కర్నూలు, ఆగస్టు 2: ప్రభుత్వ నిర్లక్ష్యం, వైద్యుల ధన దాహం, వైద్య సిబ్బంది అవినీతి కలిసి ప్రభుత్వ ఆసుపత్రుల ఉనికికే ప్రమాదం తెచ్చిపెడుతోంది. ప్రభుత్వాసుపత్రులకు వైద్యం చేయించుకునేందుకు వెళ్లడం కన్నా ఇంటి వద్దే మరణానికి చేరువ కావడం నయమన్న అభిప్రాయం ప్రజల్లో ప్రబలుతోంది. అవకాశం ఉంటే ఖర్చు పెట్టి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లడం మేలు కాని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడం అనవసరం అన్న భావన కలిగేలా అంతా కలిసి చేస్తున్నారు. జీవించి ఉన్నపుడే నరకాన్ని చూపించేవే ప్రభుత్వాసుపత్రులుగా సర్వజనులు దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు అందాల్సిన సేవలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతోంది. చిన్నారులు చిగురుటాకులా రాలిపోయినా, చిన్న వ్యాధితో ఆసుపత్రికి వచ్చి అంతుచిక్కని విధంగా ప్రాణాలు వదిలినా ఎవరూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో సామాన్యుడు ఉన్నాడు. వైద్య విద్య చేతిలో ఉంది ప్రాణాలు కావాల్సిన వారు తమ వద్దకే వస్తారన్న భావన ప్రభుత్వ వైద్యుల్లో నెలకొని ఉంది. ప్రభుత్వ నుంచి జీతం తీసుకుంటూ వైద్య సేవలను తమ సొంత ఆసుపత్రుల్లో అందజేస్తున్న వైద్యులను కట్టడి చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోందన్న ఆరోపణలు ఎన్ని ఉన్నా చర్యలు మాత్రం శూన్యం. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మారుమూల గ్రామాల్లో వైద్యం అంటే తెలియని వారు కూడా ఆర్‌ఎంపి పేరుతో బోర్డు పెట్టుకొని వేల రూపాయాలు దండుకునే దుస్థితి నెలకొని ఉంది. గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సిబ్బంది రికార్డులకు మాత్రమే పరిమితమవుతున్నాయి. రోగం వస్తే రోగులు ఎక్కడి వెళ్లాలో తెలియక తెలిసీ తెలియని వైద్యం అందిస్తున్న వారి బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కర్నూలులో తెలంగాణా, ఆంధ్రా, రాయలసీమ ప్రజలకు సేవలందించే శక్తి ఉన్న వెయ్యి పడకల ఆసుపత్రిలో సైతం నిర్లక్ష్యపు రోగం రోగులను బలిగొంటోంది. కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉచిత సేవలు అందించాల్సిన వైద్యులు రోగులను తమ క్లినిక్‌లకు రమ్మంటున్నారు. వైద్యులకు సకాలంలో వైద్యం అందడం గగనంగా మారుతోందన్న రోగుల వేదన గాలిలో కొట్టుకుపోతోంది. ఏడాది క్రితం చిన్న పిల్లల విభాగంలో రెండు రోజుల వ్యవధిలో దాదాపు 30 మంది చిన్నారులు ప్రాణాలు వదులుతున్నా వైద్యుల్లో చలనం, ప్రభుత్వంలో స్పందన కనిపించకపోవడం ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు వెల్లడిస్తోంది. ఒక్క కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికే జీతాలు, సౌకర్యాలు, మందులు తదితర ఖర్చు కోసం ప్రతి ఏటా రూ.120 నుంచి 150 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. మిగిలిన జిల్లా వ్యాప్తంగా మరో రూ.150 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. ఇంత ఖర్చు చేస్తున్నా సామాన్యుడి ఆరోగ్యానికి మాత్రం భరోసా లభించడం లేదు. జిల్లాలో అతి పెద్ద ఆసుపత్రి అయిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు 300 పడకల సామర్థ్యం ఉన్న నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి, వంద పడకల ఆదోని ఏరియా ఆసుపత్రి, యాభై పడకల ఎమ్మిగనూరు, బనగానపల్లె ఆసుపత్రులే కాకుండా మరో 16 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, 83 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 542 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో ప్రభుత్వం తరపున పేదలకు వైద్య సహాయం అందించేందుకు పలు రకాల హోదాల్లో సుమారు దాదాపు 2500 నుంచి మూడు వేల వరకు వైద్యులు, వైద్య సిబ్బందిని ప్రభుత్వం కేటాయించింది. ఇందులోని పలు విభాగాల్లో సుమారు 600 ఉద్యోగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చొరవ చూపకపోవడం గమనార్హం. జిల్లా కేంద్రంలోని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 250 మంది వైద్యులు పని చేయాల్సి ఉండగా 62 వైద్య నిపుణుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇతర సిబ్బంది విషయంలో కూడా ప్రతి విభాగంలో 15శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ఆసుపత్రి రికార్డుల ద్వారా తెలుస్తోంది. ప్రతి రోజు మూడు వేల మంది వైద్య సహాయం కోసం రోగులు వస్తుండగా ఆసుపత్రిలో ఉంటూ నిత్యం వెయ్యి మంది రోగులు వైద్య చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో 36 విభాగాలు ఉండగా ప్రధాన వ్యాధులకు సంబంధించిన వైద్యుల కొరత రోగులను వేధిస్తోంది. రోగులకు వైద్య సేవలందించేందుకు కర్నూలు ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్యాలయం ఉన్నా అక్కడ కూడా వైద్య సేవలు అంతంత మాత్రమేనని రోగులు పెదవి విరుస్తున్నారు. పారిశుద్ధ్యం అన్న మాట ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో కనిపించదని ప్రజలు భగ్గుమంటున్నారు. విచ్చలవిడిగా తిరిగే పందులు, రక్తం పీల్చే దోమలు, చికాకు తెప్పించే ఈగలు ఇలా చెప్పుకుంటూ పోతే చెత్త కుండీ పక్కన కూర్చున్నామా అన్న అభిప్రాయం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది పూర్తి స్థాయిలో ఎన్నడూ చూడలేదని గ్రామీణులు వాపోతున్నారు. చిన్న వ్యాధికి సైతం మందులు లభించని దుస్థితి ఆయా కేంద్రాల్లో నెలకొని ఉందని మండిపడుతున్నారు. ఆరోగ్య ఉప కేంద్రాల దుస్థితి కారణంగానే గ్రామాల్లో నాటు వైద్యం, వైద్యం తెలియని ఆర్ ఎంపిలు సైతం భారీ ఎత్తున సంపాదించుకుంటున్నారని పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో మందులు కూడా లభించని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వాటి గురించి పట్టించుకునే వారు కరువయ్యారని పేద ప్రజలు వాపోతున్నారు. ఆరోగ్య శ్రీ పథకం కింద కూడా ప్రభుత్వ వైద్య సహాయం అందకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రుల వైపే ప్రజలు పరుగులు తీస్తున్నారు. ఇక నల్లమల అటవీ ప్రాంతంలోని ఆత్మకూరు పరిసర గ్రామాల్లో బోదకాలు వ్యాధి, చెంచులకు విష జ్వరాలు, దీర్ఘకాలిక వ్యాధి అయిన క్షయ వంటివి పట్టి పీడిస్తున్నా వైద్య సిబ్బంది, ప్రభుత్వం స్పందించకపోవడం నిర్లక్ష్యం రోగులను ఎంత వెక్కిరిస్తుందో ఇట్టే అర్థమవుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సహాయం అందితే తమ క్లినిక్‌లకు పుట్టగతులుండన్న భావనతో 90శాతం వైద్యులు ప్రభుత్వ వైద్యం పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని మిగిలిన 10శాతం మంది నిజాయితీగా, నిబద్దత, క్రమశిక్షణతో వైద్యం అందిస్తున్నా ఆ ఫలితం మాత్రం కనిపించకపోవడం విశేషం. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో అంటు వ్యాధిలా పాతుకుపోయిన నిర్లక్ష్యం, అవినీతిని కడిగేయడం, సకాలంలో నిధులు మంజూరు చేయడం, ఖాలీ అయిన పోస్టుల్లో వెంటనే కొత్త వారిని నియమించడం వంటి చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ ఆసుపత్రుల మనుగడే ఉండకపోచ్చంటే అతిశయోక్తి కాదేమోనని ప్రజలు పేర్కొంటున్నారు.
జోరందుకున్న పంటల సాగు
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, ఆగస్టు 2: ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఆలస్యంగానైనా మంచి వర్షపాతం నమోదు కావడంతో రైతులు భారీ ఎత్తున పంటల సాగును చేపట్టారు. సీజన్ ప్రారంభ మాసమైన జూన్‌లో ఇబ్బంది పెట్టినా జూలై నెలలో భారీ వర్షపాతం నమోదు కావడంతో రైతులు ఆనందంతో విత్తనాలు వేశారు. జూన్, జూలై రెండు నెలలు కలిపి సగటు వర్షపాతం నమోదు కావడంతో అధికారులు సైతం ఆగస్టులో మంచి వర్షపాతం నమోదు అయితే కరవు కోరల్లోంచి బయట పడ్డట్లేనని స్పష్టం చేస్తున్నారు. జూన్ మాసంలో సగటు వర్షపాతం 77.1మి.మీ వర్షానికి గాను 39.8మి.మీ వర్షం కురిసింది. జూలై సగటు వర్షపాతం 117.2మి.మీ వర్షానికి గాను 146.4మి.మీ వర్షం కురిసింది. జూన్‌లో 48శాతం తక్కువ వర్షం కురవగా జూలైలో 25శాతం ఎక్కువ వర్షం కురిసింది. ఈ రెండు నెలల సగటు వర్షపాతంతో పోలిస్తే సాధారణ వర్షపాతం నమోదు అయిందని వర్షపాత రికార్డుల ప్రకారం వెల్లడవుతోంది. జూన్‌లో వర్షం కురవకపోవడంతో ఒక్క ఎకరాలో కూడా విత్తనం వేయని రైతులు జూలైలో కురిసిన వర్షంతో సుమారు 2.25లక్షల హెక్టార్లలో విత్తనాలు వేసినట్లు తెలుస్తోంది. మండలాల వారీగా వివరాలు వెల్లడైతే ఏ మండలంలో ఎంత మేర, ఏ పంట సాగులోకి వచ్చింది వివరంగా తెలియనుంది. వర్షపాత వివరాల ప్రకారం జూన్ మాసంలో జిల్లాలో అధిక మండలాల్లో తక్కువ వర్షం కురిసింది. సగటు కన్నా మిడుతూరు, నంద్యాల, బండి ఆత్మకూరు, నంద్యాల మండలాల్లో మాత్రమే ఎక్కువగా కురవగా అసలు వర్షం కురవని మండలాలు కోడుమూరు, కోసిగి, హాలహర్వి, అవుకు మండలాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 29 మండలాల్లో అతి తక్కువ వర్షపాతం కేవలం సగటు వర్షం కన్నా 10 నుంచి 40శాతం వర్షం మాత్రమే కురిసింది. ఇక తక్కువ వర్షం 7 మండలాల్లో, సాధారణ వర్షం 10 మండలాల్లో నమోదు అయింది. దీంతో జూలై మాసం 15వ తేదీ లోగా సరైన వర్షపాతం నమోదు కాకపోతే కరవులో చిక్కుకున్నట్లేనని భావించారు. ఈ మేరకు ప్రత్యామ్నాయ పంట ప్రణాళికను సైతం సిద్ధం చేశారు. మరో వైపు ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వరి పంటకు విరామం పలుకాలని అధికారులు నిర్ణయించారు. జూన్‌లో ఎదురైన చేదు అనుభవాలతో జూలై మాసంలోకి అడుగు పెట్టిన ప్రజలు మొదటి రెండు వారాలు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొన్నారు. జూలై రెండవ పక్షంలో వరుణుడు కరుణించి భారీ వర్షాలు కురిపించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ఈ వర్షాలతో రైతులకే కాకుండా భూగర్భ జల మట్టం పెరిగి తాగునీటి సమస్య కూడా తగ్గే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు భావించారు. జూలై మాసంలో అన్ని మండలాల్లో వర్షపాతం నమోదు కావడం హర్షనీయం. కేవలం కౌతాళం, హోళగుంద, పత్తికొండ, గోస్పాడు, సంజామల మండలాల్లో మాత్రమే తక్కువ వర్షపాతం నమోదు కాగా 19 మండలాల్లో సాధారణ వర్షపాతం 29 మండలాల్లో అధిక వర్షపాతం నమోదు అయింది. తక్కువ వర్షపాతం నమోదు అయిన ఆరు మండలాల్లో కూడా విత్తనం వేసేందుకు ఇబ్బంది లేదని ఆగస్టు వర్షాలతో ఆ మండలాల్లో కూడా రైతులకు మంచి జరుగుతుందన్న ఆశాభావంతో వ్యవసాయ అధికారులు ఉన్నారు. తుపాను ప్రభావంతో ఆగస్టు మాసంలో భారీ వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అధికారుల అంచనాలు వాస్తవ రూపం దాలిస్తే ఈ సీజన్‌లో వర్షాధార పంటలకు ఇబ్బందులు ఉండవని ఇక ముందు జలాశయాలు నిండితే వరి పంట సాగు సైతం చేపట్టేందుకు ఇబ్బందులు తొలిగిపోతాయని వెల్లడిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జలాశయాలకు నీటి చేరిక ఇంకా అనుమానంగానే ఉన్న కారణంగా ఇక వరి పంటకు తప్పనిసిరి పంట విరామం పాటించేలా రైతుల్లో చైతన్యం తీసుకు వచ్చి ఈ సీజన్‌లో ఆరుతడి పంటల సాగుకు ముందుకు వచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు వ్యవసాయ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అందరూ ఆశ పెట్టుకున్న ఆగస్టు మాసంలో వరుణుడు ఏం చేస్తాడో వేచి చూడాలి.
ఆలయాల్లో చోరీ
10 కిలోల వెండి ఆభరణాల అపహరణ
ఆళ్లగడ్డ, ఆగస్టు 2: ఆళ్లగడ్డ పట్ణణంలో ఉన్న రెండు ఆలయాల్లో ఏకకాలంలో రెండు చోరీలు చోటు చేసుకున్నాయి. అహోబిలం రోడ్డులో వున్న ఆంజనేయ స్వామి దేవాలయం, అమృత లింగేశ్వర స్వామి ఆలయంలో దొంగలు ఒకేసమయంలో చోరీకి పాల్పడి దాదాపు 10 కిలోల వెండి ఆభరణాలను దోచుకెల్లారు. అర్చకులు రోజు మాదిరిగానే బుధవారం రాత్రి స్వామి పూజల అనంతరం గర్భగుడికి అంతర్గత తాళం ఆపై గొళ్లెంకు, కటాంజనానికి తాళం వేశారు, అలాగే ప్రధాన ద్వారానికి కూడా తాళం వేసి వెళ్లారు. గురువారం ఉదయం అర్చకులు ఆలయానికి వచ్చేసరికి ఉత్తర ద్వారం తాళం తెరిచి ఉండడంతో పాటు గర్భగుడి తీసి ఉండడంతో వెంటనే చోరీ జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. అలాగే అమృత లింగేశ్వరస్వామి ఆలయంలో కూడా ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఉదయం అర్చకులు ఆలయానికి వచ్చి చూడగా తాళం బద్దలుకొట్టి ఉండడంతో చోరీ జరిగిందని భావించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సిఐ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో రూరల్ ఎస్‌ఐ ఈశ్వరయ్య సిబ్బందితో కలిసి చోరీ జరిగిన ఆలయాలను పరిశీలించారు. ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామి వారి వెండి ఆభరణాలైన పాదాలు, కవచం, కిరీటాలు, అభయహస్తంలు దాదాపు 6 కిలోలు అపహరణకు గురైయాయి అన్నారు. అమృతలింగేశ్వరస్వామి ఆలయంలో నాగాభరణం, అభయహస్తం, విభూది బిల్లలు దాదాపు 3.5 కిలోలు ఉన్నాయన్నారు. ఈ రెండు ఆలయాలల్లోచోరీకి గురైన వస్తువుల విలువ దాదాపు రూ.5 లక్షలు ఉంటుందని అంచనా. విషయం తెలిసిన వెంటనే డిఎస్‌పి బిఆర్. శ్రీనివాసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కర్నూలు నుండి క్లూస్ టీంతో పాటు పోలీస్ జాగిలాన్ని రప్పించి దొంగలను గుర్తించేందుకు కృషి చేస్తున్నారు. వీలైనంత త్వరలో దొంగలను పట్టుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి గురువారం ఆళ్లగడ్డ పట్టణంలోని ఆంజనేయస్వామి, అమృతలింగేశ్వరస్వామి ఆలయాల్లో చోరీ జరిగిన విషయం తెలుసుకొని ఆలయాలను పరిశీలించి ఆలయ అర్చకులను అడిగి చోరీ జరిగిన విషయాలను గురించి తెలుసుకున్నారు. సిఐ సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఐ ఈశ్వరయ్యలను కూడా చోరీ జరిగిన విషయాలను అడిని తెలుసుకున్నారు.
దొంగలను పట్టుకుంటాం : పట్టణంలో కొద్ది రోజులుగా ఆలయాలలో జరుగుతున్న వరుస చోరీలపై పోలీసుల నిఘా వుంచామని త్వరలోనే దొంగలను పట్టుకుంటామని డిఎస్పీ బిఆర్ శ్రీనివాసులు అన్నారు. గురువారం ఉదయం చోరీ జరిగిన ఆలయాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొంగతనాలపై ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించామని త్వరలోనే దొంగలను పట్టుకుంటామని డిఎస్పీ స్పష్టం చేశారు.
సంస్కృతి సంప్రదాయాలు చాటేందుకే
మనగుడి కార్యక్రమం
కర్నూలు సిటీ, ఆగస్టు 2 : సనాతన హిందూ సంస్కృతి, సంప్రదాయాలు చాటుకునేలా, హిందూ ధర్మాన్ని ప్రతిబింబించేలా గురువారం రాష్టవ్య్రాప్తంగా మనగుడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానములు ఎగ్జిక్యూటివ్ అధికారి ఎల్‌వి సుబ్రహ్మణ్యం అన్నారు. గురువారం కర్నూలులోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయనతోపాటు కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఎసి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనగుడి కార్యక్రమ విశేషాలను ఎల్‌వి సుబ్రహ్మణ్యం పాత్రికేయులకు వెల్లడించారు. టిటిడి సెంట్రల్ ధార్మిక్ అడ్వయిజరీ కమిటీ సూచనలతో మనగుడి కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా రూపకల్పన చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 13,733 దేవాలయాల్లో గురువారం ఈ కార్యక్రమం జరిగిందని, 65.45 లక్షల మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని, టిటిడి పంపిన 68 లక్షల ధర్మ కంకణాలతోపాటు ఆయా ఆలయాల్లో స్వామివార్లకు, అమ్మవార్లకు వస్త్రాల అందజేత జరిగిందన్నారు. మారుతున్న యాంత్రిక జీవనంలో దైవ చింతన, ధార్మిక భావాలు పలుచన అవుతున్నాయని, సమాజంలో సనాతన ధర్మానికి మూలమైన గుడిని మర్చిపోకూడదనే ఉద్దేశ్యంతో ఒక్కరోజైనా ప్రతివారూ గుడికి వెళ్లి ఆధ్మాత్మికతను ఆస్వాదించాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. హిందూ సంస్కృతి మహాన్నతమైనదని, దీన్ని గ్రహించలేని కొందరు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడటం సరికాందన్నారు. నవ సమాజానికి మార్గ నిర్దేశ్యం చేసిన ప్రధాన భూమిక దేవాలయాలకు దక్కుతుందన్నారు. ఈ స్ఫూర్తితోనే రాష్ట్రంలోనూ పురాతన దేవాలయాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ధర్మ ప్రవర్తన సమాజంలో పెరిగేందుకు టిటిడి వివిధ కార్యక్రమాలను చేపడుతోందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ మనగుడి కార్యక్రమం జిల్లాలోని అన్ని ఆలయాల్లో నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలో తనతోపాటు ఇతర అధికారులు కూడా ఈ కార్యక్రమానికి అనుసంధానం చేశామని, మన సంస్కృతి సంప్రదాయాలను మనమే కాపాడుకోవాలని, భావితరాల ఉన్నతికి అవి ఎంతో దోహదపడతాయన్నారు.
నేడు పినాకపాణికి టిటిడి పక్షాన శ్రీగాన విద్యా వారధి పురస్కారం
కర్నూలుకు చెందిన గాత్ర సంగీత విద్వాంసులు, పద్మవిభూషన్ పురస్కార గ్రహీత శ్రీపాద పినాకపాణి 100వ జన్మదినోత్సవం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానములు తరపున శ్రీగాన విద్యా వారధి పురస్కారాన్ని ఆయనకు అందజేస్తున్నట్లు టిటిడి ఇవో ఎల్‌వి సుబ్రహ్మణ్యం తెలిపారు. పినాకపాణి వయోభారంతో మంచంలో ఉండి లేవలేని స్థితిలో ఉన్నందున శుక్రవారం ఆయన జన్మదినం సందర్భంగా కర్నూలులోని ఆయన స్వగృహంలో టిటిడి పక్షాన పురస్కారంతోపాటు రూ.10,01116 నగదు, శాలువ, జ్ఞాపిక ప్రదానం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, పినాకపాణి శిష్యబృందం, సంగీతాభిమానులు పాల్గొంటారని తెలిపారు. సాయంత్రం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రముఖ గాత్ర సంగీత కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని వివరించారు.