గుంటూరు, ఆగస్టు 2: ప్రభుత్వం అందిస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన లబ్ధిదారులకు అంది వారికి మేలు చేకూర్చాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, జిల్లా స్థాయి అధికారులతో వివిధ అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా సురేష్‌కుమార్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేసేందుకు అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు. ఏ స్ఫూర్తితోనైతే పథకాలు రూపొందించబడ్డాయో, అదే స్ఫూర్తితో లబ్ధిదారులకు మేలు చేకూర్చేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. 13వ ఆర్థిక సంఘ నిధుల ఖర్చు వివరాలను జడ్పీ సిఇఒకు అందించాలని సూచించారు. మండలాల్లో చేపట్టే అభివృద్ధి పనులను ప్రభుత్వం నిర్దేశించి మార్గదర్శకాలను అనుసరించి మాత్రమే చేపట్టాలని స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకంపై కలెక్టర్ సమీక్షిస్తూ క్రోసూరు, మాచవరం మండలాల్లో అన్ని పారామీటర్లతో సరిచూసుకున్నా చాలా తక్కువగా పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సామర్ధ్యం ఎక్కువగా ఉన్నచోట పే ఆర్డర్ జనరేషన్ తక్కువగా ఉందని, వీటిని వేగవంతం చేసి సకాలంలో కూలీలకు వేతనం అందించేలా చూడాలన్నారు. ఉపాధి హామీ పథకంలో పనులను ముందుగా గుర్తించాలని సూచించారు. ప్రతి గ్రామంలో పని పూరె్తైన తర్వాత మరలా ఏ పని ఎప్పుడు చేపట్టడం జరుగుతుందో ముందుగా వేతన కూలీలకు తెలియజేయాల్సిన అవసరముందన్నారు. నెలముందుగా పనుల వివరాలను తయారు చేయాలని, అమలులో అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు. వదం రోజుల ఉపాధి హామీ పనులు చేపట్టిన పనులకు అదనంగా 50 రోజుల పని ఇప్పించే విధంగా ప్రభుత్వం ప్రతి కుటుంబానికి అవకాశం కల్పించిందన్నారు. జిల్లాలో కేవలం 4,794 కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పనిదినాలు కల్పించడం జరిగిందని తెలిపారు. ఇందిర జలప్రభ కార్యక్రమానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల భూములలో బోరు భావులు తవ్వించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. రాజీవ్ యువ కిరణాల పథకం కింద 15 వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ఇందుకు గాను అధికారులు గ్రామాల్లో పర్యటించి నిరుద్యోగ యువతను గుర్తించి వారిని ఈ పథకంల చేరేలా చూడాలని ఆదేశించారు. గ్రామాల్లో త్రాగునీరు, పారిశుద్ధ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పారిశుద్ధ్య కమిటీలను కొత్త నిబంధనల మేరకు ఏర్పాటు చేయాలని కోరారు. ఆయా సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రజలను భాగస్వాములు చేసి చైతన్యవంతులుగా తీర్చిదిద్దాలన్నారు. సాక్షరా భారత్ కార్యక్రమం సమర్ధవంతంగా జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపిక చేసిన వాలంటీర్ల సహాయంతో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నారు. ప్రజావాణి కార్యక్రమం మండలాల్లో సక్రమంగా నిర్వహించాలని, ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. ప్రతినెలా అధికారులు ఒకరోజు విధిగా వసతి గృహాల్లో రాత్రిపూట నిద్ర చేయాలని సూచించారు. వసతిగృహంలో సదుపాయాలు, వౌళిక వసతులు, విద్యార్థుల విద్యా విషయాలను తెలుసుకుని స్నేహభావంతో ఉండాలన్నారు. మండలాల్లోని పిహెచ్‌సి, అంగన్‌వాడీ కేంద్రాలను కూడా తనిఖీ చేసి, నివేదికను అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జడ్పీ సిఇఒ జయప్రకాష్ నారాయణ, ఆయా మండలాల అభివృద్ధి అధికారులు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు
ఇసుక లభ్యతను పెంచండి
గుంటూరు, ఆగస్టు 2: జిల్లాలో ఇసుక కొరత తీవ్రంగా ఉందని, ఈ దృష్ట్యా ఇసుక లభ్యతను పెంచేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సహకార శాఖ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి కలెక్టర్ సురేష్‌కుమార్, జెసి డాక్టర్ ఎన్ యువరాజ్‌లను కోరారు. గురువారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో జిల్లా అధికారులతో మంత్రి కాసు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాసు కృష్ణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఇతర రాష్టస్థ్రాయి అధికారులతో జిల్లాలో తాగునీటి పథకాల మంజూరుపై చర్చించామని చెప్పారు. కలెక్టర్ సురేష్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో మరో మూడు ఇసుక రీచ్‌లకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాల్సిందిగా నివేదికలు పంపామని తెలిపారు. పొరుగు జిల్లాల్లో కూడా ఇసుకను ఇదే స్థాయిలో డిమాండ్ ఉందని పే ర్కొన్నారు. లభ్యత ఉన్న ఇసుకలో ప్రభు త్వ పనులకు ప్రాధాన్యత ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ సురేష్‌కుమార్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సిం గం బసవపున్నయ్య పాల్గొన్నారు.
పూర్ణాహుతితో పరిసమాప్తమైన లలితాంబికాదేవి మహాయాగం
గుంటూరు (కల్చరల్), ఆగస్టు 2: విశ్వజన శ్రేయస్సును ఆకాంక్షిస్తూ గత మంగళవారం నుండి నగరంలోని పండరీపురంలో వేంచేసియున్న యాజ్ఞవల్క్య క్షేత్రంలో శ్రీ లలితా త్రిశక్తిపీఠం ఆధ్వర్యాన వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మూడు రోజులుగా నిర్వహిస్తున్న శ్రీ లలితాంబికాదేవి సపర్యా మహాయాగం గురువారం నాటి శ్రావణ పౌర్ణిమ నాడు వేదోప్తంగా పరిసమాప్తమైంది. ఈ సందర్భంగా గురువారం ప్రభాతవేళలో రుత్విక్కులు, యజ్ఞనిర్వాహకులు తొలుత ఆదిత్యునికి సూర్య నమస్కారాలు చేశారు. అనంతరం శ్రీ లలితా త్రిపుర సుందరీదేవికి పంచామృత స్నపన నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మీ, మహా సరస్వతీ, లలితాంబికకు పుష్పాభిషేకాన్ని కనుల పండువగా నిర్వహించారు. సామూహిక, అష్టోత్తర శత లలితాంబికా వ్రతాలలో అధిక సంఖ్యలో మహిళలు, కన్యలు, సువాసినులు శ్రద్ధాశక్తులతో పాల్గొన్నారు. అనంతరం సరిగ్గా మధ్యాహ్నం 2 గంటల సమయంలో విశేషమైన లలితాంబికాదేవి సపర్యా మహాయాగానికి రుత్విక్కులు పూర్ణాహుతి గావించారు.
పీఠ నిర్వాహకులు శంకరమంచి శ్రీరామకుమార్ శర్మ దంపతులు, శంకరమంచి జయంతి శాస్ర్తీ, పీఠ కార్యనిర్వాహకులు పాల్గొని అమ్మను సేవించుకున్నారు.
జీతాలు చెల్లించకుంటే 17 నుంచి సమ్మె
మంగళగిరి, ఆగస్టు 2: పురపాలక సంఘంలో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న సుమారు 150 మంది కార్మికులు జీతాలు అందక ఆర్థిక బాధలతో ఇబ్బంది పడుతున్నాని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లారుూస్ యూనియన్ నాయకులు ఎస్‌ఎస్ చెంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరు కుటుంబాలు గడవక అర్ధాకలితో కాలం వెళ్ళదీస్తున్నారన్నారు. మే నెలలో 4 రోజులు, జూన్, జూలై నెలల్లో జీతాలు ఇవ్వలేదని చెంగయ్య గురువారం మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈనెల 17వ తేదీలోపు కాంట్రాక్ట్ వర్కర్ల జీతాలు చెల్లించకుంటే తదుపరి సమ్మె తప్పదని, 15 రోజులు ముందుగా తెలియ జేస్తున్నామని సమ్మె నోటీసును కమిషనర్‌కు అందజేశారు.
టిప్పర్‌ను ఢీకొన్న బైక్: ఇద్దరి మృతి
తెనాలి రూరల్, ఆగస్టు 2: ప్రమాదవశాత్తు ఆగిఉన్న టిప్పర్‌ను బైకు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన తెనాలి మండలం కొలకలూరు వద్ద గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం తాడికొండ మండలం పొనె్నకల్లు గ్రామానికి చెందిన కామేపల్లి కోటేశ్వరావు(50), కోట గోవిందు(49) బైకుపై వారి గ్రామం నుండి కొలకలూరులో జరుగుతున్న బంధువుల వివాహానికి హాజరైయ్యారు. వివాహం అనంతరం ఇద్దరు బైకుపై తిరుగు ప్రయాణమై వెళుతూ మార్గమద్యంలో కొలకలూరు గ్రామం దాటిన తర్వాత రహదారి పక్కనే ఆగి ఉన్న టిప్పర్ లారీని ఢీకొట్టారు. ఈ సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి గమనించిన స్థానికులు క్షతగ్రాతులను తెనాలి పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకువస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ప్రమాద తెనాలి రూరల్ ఎస్‌ఐ బాస్కరావు తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం తర్వాత మృతుల బంధువులకు మృతదేహాలను అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భాస్కరరావు తెలిపారు.