ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, ఆగస్టు 2: ప్రజల్లో మరింత ఆధ్యాత్మిక చింతన పెంచి హిందూ ధార్మిక వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు వీలుగా టిటిడి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మనగుడి’ కార్యక్రమం ఒక ధార్మిక పండుగలా సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా 13,773 ఆలయాల్లో గురువారం ఉదయం నుండి ఆయా ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఒక హిందూ పండుగ జరుపుకున్నంత సంబంరంతో వేడుక చేసుకున్నారు. ఉదయమే ఆలయాలకు వెళ్లి శుభ్రపరిచి రంగ వల్లులు వేసి తమ ఇంటి పండగను చేసుకున్నంతగా ఘనంగా చేసుకోవడం టిటిడి యాజమాన్యంలో నూతన ఉత్సాహాన్ని కల్పించిందనే చెప్పాలి. ఇక రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రావి, జివ్వి, తులసీ, వేప, తెల్లజిల్లేడు వంటి మొక్కలను కూడా ఆలయ ప్రాంగణంలో నాటారు. ఇక అనేక గ్రామాల్లోని ఆలయాల్లో ఉదయం నుండి సాయంత్రం వరకూ హరికథ, పురాణ ప్రవచనాలు సాగాయి. భక్తిసంకీర్తనా కార్యక్రమాలు, రథయాత్రలు, ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 3వేల ఆలయాల్లో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో మహిళలకు లతామంగేష్కర్ ఆలాపించిన భక్తిపాటల సిడిలను, పసుపుకుంకుమలను, కంకణాలను అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1000 దేవతా మొక్కలను నాటారు. హిందూ వ్యవస్థపై అన్యమతస్తులు జరుపుతున్న ప్రత్యక్ష, పరోక్ష దాడులను దీటుగా ఎదుర్కొనేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని టిటిడి ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం సంకల్పించారు. ఇందుకు శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని రాష్ట్రంలోని హిందూ దేవాలయాల్లో ‘మనగుడి’ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం సందర్భంగా భజన మండళ్ల చేత భగవన్నామ సంకీర్తనలు, భజనలు నిర్వహించారు. ఈ భజనలతో భక్తజనం పులకించిపోయారు. అంతేకాకుండా స్వామివారి పాదాల చెంత వుంచిన 69లక్షల కంకణాలను రాష్ట్ర వ్యాప్తంగా భక్తులకు పంపిణీ చేశారు. కాగా ప్రతి ఆలయాన్ని పుష్పాలతో, మామిడి తోరణాలతో, అరటి పిలకలతో, రంగవల్లులతో అత్యంత అందంగా ముస్తాబు చేశారు. గురువారం ఉదయం స్వామివారిని దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆలయ మహాద్వారం వద్ద రక్షా కంకణాలను పంపిణీ చేశారు.
గృహ నిర్మాణ లక్ష్యాలు పూర్తి చేయాలి
కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ ఆదేశం
చిత్తూరు, ఆగస్టు 2: గృహ నిర్మాణ కార్యక్రమాల లక్ష్యాలను సాధించడానికి హౌసింగ్ అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో గృహ నిర్మాణ ప్రగతిపై సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది 2012-13సంవత్సరానికి 55721గృహాలను నిర్మించాలని లక్ష్యం కాగా ఏప్రిల్ నుండి జూలై నెలాఖరు వరకు 18410లక్ష్యానికి గాను 7157గృహాలు మాత్రమే పూర్తి అయ్యాయని, 40శాతం మాత్రమే లక్ష్యాలు సాధించారని, గృహ నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయడానికి కృషి చేయాలన్నారు. గ్రామాల వారీగా పర్యటించి ఇంత వరకు ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించినవి, ప్రారంభమై ఇంకనూ పూర్తికానీ గృహాల వివరాలు, పూర్తి అయి పేమెంట్, ఇతర సమస్యలను గుర్తించి నివేదికలను 10వ తేది లోపు సమర్పించాలని హౌసింగ్ ఎఇలను ఆదేశించారు. ఈనెల రెండవ వారంలో ఈ జాబితాల ఆధారంగా ఆయా ఎంపిడిఓలు, తహశీల్దార్లు, ఎఇలు ఒక టీంగా ఏర్పడి గ్రామాలను సందర్శించి, లబ్ధిదారులతో సమావేశమై సమస్యలను చర్చించి, వారికి అవగాహన కల్పించాలన్నారు. గృహృ నిర్మాణ పనులు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకొని లబ్ధిదారులను మోటివేట్ చేయాలన్నారు. రచ్చబండ-2లో 25154గృహ నిర్మాణాలకు మంజూరు జరిగాయని చాలా మండలాల్లో పనులు ప్రారంభం కాలేదని, ఇందుకు గల కారణాలపై కలెక్టరు విశే్లషించారు. ఇంటి పట్టా పొజిషన్ సర్టిపికెట్లను మంజూరు చేయడానికి సంబంధిత తహశీల్దార్లుకు ఆదేశాలిస్తామన్నారు. ఈసమావేశంలో అదనపు జెసి వెంకటసుబ్బారెడ్డి, హౌసింగ్ పిడి వెంకటరెడ్డి, డిఇలు, ఎఇలు రమణ, నరశింహాచారి, రమణరాజు, గురుప్రసాద్, మల్లికార్జున్‌రెడ్డి, విఆర్ బాలాజీ, అశోకచక్రవర్తి, నారాయణ, మునీశ్వర నాయుడు, ఎస్‌కె.కరీముల్లా, సాంబశివయ్య, పి.మహేంద్రబాబు, మధుసూదన్‌రెడ్డి, బాలకృష్ణారెడ్డి, సుబ్బరామయ్య పాల్గొన్నారు.
‘మనగుడి’ జరుపుకోవడం శుభకరం
* మంత్రి గల్లా అరుణకుమారి స్పష్టం
ఆంధ్రభూమిబ్యూరో
తిరుపతి, ఆగస్టు 2: రాష్టవ్య్రాప్తంగా టిటిడి, దేవాదాయశాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న మనగుడి మహోత్సవం గురువారం కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామి జన్మనక్షత్రమైన శ్రవణానక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా అమ్మవారి ఆలయంలో విశేషపుష్పాలంకరణ చేశారు. పచ్చటితోరణాలతో శోభాయమానంగా అలంకరించారు. తిరుమల నుండి వచ్చిన పసుపు, కుంకుమ, అక్షింతలు, ప్రసాదాలు శ్రీవారి రక్షా కంకణాలను అమ్మవారి ఆలయంలో ఉంచి పూజలు నిర్వహించారు. వేకువజామున ఐదుగంటలకు గోవిందనామసంకీర్తనలతో మనగుడి మహోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం ఆరుగంటలకు అమ్మవారి ఆలయ సమీపంలో శోభాయమానంగా పుష్పాలంకరణ చేసిన శ్రీనివాసుని ఆలయంలో తిరుమల నుండి వచ్చిన పసుపు, కుంకుమ, ఇతర సుగందద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం నిత్యార్చన, వేదపారాయణం నిర్వహించారు. మనగుడి మహోత్సవం వేడుకల్లో భాగంగా ఆలయానికి విచ్చేసిన రాష్ట్ర భూగర్భగనులశాఖామంత్రి గల్లా అరుణకుమారి అమ్మవారిని దర్శించుకుని దర్శనానంతరం విలేఖరులతో మాట్లాడుతూ మనగుడి మహోత్సవం శ్రీవేంకటేశ్వర స్వామి జన్మనక్షత్రమైన శ్రవణానక్షత్రం రోజున జరుపుకోవడం శ్రీకరం, శుభకరం అన్నారు. హిందూ సంప్రదాయాలను కాపాడాలని టిటిడి, దేవాదాయశాఖ సంయుక్తంగా మనగుడి మహోత్సవాన్ని సుమారు 12వేలకు పైచిలుకు ఆలయాల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను కాపాడాలనేదే మనగుడి మహోత్సవం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించానన్నారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శ్రీవారి రక్షాకంకణాలను భక్తులకు పంపిణీ చేశారు. సాయంత్రం అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాల్లోని ఆలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి పూజలు, భజనలు నిర్వహించారు. మనగుడి మహోత్సవం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పెద్ద సంఖ్యలో విచ్చేశారు. దీంతో ఆలయ అధికారులు కుంకుమార్చన సేవను రద్దు చేసి లఘుదర్శనాన్ని అమలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇఓ గోపాలకృష్ణ, ఎఇఓ వేణుగోపాల్, ఎవిఎస్‌ఓ వేణుగోపాలరావు, ఆర్జితం ప్రసాదాల ఇన్‌స్పెక్టర్లు వెంకటరమణ, మురళీకృష్ణ, చిన్నంగారి రమణ, రెవిన్యూ అధికారులు విఆర్‌ఓ ప్రసాద్, ఆర్‌ఐ శివప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అమ్మవారిని దర్శించుకున్న ఉమాభారతి
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని గురువారం మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి దర్శించుకున్నారు. ఆమె ఆలయం వద్దకు రాగానే ఎఇఓ వేణుగోపాల్, సూపరింటెండెంట్ శేషాద్రిగిరి, ఎవిఎస్‌ఓ మల్లిఖార్జున్‌రావులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆమె కుంకుమార్చన సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం గజమండపం వద్ద ఆలయ అర్చకులు, అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.