Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

వాకిట్లోకే కూరగాయలు

$
0
0

వినియోగదారుల

ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, ఆగస్ట్ 2: వినియోగదారుల వాకిట్లోకే కూరగాయలు తీసుకెళ్లే విధంగా ఉద్యానశాఖ 3విజిటబుల్స్ ఆన్ వీల్స్2 అనే ప్రత్యేక కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలిస్తుండటంతో అన్ని జిల్లాల్లోనూ ఇదే తరహాలో కూరగాయలను వినియోగదారుల వద్దకే తీసుకెళ్లి అమ్మించాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. రైతులే నేరుగా వినియోగదారుల వద్దకు తీసుకెళ్లటం వల్ల దళారుల బెడద ఉండదని, వినియోగదారులు కూడా మార్కెట్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ ఇంటి వద్దే కూరగాయలను కొనుగోలుచేసేందుకు అవకాశం లభిస్తుందన్నది ఉద్యానశాఖ ఉద్దేశ్యం. రైతుల నుండి మార్కెట్ వరకు వచ్చే కూరగాయల్లో కొంత శాతం రవాణాలో దెబ్బతినటం వల్ల రైతులకు నష్టం వస్తోందని, అలాకాకుండా విలువ ఆధారిత విధానంలో కూరగాయలను పరిశుభ్రంగా వినియోగదారుల వద్ద తీసుకెళితే లాభదాయకమైన ధర లభిస్తుందని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. కూరగాయల సాగు విస్తరణలో రైతులకు ప్రోత్సాహాన్నందించి, కూరగాయల ఉత్పత్తిని పెంచిన తరువాత, మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించకపోతే రైతులు నష్టపోతారని, అందువల్ల మార్కెటింగ్ అవకాశాలను కల్పించే బాధ్యతను కూడా తామే తీసుకోవాలన్న లక్ష్యంతో ఉద్యానశాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. విజిటబుల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో ప్రత్యేక వాహనంలో కూరగాయలను వినియోగదారుల వద్దకు రైతులే తీసుకెళతారు. కూరగాయలు తీసుకెళ్లే వాహనానికి కూడా ఉద్యానశాఖే డిజైన్ రూపొందించింది. కూరగాయలు దెబ్బతినకుండా, వినియోగదారులకు స్పష్టంగా కనిపించే విధంగా ప్రత్యేక ఏర్పాటు ఈ వాహనంలో ఉందని ఉద్యానశాఖ రాజమండ్రి అసిస్టెంట్ డైరక్టర్ దుర్గేష్ ఆంధ్రభూమి ప్రతినిధికి చెప్పారు. అయితే ఈ కార్యక్రమాన్ని 11మంది రైతులతో కూడిన ఒక గ్రూపు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ గ్రూపు కూడా సహకార సొసైటీల చట్టం కింద రిజిస్టర్ చేసుకోవాలి. ఇలా రిజిస్టర్ చేసుకున్న గ్రూపులోని రైతులు తాము పండించే కూరగాయలను తీసుకొచ్చి ప్రత్యేక వాహనంలో ఉంచుతారు. ముందుగానే రైతులంతా కలిసి నిర్ణయించుకున్న కేలండర్ ప్రకారం ఆయా ప్రాంతాలకు వెళ్లి కూరగాయలను అమ్ముతారు. మార్కెట్ కన్నా తక్కువ ధరకు, నాణ్యమైన కూరగాయలను ఈ విధానంలో వినియోగదారులకు అందించవచ్చని, ప్రతి వారం లేదా రైతులు, ఆయా ప్రాంతాల్లోని కాలనీవాసులు, అపార్ట్‌మెంట్‌వాసులు నిర్ణయించుకున్న రోజుల్లో నిర్ధిష్టమైన సమయాల్లో వెళ్లి కూరగాయలను అమ్మే విధానం కనుక క్రమం తప్పకుండా జరిగితే విజిటబుల్స్ ఆన్ వీల్స్ విజయవంతమవుతుందని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ కార్యక్రమం కింద రిజిస్టర్ చేసుకున్న రైతుల సంఘానికి ఉద్యానశాఖ నుండి రూ.2లక్షల వరకు సబ్సిడీ అందుతుందని, వాహనం కొనుగోలుకు రూ.4లక్షల 30వేల వరకు ఖర్చవుతుందని ఉద్యానశాఖ అసిస్టెంట్ డైరక్టర్ దుర్గేష్ చెప్పారు. జిల్లాలో ఒక గ్రూపునకు మాత్రమే ఇలాంటి అవకాశం కల్పించాలని ఉద్యానశాఖ భావిస్తున్నప్పటికీ, ఈ కార్యక్రమం విజయవంతమయితే మరికొన్ని గ్రూపులకు అవకాశం లభించవచ్చని తెలుస్తోంది. ఇది ఒక రకంగా మొబైల్ రైతు బజారని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు.
జెఎన్‌టియు లేడీస్ హాస్టల్లో కలుషిత నీరు సేవించి
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, ఆగస్టు 2: కాకినాడలోని జెఎన్‌టియుకె లేడీస్ హాస్టల్లో గురువారం రాత్రి కలుషిత నీరు సేవించి 22 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్టు విశ్వసనీయంగా తెలిసింది. హాస్టల్లో నివసిస్తున్న విద్యార్థినులు భోజనం అనంతరం అదే హాస్టల్లో సరఫరా అయ్యే నీరు తాగి అస్వస్థతకు గురైనట్టు సమాచారం. అయితే ఇందుకు సంబంధించి పోలీస్ స్టేషన్లో ఏవిధమైన కేసు నమోదు కాలేదని పోలీస్ వర్గాలు తెలిపాయి. మరోవైపు విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్టు సమాచారం అందుకుని విలేఖర్లు హాస్టల్లో ప్రవేశించేందుకు ప్రయత్నించగా జెఎన్‌టియుకె ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పద్మరాజు అటువంటి సంఘటనలేవీ జరగలేదని చెప్పారు. వాస్తవాలు తెలుసుకునేందుకు తమను హాస్టల్లోకి అనుమతించాలని విలేఖరులు కోరగా ఉమెన్స్ హాస్టల్ కావడంతో అర్థరాత్రి సమయంలో అనుమతించలేమని ఆయన స్పష్టం చేశారు. అయితే 22 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్టు విశ్వవిద్యాలయ వర్గాల్లో పెద్దయెత్తున ప్రచారం జరగడంతో పలువురు విద్యార్థినులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.

ఇది దొంగల ప్రభుత్వం
టిడిపి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు
రావులపాలెం, ఆగస్టు 2: కిరణ్ సర్కార్ దొంగల ప్రభుత్వంగా మారిపోయిందని, అవినీతి మంత్రులు, అధికారులను కేసుల నుండి రక్షించేందుకు జీవోల ద్వారా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగపర్చడమే దీనికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కింజరపు ఎర్రన్నాయుడు ధ్వజమెత్తారు. గురువారం జిల్లా పర్యటనలో భాగంగా రావులపాలెం వచ్చిన ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ఇందిరమ్మ బాట పేరుతో వివిధ జిల్లాల్లో షికార్లు చేస్తూ క్రికెట్, బాస్కెట్ బాల్ ఆడుతున్న సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు మాత్రం తీరికలేదని ఎద్దేవా చేసారు. వర్షాలు పడక, జలాశయాల్లో నీరు లేక విద్యుత్ ఉత్పత్తి దిగజారి ప్రజలు అష్టకష్టాలు పడటానికి ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడమే కారణమన్నారు. వర్షాభావం, కరువుపై రెండు నెలల క్రితం నుండే సంకేతాలున్నా కేంద్రానికి నివేదించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. వర్షపాతంలేని జిల్లాలకు కేంద్ర వ్యవసాయశాఖామంత్రి శరాద్‌పవార్ రూ. 2200 కోట్లు ప్రకటించగా ఆ సహాయానికి ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ఒక్క జిల్లా నోచుకోకపోవడం ప్రభుత్వతీరుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో కరువు, వర్షాభావాలు లేవా? అని ఆయన ప్రశ్నించారు. బీసీలకు సీట్లు కేటాయింపుల్లో టిడిపి చేసిన ప్రకటనతో కాంగ్రెస్ నాయకులకు పిచ్చిపట్టినంత పనైందన్నారు. బీసీల గురించి, సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు. బీసీలు టిడిపి సొత్తు అని, ప్రాణమని ఆయన స్పష్టం చేసారు. బీసీలకు మహిళలకు రాజ్యాధికారం కట్టబెట్టిన ఘనత టిడిపిదేనన్నారు. బీసీ రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణ చేయకముందే టిడిపి బీసీలకు పెద్దపీట వేసిందన్నారు. ప్రస్తుత కిరణ్ సర్కార్‌కు పాలనపై స్పష్టత లేదని, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో సీట్ల కేటాయింపులపై ఇంత వరకు ఎలాంటి ప్రణాళిక లేకపోవడమే దీనికి నిదర్శనమన్నారు. దీంతో లక్షలాది మంది విద్యార్ధుల భవిష్యత్ దిక్కుతోచనిస్థితిలో ఉందన్నారు. కాంగ్రెస్‌ను నమ్మి కేంద్రం, రాష్ట్రంలోనూ అధికారం కట్టబెట్టడమే ప్రజలు చేసిన నేరమా? అని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి ఒక్కక్షణం కూడా అధికారంలో ఉండే అర్హత లేదని దుయ్యబట్టారు.
ఇసుక మోసగాళ్లపై పీడీ చట్టం ప్రయోగించాలి
ఇసుక ర్యాంపులను పథకం ప్రకారం పెద్దమొత్తానికి పాడి వదిలేస్తున్న వారిపై పీడీ చట్టం ద్వారా కేసులు నమోదుచేయాలని ఎర్రన్నాయుడు డిమాండ్ చేసారు. రావులపాలెం ఇసుక ర్యాంపులో ఇటీవల రెండు దఫాలుగా రూ 10 కోట్లు, రూ 13.75 కోట్లకు పాడి వదిలేయడం ఇసుక మాఫియా కుట్ర అన్నారు. వారు అనుకున్నది సాధించేందుకు ఇసుక మాఫియా ఈ పన్నాగాన్ని అమలుచేస్తుందన్నారు. ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వమే ఇసుక ర్యాంపులను నిర్వహించి చౌకగా ఇసుకను సామాన్య ప్రజలకు అందించాలని ఆయన డిమాండ్ చేసారు. ఇసుక మాఫియా కుయుక్తులకు చేష్ఠలుడిగి చూస్తుండటం మాని ప్రభుత్వం ఈ ప్రయోగం ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. టిడిపి రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు బీసీలకు పెద్దపీట వేస్తూ జూలై 9న బీసీ డిక్లరేషన్ ప్రకటించారని, అది చారిత్రాత్మకమైన రోజని అన్నారు. వెనుకబడిన తరగతుల జిల్లా విస్తృతస్థాయి సమావేశం ఈ నెల 9న కాకినాడ సూర్యకళా మందిర్‌లో నిర్వహిస్తున్నామని, కొద్ది రోజుల క్రితం తిరుపతిలో నిర్వహించామని, అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశాల్లో టిడిపి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ బీసీలంతా పార్టీలోనే ఉంటామని ప్రకటించడంతో పాటు ఆయా కులసంఘాల అభిప్రాయాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుందన్నారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించడం కాంగ్రెస్ ప్రభుత్వానికే అలవాటుగా మారిందన్నారు. గత ఎనిమిదేళ్ళ కాలంలో ఈ విధంగా 17 వేల కోట్ల రూపాయలను దారి మళ్ళించారన్నారు. దీనిపై కమిటీ వేసినప్పటికీ అదంతా దళితులను ఆకట్టుకునే నాటకమేనన్నారు. కమిటీ వేసిన తరువాత కూడా 150 కోట్లు సబ్ ప్లాన్ నిధులు దారి మళ్ళించడమే దీనికి నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు వెంకట సత్తిబాబు, మండల పార్టీ అధ్యక్షుడు గుత్తుల పట్ట్భారామారావు, జిల్లా పార్టీ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు షేక్ అక్బర్ షరీఫ్, సయ్యపురాజు రామకృష్ణంరాజు, పెచ్చెట్టి చిన్నారావు, మంతెన గోపాలరాజు, మానే గోవిందు తదితరులు పాల్గొన్నారు.

కోకోనట్ ప్రొడ్యూసర్స్ సొసైటీల ఏర్పాటు
ఎంపి హర్షకుమార్ వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, ఆగస్టు 2: కోకోనట్ బోర్డు నుండి రైతులకు సబ్సిడీలు, ఇతర రాయితీలు అందాలంటే తప్పనిసరిగా కోకోనట్ ప్రొడ్యూసర్స్ సొసైటీలు ఏర్పాటుచేయాలని కోకోనట్ బోర్డు ఛైర్మన్ తెలిపారని అమలాపురం ఎంపీ జివి హర్షకుమార్ తెలిపారు. గురువారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో హర్షకుమార్ మాట్లాడారు. ఇటీవల తాను కేరళ వెళ్ళి కొచ్చిన్‌లో కోకోనట్ బోర్డు ఛైర్మన్‌తో సమావేశమైనట్లు హర్షకుమార్ వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా కొబ్బరిపై ఆధారపడిన వారు 28 మిలియన్ల మంది ఉంటే మనదేశంలో పది మిలియన్ల మంది ఉన్నారన్నారు. వరి, ఆక్వారంగాలపై దెబ్బతిన్న రైతులు కొబ్బరి అభివృద్ధిపై దృష్టిసారిస్తే గణనీయమైన రాయితీలతో పాటు లాభాలను కూడా ఆర్జించవచ్చని ఆయన తెలిపారు. శ్రీలంకలో చాలా తక్కువ స్థాయిలో కొబ్బరి పంట ఉన్నప్పటికీ ఏటా 30 నుండి 40 శాతం విదేశీ మారకద్రవ్యాన్ని సముపార్జిస్తుందన్నారు. కోకోనట్ ప్రొడ్యూసర్స్ సొసైటీలు మన రాష్ట్రంలో కనీసం 5 వేల వరకు ఏర్పాటుకావాలని ఆయన సూచించారన్నారు. మన రాష్ట్రంలో ప్రస్తుతం ఇటువంటి సొసైటీలు ఒక్కటి కూడా లేవన్నారు. పది కొబ్బరి చెట్లు ఉన్న రైతు కోకోనట్ ప్రొడ్యూసర్స్ సొసైటీలో సభ్యులుగా ఉండవచ్చన్నారు. ఇలాంటి సొసైటీలు విరివిగా ఏర్పాటుచేయాలన్నారు. దానివల్ల రైతులకు అనేక రాయితీలు కల్పిస్తామని ఆయన హామీనిచ్చినట్లు హర్షకుమార్ తెలిపారు. ఇలాంటి సొసైటీలన్నీ కలిపి కంపెనీలుగా ఏర్పడతాయని ఆయన సూచించారు. కొబ్బరి దింపు కార్మికుల సమస్య మనకే కాకుండా కేరళలో సైతం అధికంగా ఉందని, దీనిని నివారించేందుకు క్లెంబర్స్‌తో కొబ్బరి చెట్లు ఎక్కి కాయలు దించేందుకు వెయ్యి మందికి శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర క్వాయర్ బోర్డు సిద్ధంగా ఉందన్నారు. దీని ద్వారా మహిళలు సైతం కొబ్బరి చెట్లు ఎక్కి సురక్షితంగా కాయలు దించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. కేరళలో 33 శాతం మహిళలు కొబ్బరి దింపు కార్మికులుగా ఉన్నారన్నారు. తద్వారా నెలకు 22 వేల రూపాయలు సంపాదిస్తున్నారన్నారు. మన జిల్లాలో అంబాజీపేట కొబ్బరి పరిశోధన స్థానంలో వెయ్యి మందికి దశల వారీగా శిక్షణ ఇచ్చేందుకు కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. ఈ మిషన్లకు 5 వేలు ఖర్చవుతుందని, శిక్షణ అనంతరం వీటిని ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుందన్నారు. దీనికి ఆర్డీవో నోటిఫికేషన్ ఇస్తారని, 18 నుండి 40 సంవత్సరాల వయస్సు ఉండి 7వ తరగతి వరకు చదువుకున్న వారు ఈ శిక్షణ తీసుకోవచ్చన్నారు. ఈ శిక్షణ కార్యక్రమ ప్రారంభానికి కోకోనట్ బోర్డు ఛైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆహ్వానించనున్నట్లు హర్షకుమార్ వెల్లడించారు. కోకోనట్ బోర్డు రీజినల్ ఆఫీస్‌ను అమలాపురంలో ఏర్పాటుచేయాలని తాను లేఖ రాయగా బోర్డు నుండి ప్రతికూల సమాధానం వచ్చిందని హర్షకుమార్ వెల్లడించారు. ఈ సమావేశంలో క్వాయర్ బోర్డు డైరెక్టర్ పెనె్మత్స జగ్గప్పరాజు, ఆర్డీవో పి సంపత్ కుమార్, కాంగ్రెస్ నాయకులు గెడ్డం సురేష్‌బాబు, పిల్లి శ్రీనివాస్, కాశి శేషారావు, ఈతకోట బాలస్వామి, త్సవటపల్లి నాగభూషణం, పోతుకుర్రు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా 707 ‘మనగుడి’ పూజలు
సామర్లకోట, ఆగస్టు 2: జిల్లా వ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం, దేవాదాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో 707 దేవాలయాల్లో మనగుడి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించినట్లు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ డి రమేష్‌బాబు తెలిపారు. గురువారం స్థానిక పంచారామ క్షేత్రం భీమేశ్వరాలయంలో జరుగుతున్న మనగుడి పూజా కార్యక్రమాలను ఎసి రమేష్‌బాబు ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న 505 దేవాలయాల్లోనూ, అదనంగా 200 ఆలయాల్లో ఉదయం నుండి రాత్రి వరకూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివార్కి అమ్మవార్కి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదపండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. తదుపరి పూజలు జరుగుతున్న తీరును పర్యవేక్షించారు. ఈయన వెంట ఆలయ కార్యనిర్వహాణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ, మాండవ్యనారాయణ స్వామి దేవస్ధానం ఇవో పివి భాస్కరరావు, భక్తులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
ప్రజా ఉద్యమాలకు అండగా నిలుస్తాం
యు.కొత్తపల్లి, ఆగస్టు 2: ప్రజా ఉద్యమాలకు తాము అండగా నిలుస్తామని ఇండియన్ నేషనల్ సోషల్ యాక్షన్ ఫోరం (లక్నో)(ఇన్‌సాఫ్) కార్యదర్శి చిత్తరంజన్‌దాస్ పేర్కొన్నారు. గురువారం యు.కొత్తపల్లి మండలం రమణక్కపేట గ్రామంలో పెద్దరైతులతో నిర్వహించిన సమావేశంలో దాస్ ప్రసంగిస్తూ దేశవ్యాప్తంగా తమ సంస్థ అనేక ప్రజాపోరాటాలకు అండగా నిలిచిందన్నారు. ప్రస్తుతం దేశంలో అవినీతిపరులు రాజ్యమేలుతున్నారని, ప్రజలకు సరైన న్యాయం జరగడం లేదని ఆయన విచారం వ్యక్తం చేసారు. తమ హక్కులకు, ఆస్తులకు నష్టం వాటిల్లినట్లయితే పోరాటాల ద్వారానే తిరిగి సాధించుకోవాలని ఆయన సూచించారు. దేశంలో 551 సెజ్‌లకు అనుమతులు మంజూరయ్యాయని, పెద్దగా పరిశ్రమలు స్థాపించిన దాఖలాలు లేవని ఆయన తెలిపారు. పరిశ్రమల వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడి సుమారు 30 కి.మీ మేర ప్రజలు రోగాల బారిన పడే అవకాశాలున్నాయన్నారు. పచ్చటి పంట పొలాలు సెజ్‌ల పేరిట భూసేకరణ జరిపారని, వీటి వల్ల రైతులకుగాని, రైతు కూలీలకుగాని ఎక్కడా న్యాయం జరగలేదన్నారు. ఈ సమావేశంలో విశాఖకు చెందిన సమతా ఆర్గనైజేషన్ మహిళా సమన్వయకర్త లిల్లీరాణి, హైదరాబాద్‌కు చెందిన ఇన్‌సాఫ్ సభ్యురాలు విజయకుమారి, వాన్‌విక్ సెజ్ పోరాట కమిటీ నాయకులు శ్రీహరి, కడలి నెట్ వర్క్ కన్వీనర్ రాజేంద్రకుమార్, శ్రీవాణి ఆర్గనైజేషన్ సభ్యురాలు రత్నమాల, కాకినాడ సెజ్ పోరాట కమిటీ కన్వీనర్ బాలిశెట్టి నారాయణస్వామి, అధ్యక్షులు చింతా సూర్యనారాయణమూర్తి, రైతు నాయకుడు పెనుమల్లు సుబ్బిరెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.
కాకినాడలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, ఆగస్టు 2: కాకినాడ నగర పాలక సంస్థలోని వివిధ డివిజన్లలో గురువారం జిల్లా కలెక్టర్, కార్పొరేషన్ స్పెషలాఫీసర్ నీతూప్రసాద్ సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ఆట స్థలాలు, రహదారుల విస్తరణ కార్యక్రమాలను ఆమె పరిశీలించారు. నగరంలో జరుగుతున్న పారిశుద్ధ్యం పనుల తీరును ఆమె స్వయంగా పరిశీలించి, తీసుకోవల్సిన జాగ్రత్తలపై అధికార్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగన్నాథపురం వద్ద మెయిన్‌రోడ్డు విస్తరణకు తక్షణం మార్కింగ్ చేయాలని, మాస్టర్ ప్లాన్ ప్రకారం నగరంలో ప్రథాన రహదారి విస్తరణను 80 అడుగుల వెడల్పుతో నిర్మిస్తున్న నేపథ్యంలో ఈపనులను యుద్ధప్రాతిపదికన నిర్వహించాలన్నారు. టు టౌన్ నుండి మసీదు సెంటర్ వరకు ఈ పనులు వేగంగా జరుగుతున్నప్పటికీ మసీదు సెంటర్ నుండి జగన్నాథపురం వంతెన వరకు విస్తరణ పనులు జరగకపోవడం పట్ల అధికారులను కలెక్టర్ మందలించారు. అలాగే సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న ప్రతీచోటా అధికారులు అప్రమత్తమై, వ్యాధినిరోదక చర్యలు చేపట్టాలని, నీరు నిల్వవున్న ప్రాంతాల్లో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో చెత్తకుప్పలను ఎప్పటికపుడు తొలగిస్తూ ప్రతీరోజు ఫాగింగ్ చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
బ్యాంకులో నకిలీ నోట్లు
డిపాజిట్‌కు యత్నంపై కేసునమోదు
రాయవరం, ఆగస్టు 2: రాయవరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో ఈ నెల 1వ తేదీన డిపాజిట్ చేసేందుకు తెచ్చిన సొమ్ములో దొంగ నోట్లు లభ్యమైన నేరంపై బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అనపర్తి సిఐ కెవివి సత్యనారాయణ తెలిపారు. గురువారం ఈ నేరానికి సంబంధించిన గొలుగూరి వీర రాఘవరెడ్డి అనే వ్యక్తిని అనపర్తి కోర్టులో హాజరుపర్చగా, అతనికి 15 రోజులు డిమాండ్ విధించినట్లు సిఐ సత్యనారాయణ తెలిపారు.
కళాశాల అభివృద్ధికి ఎస్‌ఆర్‌ఎంటి విరాళం
కాకినాడ, ఆగస్టు 2: కాకినాడ నగరంలోని అన్నవరం సత్యదేవలక్ష్మీ ప్రభుత్వ మహిళా కళాశాల అభివృద్ధికై స్థానిక ఎస్‌ఆర్‌ఎంటి సంస్థ అధినేత కె సారధి 25 లక్షల విరాళాన్ని అందజేశారు. ఈమేరకు ఆయన గురువారం కలెక్టర్ నీతూప్రసాద్‌ను కలసి 25లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సారధిని కలెక్టర్ ప్రత్యేకించి అభినందించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఇ, ఇఇలకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, ఆగస్టు 2: ముందస్తు అనుమతి లేకుండా సెలవుపై వెళ్ళిన కాకినాడ నగర పాలక సంస్థకు ఎస్‌ఇ, ఇఇలకు జిల్లా కలెక్టర్, నగర పాలక సంస్థ ప్రత్యేకాధికారి నీతూప్రసాద్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నగర పాలక సంస్థలో గురువారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె ముందస్తు అనుమతి లేకుండా సెలవుపెట్టిన ఎస్‌ఇ, ఇఇల తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇకమీదట కార్పొరేషన్ అధికారులు తమ పనితీరును మెరుగుపరచుకోలేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్ అదనపు కమీషనర్ సత్యవేణి, ఆరోగ్య అధికారి రత్నఉమ తదితరులు పాల్గొన్నారు.
కిడ్నాప్ కేసులో పక్కింటి యువకుడే నిందితుడు
ఇంటికి చేరిన తల్లీకొడుకులు
రావులపాలెం, ఆగస్టు 2: సంచలనం రేకెత్తించిన తల్లీకొడుకల కిడ్నాప్ కేసు కీలక మలుపు తిరిగింది. బుధవారం సాయంత్రం ఆటోలో వెళ్తున్న రాజమండ్రికి చెందిన అరిటాకుల వరలక్ష్మి, ఆమె కుమారుడు ఎనిమిదేళ్ల సూర్యభగవాన్‌లను ఆలమూరు మండలం మూలస్థానం వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని ఆటో డ్రైవరు, మరో యువకుడు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. వరలక్ష్మి అత్త అరిటాకుల చంద్రావతిని ఆటో నుండి సినీఫక్కీలో దించివేసి, తల్లీకొడుకులను ఆటో డ్రైవరు, మరో యువకుడు కిడ్నాప్ చేశారు. చంద్రావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తల్లీకొడుకులకోసం గాలింపు చర్యలు చేపట్టగా గురువారం ఉదయం తల్లీకొడుకులు రాజమండ్రిలోని తమ ఇంటికి చేరారు. రాజమండ్రి బస్ స్టేషన్ నుండి ఫోన్ ద్వారా ఇంటికి సమాచారం ఇవ్వడంతో బంధువులు బస్టేషన్‌కు చేరుకుని వారిని ఇంటికి తీసుకెళ్ళారు. దీంతో రావులపాలెం పోలీసులు రాజమండ్రి వెళ్ళి వరలక్ష్మిని విచారించారు. ఈ విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. రావులపాలెం సిఐ సిహెచ్‌వి రామారావు ఈ వివరాలను గురువారం రాత్రి విలేఖరులకు తెలిపారు. వరలక్ష్మిని పక్కింట్లోనే ఉంటున్న దిరిశాల మాచిరాజు గత కొంతకాలంగా తనతో రావాలని వేధిస్తున్నాడు. ఈక్రమంలో బుధవారం అత్త చంద్రావతితో కలిసి వరలక్ష్మి మలికిపురం మండలం శృంగవరప్పాడు వెళ్తున్నట్టు తెలుసుకుని పథకం ప్రకారం ఆటో డ్రైవర్‌ను, మరో యువకుడిని వారి వద్దకు పంపాడు. ఆ ఆటో ఎక్కాలని, లేకపోతే చచ్చిపోతానని వరలక్ష్మిని రహస్యంగా బెదిరించాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె ఆటో ఎక్కింది. మూలస్థానం వద్దకు వచ్చేసరికి ముందుగా వేసుకున్న పథకం ప్రకారం అత్త చంద్రావతిని ఆటో నుండి దించివేశారు. తరువాత జొన్నాడ వరకు ఆటోలో తీసుకెళ్ళి, అక్కడి నుండి మాచిరాజు వరలక్ష్మి, సూర్యభగవాన్‌లను మోటారు సైకిల్‌పై మండపేట మీదుగా ధవళేశ్వరం తీసుకొచ్చి ఒక గదిలో ఉంచాడు. ఇక్కడే ఉండిపోదామని, ఇంటికి వెళ్ళవద్దని ఆమెకు నచ్చజెప్పాడు. అయితే ఉదయానికి ఆందోళనకు గురైన వరలక్ష్మి అతనికి తెలియకుండా కుమారుడిని తీసుకుని రాజమండ్రి బస్ స్టేషన్‌కు చేరుకుంది. పోలీస్ విచారణలో ఈ వివరాలు వరలక్ష్మి చెప్పడంతో మాచిరాజుపై బెదిరింపులు, కిడ్నాప్ కేసు నమోదు చేసినట్టు సిఐ రామారావు తెలిపారు. మాచిరాజుకు సహకారం అందించిన ఆటో డ్రైవరు, మరో యువకుడుని ఇంకా గుర్తించాల్సి ఉందని సిఐ తెలిపారు. కాగా వరలక్ష్మి భర్త శ్రీనివాసరావు రెండేళ్లుగా కువైట్‌లో ఉంటున్నట్టు తెలిసింది.

ఉద్యానశాఖ విజిటబుల్స్ ఆన్ వీల్స్
english title: 
va

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles