Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

మీ పనితీరేం బాగోలేదు

$
0
0

అవనిగడ్డ, సెప్టెంబర్ 6: నీటి పారుదల శాఖాధికారులకు రైతుల శ్రేయస్సు పట్టడం లేదంటూ మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ గురువారం రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కొలుసు పార్థసారథి సమక్షంలో ధ్వజమెత్తారు. బుద్ధప్రసాద్‌ను పరామర్శించేందుకు అవనిగడ్డ వచ్చిన కెపి సారథి వద్ద బుద్ధప్రసాద్ అసంతృప్తి గళం విప్పారు. ముఖ్యమంత్రితో నిర్వహించిన చర్చల వివరాలను సారథి బుద్ధప్రసాద్‌కు వివరించారు. ఈసందర్భంగా నీటిపారుదల శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. నీటి యాజమాన్య పద్ధతిలో ఇరిగేషన్ అధికారుల మధ్య సమన్వయం లేకపోవటంతో దివిసీమకు ఈ దుస్థితి ఏర్పడిందని బుద్ధప్రసాద్ అన్నారు. దీంతో మంత్రి సారథి ఇరిగేషన్ ఇఇ గంగయ్య, డిఇ మారుతీప్రసాద్, డిఇఇ హరనాథ్‌లతో సమీక్షించారు. మీ పనితీరు బాగోలేదంటూ మంత్రి మందలించారు. రైతు ప్రముఖులను మీరు ఎందుకు సంప్రదించరని, ఇక్కడి అవసరాలను ఎందుకు గుర్తించరని ప్రశ్నించారు. బుద్ధప్రసాద్ జోక్యం చేసుకుంటూ తాను అనేక పర్యాయాలు ఇరిగేషన్ అధికారులకు ఫోన్ ద్వారా సాగునీటిని వినియోగించాల్సిన అవసరాన్ని వివరించానని, అయినప్పటికీ ఏవిధమైన చర్యలు తీసుకోక నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పారు. రైతుల కడుపు మండిపోతోందని, ఇప్పుడు ఏదో చేస్తామంటే ప్రయోజనం ఏమిటని నిలదీశారు. ఇకనైనా పదవీ విరమణ చేసిన ఉద్యోగుల నుండి వారి అనుభవాలను తీసుకుని సాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇన్‌చార్జిని గాక శాశ్వతంగా డిఇని నియమించాలన్నారు. ఇప్పటివరకు విధుల్లో చేరని డిఇని తక్షణమే రప్పించి సాగునీరు వ్యవస్థను సమీక్షించే విధంగా ఆదేశించాలన్నారు. అతిథిగృహంలో మకాం చేసి సాగునీటి సమస్యను పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు అన్నపరెడ్డి సత్యనారాయణ, నీటి సంఘాల అధ్యక్షులు బీసాబత్తిన ప్రసాద్, అర్జా అర్జునరావు, దిడ్ల వీరరాఘవులు నుండి మంత్రి సాగునీటికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

రవీంద్ర ఆమరణ దీక్ష భగ్నం
మచిలీపట్నం, సెప్టెంబర్ 6: డెల్టా రైతుల హక్కుల సాధన కోసం స్థానిక కోనేరుసెంటరులో ఆమరణ దీక్ష చేస్తున్న తెలుగుయువత జిల్లా అధ్యక్షులు కొల్లు రవీంద్ర దీక్షను గురువారం పోలీసులు భగ్నం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నాలుగు రోజులుగా రవీంద్ర ఆమరణ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. నాలుగో రోజైన గురువారం తెల్లవారుజామున 4గంటల సమయంలో పోలీసులు రవీంద్ర ఆమరణ దీక్షను భగ్నం చేశారు. పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మురళీధర్, మచిలీపట్నం టౌన్ ఎస్‌ఐ రామకృష్ణ, తహశీల్దార్ శివకుమార్ దీక్షా శిబిరం వద్దకు వచ్చి దీక్ష విరమించాల్సిందిగా కోరారు. ఇందుకు రవీంద్ర నిరాకరించటంతో పోలీసులు బలవంతంగా రవీంద్రను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్ళ కారణంగానే తన దీక్షను పోలీసులు భగ్నం చేశారని ఆరోపిస్తూ రవీంద్ర రాత్రి వరకు ఆస్పత్రిలో దీక్షను కొనసాగించారు. 9గంటల సమయంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ కాగిత వెంకట్రావు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. తెలుగుదేశం పార్టీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డా. సియల్ వెంకట్రావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బచ్చుల అర్జునుడు, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బూరగడ్డ రమేష్‌నాయుడు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ జగన్నాధరావు, తెలుగురైతు జిల్లా అధ్యక్షులు చలసాని ఆంజనేయులు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రిపాటి గోపిచంద్ తదితరులు రవీంద్రను పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రవీంద్ర చేపట్టిన ఆమరణ దీక్షకు అన్ని వర్గాల నుండి వస్తున్న మద్దతును చూసి ఓర్వలేక అధికార పార్టీ నేతలు ఒత్తిళ్ళ నేపథ్యంలో పోలీసులు దీక్షను భగ్నం చేశారని ఆరోపించారు. అధికార పార్టీ నేతల కుట్రలు, కుతంత్రాలకు తాము భయపడేది లేదన్నారు. రైతుల కోసం ఎటువంటి ఉద్యమానికైనా తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. నాయకులు మోటమర్రి బాబాప్రసాద్, గోపు సత్యనారాయణ, కుంచే దుర్గాప్రసాద్, కుర్రా నరేంద్ర, సాతులూరి నాంచారయ్య, కూనపరెడ్డి యానాదిరావు, వక్కపట్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

రైతుల సమస్యలపై తుదకంటా పోరాడతా
మచిలీపట్నం టౌన్, సెప్టెంబరు 6: రైతుల సమస్యలపై చివరి నిమిషం వరకు పోరాడతానని జిల్లా తెలుగుయువత అధ్యక్షులు, బందరు నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి కొల్లు రవీం ద్ర అన్నారు. డెల్టా రైతుల హక్కుల సాధన కోసం స్థానిక కోనేరుసెంటరులో చేపట్టిన రవీంద్ర ఆమరణ దీక్షను గురువారం పోలీసులు భగ్నం చేసిన అనంతరం జిల్లా ప్రభు త్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విలేఖర్లతో మాట్లాడారు. రైతుల బాగోగులను పట్టించుకోవడంలో అధికార పార్టీ నేతలు పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని ఒత్తిళ్ళ మేరకు తన దీక్షను పోలీసులు భగ్నం చేశారని ఆరోపించారు. తన ఆరోగ్య పరిస్థితి బాగున్నా పోలీసులు బలవంతంగా తనను దీక్షా శిబిరం నుండి ఆస్పత్రికి తరలించారన్నారు. పార్టీ పెద్దల సూచనల మేరకు దీక్షను విరమిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో కూడా రైతుల పక్షాన నిలబడి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తానన్నారు. డెల్టాకు పూర్తిస్థాయిలో విడుదల చేసేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదని రవీంద్ర స్పష్టం చేశారు.

ఆలయాల సిబ్బంది జీతభత్యాల కోసం..
‘మూలనిధి’ ఏర్పాటు చేయాలి
మచిలీపట్నం (కల్చరల్), సెప్టెంబర్ 6: దేవాలయాల అర్చకులు, మేనేజర్లు, సిబ్బంది జీతభత్యాలు చెల్లించడానికి మూలనిధిని ఏర్పాటు చేయాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖ సిబ్బంది పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ధూళిపాళ సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. స్థానిక బచ్చుపేట వెంకటేశ్వరస్వామి దేవాలయ కల్యాణ మండపంలో గురువారం సమితి సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల్లోని నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని కోరారు. జీతభత్యాలు ప్రతినెలా 1వ తేదీనే చెల్లించడానికి వీలుగా మూలనిధిని ఏర్పాటు చేయాలన్నారు. 75కోట్ల రూపాయలతో మూలనిధిని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించిందని ఆయన గుర్తుచేశారు. రూ.5వేలు నుండి రూ.5లక్షలు వరకు ఆదాయం వచ్చే ఆలయాలు 30శాతం, రూ.5లక్షల నుండి రూ.50లక్షల వరకు ఆదాయం వచ్చే ఆలయాలు 25శాతం, రూ.50లక్షల నుండి కోటి రూపాయల వరకు ఆదాయం వచ్చే ఆలయాలు 20శాతం, కోటి రూపాయలకు పైగా ఆదాయం వచ్చే ఆలయాలు 15శాతం ఆదాయాన్ని మూలనిధికి జమచేయాలన్నారు. ఈవిధంగా రూ.110కోట్లు జమ అవుతాయని పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చెల్లించాల్సిన రూ.175కోట్లతో కలిపి రూ.285కోట్లతో మూలనిధిని ఏర్పాటు చేసి దీనిపై వచ్చే వడ్డీతో జీతభత్యాలు చెల్లించాలన్నారు. ఖాళీగా ఉన్న 422 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులను సీనియర్ సిబ్బందితో భర్తీచేయాలని సుబ్రహ్మణ్యం కోరారు. ఆలయ మేనేజరు తుర్లపాటి రామచంద్ర మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులందరూ సమైక్యంగా కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో వెల్ఫేర్ బోర్డు సభ్యులు అప్పలాచార్య, సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు టివివి మోహనరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్‌కె కిషోర్, జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, అర్చక సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఘంటసాల పద్మనాభశర్మ, మేనేజర్లు ఎంవివి సత్యనారాయణ, వేమవరపు శ్రీనివాసరావు, జోగి రాంబాబు పాల్గొన్నారు.

టోల్‌ప్లాజా నిర్మాణం నిలిపివేయాలని ధర్నా
నందిగామ, సెప్టెంబర్ 6: నిబంధనలకు విరుద్ధంగా జాతీయ రహాదారిపై గట్టు భీమవరం వద్ద నిర్మిస్తున్న టోల్‌ప్లాజాను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సవరించిన టోల్ పాలసీ నిబంధనలు మే 2009 ప్రకారం కానీ లేదా భారత ప్రభుత్వ షిప్పింగ్, రోడ్ రహదారులు, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ 2008 డిసెంబర్ 5న విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో 8వ పాయింట్ 2వ నిబంధన ప్రకారం జాతీయ రహదారిపై ఒకే మార్గంలో 60కిలో మీటర్ల లోపు టోల్‌ప్లాజాను నిర్మించకూడదు అని పేర్కొని ఉన్నప్పటికీ ప్రభుత్వ నిబంధనలను జిఎంఆర్ సంస్థ, జాతీయ రహదారుల శాఖ ఉల్లంఘించి అక్రమ పద్ధతిలో గట్టు భీమవరం వద్ద జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా నిర్మిస్తుందని నేతలు పేర్కొన్నారు. ఈ నిర్మాణాలను వ్యతిరేకిస్తూ గత 35 రోజులుగా జెఎసి ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నా అధికారులు స్పందించడం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు ప్రజా ప్రయోజనాల పట్ల స్పందించి నిబంధనలకు విరుద్ధంగా గట్టు భీమవరం వద్ద నిర్మిస్తున్న టోల్‌ప్లాజాను బేషరతుగా తొలగించాలని, ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా వ్యవహరిస్తే జరిగే పరిణామాలకు ప్రభుత్వం, అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని నేతలు పేర్కొన్నారు. ధర్నా అనంతరం డెప్యూటీ తహశీల్దార్ గోపీనాధ్‌కు వినతిపత్రం సమర్పించారు. రైతుకూలీ సంఘం, తెలుగుదేశం, బిజెపి, వామపక్షాల నేతలు మందా జార్జి, చిరుమామిళ్ల శ్రీనివాసరావు, అయ్యదేవర కన్నబాబు, ఎస్‌కె సైదా, ఎం రాంబాబు, జరబన నాగేశ్వరరావు, చుండూరు సుబ్బారావు, నెలకుదిటి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో..
ఇద్దరు యువకుల దుర్మరణం
హనుమాన్ జంక్షన్, సెప్టెంబర్ 6: దేవుని గుడికి వెళ్లివస్తూ రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. జాతీయ రహదారిపై బాపులపాడు మండలం అంపాపురం గ్రామం వద్ద గురువారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. వీరవల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ రూరల్ ప్రసాదంపాడు గ్రామానికి చెందిన గట్టెం సాయిప్రకాష్ (19), పాపిశెట్టి కిషోర్ (17), చిగురుకోట మహేష్ గురువారం ఉదయం వెంకటేశ్వరుని దర్శించుకునేందుకు ద్వారకాతిరుమల వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా వీరు ప్రయాస్తున్న మోపెడ్ అంపాపురం గ్రామం వద్ద ముందు వెళుతున్న ట్రాలీని ఢీకొంది. దీంతో ట్రాలీ చక్రాల క్రిందభాగంలో సాయిప్రకాష్ చిక్కుకుని మృతిచెందగా, తీవ్రగాయాలపాలైన కిషోర్‌ను అసుప్రతికి తరలిస్తూండగా మృతిచెందాడు. మోపెడ్ నడుపుతున్న మహేష్‌కు కొద్దిపాటి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి, మృతదేహలను పోస్టుమార్డం నిమిత్తం గన్నవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కాంగ్రెస్ ఉనికి కోసమే బుద్ధప్రసాద్ దీక్ష
* కాగిత విమర్శ
మచిలీపట్నం టౌన్, సెప్టెంబరు 6: రైతుల సమస్యలపై మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ కాగిత వెంకట్రావు విమర్శించారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడేందుకే ఆయన 48గంటల సత్యాగ్రహ దీక్ష చేశారని ఆరోపించారు. తెలుగుదేశం బందరు నియోజకవర్గ ఇన్‌చార్జి కొల్లు రవీంద్రను ఆస్పత్రిలో గురువారం ఆయన పరామర్శించారు. ఈసందర్భంగా కాగిత విలేఖర్లతో మాట్లాడుతూ రైతుల సమస్యలపై అధికార పార్టీ నేతలకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. బుద్ధప్రసాద్ దీక్షకు దిగితే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు సానుభూతి తెలిపి ముఖ్యమంత్రితో తాము మాట్లాడి సాగునీటి విడుదలకు కృషిచేస్తామని హామీలు ఇచ్చారన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతుల సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తామని చెప్పిన అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష నాయకుడు రవీంద్ర చేపట్టిన ఆమరణ దీక్షకు ఎందుకు మద్దతు తెలుపలేదని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవిధంగా రవీంద్ర ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారన్నారు. ఎటువంటి చర్చలు జరపకుండా దీక్షను భగ్నం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇది సరైన పద్ధతి కాదని కాగిత ఖండించారు. కృష్ణాజలాల విడుదలపై ఈ నెల 10న ట్రిబ్యునల్ తీర్పు వరకు వేచి చూస్తామన్నారు.

33క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
జగ్గయ్యపేట, సెప్టెంబర్ 6: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంను అందిన సమాచారం మేరకు స్వాధీనం చేసుకున్నట్లు డిటి భోజరాజు తెలిపారు. గురువారం పట్టణ తహశీల్దార్ కార్యాలయంలో ఆయన దీనికి సంబంధించి వివరాలు వివరిస్తూ బుధవారం రాత్రి 12గంటల ప్రాంతంలో రెండు మినీ వ్యాన్‌లలో బియ్యం తరలివెళుతున్నాయని సమాచారం తహశీల్దార్ మదన్‌మోహన్‌కు అందిందని, ఈ మేరకు బలుసుపాడు వద్ద నిఘా వేయగా రెండు మినీ వ్యాన్‌లో వెళుతున్న బియ్యంను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నందిగామ నుండి 30 బ్యాగ్‌లలో 15 క్వింటాళ్ల బియ్యంను కోదాడకు చెందిన వ్యాపారి కొత్తమాసు రమేష్ కుమార్ వద్దకు తరలిస్తున్న వ్యాన్ డ్రైవర్ మహేశ్వరపు రాఘవేంద్రను అదుపులోకి తీసుకున్నామని, అలాగే వత్సవాయి మండలం భీమవరం నుండి మద్దు పోతరాజు 40 బ్యాగ్‌లలో 18 క్విం టాళ్ల బియ్యంను కోదాడలోని అదే వ్యాపారి వద్దకు తరలిస్తుండగా వాహ నం యజమాని పోతరాజు, డ్రైవర్ చంద్రయ్యలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరిని ప్రశ్నించగా తాము కార్డుదారుల వద్ద నుండి రూ.7 లకు కొని రూ.8లకు కోదాడలో అమ్ముతుంటామని, ఇలా చేయడం ఇదే మొదటిసారని వారు వివరించా రు. దీనిపై సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు డిటి భోజరాజు తెలిపారు.

బస్తాల్లోనే మాయమవుతున్న బియ్యం
పటమట, సెప్టెంబర్ 6: ఒకటేంటి ప్రతి వస్తువులో దగ, మోసం. కల్తీ జరుగుతూనే ఉన్నాయి. పాలు, నీళ్లు, ఉప్పు, పప్పు, కారం, నూనె, ప్రెటోల్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వస్తువులో వినియోగదారుడు ఏదో విధంగా మోసపోతూనే ఉన్నాడు. వ్యాపారులు చేసే ఘరానా మోసాలకు వినియోగదారుడు దగా పడుతున్నాడు. కొంతమంది వ్యాపారులు ఆక్రమార్జనకు ఒడిగట్టి తెల్లారేసరికి లక్షాధికారిగా మారాలనే దుర్బుద్ధి వారి మెదళ్లను తొలవటంతో మోసాలకు అంతు లేకుండా పోతోంది. బియ్యం ధరలు చుక్కలంటడంతో కొంతమంది వ్యాపారులు కొత్త అవతారం ఎత్తి గుట్టు చప్పుడు కాకుండా, వినియోగాదారుడికి అనుమానం రాకుండా ఘరానా మోసం చేస్తున్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. వినియోగదారుడికి తెలియకుండానే జేబుకు చిల్లుపెడుతున్నారంటే వారి తెలివితేటలు అమోఘం. సహజంగా మార్కెట్‌లో విక్రయించే బియ్యం 25 కేజీలతో నింపి ఉన్న బియ్యం కట్టలను ఎక్కువ మంది కొనుకోలు చేస్తారు. కానీ అక్కడే మనం మోసానికి గురవుతున్నామని వినియోగారుడికి తెలియకుండానే నగరంలోని కొంతమంది బియ్యం వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. రైస్ మిల్లర్ల నుండి బియ్యం వ్యాపారులు వివిధ బ్రాండ్‌ల పేరుతో కర్నూలు సోనా, సోనా మసూరి, బి.పి.టి. సన్నాలు, 2716 రకాల బియ్యాన్ని టన్నుల కొద్ది 25 కేజీల బియ్యం బస్తాలు కొనుగోలు చేసి నగరానికి తీసుకొచ్చి వారి ప్రాంతాలలో హోల్‌సేల్, రిటైల్ పేరిట వినియోగారులకు అమ్మకాలు సాగిస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ కొంతమంది వ్యాపారులు అత్యాశకు పోయి ఆక్రమార్జనే సంపాదనగా భావించి లక్షలు గడించాలని బరితెగించి మోసాలకు ఒడిగడుతున్నారు. 25 కేజీ బియ్యం బస్తాలను మిల్లర్లే ప్యాక్ చేసి బియ్యం వ్యాపారులకు విక్రయిస్తారు. కానీ హోల్‌సేల్ రిటైల్ కొంతమంది బియ్యం వ్యాపారులు నగరంలో 25 కేజీల బియ్యం బస్తాల ప్యాకింగ్ దారాన్ని ఒకవైపు తొలగించి అందులో నుంచి కేజి నుండి 2 కేజీల వరకు తస్కరించి గుట్టుచప్పుడు కాకుండా, ఏ విధమైన అనుమానం రాకుండా ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన బియ్యం సంచులు కుట్టే మిషన్‌తో తిరిగి యథావిధిగా అదే దారంతో ప్యాకింగ్ చేసి వినియోగారులకు విక్రయిస్తూ హైటెక్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇది తూనికలు కొలతల శాఖ, విజిలెన్స్ శాఖ అధికారులకు తెలియకపోవడం ఆశ్చర్యకరం. ఇటీవల పటమటలో ఒక బియ్యం వ్యాపారి నుండి 25 కేజిల బియ్యం బస్తాను కొనుగోలు చేసిన వినియోగదారుడు ఎందుకో అనుమానం వచ్చి వెంటనే తూకం వేయించగా ఆ బస్తాలో సుమారు రెండు కేజీల బియ్యం తక్కువ వచ్చింది. అతను గొడవ చేయడంతో ఆ వ్యాపారి చేస్తున్న మోసం గుట్టురట్టయిందని ఈ ప్రాంత వాసులు బహిరంగంగా చర్చించుకుటున్నారు. కర్నూలు సోనా బియ్యం కేజీ 37 నుంచి 38 వరకు, సోనామసూరి 30 నుంచి 33 వరకు, బి.టి.పి. సన్నాలు 27 నుంచి 30 వరకు, 2716 రకం బియ్యం 25 నుంచి 20 వరకు వ్యాపారులు అమ్ముతున్నారు. అంటే ఆయా రకం బియ్యం కోనుగోలు చేసిన వినియోగదారుడు తనకు తెలియకుండానే ఒక్కొక్క రకం బియ్యం రకాన్ని బట్టి 25 కేజీల బస్తాకి దాదాపు 74 రూపాయల నుండి 40 రూపాయల వరకు తెలియకుండానే కొనుగోలుదారుడు నష్టపోతున్నారు. నేటి బిజీ లైఫ్‌లో వినియోగదారుడు పట్టించుకోకపోడం వల్ల వ్యాపారులు మోసాలకు పాల్పడుతూ లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు. ఇంతా జరుగుతున్నా తూనికలు, కొలతల శాఖ అధికారులకు తెలియకపోడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల పౌరసరఫరాల, తూనికల కొలతల శాఖ మంత్రి శ్రీ్ధర్‌బాబు తూనికల కొలతల శాఖ అనేది ఉందా అని అధికారులను వ్యాఖ్యానించడం చూస్తే ఈ శాఖ పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మున్సిపల్ కార్మికులకు భిక్షాటనే శరణ్యమా?
అజిత్‌సింగ్‌నగర్, సెప్టెంబర్ 6: నెలల తరబడి జీతాలు చెల్లించని తమకు ఇక వీధుల్లో భిక్షాటనే శరణ్యమని, జీతాలు లేకుండా తాము ఏ విధంగా జీవించాలంటూ మున్సిపల్ వర్కర్స్ భిక్షాటన చేస్తూ వినూత్న నిరసన చేపట్టారు. జీతాల చెల్లింపులో అధికారులు అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ గురువారం ఉదయం నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భిక్షాటన కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి సిహెచ్ బాబూరావు మాట్లాడుతూ జీతాలు సక్రమంగా అందించకుండా కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేసే అర్హత లేదని అన్నారు. బాధ్యతాయుతంగా కష్టించి పనిచేసిన కార్మికులకు నెలల తరబడి జీతాలను చెల్లించలేని దుర్భర పరిస్థితుల్లోకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌ను నెట్టేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. తమ అవసరాల కోసం కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకునే పాలకులకు వారి బాగోగులను చూడాల్సిన బాధ్యత ఉందని, పని చేసిన వారు జీతం పొందడం ప్రాథమిక హక్కుగా ఉన్నా కార్మికుల హక్కులను హరించే విధంగా పాలన సాగిస్తున్న స్పెషలాఫీసర్ పాలనలో ప్రజా పాలన వ్యవస్థ కుంటుపడిందనడానికి ఇదే నిదర్శనమన్నారు. స్పెషల్ డ్రైవ్‌ల పేరుతో అదనపు పనులను సైతం చేయించుకుంటున్న నగర పాలక సంస్థ కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్న వైనాన్ని పరిశీలిస్తే ఆనాడు కూలీల రక్త మాంసాలతో రాజమహళ్లును నిర్మించుకున్న నియంతృత్వ రాజుల పాలన గుర్తుకొస్తోందన్నారు. సకాలంలో జీతాలను చెల్లించాలని కోరుతూ గతంలో కార్మికులు ఉద్యమం చేపట్టిన సందర్భంలో ఆనాడు ప్రజా ప్రతినిధులైన ఎమ్మెల్యే, ఎంపీలు ప్రతి నెలా 5వ తేదీకల్లా జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామన్న వారి హామీలు నేడు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. నేడు జీతాలు లేక అల్లాడుతున్న కార్మికులకు మొఖం చాటేసుకుని తిరుగుతున్న కాంగ్రెస్ పెద్దలు నగర పాలక సంస్థకు ఒరగబెట్టింది ఏమీ లేదని, కనీసం ప్రభుత్వం నుంచి కార్పొరేషన్‌కు రావాల్సిన గ్రాంటు నిధుల మంజూరులో కూడా విఫలమై వారి చేతకానితనాన్ని నిరూపించుకుంటున్నారని విమర్శించారు. తక్షణమే కార్మికుల జీతాలపై పాలకులు చర్యలు తీసుకోకపోతే కార్మిక ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి ఎం డేవిడ్ మాట్లాడుతూ కార్మికుల జీతాలను సక్రమంగా మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకోవడంతోపాటు అర్హులైన వారిని పెర్మనెంటు చేయాలని, పెర్మనెంట్ ఉద్యోగులకు సరెండర్ లీవ్‌లు లేవని, రిటైర్ అయిన ఉద్యోగులకు సరైన సౌకర్యాలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. అపరిష్కృతంగా ఉన్న కార్మిక సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు నిరంతర ఉద్యమాలు సాగిస్తామని ఆయన పేర్కొన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎన్‌సిహెచ్ శ్రీనివాసరావు, యూనియన్ నగర నాయకులు తిరుపతయ్య, ఎస్ ఎల్లారావు, జి లక్ష్మి, ఎస్ లక్ష్మి, జి వీరయ్య, మాడుగల ఎల్లారావు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ కార్యాలయం వద్ద ప్రారంభించిన కార్మికుల భిక్షాటన కెనాల్ రోడ్డు వరకు నిర్వహించి తమ నిరసన తెలిపారు.

చిత్తశుద్ధితో కృష్ణా డెల్టా పరిరక్షణ
విజయవాడ, సెప్టెంబర్ 6: కృష్ణా డెల్టా పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతుల ప్రయోజనాలు కాపాడటమే తమ లక్ష్యమని రాష్ట్ర స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి తోట నరసింహం తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గురువారం ఉదయం నగరానికి చేరుకున్న తోట నరసింహం రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో బస చేశారు. అతిథి గృహంలో విలేఖరులతో ముచ్చటిస్తూ కృష్ణా డెల్టాను పరిరక్షించి రైతుల ప్రయోజనాలు కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. చిట్టచివరి భూముల వరకు సాగునీరు అందే విధంగా రైతులకు అవసరమైన సాగునీటిని ఎప్పటికప్పుడు సకాలంలో విడుదల చేస్తామన్నారు. ఈ విషయంలో రైతులు ఎటువంటి అపోహలకు గురికావలసిన అవసరం లేదని మంత్రి తెలిపారు. ఖరీఫ్‌లో రైతాంగానికి అవసరమైన ఎరువులు, పురుగు మందులు సిద్ధంగా ఉన్నాయన్నారు. జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు వివిధ రాజకీయ పక్షాల సమన్వయంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాన్నారు. ముఖ్యంగా మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని రాజకీయ పక్షాల ప్రతినిధుల సహకారంతో పోర్ట్ నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టేలా కృషి చేస్తానని, వీలైనంత త్వరలో నిర్మాణ పనులు చేపట్టేందుకు ముఖ్యమంత్రి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
కాగా ప్రభుత్వ అతిథి గృహంలో రాష్ట్ర మాధ్యమిక విద్యా శాఖ కె పార్థసారథి, జిల్లా కలెక్టర్ డా బుద్ధప్రకాష్ ఎం జ్యోతి, రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్ వెంకట్రావ్, ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, డిసిసి అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు, తదితరులు మంత్రిని మర్యాదకపూర్వకంగా కలుసుకున్న వారిలో ఉన్నారు.

సకాలంలో డంపర్ బిన్లు తరలించాలి
అజిత్‌సింగ్‌నగర్, సెప్టెంబర్ 6: నగర వ్యాప్తంగా డంపర్ బిన్లను తరలించే విషయంలో ఎటువంటి అలక్ష్యం వహించరాదని, నిర్ణీత వేళల్లో డంపర్లను తరలించకపోతే సహించేది లేదని నగర పాలక సంస్థ కమిషనర్ అబ్దుల్ అజీమ్ పేర్కొన్నారు. నగర పర్యటనలో భాగంగా గురువారం పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన చెత్తతో నిండిన డంపర్ బిన్లను గమనించి వాటిని ఏయే సమయాల్లో తరలిస్తారన్న విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బిన్లు పూర్తిగా నిండినా సకాలంలో డంపింగ్ యార్డుకు తరలించకపోవడం వలన పారిశుద్ద్య సమస్యలు ఎదురవుతున్నందున ఆయా సమస్యలు అసలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్దేశిత ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన డంపర్‌బిన్లను వాటిని ఏ సమయంలో తరలిస్తారన్న విషయం సమగ్రంగా ఉండాలని, ఇందుకు ఆ సమయాన్ని అక్కడ ప్రదర్శించాలని తెలిపారు. పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపర్చినప్పటికీ పూర్తి స్థాయిలో నిండిన బిన్లను సకాలంలో యార్డుకు తరలించకపోవడంతో మరలా పారిశుద్ధ్య సమస్యలు ఉత్పన్నమై ప్రజారోగ్యానికి హాని కలిగే అవకాశం ఉందన్నారు. చెత్తతో నిండిన బిన్లను నగర రహదారుల గుండా తరలించే సమయంలో రోడ్లపై చెత్త పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఇందుకు బిన్లను నెట్‌లతో కప్పి ఉంచాలన్నారు. అనేక ప్రదేశాల్లో చెత్తను పడేస్తూ వెళ్తున్న వాహనాలపై ప్రజా ఫిర్యాదులున్నందున జాగ్రత్తలు వహించాలన్నారు. డంపర్‌బిన్లను సకాలంలో తరలించే విషయంలో సంబంధిత శానిటరీ ఇన్‌స్పెక్టర్లదే బాధ్యత అని పేర్కొన్నారు. భవానీపురం దర్గా వద్ద ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేస్తున్న విషయాన్ని గుర్తించిన కమిషనర్ అజీమ్ ఆ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాటర్ సరఫరా అయ్యే పైప్ లైన్‌కు మరమ్మతులు చేపడుతున్నందున నీటిని ఈ విధంగా సరఫరా చేస్తున్నామని సిబ్బంది వివరించారు. సాయంత్రానికి మరమ్మతులు పూర్తయి యధావిధిగా పైప్‌లైన్ ద్వారా నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. మారుతీనగర్‌లోని వెంకట్రామయ్య వీధి, గద్దే పూర్ణచంద్రరావు వీధి తదితర ప్రాంతాలకు పూర్తి స్థాయిలో నీటి సరఫరా చేసేందుకు స్థానిక ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల ఆవరణలో 13వ ఫైనాన్స్ నిధులతో సుమారు రెండు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించతలపెట్టిన వాటర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు తక్షణమే ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్ణీత గడువులోగా ఆ నిర్మాణం పూర్తయ్యేలా రూపకల్పన చేయాలన్నారు. ఈ పర్యటనలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ ఎం సత్యనారాయణరాజు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఓం ప్రకాష్, చౌదరి, సహాయ వైద్యాధికారి డాక్టర్ రత్నావళి తదితరులు పాల్గొన్నారు. నగర పర్యటనలో భాగంగా కమిషనర్ ఆజీమ్ ఎంజి రోడ్డు, కెనాల్ రోడ్డు, బిఆర్‌పి రోడ్డు, గణపతిరావురోడ్డు, కొత్తపేట, టిపి రోడ్డు, చిట్టినగర్, కెటి రోడ్డు, కబేళా, సితార జంక్షన్, కుమ్మరిపాలెం సెంటర్, భవానీపురం దర్గా, ఏలూరు రోడ్డు, మారుతీ నగర్, మాచవరం, ఇఎస్‌ఐ హాస్పటల్ రోడ్డు, క్రీస్తురాజపురం, సున్నపుబట్టీల సెంటర్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు.

లక్ష్య సాధనకు బ్యాంకర్లు కృషి చేయాలి
పాయకాపురం, సెప్టెంబర్ 6: వ్యవసాయ, ఇతర ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరుకు నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేందుకు బ్యాంకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి ఆదేశించారు. నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం ఉదయం బ్యాంకు అధికారులు, వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వివిధ బ్యాంకుల ద్వారా వ్యవసాయ, ఇతర ప్రాధన్యతా రంగాలకు రుణాల మంజూరుకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని బ్యాంక్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఈ ఖరీఫ్ సీజన్‌లో నిర్దేశించిన సుమారు 1415 కోట్లు రుణాల మంజూరు లక్ష్యాలకుగాను, ఇప్పటివరకు 1240 కోట్లు వివిధ బ్యాంకుల ద్వారా మంజూరు చేసి, 87 శాతం లక్ష్యాలను సాధించామన్నారు. ఖరీఫ్ వ్యవసాయ సీజన్ పూర్తయ్యేలోపు పూర్తి లక్ష్యాలను సాధించేందుకు బ్యాంకర్లు సహకరించాలన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి త్వరితగతిన రైతులకు రుణాలు మంజూరు చేసే విధంగా బ్యాంకర్లు కృషి చేయాలన్నారు. రైతులకు పావలా వడ్డీ బకాయిల చెల్లింపులకు ప్రభుత్వం నుండి నిధులు మంజూరయ్యాయని, షెడ్యూల్ కులాలు, తెగలు, ఇతర వెనకబడిన వర్గాల వివరాలతో కూడిన జాబితా వ్యవసాయ శాఖ అధికారులకు త్వరితగతిన అందజేసేలా బ్యాంకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో కొత్తగా 5941 మంది రైతులకు 28.36 కోట్లు వ్యవసాయ రుణాలు మంజూరు చేశామని, అదే విధంగా 13,039 రుణ అర్హత కలిగిన కౌలుదారు రైతులకు 28.69 లక్షలు బ్యాంకుల ద్వారా మంజూరు చేశామన్నారు. జిల్లాలో అర్హత కలిగిన ప్రతి కౌలుదారు రైతుకు రుణం మంజూరు చేసేలా బ్యాంకు అధికారులు సహకరించాలని కలెక్టర్ కోరారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా 18602 అర్హులైన స్వయం సహాయక సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో 540 కోట్ల రుణాలు మంజూరు లక్ష్యంకాగా ఇప్పటివరకు 5913 గ్రూపులకు 170 కోట్లు రుణాలు మంజూరు చేశామని, వివిధ బ్యాంకులకు కేటాయించిన నెలవారీ లక్ష్యాలను అధిగమించేందుకు బ్యాంకు అధికారులు కృషి చేయాలని అన్నారు. బ్యాంకుల నుండి రుణాలు పొందిన స్వయం సహాయక సంఘాలు వాటిని తిరిగి చెల్లించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు తరచూ సమావేశాలు నిర్వహించి చెల్లింపులు వేగవంతం చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాల మంజూరుకు వివిధ బ్యాంకులకు కేటాయించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని రైతులు, స్వయం సహాయక సంఘాలు, ఇతర ప్రాధాన్యత రంగాలకు రుణాలు మంజూరు చేయాలని, బ్యాంకు అధికారులు రుణాల మంజూరులో ఎదురయ్యే సమస్యలను అధికారుల సమన్వయంతో ఎప్పటికప్పుడు పరిష్కరించుకుని రుణాల మంజూరు ప్రక్రియ వేగవంతం చేయాలని బ్యాంకు అధికారులు, వివిధ శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. సమావేశంలో డిఆర్‌డిఎ ఇన్‌చార్జి పిడి వి.హనుమానాయక్, నాబార్డ్ ఏజిఎం, ఎన్. మధుమూర్తి, లిడ్ బ్యాంక్ మేనేజర్ ఆర్.వి.నరసింహారావు, తదితర అధికారులు పాల్గొన్నారు.

* నీటి పారుదల శాఖాధికారులకు మంత్రి సారథి క్లాసు
english title: 
irrigation officials

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>