ఖమ్మం, జూన్ 21: జిల్లాలో ప్రజాప్రతినిధుల, అధికారుల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఇటీవల జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ హేమ మహేశ్వరరావుపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు బాగాలేదని, సరైన ప్రణాళిక లేకుండా పని చేస్తున్నారని ఆయన జెడిఏ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయటమే కాకుండా మరో సారి పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. ఇదే క్రమంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా అధికారులు పని చేయాలని కూడా సూచించారు. అయితే జెడిఏ వెంటనే విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి మంత్రి పొన్నాల లక్ష్మయ్య వ్యవహార శైలిపై తాను మనస్థాపం చెందానని, రాష్టస్థ్రాయిలో తీసుకున్న నిర్ణయాలనే తాము అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మంత్రిపై తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి పొన్నాల జెడిఏ పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఓ జిల్లా అధికారి ఏకంగా జిల్లా ఇన్‌చార్జి మంత్రిపైనే విమర్శలు గుప్పించే స్థాయికి ఎదిగాడని, ఆయన తన సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విషయంపై రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులతో కూడా మాట్లాడటంతో పాటు జెడిఏపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది. మంత్రి పొన్నాల వైఖరిపై జెడిఏ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని తెలుసుకున్న ఉన్నతాధికారులు కూడా ఆయనను మందలించినట్లు సమాచారం. ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయటం, అందులోనూ జిల్లా ఇన్‌చార్జి మంత్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడటం సరైన పద్ధతి కాదని, ఇది ఖచ్ఛితంగా క్రమశిక్షణ రాహిత్యం కిందకే వస్తుందని, అందుకే ఆయనపై చర్యలు తీసుకోవాలని పొన్నాల ఉన్నతాధికారుల వద్ద పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఓ జిల్లా ఉన్నతాధికారి తనను విమర్శించటంపై పొన్నాల ఆగ్రహం వ్యక్తం చేయటమే కాకుండా ఆయనపై చర్య తీసుకోవాల్సిందేనని పట్టుబడుతున్నట్లు సమాచారం. మూడు రోజుల క్రితం జరిగిన సమీక్ష సమావేశం జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య వైరాన్ని పెంచింది.
వ్యవసాయ విస్తరణ పనుల్లో ఆదర్శ రైతుల
సేవలను వినియోగించుకోవాలి
* జిల్లా కలెక్టర్
ఖమ్మం, జూన్ 21: వ్యవసాయ విస్తరణ కార్యక్రమాల్లో ఆదర్శరైతుల సేవలను వినియోగించుకోవాలని వ్యవసాయాధికారులను జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన సెట్ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. పంటల సాగు ప్రారంభమైనందున విత్తనాలు మొలక, చీడపీడలు, విత్తనాలు, ఎరువుల అందుబాటు అంశాల్లో ప్రతి రోజు పొలాలు సందర్శించి నివేదికలు ఇవ్వాల్సిన బాధ్యత ఆదర్శరైతులపై ఉందన్నారు. విత్తన శుద్ధి, భూసార పరీక్ష ఫలితాలను రైతులకు తెలియ చేయాలని కోరుతూ ఆదర్శరైతులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. రైతులకు సంబంధించి ఇంకా 5.30లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కూపన్లు పొందిన రైతుల జాబితా ప్రకారం వారి పంటలను పరిశీలించాలని విఆర్వోలను ఆదేశించారు. ఇప్పటి వరకు 1.80లక్షల మంది రైతులకు 71 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని పంపిణీ చేశామని, మిగతా సొమ్మును 15రోజుల్లో పంపిణీ చేస్తామన్నారు. సెట్‌కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎంఎం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
దోపిడీని యథాతథం చేసే కొత్త మద్యం పాలసీ
ఖమ్మం, జూన్ 21: కొత్త సీసాలో పాత సారాయి లాంటిదే ప్రభుత్వం తెచ్చిన కొత్త మద్యం విధానం అని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం విమర్శించారు. యధాతధంగా దోపిడీని కొనసాగించేలాగా, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏ మాత్రం తగ్గకుండా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజల్ని మోసగించే జిమ్మిక్కులు చేశాడని విమర్శించారు. గురువారం సుందరయ్య భవన్‌లో జరిగిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మద్యనియంత్రణ కాకుండా దాన్ని వరదలా పారించేలాగా కొత్త విధానం ఉందన్నారు. మహిళలు, యువజనులు మద్యంపై పోరాటానికి సన్నద్ధం కావాలన్నారు. ఖమ్మం జిల్లాలో వామపక్షాలు, ప్రజలు చేసిన ఉద్యమాల ఫలితంగా రక్షణ స్టీల్స్‌కు కేటాయించిన బయ్యారం ఇనుప గనులను జిల్లా ప్రయోజనాల కోసం అక్కడే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే ‘బయ్యారం ఉక్కు - ఖమ్మం జిల్లా హక్కు’ అనే నినాదంతో పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. బయ్యారం ఉక్కు ఖమ్మం జిల్లా హక్కు అనే నినాదం ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి మనిషి నినాదం కావాలన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు మాట్లాడుతూ మధ్యం షాపులను దక్కించుకోవటానికి మధ్యం సిండికేట్లు తయారవుతున్నాయని, 29 ఏజన్సీ మండలాల్లో బినామి పేర్లతో వాటిని కైవసం చేసుకొనే ప్రయత్నాలు జరుగుతున్నాయని హెచ్చరించారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైనా రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. జిల్లాలోని అధికార యంత్రాంగానికి ఏ విషయంపైన ముందు చూపులేదని, ప్రజల సమస్యలను పట్టించుకొనే మంత్రులు, ఎమ్మెల్యేలు కరువయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. కాసాని ఐలయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నున్నా నాగేశ్వరరావు, బండారు రవికుమార్, పొన్నం వెంకటేశ్వరరావు, యర్రా శ్రీకాంత్, బుగ్గవీటి సరళ, కళ్యాణం వెంకటేశ్వరరావు, అన్నవరపు కనకయ్య, ఎజె రమేష్, యలమంచి రవికుమార్, పది డివిజన్‌ల కార్యదర్శులు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
పోలింగ్ బూత్‌లను తనిఖీచేసిన డిప్యూటీ కలెక్టర్
రుద్రంపూర్, జూన్ 21: సింగరేణిలో ఈనెల 28వతేదీన జరగనున్న గుర్తింపుసంఘం ఎన్నికల పోలింగ్‌బూత్‌లను ఎలక్షన్ ప్రోసిడింగ్ అధికారి, (డిప్యూటీ కలెక్టర్) జె శివశ్రీనివాస్ గురువారం సందర్శించి పరిశీలించారు. ఏరియాలోని వికె 7, పివికె, ఏరియా వర్క్‌షాప్, సత్తుపల్లి, గౌతంపూర్ ఓసిలలోని పోలింగ్ బూత్‌లను, బ్యాలెట్ బాక్స్‌ల ఏర్పాటును పరిశీలించి వాటిని ఏవిధంగా అమర్చాలో, వాటి పని విధానాన్ని సూచించారు. అనంతరం ఏరియా జిఎం విజయారావు, డివైజిఎం పర్సనల్ పి హరిగోపాల్‌తో పోలింగ్ విషయాలను చర్చించారు. ఈసందర్భంగా ఎలక్షన్ ప్రొసిడింగ్ అధికారి మాట్లాడుతూ ఎలక్షన్‌లు నిర్వహించి సిబ్బందికి, కౌటింగ్ సిబ్బందికి మంగళ, బుధవారాలలో కొత్తగూడెం కెసిఓఎ క్లబ్‌లో శిక్షణ ఇచ్చామని వారి సహకారంతో ఈపోలింగ్ పకద్భందిగా నిర్వహిస్తామన్నారు. అనంతరం ఏరియా జిఎం మాట్లాడుతూ ఓటు వేయడానికి వచ్చే ప్రతి కార్మికుడు తప్పని సరిగా తమ గుర్తింపుకార్డులను తప్పని సరిగా తీసుకుని రావాలని గుర్తింపుకార్డు లేకుండా ఓటువేయడం కుదరదని అన్నారు. ఒకేవేళ గుర్తింపు కార్డు లేని కార్మికులు సంబంధిత గనులపై కానీ, కార్యాలయ అధికారుల వద్ద తాత్కాలిక గుర్తింపుకార్డును పొందే అవకాశం కల్పించామని గుర్తింపుకార్డు లేని కార్మికుడు తాత్కాలిక గుర్తింపుకార్డును తీసుకువస్తేనే ఓటు వేయనిస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ సాజిద్, డివైజిఎం పి బ్రహ్మనందంలు పాల్గొన్నారు.
మనకు మనమే
పోటీగా ఉండాలి
* జిల్లా కలెక్టర్
సత్తుపల్లి రూరల్, జూన్ 21: మనకు మనమే పోటీగా ఉండాలని, అప్పుడే ఉన్నత స్థితికి చేరుకుంటామని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ పేర్కొన్నారు. గురువారం స్థానిక మెప్మా కార్యాలయంలో స్ర్తినిధిపై జరిగిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో తొలిసారిగా ప్రారంభిస్తున్న స్ర్తినిధి ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నారు. బ్యాంక్‌ల ద్వారా రుణాలు పొందే స్వయం సహాయక సంఘాలకు ఎటువంటి గ్యారెంటీ లేకుండా అప్పులు ఇవ్వటం జరుగుతుందన్నారు. సంఘంలోని సభ్యులు ఒకరికి ఒకరు గ్యారెంటీగా ఉంటారని, అందువల్ల ఎవరికీ ఎక్కువ డబ్బు అవసరమో గుర్తించటంతో పాటు సక్రమంగా ఖర్చు చేయించటంలో కూడా ఈ పరిరక్షణ అవసరం అన్నారు. ఈ పథకం 300కోట్ల ప్రభుత్వ వాటాధనంతో ప్రారంభమవుతుందన్నారు. పక్షం రోజులకు ఒక సారి సంఘం సభ్యుల సమావేశం జరగాలని సూచించారు. కార్యక్రమంలో మెప్మా పిడి వేణు మనోహర్, కమల శ్రీ, సుజాత, నగర పంచాయతీ కమిషనర్ జగన్ తదితరులు పాల్గొన్నారు.
రాముని హుండీ ఆదాయం 68.39 లక్షలు
భద్రాచలం, జూన్ 21: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం హుండీ లెక్కింపు గురువారం జరిగింది. ఈ లెక్కింపు ద్వారా గత 45 రోజులకు గాను ఆలయ హుండీ రూ.68,39,340ల ఆదాయం వచ్చినట్లు ఇఓ బదరీ నారాయణాచార్యులు తెలిపారు. ఈ లెక్కింపులో 22 యుఎస్‌ఎ డాలర్లు, సౌదీ అరబ్ 33 ఆరమ్‌లు, మలేరియా 11, ఒమన్ 100 బైసాలు లభించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కురిచేటి పాండురంగారావు, ప్రధానార్చకులు హరి జగన్నాధాచార్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
రైలు కిందపడి వ్యక్తి మృతి
రుద్రంపూర్, జూన్ 21: ప్రమాదవశాత్తు రైలుకిందపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం హనుమాన్ బస్తీలో చోటు చేసుకుంది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హనుమాన్ బస్తీ నివాసి అయిన కమలాకర్ (34) కూలీపని చేస్తు జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం కూలిపని చేసుకొని ఇంటికి తిరిగి వస్తూ రాజీవ్ పార్కువద్ద ఆగివున్న రైలు కిందినుండి రైల్వేలైను దాటుతుండగా రైలు కదలడంతోదానికింద నొక్కుకుపోయి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడుకి భార్య పిల్లలు ఉన్నారు.
కోర్టు వద్ద నుండి ఇద్దరు గిరిజనులను
తీసుకెళ్లిన పోలీసులు?
కొత్తగూడెం, జూన్ 21: కొత్తగూడెం కోర్టుకు హాజరైన ఇద్దరు గిరిజనులను పోలీసులు విచారణ నిమిత్తం తమ వాహనంలో ఎక్కించుకుని తీసుకువెళ్ళినట్లు తెలుస్తోంది. గతంలో గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా వివిధ ప్రజాసంఘాలు భద్రాచలం డివిజన్‌లో నిర్వహించిన సభకు చర్ల మండలం ఎర్రబోలు గ్రామానికి చెందిన 30మంది గిరిజనులు వెళుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగిరిజనులకు సంబంధించి కొత్తగూడెం కోర్టులో గురువారం విచారణ జరిగింది. విచారణ అనంతరం బయటకు వస్తున్న గిరిజనులలో పల్ల జోగయ్య, సర్వేశ్వరరావు అనే వారిని భద్రాచలం పోలీసులు తమ వాహనంలోకి ఎక్కించుకుని తీసుకువెళ్ళారు. ఈఘటనను విరసం నేత వరవరరావు, న్యూడెమోక్రసీ జాతీయ కార్యవర్గ సభ్యులు సాధినేని వెంకటేశ్వరరావులు తీవ్రంగా ఖండిస్తూ కిడ్నాప్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులే కిడ్నాప్‌కు పాల్పడడం హేయకరమైన చర్య అని, వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తీసుకువెళ్ళిన ఇరువురు గిరిజనులను మవోయిస్టుల సమాచారం కోసం భద్రాచలం పోలీసులు భద్రాచలంలో విచారిస్తున్నట్లు తెలిపారు.
‘మారిన మనిషి’ టెలీఫిలిమ్ సీడీ ఆవిష్కరణ
రుద్రంపూర్, జూన్ 21 : సింగరేణి కాలరీస్ కార్పోరేట్ కమ్యూనికేషన్ సెల్ ఆధ్వర్యంలో రూపొందించిన మారినమనిషి టెలిఫిలిమ్ సీడీని సంస్థ డైరెక్టర్ పాటి విజయ్‌కుమార్ గురువారం అవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థకు సంబంధించిన రక్షణ, ఉత్పత్తి, ఉత్పాదకత విషయాలకే కాకుండా వివిధ సామాజిక కార్యక్రమాలకు కూడా నిర్వహిస్తుందని ఇందులో భాగంగా టెలిఫిలిమ్‌ను కమ్యూనికేషన్ విభాగం నిర్మించడం అభినందనీయమన్నారు. ఈకార్యక్రమంలో జిఎం పర్సనల్ పురుషొత్తంరావు, డివైజిఎం పర్సనల్ ఎ బుచ్చిప్రసాద్, పిఆర్‌ఎ రమణ, కో ఆర్డీనేటర్ అల్లిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
చర్లలో సోములమ్మ జాతర ప్రారంభం
చర్ల, జూన్ 21: వర్షాలు కురియాలని, పంటలు బాగా పండాలని...ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుతూ గిరిజనులు ప్రతీ ఏటా సోములమ్మ జాతర నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.
మండల పరిధిలోని పూజారిగూడెం గ్రామంలోని సోములమ్మ ఆలయంలో చిన్నారులచే గురువారం సోములమ్మ జాతర గ్రామపెద్దలు పూజారి లక్ష్మీ నారాయణ, నీలం రమణయ్య, ముర్ల రాములు ఆధ్వర్యంలోప్రారంభించారు. ఈ జాతరను ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ జాతరలో ముఖ్యంగా చిన్నారులచే సోములమ్మ తల్లిని ప్రసన్నం చేసుకుంటారు. ఇదే ఈ జాతరలో ప్రధాన భూమిక. ఈ జాతర చివరి రోజు భారీ వర్షం కురిస్తే ఈ ఏడాది అంతా కలసి వస్తుందని సోములగూడెం గిరిజనుల నమ్మకం. జాతర తొలిరోజు గురువారం ఆలయ పూజారులు బద్దె ముత్తయ్య, సింగా శ్రీను ఆలయంలో కుండదింపుడు కార్యక్రమం జరిగింది. ఉదయానే్న ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఐదేళ్ల నుంచి పదేళ్లలోపు ఐదుగురు చిన్నారులచే సోములమ్మకు ప్రత్యేక పూజలు చేయించి వారి నెత్తిన బిందెలు ఉంచి గ్రామంలోని ముత్యాలమ్మ, సమ్మక్క, సారలమ్మ, కనకదుర్గమ్మ, మైసమ్మ ఆలయాలకు ఊరేగింపుగా తీసుకెళ్లి ఆయా దేవతలకు పూజలు జరిపారు. అనంతరం వారిని ఊరంతా తిప్పి సోములమ్మ ఆలయం వద్దకు తోడ్కొనివచ్చారు. ఇక జాతరలో ముఖ్యమైన ఘట్టం ఆరంభమైంది.
ఈ ఘట్టంలో చిన్నారులను సోములమ్మ ఆలయం ఎదురుగా నిలబెట్టి సోములమ్మతల్లి ఆవహించేలా పూజలు జరిపారు. తర్వాత సోములమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేశారు. దీంతో తొలిజాతర ముగిసింది. ఈ జాతరలో గ్రామపెద్దలు శ్రీను, సత్యం, రమేష్, కుమార్, మురళీ, మనోహర్, నాగేశ్వరరావు, రాములు, మహిళలు పాల్గొన్నారు.
సాయిబాబా ఆలయానికి
లక్షా పదహారు వేల వితరణ
భద్రాచలం, జూన్ 21: భద్రాచలం పట్టణంలోని జూనియర్ కళాశాల సెంటర్‌లో ఉన్న శ్రీశ్రీశ్రీ షిర్డీ సాయిబాబా మందిరానికి భద్రాచలంకు చెంది ప్రస్తుతం ఉద్యోగరీత్యా సౌత్ ఆఫ్రికాలో ఉంటున్న రాట్నాల నగేష్‌కుమార్ రూ.లక్షా పదహారు వేల విరాళాన్ని అందించారు. ఈ విరాళాన్ని గురువారం తన తల్లిదండ్రుల చేతుల మీదుగా ఆలయ కార్యదర్శి కోనేరు కృష్ణారావుకు అందజేశారు. త్వరలో సాయిబాబా ఆలయ ఆధునికీకరణలో భాగంగా శిల్పకళతో పూర్తిగా తీర్చిదిద్దేందుకు ఈ సొమ్మును వినియోగించనున్నట్లు ఆలయ అధ్యక్షులు మాగంటి సూర్యం వెల్లడించారు. బాబా ఆలయ అభివృద్ధికి భక్తులు మరింత ముందుకు వచ్చి తమవంతు సాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు తుమ్మలపల్లి సతీష్, భక్తులు పాల్గొన్నారు.