ఒక కారు ఫ్రీగా సంపాదించాలంటే, ఆ కారుపై అరచేయి ఆనించి, ఎన్ని గంటలు వుండగలరో వుండండి..చాలు, అంటే ఎవరన్నా ఏమంటారు. ఎగిరి గంతేస్తారు కదా? చైనాలోని ఓ కార్ల కంపెనీ ఇలాంటి వింత పోటీ పెడితే, చాలా మంది ఇలాగే క్యూ కట్టేసారు. సుమారు 120 మంది 18ఏళ్ల నుంచి నలభై ఏళ్ల లోపు వారు మేమంటే, మేమంటూ పరుగెత్తుకొచ్చారు. పోటీ ఏమిటంటే, బిఎండబ్ల్యూ వన్ సిరీస్ కార్లపై అరచేయి ఆకారంలో కొన్ని స్టిక్కర్లు అంటించి వుంటాయి. పోటీదారులు చేయాల్సిందలా ఒక్కటే, ఆ స్టిక్కర్‌పై అరచేయి అలా ఆనించి వుండడమే. ఎవరు ఎక్కువ సేపు వుండగలరో వారు నెగ్గినట్లు. ఒక రియల్ ఎస్టేట్ సంస్థ అమ్మకాలు పెంచుకునే కార్యక్రమంలో భాగంగా ఈ పోటీని నిర్వహించింది. చూడ్డానికి కాస్త వీజీగా అనిపించినా, తీరా చేసి, చేయి పెట్టిన తరువాత తెలుస్తుంది, అలా వుంచుకుని నిలబడ్డం ఎంత కష్టమో. ప్రతి నాలుగు గంటలకు కేవలం 15 నిమిషాలు విశ్రాంతి లభిస్తుంది. అంటే ఎకాఎకిన నాలుగు గంటల పాటు అలా చేయి వుంచాల్సిందే అన్నమాట. ఈ పదిహేను నిమిషాల్లోనే విశ్రాంతి తీసుకున్నా, రిఫ్రెష్ అయినా, ఆహారం తీసుకున్నా. 120 మంది చివరదాకా సాగింది కేవలం ముగ్గురు మాత్రమే. అంతలోనే ఒక వ్యక్తి కాళ్లు వాచిపోయి, నడవలేక, కన్నీళ్లతో వైదొలిగాడు. మరో వ్యక్తి కొన్ని గంటల తరువాత పక్కకు తప్పుకున్నాడు. ఆఖరికి ఛాంగ్‌జియాంగ్ అనే వ్యక్తి మాత్రం 87 గంటల పాటు అలా చేయి వుంచి, కారును అయిదేళ్లపాటు వాడుకునే అవకాశాన్ని గెలుపొందాడు. అంటే సుమారు నాలుగు పగళ్లు, మూడు రాత్రులు అన్నమాట. గట్టివాడే.
..........................................................................................
అమ్మాయిలు ఏం చూసి అబ్బాయిల్ని ఇష్టపడతారు? అబ్బో గొప్ప ప్రశే్న. దీనికి జవాబు తెలిస్తే, ఆ విధంగా తయారై లేదా, మారి అమ్మాయిల్ని ఇట్టే బుట్టలో వేసుకునేవాళ్లం కదా అని ఎవరైనా అంటే అనొచ్చు. కానీ అమ్మాయిలు ఏం చూసి అబ్బాయిల్ని ఇష్టపడతారు అన్నది అమ్మాయిలకే తెలుస్తుందేమో? అందుకే ఇజ్రాయిల్‌లోని టెల్‌అవీలో ఓ అమ్మడు ఇందుకోసం చిన్న స్కూలు ప్రారంభించేసింది. ‘వాట్ షి వాంట్స్’ అన్నది ఈ స్కూలు కానె్సప్ట్. ఇజ్రాయిల్‌లో పెద్ద సక్సెసై కూర్చుంది. నిజానికి పుస్తకంలో చదివి ఈత నేర్చుకోవడం లాంటిదీ వ్యవహారం. కానీ కాస్త కాకపోతే కాస్తయినా తెలుస్తుంది కదా అని అబ్బాయిలు ఎగబడుతున్నారు ఈ స్కూలుకు. చక్కగా చదువుకున్నా, అంతో ఇంతో అందం వుంది. అయినా అమ్మాయిలకు నచ్చడం లేదు. ఇంకేంచేయాలో.. వారికింకేం కావాలో అన్న ఆలోచనతోనే ఈ స్కూలుకు వస్తున్నట్లు పలువురు విద్యార్థులు మొహమాటం లేకుండా చెబుతున్నారు. తాను చెబుతున్న పాయింట్లతో, పాఠాలతో చాలా మంది మహిళలు ఏకీభవిస్తారని షరోన్ రబిన్‌స్టెయిన్ అనే ఆ అమ్మాయి నిబ్బరంగా చెబుతోంది. మహిళలు, అభిరుచులు, సమస్యలు, వాటిలో అబ్బాయిలకు సంబంధించినవి, వారు తీర్చగలిగేవి, పంచుకోగలిగేవి...ఇలా చాలా సిలబస్సే వుందట క్లాసులో.
..............................................................................
ఎంత వంతెన చూసి ముచ్చటపడితే మాత్రం పెరట్లో అచ్చం అలాగే కట్టేసుకుంటారా ఎవరైనా? కాన్సాస్, ముల్‌వానెకు చెందిన లారీ రిచర్డ్‌సన్ ఇలాగే చేసాడు. సైన్యంలో పనిచేసి, రిటైరైన రిచర్డ్‌సన్‌కి రెండంటే విపరీతమైన ప్రేమ. ఒకటి అతగాడి భార్య. రెండవది గోల్డెన్‌గేట్ వంతెన. తన చిన్నతనం నుంచీ ఆ వంతెన చూడాలని కోరిక. తీరా చూసాక విపరీతంగా నచ్చేసింది. నచ్చడం కూడా కాదు అదే మనసులో నిలిచిపోయింది. ఇదంతా 1968 నాటి సంగతి. ఆ తరువాత కూడా ఒకటి రెండు సార్లు దాన్ని చూసాడు. కానీ తనివి తీరలేదు. ఇక లాభం లేదు అలాంటి దాన్ని తన పెరట్లో కట్టేసుకోవాలని డిసైడైపోయాడు. తన ఫామ్ హౌస్‌లోని వెనుక ఖాళీ స్థలంలో గోల్డెన్‌గేట్ వంతెన నమూనా నిర్మించాలని. ఆ సమయంలో అతగాడి దగ్గర వున్నది పోస్టుకార్డ్ సైజులో వున్న వంతెన ఫొటోమాత్రమే. తన తండ్రితో కలిసి 11 ఏళ్లు కష్టపడ్డాడు. 90టన్నుల కాంక్రీట్ ఖర్చయింది. మిగిలినవన్నీ రీసైకిల్డ్ మెటీరియల్ మాత్రమే. అయితే తాను ఎంతో ఖర్చు పెట్టలేదని, అయిదువేల డాలర్లు మాత్రమే అయ్యాయని అంటాడతను. ఇప్పుడు లారీ రిచర్డ్‌సన్ పెరట్లో కుదురుకున్న గోల్డెన్‌గేట్ వంతెన భలే అట్రాక్షన్‌గా మారిపోయింది.
*
ఒక కారు ఫ్రీగా సంపాదించాలంటే, ఆ కారుపై అరచేయి ఆనించి,
english title:
blog
Date:
Sunday, June 24, 2012