కూచిపూడి, ఆగస్టు 2: దేశ అభ్యున్నతికి జీవితాన్ని ధారపోసిన పింగళి వెంకయ్య చిరస్మరణీయులని వక్తలు నివాళి అర్పించారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య 135వ జయంతిని ఆయన జన్మించిన గ్రామం భట్లపెనుమర్రులో పంచాయతీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పింగళి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన జీవిత విశేషాలను వివరించారు. కార్యక్రమంలో ఎంఇఓ పరసా సోమేశ్వరరావు, కార్యదర్శి బూరే అశోక్, రెగ్యులర్ పాఠశాల ప్రధానోపాధ్యాయిని సిహెచ్ అనురూప, ఉపాధ్యాయులు అగ్నిహోత్రం శ్రీరామ చక్రవర్తి, చలసాని అశోక్, సంఘిశెట్టి సాంబశివరావు, చింతా రామ్మూర్తి, బి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మండలంలోని పలు పాఠశాలల్లో పింగళి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఇసుక కోసం ఎడ్లబండ్ల యజమానుల ధర్నా
* తహశీల్దార్ ఆఫీసు ముట్టడి
తోట్లవల్లూరు, ఆగస్టు 2: ఇసుక క్వారీ ఉన్న గ్రామ ప్రజలు తమ అవసరాలకు ఎడ్లబండ్ల ద్వారా ఇసుక తోలుకునే అవకాశం లేకుండా 20రోజుల నుంచి రెవెన్యూ అధికారులు విధించిన ఆంక్షలతో తమ జీవనం దుర్భరంగా తయారయిందని తోట్లవల్లూరు ఎడ్లబండ్ల యజమానులు, పలువురు రైతులు గురువారం తహశీల్దార్ కార్యాలయం వద్ద వినూత్న రీతిలో ఆందోళనకు దిగారు. తోట్లవల్లూరు గ్రామంలోని రైతులు తమ ఎడ్లబండ్లను తహశీల్దార్ కార్యాలయానికి తోలుకొచ్చి ఆర్ అండ్ బి రోడ్డుపై ధర్నా నిర్వహించారు. దీంతో రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తహశీల్దార్ కార్యాలయంలోకి ఎవరూ వెళ్ళకుండా వారు ముట్టడి చేశారు. రైతులు పుట్టి రాజేష్, గొరిపర్తి రవి, శ్రీనివాసరావు, వల్లూరు సుదర్శనరావు, డొక్కు గోవిందు, వి రవి, వల్లూరు చంటి, జి నాగరాజు తదితరులు సుమారు 50 ఎడ్లబండ్లను రోడ్డుపై విడిచి ఆందోళన చేపట్టారు. పూర్వం నుంచి ఇసుక క్వారీ ఉన్న గ్రామస్తులు తమ అవసరాలకు ఎడ్లబండ్ల ద్వారా ఉచితంగా ఇసుక తోలుకునే అవకాశం ఉందని, అయితే 20రోజుల నుంచి రెవెన్యూ అధికారులు గ్రామంలో ఇసుక తోలుకోకుండా నిషేధం విధించారని రైతులు చెప్పారు. చెరకు సీజన్ ముగిశాక ఎడ్లబండ్లకు ఎలాంటి పని ఉందని, ఈ వర్షాకాలంలో ఇసుక తోలుకునే పని ఒక్కటే ఉంటుందన్నారు. అధికారులు ఇసుక తోలకాలను బంద్ చేయటంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఎడ్లబండ్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు 400 రూపాయల కూలి ఇసుక తోలకం ద్వారా సంపాదించేవారమన్నారు. కొంతమంది అక్రమార్కులు చేసిన దొంగపనులకు ఎవరూ ఇసుక తోలుకోటానికి వీల్లేదంటూ ఆంక్షలు విధించటం ఎక్కడి న్యాయమని రైతులు ప్రశ్నించారు. ఇసుకను బయటి గ్రామాలకు దొంగతనంగా రవాణా చేసేవారిని పట్టుకుని కఠినంగా శిక్షించి జరిమానాలు విధించాలని, తమలా నిజాయితీగా ఇసుక తోలుకునే వారిని ఇబ్బందులకు గురిచేయవద్దని వారు వేడుకున్నారు. రెండు గంటలు ధర్నా చేశాక తహశీల్దార్ ఎం బాబూరావు చేరుకుని ఎడ్లబండ్ల యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎడ్లబండ్లను తొలగించమని పోలీసులను ఆదేశించారు. దాంతో రైతులు తమ ఎడ్లబండ్లను రోడ్డుపై నుంచి తీసుకెళ్ళారు. తహశీల్దార్ సూచన మేరకు వినతిపత్రం అందజేశారు.
హైందవ ధర్మరక్షణకు కృషి చేయాలి
* భక్తులకు త్రిపురనేని హనుమాన్‌చౌదరి పిలుపు
గుడివాడ, ఆగస్టు 2: దేశం విచ్ఛిన్నం కాకుండా ఉండాలంటే ప్రతిఒక్కరూ హైందవ ధర్మాన్ని పాటించడమే మార్గమని, హైందవ ధర్మరక్షణకు అందరూ కృషి చేయాలని ప్రభుత్వ మాజీ ఐటి సలహాదారు త్రిపురనేని హనుమాన్‌చౌదరి అన్నారు. గుడ్లవల్లేరు మండలం అంగలూరు గ్రామంలోని శ్రీ సీతారామస్వామి ఆలయ పునఃప్రతిష్ఠా మహోత్సవాల్లో పాల్గొన్న ఆయన భక్తులనుద్దేశించి మాట్లాడారు. హైందవ ధర్మం శాశ్వతంగా ఉండాలంటే దాతలంతా ముందుకొచ్చి తమ గ్రామాల్లోని దేవాలయాలను జీర్ణోద్ధరణ చేయాలన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో పుట్టి ఉన్నతస్థాయికి ఎదిగిన వారు తమ గ్రామాల్లోని దేవాలయాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. హైందవ ధర్మప్రచారాన్ని ప్రజలు ఆచరించినపుడు అందరూ సోదరభావంతో కలిసిమెలిసి ఉంటారని హనుమాన్‌చౌదరి వివరించారు. ఆగమశాస్త్ర సలహాదారులు వేదాంతం రాజగోపాల చక్రవర్తి మాట్లాడుతూ ఉత్సవాల్లో ముఖ్యమైన జలాధివాసాన్ని నిర్వహించామన్నారు. దేశంలోని సప్తనదులు, సముద్రపు నీటితో స్వామివారి విగ్రహాలకు అభిషేకాలను భక్తులతో చేయించామన్నారు. స్వామివారి విగ్రహాలకు స్వయంగా అభిషేకం చేసుకునే అరుదైన అవకాశాన్ని ఇక్కడ కల్పించామన్నారు. అనంతరం గోపూజ, అదివాస హోమాలను నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి విఎన్‌కె శేఖర్, మహోత్సవాల దాతలు త్రిపురనేని శేషగిరిరావు, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.
ఆటో, కారు ఢీకొని
ఏడుగురికి తీవ్రగాయాలు
కంచికచర్ల, ఆగస్టు 2: కంచికచర్ల - పొన్నవరం మధ్య రహదారిపై ఆటో, కారు ఢీకొనడంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ వాంబే కాలనీకి చెందిన తమ్మిశెట్టి పెద వెంకటరత్నం, వల్లెపు చిన వెంకట రత్నం, పల్లెపు దుర్గ, దేరంగుల మాధవిలు వీరులపాడు మండలం జుజ్జూరులో ఉంటున్న తమ సోదరుడు దండుగల ఆంజనేయులుకు రాఖీ కట్టేందుకు వచ్చారు. తిరిగి విజయవాడ వెళ్లేందుకు ఆటోలో వీరితోపాటు మాధవి కుమార్తె సునీత ఆటోలో వస్తుండగా పొన్నవరం అడ్డరోడు దాటిన తరువాత ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో వల్లెపు దుర్గ, దేరంగుల మాధవి, దేరంగుల సునీత, ఆటోడ్రైవర్ సత్యనారాయణరెడ్డిలు తీవ్రంగా గాయపడగా, మిగిలినవారికి గాయాలయ్యాయి. దుర్గ, మాధవి, సునీతలను 108 అంబులెన్స్‌లో విజయవాడ తరలించారు. ఆటోడ్రైవర్ సత్యనారాయణరెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో ఇబ్రహీంపట్నం 108 వాహనం ద్వారా విజయవాడ తరలించారు. మిగతావారిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఉపాధి హామీ పథకం
ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు!
కూచిపూడి, ఆగస్టు 2: ప్రభుత్వానికి భారంగా మారినట్లు భావిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపునకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ కమిషనర్ జి జయలక్ష్మి జిల్లాలో 523మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తున్నట్లు జారీ చేసిన ఉత్తర్వులు గురువారం ఎండిఓలకు అందాయి. రాష్టవ్య్రాప్తంగా 2851 మందిని తొలగిస్తున్నట్లు ఆమె ఉత్తర్వులు జారీ చేశారని జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులు పేర్కొన్నారు. గ్రామస్థాయిలో ఉపాధి హామీ పనులను పర్యవేక్షించే ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రభుత్వం నెలకు 3600 రూపాయల చొప్పున వేతనం అందచేస్తోంది. అయితే దీనివల్ల ప్రభుత్వం ఆసించినంత మేర పనులు జరగకపోవటంతో వీరిని వదిలించుకునేందుకు దృష్టి సారించింది. 2008వ సంవత్సరం నుండి ప్రారంభమైన ఉపాధి హామీ పనుల్లో ఒక్కో గ్రామంలోని వ్యవసాయ కూలీలకు కనీసం గత నాలుగు సంవత్సరాల్లో (2008-11)లో 5వేల పనిదినాలు కల్పించని ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించాలని నిర్ణయించింది. ఈవిధంగా ప్రభుత్వానికి నెలకు 8కోట్ల 21లక్షల 8వేల 800 రూపాయల ఆదాయం మిగులుతుంది. జిల్లాలో 523మందిని తొలగిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. మొవ్వ మండలంలోని అవిరిపూడి, బార్లపూడి, గూడపాడు, కొండవరం, కూచిపూడి, మొవ్వపాలెం, నిడుమోలు, పాలంకిపాడు, పెదపూడి, యద్దనపూడి, వేములమడ గ్రామాలకు చెందిన 11మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించినట్లు ఎండిఓ వై పిచ్చిరెడ్డి గురువారం తెలిపారు. 2013 ఫిబ్రవరి నుండి ప్రారంభమయ్యే ఉపాధి హామీ పనుల పర్యవేక్షణకు తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తీసుకునే అవకాశం లేదని వివరించారు.