ఆంధ్రభూమిబ్యూరో
ఖమ్మం, ఆగస్టు 2: ఖమ్మం జిల్లాపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని, జిల్లాలో అన్ని వనరులు ఉన్నప్పటికీ అభివృద్ధిలో మాత్రం పూర్తిగా వెనుకబడిపోయామని ఖమ్మం ఎంపి నామ నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఆంధ్రభూమితో ప్రత్యేకంగా మాట్లాడుతూ జిల్లాలోని సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో నీరు, విద్యుత్ వనరులు అన్ని ఉన్నాయని, వాటిని ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం చొరవ చూపకపోవడం బాధాకరమన్నారు. జిల్లాలోని పలు
సమస్యలపై వేల సంఖ్యలో ప్రభుత్వానికి లేఖలు రాశానని, వాటికి స్పందన లేదన్నారు. జిల్లాలో ఎంపి నిధుల ద్వారా 597 పనులను చేపట్టగలిగానన్నారు. ఉపాధి హామీ పథకం కింద 340 ప్రాజెక్టులు చేపట్టానని, పార్టీలకు అతీతంగా అడిగినవారందరికీ రైల్వే పాస్ సౌకర్యం, గ్యాస్ సౌకర్యం అందిస్తున్నానన్నారు. రాజకీయాల్లోకి రాకముందే తన తండ్రి నామ ముత్తయ్య పేరుతో ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా పలు సామాజిక కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు.
బయ్యారం ఆపినందుకు గర్వంగా ఉంది
బయ్యారంలో అక్రమ తవ్వకాలను ఆపగలిగినందుకు గర్వపడుతున్నట్టు నామ చెప్పారు. పార్లమెంట్‌లో బయ్యారం అక్రమ తవ్వకాలు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టానని, తాను మాట్లాడిన రోజే సంబంధిత శాఖామంత్రి బయ్యారం తవ్వకాలకు ఇచ్చిన లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్టు చెప్పడం తన విజయంగా భావిస్తున్నానన్నారు. అలాగే బాబ్లీపై తమ పార్టీ చేపట్టిన ఉద్యమానికి ప్రజలంతా మద్దతివ్వడం గుర్తుంచుకోదగిన అంశమన్నారు.
సమస్యలపై ఉద్యమం
త్వరలో జిల్లాలోని సమస్యలపై భారీగా ఉద్యమాన్ని చేపట్టనున్నట్టు నామ స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించటంలో కొంతమేరకు విజయం సాధించానని, అయితే ప్రభుత్వ సహకరం లేనికారణంగా మరికొన్ని సమస్యలు పెండింగ్‌లో ఉంటున్నాయన్నారు. జిల్లా అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు అధికారపార్టీ ప్రజాప్రతినిధులు కూడా సహకరించడం లేదన్నారు. జిల్లాలోని వనరులను ఉపయోగించుకుంటూ జిల్లా ప్రజలను అభివృద్ధి చేయాల్సిన కార్యక్రమాలపై ప్రణాళిక రూపొందించుకుంటున్నామని, దీనిపై త్వరలోనే ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు.
ఐక్యంగానే పనిచేస్తున్నాం
జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నేతలంతా ఐక్యంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నామన్నారు. పార్టీ కార్యకర్తలందరినీ ఐక్యం చేసి ఈ ఆందోళనల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోబోతున్నామన్నారు. తన నియోజకవర్గ పరిధిలో లేని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, తనకు జిల్లా అభివృద్ధే లక్ష్యమని స్పష్టం చేశారు.
గ్రానైట్ హబ్‌పై ప్రత్యేక శ్రద్ధ
జిల్లాలోని తిరుమలాయపాలెం మండలంలో 500 ఎకరాలలో గ్రానైట్ హబ్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రితో కూడా మాట్లాడానని వెల్లడించారు. దేశంలోనే ప్రాధాన్యత కలిగిన ఖమ్మం గ్రానైట్ పరిశ్రమ మరింత కాలం వర్థిల్లాలంటే గ్రానైట్ హబ్ తప్పనిసరైన విషయాన్ని ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.
సింగరేణి బొగ్గు ఉత్పత్తికి ప్రతికూలంగా మారిన ప్రకృతి
కొత్తగూడెం, ఆగస్టు 2: సింగరేణి బొగ్గు ఉత్పత్తికి ప్రకృతి వైపరీత్యాలు శాపంగా మారడంతో ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. గడిచిన నాలుగు మాసాలలో నాలుగుజిల్లాలలో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థలోని 11 ఏరియాలు 90శాతం ఉత్పాదకరేటును మాత్రమే నమోదుచేసుకుని బొగ్గు ఉత్పత్తిలో వెనుకంజలో ఉన్నాయి. ఇల్లెందు, మణుగూరు, రామగుండం - 3 ఏరియాలు మాత్రమే నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్షసాధనలో సఫలీకృతం కాగా మిగిలిన ఎనిమిది ఏరియాలు లక్షసాధనలో చతికిలపడ్డాయి. వేసవికాలంలో ప్రచండభానుడి తీవ్రతకు కార్మికుల హాజరుశాతం గణనీయంగా తగ్గడంతో ఉత్పత్తికి విఘాతంకలిగింది. అదేవిధంగా ప్రస్తుత సీజన్‌లో వర్షాలు కురుస్తుండడం వలన సింగరేణి బొగ్గు ఉత్పత్తికి వెనె్నముకగా ఉండే ఓపెన్‌కాస్టు గనులలో వర్షపునీరు చేరుకున్న కారణంగా ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. నూతన ఆర్థిక సంవత్సరంలో గడిచిన నాలుగుమాసాలలో సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11ఏరియాలలో 17142247టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాల్సివుండగా 15405362 టన్నులు మాత్రమే సాధించి సంస్థ 90శాతం ఉత్పాదకరేటును మాత్రమే నమోదుచేసుకుంది. దీనిలో కొత్తగూడెం ఏరియా 2460010 టన్నులు సాధించాల్సివుండగా 2390636 టన్నులు సాధించి 97శాతం ఉత్పాదకరేటును నమోదుచేసుకుంది. ఇల్లెందు ఏరియా 1248896 టన్నులకు గాను 1336959టన్నులు సాధించి 107శాతం, మణుగూరు ఏరియా 2320692 టన్నులకు గాను 2459188 టన్నులు సాధించి 106శాతం, రామగుండం - 1ఏరియా 2176886టన్నులకు గానూ 1878695టన్నులు సాధించి 86శాతం, రామగుండం - 2ఏరియా 1793410 టన్నులకు గాను 1432664 టన్నులు సాధించి 80శాతం, రామగుండం - 3 ఏరియా 1588921 టన్నులకు గాను 1682107 టన్నులు సాధించి 106శాతం, భూపాలపల్లి ఏరియా 1034694 టన్నులకు గాను 518250 టన్నులు మాత్రమే సాధించి కేవలం 50శాతం ఉత్పాదక రేటును నమోదుచేసుకుంది. అవిధంగా ఆడ్రియాల ఏరియా 529289 టన్నులకు గాను 264590 టన్నులు మాత్రమే సాధించి 50శాతం, బెల్లంపల్లి ఏరియా 1529470 టన్నులకు గాను 1292471 టన్నులు సాధించి 85శాతం, మందమర్రి ఏరియా 504173 టన్నులకు గాను 387836 టన్నులు సాధించి 77శాతం, శ్రీరాంపూర్ ఏరియా 1955806 టన్నులకు గాను 1761966 టన్నులు సాథించి 90శాతం ఉత్పాదకరేటును నమోదు చేసుకున్నాయి. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 36్భగర్భగనులలో 5242944 టన్నుల బొగ్గు ఉత్పత్తిని గడిచిన నాలగుమాసాలలో సాధించాల్సివుండగా కేవలం 3790037 టన్నులు సాధించి 72శాతం ఉత్పాదకరేటును మాత్రమే నమోదు చేసుకోగా, 14 ఓపెన్‌కాస్టు గనులు 11899303 టన్నులు సాధించాల్సివుండగా 11615325 టన్నులు సాధించి మెరుగైన ఉత్పత్తి ఫలితాలతో 98శాతం ఉత్పాదకరేటును నమోదుచేసుకున్నాయి. భవిష్యత్‌లో నిర్ధేశిత ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు అధికారులు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలుచేసేందుకు సమాయత్తవౌతున్నారు.
అన్నపురెడ్డిపల్లి విషజ్వరాలపై కదలిన జిల్లా యంత్రాంగం
చండ్రుగొండ, ఆగస్టు 2: మండలంలోని అన్నపురెడ్డిపల్లి గ్రామంలో విషజ్వరాలతో బాధపడుతున్న వారిని స్వయంగా కలిసి పరిస్థితులను అంచనా వేసేందుకు జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్‌తో పాటు జిల్లా అధికార యంత్రాగం గురువారం అన్నపురెడ్డిపల్లి గ్రామానికి కదిలివచ్చింది. బుధవారం ఆంధ్రభూమి పత్రికలో ముగ్గురు మృతిచెందినా కదలని జిల్లా యంత్రాంగం అనే కథనానికి స్పందించిన జిల్లా యంత్రాంగం గ్రామాన్ని సందర్శించి రోగులను ఓదార్చారు. గ్రామాన్ని చేరుకున్న కలెక్టర్ తొలుత దేవస్థానసత్రంలో ఏర్పాటుచేసిన వైద్యశిబిరంలో చికిత్సపొందుతున్న రోగులను పరామర్శించారు. శిబిరంలో వైద్యసేవలు అందిస్తున్న డాక్టర్ల బృందాన్ని విషజ్వరాలు తదితర అటువ్యాధులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసమయంలో అక్కడికి వచ్చిన ఆశ్వారావుపేట ఎమ్మెల్యే ఒగ్గెల మిత్రసేనతో పాటు డిఎంహెచ్‌ఓ డి విజయ్‌కుమార్, పంచాయితీరాజ్‌శాఖాధికారి విల్సన్‌బెన్నీ, జిల్లా మలేరియా అధికారి అన్సారీ, ఆర్డీఓ ధర్మారావుతో కలిసి గ్రామంలో రోగాల బారినపడ్డ వారి ఇళ్లకు వెళ్ళి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా 10రోజుల క్రితం డెంగ్యూ లక్షణాలతో మృతిచెందిన దోసపాటి రాజ్యలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. మలేరియా వ్యాధి సోకిన పసుమర్తి వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్ళి ప్రైవేట్ వైద్యుని వద్ద అతను వాడుతున్న మందులను పలురకాల పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను డిఎంహెచ్‌ఓ పరిశీలించారు. రక్తపరీక్ష చేసిన స్థానిక ల్యాబ్‌కు గుర్తింపులేదని పక్కనే ఉన్న ల్యాబ్‌యజమాని పిలిచి మందలించారు. గుర్తింపులేని డాక్టర్లు, ల్యాబ్‌యజమానుల మాటలు నమ్మిభయాందోళన చెందవద్దన్నారు. కొందరు వ్యక్తులు లేనిరోగాలు ఉన్నట్లుగా రోగిని భయపెట్టి డబ్బులు గుంజుతున్నారని అక్కడ గుమికూడిన ప్రజలకు వివరించారు. ఈసమయంలో గ్రామస్థులు స్పందిస్తూ ప్రభుత్వ వైద్యం అందకనే ప్రైవేట్‌వైద్యులను ఆశ్రయించాల్సివస్తోందని కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. గ్రామంలో రోడ్లు మురికికూపాలను తలపిస్తున్నాయని, మురికినీరు, దోమల నివారణకు అధికారులు ఎటువంటి ముందస్తు చర్యలు చేపట్టలేదని కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. ఈకార్యక్రమంలో తహశీల్దార్ నాగేశ్వరరావు, ఎంపిడిఓ గోవిందరావు, బాలాజీ దేవస్థానం చైర్మన్ కాపుగంటి సత్యబాబు, స్థానిక నాయకులు సారేపల్లి శేఖర్, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.