శ్రీకాకుళం, ఆగస్టు 2:వ్యవసాయం...వ్యయసాయంగా మారినా అనాదిగా ఆ రంగాన్ని నమ్ముకుని కుటుంబాలను నెట్టుకొస్తున్న అన్నదాతలు వ్యయప్రయాసలకు గురై బతుకుబండి సాగిస్తున్నారు. గడచిన ఖరీఫ్‌లో వరిసాగు చేసి నష్టాన్ని దిగమింగుకుంటూ వరుణదేవుడు కరుణించి పంటలు కలసిరాకపోతాయా అన్న అతి విశ్వాసంతో వేలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టి విత్తనాలు కొనుగోలు చేసి నారుమళ్లు సిద్ధం చేసినా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. రుతుపవనాలు దోబూచులాడటం...అల్పపీడన ద్రోణి, తుఫాన్ హెచ్చరికలు..వాతావరణ కేంద్రం జారీ చేసిన కనీస వర్షపాతం నమోదు కాకపోవడంతో అన్నదాతలలో మరింత దిగులు వెంటాడుతోంది. కేవలం చిరుజల్లులకే చినుకు పరిమితం కావడంతో కావాల్సిన వర్షపాతం ఖరీఫ్ పనులకు లేక అన్నదాతలు హడలెత్తిపోతున్నారు. ప్రకృతి సహకరించకపోవడం పంట కాలువల్లో సాగునీరు ముందుకు కదలకపోవడంతో ఈ ఏడాది కూడా నష్టాలు చవిచూడాల్సి వస్తుందేమోనన్న దిగులు ఆ కుటుంబాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. జూన్‌లో 134.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా వంద మిల్లీమీటర్లతో సరిపెట్టుకుంది. జూలై నెలలో 12230.7 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 10698.3 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇదిలా ఉంటే జిల్లాలోని వంశధార, నాగావళి, బహుదా నదుల ఆయకట్టు రైతాంగం కూడా ఉబాలు పూర్తిచేయలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటివరకు పంటకాలువల్లో టైలాండ్‌కు సాగునీరందక కేవలం 30 శాతం ఉబాలు మాత్రమే పూరె్తైనట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలో 2.10 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సీజన్‌లో వరిసాగు జరుగుతోంది. ఇందులో 70 శాతం వరకు వర్షాధారమే. వర్షాలు కురిస్తేనే పంటలు ఆశాజనకంగా ఉంటాయి. ఆగస్టు మొదటి వారం సమీపించినా ఖరీఫ్ సీజన్ ఊపందుకోకపోవడంతో రైతులను భయం వెంటాడుతోంది. ఎరువు కూడా కావాల్సినంత సిద్ధం చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. 32,696 మెట్రిక్ టన్నులు అవసరం కాగా 18 వేల మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నట్లు సంబంధిత అధికారుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. విత్తనాలు కూడా ఇదే మాదిరిగా సరఫరా చేయడంతో అన్నదాతలు వ్యాపారుల వలలో చిక్కుకుని తీవ్రంగా నష్టపోయారు. 1.60 లక్షల క్వింటాళ్ల విత్తనాలు రైతాంగానికి అవసరమైనప్పటికీ 58 వేల క్వింటాళ్లను మాత్రమే రాయితీపై సరఫరా చేసి చేతులు దులిపేసికున్నారు. పంట రుణాల కోసం తిప్పలు తప్పడం లేదు. ఈ ఖరీఫ్‌లో రైతులకు వ్యవసాయ అనుబంధ రంగాలలో 1030.27 కోట్ల రూపాయల రుణాలను ఇవ్వాలని ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటివరకు 440 కోట్లు మాత్రమే రుణాలు అందించారు. ఇందులో అధిక శాతం రెన్యూవలే కావడం గమనార్హం. కొత్తగా పంట రుణం అన్నదాతలకు గగనంగా మారింది. ఇలా ఖరీఫ్ సీజన్‌లో వరిసాగు చేసే అన్నదాతలకు అడుగడుగునా ఆటంకాలే ఎదురయ్యే సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి.
ఎచ్చెర్లలో..
ఎచ్చెర్ల: మండలంలోని 11 గ్రామ పంచాయితీలలో రైతాంగానికి సాగునీరందించాల్సిన నారాయణపురం కుడికాలువ ఆధునీకరణ పనులు నత్తనడకన సాగడంతో ఈ ఏడాది సాగునీటి కష్టాలు తప్పేటట్లు లేదు. ఇబ్రహీంబాద్, పూడివలస, తమ్మినాయుడుపేట, కుశాలపురం, తోటపాలేం, కొత్తపేట, ముద్దాడ, కొంగరాం, రామజోగిపేట, భగీరధపురం, ధర్మవరం, బొంతలకోడూరు గ్రామాల్లోని 8,750 ఎకరాలకు ఈ కాలువ గుండా సాగునీరు సరఫరా కావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు కేవలం వెయ్యి ఎకరాల్లో కూడా ఉబాలు పూర్తికాకపోవడం ఆగస్టు మొదటివారం సమీపించడంతో ఖరీఫ్‌పై కారుమబ్బులు కమ్ముకుంటున్నాయి. నారుమళ్లు 21 రోజులకే ఉబాలు పూర్తిచేయాల్సి ఉన్నప్పటికీ ఆ దాఖలాలు కానరావడం లేదు. నారు ముదిరితే దిగుబడి తగ్గిపోతుందని, వరుణదేవుని కరుణ కోసం వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. వర్షాధార గ్రామాల్లో ప్రతీ ఏటా మూడువేల ఎకరాల్లో చెరువులు ఆయకట్టుగా వరిసాగుచేయడం పరిపాటి. దీని కోసం సిద్ధం చేసిన ఆకుమడులు ఎండలకు ఎండిపోయి కరవుఛాయలు ఆ గ్రామాల్లో కమ్ముకుంటున్నాయి. మండలంలో మే నెలలో సాధారణ వర్షపాతం 104 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 62.2 మిల్లీమీటర్లు నమోదైంది. జూన్ నెలలో 113 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 62.0 మిల్లీమీటర్లు నమోదైంది. జూలై నెలలో 139 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా 195 మిల్లీమీటర్లు కురిసింది. ఆగస్టు నెలలో 175 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 2.4 మిల్లీమీటర్లు ఇప్పటివరకు నమోదైంది. ఇలా వర్షపాతం కూడా అన్నదాతలకు సహకరించని స్థితిలో ఉండడంతో వారంతా మరింత దిగులు చెందుతున్నారు. వరుణదేవుని కరుణ కోసం వెయ్యి కళ్లతో నాట్లు వేయాలని గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్న అన్నదాతల ఆశలు ఎలా ఫలిస్తాయో వేచిచూడాలి మరి.
శ్రీకాకుళం రూరల్‌లో..
శ్రీకాకుళం(రూరల్): అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మండలంలో ఆయకట్టు రైతుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. నారాయణపురం ఎడమకాలువ, వంశధార కుడికాలువ, బైరిదేసిగెడ్డ తదితర ఛానల్స్ ఉన్నప్పటికీ ఉభాలు మాత్రం అరకొరగా సాగడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. మండలం పరిధిలోని 7157 హెక్టార్లలో సాధారణంగా వరిసాగవుతుండగా ఇంతవరకు కేవలం 30 శాతం మాత్రమే ఉబాలు పూర్తికావడంతో రైతుల్లో దిగులు వెంటాడుతోంది. కాలువ కింద భూముల్లో తప్ప చెరువు ఆధారంగా పండించే పొలాల్లో ఇంతవరకు ఉబాలు ప్రారంభం కాలేదు. పాతృనివలస ఎత్తుప్రాంతం కావడంతో కాలువ ఉన్నప్పటికీ ఉబాలు ఆరంభానికి నోచుకోలేదు. అలాగే సింగుపురం, వాకలవలస, కిష్టప్పపేట ప్రాంతాలకు కూడా దీనికి భిన్నంగా లేదు.
రణస్థలంలో..
రణస్థలం: జిల్లా ముఖద్వారం వద్దనున్న మండలం కరవు కోరల్లో చిక్కుకుంది. ఈ రైతాంగాన్ని ఆదుకునే నాధుడే కరువయ్యాడు. తరచూ కరవుకాటకాలతో అలమటిస్తూ బతుకుతెరువు కోసం అన్నదాతలు వ్యవసాయ కూలీలుగా మారాల్సిన పరిస్థితి ఉంది. 30 గ్రామ పంచాయితీల్లో ఉన్న 95 శాతం మందికి వ్యవసాయమే జీవనాధారం. మండలంలో 6687.78 ఎకరాల పల్లపుభూమి ఉంది. అయితే సాధారణ వర్షపాతం కూడా నమోదుకాకపోవడం, ఆయకట్టు చెరువులు నిండకపోవడంతో కనీసఉబాలు కూడా సాగలేదు. మే నెలలో 98.0 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కురవాల్సి ఉండగా 14.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూన్ నెలలో 119 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా 61.2 మిల్లీమీటర్లు, జూలైలో 146 మిల్లీమీటర్లులకు గాను 158.2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. గత ఏడాది జిల్లాలో 30 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించి ఈ ప్రాంతాన్ని విస్మరించడంపై అన్నదాతలు మరింత నిరాశకు లోనయ్యారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితులు నెలకొన్నాయి. ఉబాలు సాగించాలని చెరువులు ఆయకట్టుగా వేసిన నారుమళ్లు ఎండలతీవ్రతకు ఎండిపోయి ఆ రైతులు నష్టాలఊబిలో కూరుకుపోతున్నారు. మేఘమాలిక మబ్బులతో దర్శనమిస్తోంది కాని చినుకు రాల్చకపోవడంపై రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు.
పొందూరులో..
పొందూరు: నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వలన మండలంలో ఖరీఫ్ సాగుపై కరవుమేఘాలు కమ్ముకుంటున్నాయి. నైరుతి రుతుపవనాల తాకిడిలో కొంతమేర జాప్యం జరగడంతో వరినారుమళ్లు ఎండిపోతున్నాయి. సాగునీరు లేక ఉబాలు ముందుకు సాగడం లేదు. మండలంలో 29 పంచాయితీలుండగా 12 పంచాయితీల పరిధిలో నారాయణపురం కుడికాలువ సాగునీరందుతోంది. 14 పంచాయితీలు వర్షాధారమే. ఎదలు రూపంలో వెయ్యి హెక్టార్లు ఉండగా వెయ్యి ఎకరాలు సాగవుతోంది. 2,500 హెక్టార్లు ఉబాలు జరగాల్సి ఉండగా ఇప్పటివరకు 150 హెక్టార్లలో నాట్లు పూర్తయినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. నారాయణపురం కాలువ నీరు ఆలస్యంగా విడుదలవ్వడంతో రైతులపాలిట శాపంగా మారింది. వర్షాధార గ్రామాల్లో పరిస్థితులు దయనీయంగా మారాయి. వర్షపాతం విషయానికి వస్తే మే నెలలో 120 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 95.6 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. జూన్ నెలలో 160 మిల్లీమీటర్లు నమోదవ్వాల్సి ఉండగా కేవలం 58 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. జూలై నెలలో 192 మిల్లీమీటర్లు సాధారణ వర్షపాతం కాగా 226 మిల్లీమీటర్లు నమోదైంది. వరినారు సిద్ధం చేసి 30 రోజుల్లో ఉబాలు పూర్తిచేయాల్సి ఉండగా 50 రోజులు గడుస్తున్నా నాట్లు పడకపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. భారీ వర్షాలు పడకుంటే కరవు కోరల్లో రైతాంగం చిక్కుకోవాల్సిందే.
లావేరులో...
లావేరు: ప్రతీఏటా కరవుకోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోన్న ఈ ప్రాంత రైతాంగానికి ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఎదురుకానుందన్న భయం వెంటాడుతోంది. గడచిన ఆరేళ్లుగా కరవును నెత్తిన మోసుకుంటూ అన్నదాతకు అదును దాటిపోవడం నారు ముదిరిపోవడంతో ఖరీఫ్‌పై ఆశలు సన్నగిల్లుతున్నాయి. పూర్తిగా వర్షాధార ప్రాంతమైన మండలంలో పదివేల హెక్టార్లలో పంటలకు బావులు, పంపుసెట్లు, సాగునీటి చెరువులు, పెద్దగెడ్డ తదితర నీటివనరులే పెద్దదిక్కు. అయితే సాధారణంగా 3,500 హెక్టార్లలో వరినాట్లు వేయాల్సి ఉంది. కానీ ఆ పరిస్థితి కానరావడం లేదు. వర్షాలు అనుకూలిస్తే జూలై మాసాంతానికి నాట్లు పూరె్తై కలుపు తీసే కార్యక్రమాలు ఆరంభించాల్సి ఉంది. నేటికి రెండువేల హెక్టార్లలో వరిసాగుకు రంగం సిద్ధమైంది. ప్రధానంగా పెద్దగెడ్డ పరివాహక ప్రాంతమైన కొత్తకోట, అదపాక, బుడుమూరు, రొంపివలస, తామాడ, లక్ష్మీపురం, నేతేరు గ్రామాలకు ఆనుకుని ఉన్న భూముల్లో గెడ్డనీటితోనే వరిసాగుచేసేవారు. అయితే ఈ ఏడాది వర్షాలు కరుణించక ఈ గెడ్డలో చుక్కనీరు కూడా లేకపోవడంతో ఉబాలు సాగే పరిస్థితి కానరావడం లేదు. జూన్ నెలలో 108 మిల్లీమీటర్లసాధారణ వర్షపాతం కురవాల్సి ఉండగా 86 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. జూలైలో 144 మిల్లీమీటర్లు పడాల్సి ఉండగా 159 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది కూడా కరవు ఛాయలు కమ్ముకుంటున్నాయన్న దిగులు అన్నదాతలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
జలుమూరులో...
జలుమూరు: మండలంలో మూడువేల ఎకరాలు మినహా మిగిలిన విస్తీర్ణంలోని 12 వేల ఎకరాల్లో ఉబాలు వేసేందుకు అన్నదాతలు వ్యవసాయపనులు ముమ్మరంగా సాగిస్తున్నారు. మూడువేల ఎకరాలు మాత్రం వర్షాధారం కావడంతో కనీస వర్షపాతం లేక బీడుభూములుగా మారాయి. వంశధార ప్రధాన ఎడమకాలువ, పిల్లకాలువలు, నిండినచెరువుల ద్వారా ఉబాలు ముందుకు సాగుతున్నాయి. మెట్ట ప్రాంతాలైన టెక్కలిపాడు, రాయిపాడు, దరివాడ తదితర పంచాయితీ పరిధిలో కనీసం దుక్కిలు కూడా సాగడం లేదు. ఆయా గ్రామాల్లో నారుమళ్లు రక్షించుకునేందుకు రైతులు వ్యయప్రయాసలకు గురవుతున్నారు. వరుణదేవుడు కరుణించకే ఇటువంటి దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయని పలువురు రైతులు వాపోతున్నారు. లింగాలవలస, చల్లవానిపేట పంచాయితీ పరిధిలో 1500 ఎకరాలకు ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందాల్సి ఉండగా ఈ పథకం మూలనపడడంతో ఆయకట్టు రైతులు నిరాశకు లోనవుతున్నారు.
సారవకోటలో...
సారవకోట: మండలంలో ఖరీఫ్ వరినాట్లు నత్తనడకన సాగుతున్నాయి. ఆశ, నిరాశల మధ్య ప్రారంభమైన వ్యవసాయ పనులు ఇప్పుడిప్పుడే ఊపందుకున్నాయి. నారుమళ్లు వేసిన తరువాత కొద్దిరోజులు వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో తొలుత రైతులు ఆందోళనకు గురయ్యారు. కొద్దిపాటి వర్షాలు కురియడంతో ఆశలు చిగురించి అన్నదాతలు ఉబాలు ప్రారంభించారు. మండలంలో సాధారణంగా 7934 హెక్టార్లలో వరిసాగు చేయాల్సి ఉంది. ఇందులో కాలువల కింద 948 హెక్టార్లు, చెరువులు ఆయకట్టు 4618 హెక్టార్లు, వర్షాధారం 2368 హెక్టార్లలో ఉబాలు పూర్తిచేయాల్సి ఉంది. వంశధార కాలువ ఆయకట్టు ప్రాంతంలో దాదాపు 90 శాతం వరినాట్లు పూర్తయ్యాయి. ఇక్కడి మెట్టప్రాంతాల్లో నాట్లు పడాల్సి ఉంది. ఇటీవలి అనుకూలించిన వర్షాలు కారణంగా చెరువుల్లో నీరుచేరి 1500 హెక్టార్లలో మాత్రమే ఇప్పటివరకు వరినాట్లు పడినట్లు సంబంధిత అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉండగా 1150 హెక్టార్లలో ఎదసాగు చేస్తున్నారు.
జిల్లాకు బిసి స్టడీ సర్కిల్
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, ఆగస్టు 2: ఉత్తరాంధ్ర జిల్లాలకు ఒకేఒక బి.సి.స్టడీ సర్కిల్ నడుపుతున్న సర్కార్ శ్రీకాకుళం జిల్లాకు మరో బి.సి.స్టడీసర్కిల్‌ను మంజూరు చేసింది. రాష్ట్ర రోడ్లు,్భవనాలశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు గురువారం ‘ఆంధ్రభూమి’తో హైదరాబాద్ నుంచి మాట్లాడుతూ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల బి.సి. నిరుద్యోగ యువతకు కాంపిటేటివ్ పరీక్షల కోచింగ్ ఇచ్చే స్టడీసర్కిల్ ఒక్క విశాఖపట్నంలో ఉండేదని, ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. జిల్లా జనాభాలో 70 శాతం వరకూ బి.సి.లు కలిగిన శ్రీకాకుళంలో సుమారు 4.20 లక్షల మంది బి.సి. నిరుద్యోగులకు ఉద్యోగ‘బాట’ పట్టేలా కోచింగ్ ఇచ్చేందుకు మరో మూడు నెలల్లో చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. బి.సి.సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ స్టడీ సర్కిల్‌లో సివిల్స్ నుంచి ఎ.పి.పి. ఎస్.సి., బ్యాంకు, రైల్వే, గ్రూప్-4 వరకూ కాంపిటేటివ్ కోచింగ్ నిర్వహించనున్నారు. జిల్లాలో అంబేద్కర్ యూనివర్సిటీ అనుబంధంగా గల 21వ శతాబ్ధపు గురుకుల భవనాల్లో ఈ స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేసేందుకు సర్కార్ అనుమతులు ఇచ్చింది. విద్యాధికులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసే స్టడీ సర్కిల్ జిల్లాలో ఏర్పాటు చేయడం ఓ వరం. నిన్నమొన్నటి వరకూ ఆంధ్రాయూనివర్సిటీ అనుబంధంగా గల విశాఖపట్నంలో బి.సి.స్టడీ సర్కిల్‌ను జిల్లా బి.సి.విద్యార్ధులు, నిరుద్యోగులు వినియోగించుకుని ఉన్నత శిఖరాలు, మరెన్నో అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఇటువంటి సంస్థ సిక్కోల్‌లో ఏర్పాటు చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.