‘జరిగిపోయింతర్వాత నేనేం చెప్పినా నువ్వు నమ్మవని నాకు తెల్సు! అందుకే ఈ రోజు నీకో విషయాన్ని సాక్ష్యాధారాల్తో చూపిద్దామనుకుంటున్నాను’
‘ఎలా సునీతా?’ ఆమె ఆత్మవిశ్వాసం చూస్తుంటే నా గొంతు నాకు తెలీకుండానే బలహీనమవుతోంది.
ఆమె చెప్పిన ప్లాన్ విని నేను నివ్వెరపోయాను. పూల్ ప్రూఫ్ ప్లాన్!
‘నువ్వు క్రిష్‌ని.. నీ క్రిష్‌ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకో దలిస్తే ఒక అరగంటలో బయల్దేరి మా ఇంటికి వచ్చేయ్! ఇక్కడికి వచ్చి శిల్ప ఇంటికి వెళ్లి చూసింతర్వాత నీ ఇష్టం అమూల్యా! మనిషికి క్యారెక్టర్ ముఖ్యమని నువ్వనుకుంటావో లేదో నీ ఇష్టం! ఎలాటివాడైనా క్రిష్‌ని నువ్వు భర్తగా యాక్సెప్ట్ చేస్తావా? లేదా అన్నది నీకే వదిలేస్తున్నాను. ఇటీజ్ నన్నాఫ్ మై బిజినెస్! ఈ విషయమై నీకు ఇక ఎలాంటి ఫోన్లు చేయను’ చెప్పి, ఫోన్ కట్ చేసింది.
ఒక్కసారిగా కుప్పకూలిపోయాను.
పాప ఏడుస్తున్నా నేను కదలకుండా కూర్చున్నానని మమీ కేకలేస్తుంటే, లేచి పాపకి పాలిచ్చాను. దానికి పాలిస్తూ, మధ్యలో ఇంకా ఏదో ఆశ చావక, అస్సలిదంతా క్రిష్‌తో డైరెక్ట్‌గా చెప్పేస్తే ఎలా ఉంటుందా అన్న అయిడియా వచ్చి, తన మొబైల్‌కి ట్రై చేశాను. ‘దిస్ మొబైల్ ఈజ్ స్విచ్‌డాఫ్!’ అని జవాబొచ్చింది.
తను నిజంగానే బెంగుళూరు వెడ్తున్నాడేమో, ఫ్లయిట్ టేకాఫ్ అయ్యిందేమో, అతను ఫ్లయిట్‌లో ఉన్నాడేమో.. అని నన్ను నేను సరిపెట్టుకో చూసాను. అంతలోనే నాకు సునీత మాటలు గుర్తొచ్చాయ్! చాలా అవమానంగా అన్పించింది.
ఉన్నట్టుండి నాకు ఏడ్పు వచ్చింది.. నాకు తెలీకుండానే ఏడ్వటం మొదలుపెట్టాను.. మమీ బాగా కంగారుపడిపోయింది. ‘ఏమైందిరా? ఇప్పటిదాకా బాగానే ఉన్నావ్ కదా!’ అంటూ నా దగ్గరికొచ్చింది.
నేను మమీని కౌగిలించుకుని ఏడ్చేసాను. ఓదార్చగా ఓదార్చగా మమీకి జరిగిందంతా చెప్పాను.. ఇదివరకటి సునీత ఫోన్ల గురించి, ఇపుడు సునీత వేసిన ప్లాన్ గురించి కూడా చెప్పాను.
నాకన్నా ఎక్కువగా మమీ గుండెలు బాదేసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లి తీరాల్సిందే.. పదపదమంటూ నన్ను తొందర చేసింది. ఇంతకాలం ఆ పిల్ల అన్నిసార్లు నెత్తీనోరూ బాదుకుని చెబ్తుంటే ఎలా ఊర్కున్నావే అని చివాట్లు వేసింది. నేను దేనికీ సమాధానం చెప్పలేదు.
ఒకప్రక్కన జోరున వర్షం కురుస్తోంది. పిల్లలు నిద్రపోయారు. మమీ, నేనూ కార్లో బయల్దేరాం! నా క్రిష్ నాకే స్వంతం అని నా మనస్సెక్కడో ఇప్పటికీ చెబ్తోంది. అది ఈ లోకానికి నిరూపించటానికే ఈ రోజు నేనిలా బయటకు వచ్చాను. అంతే! నాకు నేను సర్ది చెప్పుకున్నాను. ఆ ఎపార్ట్‌మెంట్ ముందు మా కారాగింది.
వణుకుతున్న కాళ్లతో కారు దిగాను. ఆ ఎపార్ట్‌మెంట్ పార్కింగ్‌లోనే మా తెల్లకారు కన్పించింది. నేను సగం నీరుగారిపోయాను. మమీ ‘చూసావా?’ అన్నట్టు నావైపు అదోలా చూసింది. సడలిపోతోన్న నా నమ్మకాన్ని ఏదో మొండి ధైర్యంతో కూడగట్టుకున్నాను. చేసేదేం లేక నేరుగా సునీత ఫ్లాట్‌కి వెళ్లాం!
వెళ్లగానే సునీత మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంది. సునీత ఫ్లాట్‌లోంచి శిల్ప ఫ్లాట్ కన్పిస్తోంది.. అమ్మని సునీత దగ్గరే వదిలేసి, నేను ఒక్కదానే్న శిల్ప ఫ్లాట్‌కి బయల్దేరాను.
శిల్ప, సునీత నైబర్స్ కాబట్టి ఆ మధ్యనెపుడో తన పేరెంట్స్ వస్తే ఇమ్మని చెప్పి, శిల్ప తన ఫ్లాట్ తాళం చెవి సునీతకిచ్చింది. అప్పటికే శిల్పనీ, క్రిష్‌నీ ఓ కంట గమనిస్తోన్న సునీత ఎందుకయినా మంచిదని, నా మేలు కోరి వెంటనే ఆ తాళం చెవికి డూప్లికేట్ తాళం చెవి తయారు చేయించిందంట!
ఆ తాళం చెవి ఇపుడు నా చేతుల్లో ఉంది. ఒక్క క్షణం ఇదంతా ‘అన్‌ఫెయిర్’ కదా అన్పించింది. కానీ అతను చేస్తోన్న పని ముందు నేను చేసేదేం తప్పు కాదు అన్పించింది. గుండె దిటవు పరుచుకుని, ఆ తలుపు తాళం తీశాను.
సునీత ముందే చెప్పింది... తను అంత క్రితమే వెళ్లి ఆ తలుపుకి లోపలుండే బోల్ట్ తాలూకు హోల్డర్ సైడ్ స్క్రూలని తీసి వచ్చానని! బోల్ట్ కూడా లేకపోవటంతో శబ్దం చేయకుండా తలుపు తెరుచుకుంది.
హాల్లోంచి బెడ్రూమ్ కన్పిస్తోంది.. వాళ్లు బెడ్రూం తలుపు కూడా వేసుకోలేదు. ఆ బెడ్‌లైట్ వెల్తురుకి అలవాటు పడ్డానికి నాకు కొన్ని సెకన్ల టైమ్ పట్టింది. నేను జన్మలో చూడాలనుకోని దృశ్యం ఆ నీలిరంగు వెల్తుర్లో స్పష్టంగా కన్పించింది.
వాళ్లిద్దరూ ఆమె డబుల్ కాట్ మీద ఒక్క నూలుపోగైనా లేకుండా నగ్నంగా, నిర్లజ్జగా.. ఒకళ్ల మీద ఒకళ్లు చేతులు వేసుకుని పడుకుని ఉన్నారు! నేను సిగ్గుతో చితికిపోయాను.
అలికిడికి క్రిష్ తల తిప్పి చూస్తూ ‘ఎవరదీ’ అంటూనే ట్యూబ్‌లైట్ స్విచ్ వేశాడు.
అంత వెల్తుర్లో నన్ను చూసి, క్రిష్ నివ్వెరపోయాడు.. అలా అక్కడ ఆమె మంచమీద అతడ్ని చూసి, అతనిలాంటి పని చేస్తాడని కలలో కూడా ఊహించని నేనెంత నివ్వెరపోయానో నన్ను చూసి అతను కూడా అంతే కాదు కాదు అంతకన్నా ఎక్కువ నివ్వెరపోయాడు.
అవున్మరి! నేను అంతో ఇంతో ప్రిపేర్డ్‌గా ఉన్నాను.. అతడ్ని ఇలాంటి స్థితిలో చూడాల్సి వస్తుందని! అతనికిది షాక్! నేను అతడ్నీ, అతని మాటనీ నమ్మకుండా, అతడ్ని అనుమానించి, అతని మీద గూఢచారుల్ని పెట్టి, నేనే స్వయంగా ఫాలో అయ్యి, ఇలా వస్తానని ఎంత తెలివిగలవాడైనా అతను మాత్రం ఎలా ఊహిస్తాడు?
నా పాలిటి దేవతలా సునీత ఇప్పటికైనా నా కళ్లు తెరిపించింది. అలాటి పరిస్థితిలో కూడా నేను సునీత సలహాని మర్చిపోలేదు.. నా సెల్‌ఫోన్ కెమెరాతో ఆ దృశ్యాన్ని క్లిక్‌మన్పించాను. అతను అపుడే స్పృహలోకి వచ్చినట్టు, తాము నగ్నంగా ఉన్నామని గుర్తొచ్చినట్టు, బెడ్‌షీట్ మీదికి లాక్కుంటూ, వారింపుగా చెయ్యి అడ్డంగా జాపి ఊపాడు. ఇక చూడాల్సిందేమీ లేదు. చెయ్యాల్సిందే ఉంది. నేను గిర్రున వెనక్కి తిరిగాను.
అతను పిలుస్తున్నా వినిపించుకోలేదు. అతనికి మాట్లాడే అవకాశమివ్వలేదు అక్కడ అస్సలు వింటానికేమీ లేదు.. అయినా ఇంకా ఏం చెబ్తాడు? తనూ శిల్పా కల్సి భజగోవిందం చదువుకుంటున్నామని చెబ్తాడా?
వినే వాళ్లుంటే అలా చెప్పినా చెబ్తాడు.. అతని గ్లామర్ మీద అతనికంత నమ్మకం!
నేను పరుగు పరుగున వచ్చి కార్లో కూర్చున్నాను.
సునీత ఇంట్లోంచి బయటకు వస్తోన్న నన్ను చూసి మమీ కూడా గబగబ క్రిందికి వచ్చేసింది.
కారు బయల్దేరగానే నేను మమీ భుజమీద వాలిపోయి ఒక్కసారిగా ఏడ్వటమ్మొదలు పెట్టాను...
‘నేను ఓడిపోయాను మమీ!’
‘ఊర్కోమ్మా! అస్సలే పచ్చి బాలింతవి! ఏడ్వకూడదే తల్లీ!’
‘ఊహు! నాకీ క్రిష్ వద్దు మమీ!’
మమీ ఎంతో సముదాయించింది. ‘నా పిచ్చితల్లీ! ఊర్కోవే! నాకు నీ పెళ్లిచూపుల్నాడే ఆ అబ్బాయి వాలకమీద అనుమానమొచ్చింది. అందుకే నీకు నేను మొదట్నుంచీ చెబ్తూనే ఉన్నాను.. జాగ్రత్తే తల్లీ అని! నువ్వు నా మాట వినకపోతివి! పోనే్లమ్మా! ఇప్పటికన్నా మేలుకున్నావ్!’
‘ఎంత పని చేశాడమ్మా? నన్ను నిలువునా మోసం చేశాడు.. నన్ను మళ్లీ క్రిష్ దగ్గరకు వెళ్లమని చెప్పకు!’ పదేపదే అదే మాట చెబ్తూ ఏడుస్తూనే అన్నాను.
‘నా తల్లే! ఊర్కోమ్మా! ఇంత జరిగాక వాడి దగ్గరకు నిన్ను కాపురానికి పంపిస్తానా? నా కంఠంలో ప్రాణముండగా పంపించను.. అస్సలు నువ్వు వెడ్తానన్నా నేను పంపించను.. ఒట్టు!’
అమ్మ ఏమ్మాట్లాడ్తోందో నాకర్థం కావట్లేదు.. ‘మన పగవాళ్లక్కూడా రాగూడని సమస్య మనకొచ్చిందే తల్లీ!.. ఇలాటి పరిస్థితులంటూ వస్తే గుండె నిబ్బరంతో బ్రతకాలనే నీకంత పెద్ద చదువు చదివించానే తల్లీ! నీకేం తక్కువే? రాజాలాటి ఉద్యోగం! దర్జాగా ఉద్యోగం చేసుకుంటావ్! నీ కాళ్ల మీద నువ్వు నిలబడ్తావ్!’
నేనలా ఏడుస్తూనే ఉన్నాను. ‘క్రిష్ ఎంత పని చేశాడు? నేనేం తక్కువ చేశాను?’
ఇంటికెళ్లగానే డాడీతో మమీ అన్ని సంగతులూ చెప్పేసింది. ఎపుడూ ఎంతో కూల్‌గా ఉండే డాడీ కూడా బాగా అప్‌సెట్టయ్యారు. తర్వాత డాడీ మమీ ఇద్దరూ కల్సి క్రిష్‌ని బాగా తిట్టిపోశారు.. తనని ఎవరన్నా చిన్న మాటంటే కూడా ఇదివరలో ఊర్కునేదాన్ని కాను... రయ్యిమని పోట్లాటకు దిగిపోయేదాన్ని! ఇపుడింతగా తిడ్తున్నా నిమ్మకు నీరెత్తినట్టు, అస్సలు నాకేమీ వినబడనట్టుండిపోయాను. అస్సలు నాలో చలనమే లేదు.
ఎంతసేపూ నా కళ్లల్లో ఆ దృశ్యమే. వాళ్లిద్దరూ అలా ఆ మంచమీద నగ్నంగా పడుకున్న దృశ్యమే మెదలసాగింది. నా కంటికి ఇంకేమీ కన్పించట్లేదు. నేనలా ఏడుస్తూనే ఉన్నాను.
‘క్రిష్ ఎంత పని చేశాడు? అతనికి నేనేం తక్కువ చేశాను? ఎందుకింకో అమ్మాయి దగ్గరికి వెళ్లాడు?’ ఆలోచిస్తోన్న కొద్దీ స్తబ్దుగా అయిపోతున్నాను.
అతను ముందు నుంచీ ఇంతేనా? నేనే గమనించలేదా? అస్సలు అతని జీవితంలో ఈ ఒక్క అమ్మాయే ఉందా? ఇంకా ఎవరన్నా ఉన్నారా? అస్సలు ఎందరున్నారు? ఎవరెవరున్నారు?
మరి ఇన్నాళ్లూ అతను నా పట్ల చూపించిన ప్రేమ, కన్సర్న్ అంతా నటనేనా? అతను అమ్మాయిలందరితోనూ అలానే ఉంటాడా?
నన్ను తాకిన చేతులు ఇంకో అమ్మాయిని.. మరో అమ్మాయిని.. వేర్వేరు అమ్మాయిల్ని తాకాయా?
నా ఒంటినిండా ముద్దులు పెట్టిన ఆ పెదవులు.. నన్ను ప్రేమగా చూసిన ఆ కళ్లు.. నేను చెప్పిన గుసగుసలు విన్న ఆ చెవులు.. నా తనువునంతా సంగీత వాయిద్య పరికరంలా మీటిన ఆ చేతులు.. తమకంతో, మోహంతో నన్నల్లుకుపోయిన ఆ శరీరం.. నాకిచ్చిన ఆ మనస్సు.. నిజానికి ఏదీ నా స్వంతం కాదా?
నా వాడనుకున్న క్రిష్, నాకే స్వంతమనుకున్న నా క్రిష్ ఇంకో అమ్మాయి కౌగిట్లో.. గ్గాడ్ నేను ఊహల్లో, కలల్లో కూడా ఊహించలేని విషయానే్న ఎందుకు నాకిచ్చావ్? నేనేం పాపం చేశాను?
తన గుండెలో నా కోసం గుడి కట్టానన్నాడు.. నేనే తన దేవతని, ప్రేమ దేవతని అన్నాడు. ఇపుడా గుడిని ఏం చేశాడు? తన చేతుల్తోనే పగలకొట్టేశాడా? పూర్తిగా పగలగొట్టేసి, ఇపుడా శిల్ప కోసం ఇంకో గుడి కట్టాడా? నా విగ్రహాన్ని తీసి అవతల పారేసి, ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించాడా?
ఊహు! క్రిష్ మగాడు కదా! మగాడంటే మమీ చెప్పినట్టు మాంత్రికుడే అయ్యుంటాడు. ఇలా చిన్న మంత్రదండంతో ఆ గుడి చుట్టూ మూడుసార్లు తిప్పి, ‘హాం ఫట్!’ అనగానే ఆ గుడి, ఆ గుళ్లోని దేవత మాయమైపోతారేమో!
ప్రాణానికి ప్రాణంగా నేను ప్రేమించిన క్రిష్ ఎంత మోసం చేశాడు? క్రిష్ నిలువెత్తు మోసానికి చిరునామానా? ఇంతకాలం అతనే నా జీవితమన్నట్టుగా బ్రతికాను. అతని చుట్టూరానే నా ప్రపంచాన్ని నిర్మించుకున్నాను. అతను కాదు పొమ్మన్నాడు. ఇక నా జీవితంలో నాకేమ్మిగిలింది?
ఓటమి! ఓటమి తాలూకు అవమానం!
‘ఆఫీస్‌లో అందరి ముందు ఇంత మంది అభినందనలు అందుకుంటున్న ఈ క్రిష్ నా వాడు! నాకే స్వంతం అన్నట్టు ఎంతో గర్వంగా నవుతూ తిరిగేదాన్ని! కానీ వాళ్లందరికీ సంగతి ముందే తెల్సా? వాళ్లంతా నన్ను చూసి చాటుగా, జాలిగా, హేళనగా నవ్వుకుంటున్నారా? ఆ ఆలోచన వచ్చిందే తడవు.. వాళ్లంతా నన్ను చూసి పెద్దగా నవుతున్న దృశ్యం నా కళ్ల ముందు వద్దన్నా మెదిలింది.
(ఇంకా ఉంది)