విశాఖపట్నం, జూన్ 19: జిల్లాలో రైతులకు ఖరీఫ్ సీజన్‌లో సకాలం అవసరమైన విత్తనాలు, ఎరువులు అందించేందుకు తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర వౌలిక వసతులు, పెట్టుబడులు, ఓడరేవుల మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఇక్కడి ప్రభుత్వ అతిథిగృహంలో కలెక్టర్ లవ్ అగర్వాల్‌తో కలిసి వ్యవసాయశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో సాగును అంచనావేసి అవసరమైన విత్తనాలు సిద్ధం చేయాలన్నారు. ఆయా ప్రాంతాల్లో అవసరమైన రకాలు ఏమేరకు అవసరమో గుర్తించాలన్నారు. దానికి తగిన విధంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. వర్షాలు ప్రారంభమైన తరువాత రైతులు విత్తనాల కోసం ఎదురుచూడకుండా తగిన ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ప్రైవేటు వర్తకుల వద్దకు వెళ్ళే పని లేకుండా సొసైటీల ద్వారా పూర్తిస్థాయిలో విత్తనాల పంపిణీ జరగాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ముందుగా గుర్తించి పైఅధికారులకు తెలియజేయాలని మంత్రి గంటా అన్నారు. అవసరమైతే రాష్టస్థ్రాయిలో తాను తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎక్కడైనా విత్తనాల లోటుపై ఫిర్యాదులు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. సకాలంలో అవసరమైన ఎరువులు కూడా సరఫరా చేయాలని, ఎక్కువ ధరలకు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ లవ్ అగర్వాల్ మాట్లాడుతూ జిల్లాలో ఆయా డివిజన్లకు సంబంధించిన ఎడిలు తమ పరిధిలో ఉన్న రైతులకు ప్రభుత్వం సరఫరా చేసే ఎరువులు, విత్తనాలపై అవగాహన కల్పించాలన్నారు. ఎరువులు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల ద్వారా సకాలంలో సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కౌలురైతులంతా బ్యాంకు ఖాతాలు ప్రారంభించేందుకు చర్యలు వేగవంతం చేయాలన్నారు. ఖరీఫ్ సీజన్‌లో విత్తనాలు, ఎరువులు అందనట్టు, బ్లాక్ మార్కెటింగ్ జరిగినట్టు తన దృష్టికి వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాసరావు, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మళ్ళ విజయప్రసాద్, తైనాల విజయకుమార్, యువి.రమణమూర్తిరాజు, పంచకర్ల రమేష్‌బాబు, బోళెం ముత్యాలపాప, చింతలపూడి వెంకట్రామయ్య, వ్యవసాయశాఖ జెడి వేణుగోపాలరావు, ఎడిలు పాల్గొన్నారు.
* రాష్ట్ర మంత్రి గంటా
english title:
seeds distribution
Date:
Wednesday, June 20, 2012