పార్టీని మూడో స్థానంలో నిలబెట్టాయంటే, నియోజకవర్గంలో నాయకత్వం ఏవిధంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. మనోళ్ళే పార్టీని ముంచేశారంటూ మొన్నటి ఎన్నికల్లో కూడా ఓటమి పాలైన గంటెల సుమన ఆవేదన వ్యక్తం చేశారని తెలిసింది. పాయకరావుపేట ఉపఎన్నికల ఫలితాలపై మంత్రి గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు స్థానిక సర్క్యూట్ హౌస్‌లో మంగళవారం సమావేశమై సమీక్షించుకున్నారు. కాంగ్రెస్‌కు మంచి పట్టు ఉన్న తంగేడులో కాంగ్రెస్ పార్టీకి కేవలం 115 ఓట్లు వచ్చాయంటే, అక్కడి కేడర్ ఏవిధంగా పనిచేసిందో ఇట్టే చెప్పేయచ్చు. ఈవిషయం మంగళవారం జరిగిన సమావేశంలో చర్చకు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ, రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టినట్టు ప్రజలు నమ్ముతున్నారని నాయకులు భావించారు. వీటిని కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలని ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన వారి స్థానాలను భర్తీ చేయకపోవడం వలన కూడా పార్టీకి తీవ్రనష్టం వాటిల్లిందని నాయకులు అభిప్రాయపడ్డారు. ఎన్నికలో అభ్యర్థిని ప్రకటించడం ఆలస్యం కావడం కూడా పార్టీ ఓటమికి కారణమని భావించారు. గ్రామాల వారీగా, బూత్‌ల వారీగా ఓట్ల వివరాలను తెప్పించుకుని ఓటమికి గల కారణాలను విశే్లషించాలని నిర్ణయించారు. అలాగే అర్బర్, రూరల్ జిల్లా కమిటీ సమావేశాలను త్వరలోనే ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. నామినేటెడ్ పోస్ట్‌ల భర్తీకి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. పార్టీ శ్రేణులను మళ్లీ బలోపేతం చేయాలని కూడా నిర్ణయించారు.
* ‘పేట సమీక్ష’లో సుమన ఆవేదన
english title:
sumana avedana
Date:
Wednesday, June 20, 2012