శ్రీకాకుళం, సెప్టెంబర్ 6: జిల్లా అంతటా మృత్యుఘోష. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలోనే జనం డెంగ్యూ, స్వైన్‌ఫ్లూ, విష జ్వరాలతో చనిపోయారు. ప్రతీ ఏటా సీతంపేట, తదితర ఏజెన్సీ గ్రామాల్లోనే ఈ ఘోష వినిపించేది. ఈ ఏడాది కొండప్రాంతాల కంటే మైదానప్రాంతాల్లోనే ఎక్కువ మంది జ్వరాలతో మృత్యువాతపడ్డారు. వ్యాధులతో విలవిల్లాడుతున్న పల్లెలకు అధికారులు వచ్చారు...చూశారు..వెళ్లారు. సంతకవిటి, జి.సిగడాం, వంగర, పొందూరు, సోంపేట, సీతంపేట మండలాల్లో ఆగస్టు 28న కలెక్టర్, 31న డిఎంహెచ్‌వో, డిపివోలు పర్యటించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను, కలుషతమైన తాగునీటి వనరులను పరిశీలించారు. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి రోగులకు రెండురోజులు సేవలందించారు. అయినప్పటికీ మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతునే ఉంది. ప్రభుత్వం దీనిపై లెక్కలు అడిగితే ‘చావు’లెక్కలుగా ఇద్దరు మాత్రమే డెంగ్యూ కేసుల అనుమానంతో మృతి చెందారంటూ జిల్లా వైద్యాధికారులు నివేదిక పంపారు. కానీ జిల్లాలో వివిధ జ్వరాలతో 20 మందికి పైగా మృతిచెందారు. పారామెడికల్ సిబ్బంది, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల నుంచి ఈ చావులకు లెక్కలు పంపకపోవడంతో జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో ఎటువంటి సమాచారం అందుబాటులో ఉండటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ‘సిక్కోల్ మృత్యుఘోష’పై లెక్కలు పంపాలంటూ ఫాక్స్ ఆదేశాలు ఇస్తే రెండేరెండు కేసులు ఉన్నాయంటూ వైద్యాధికారులు సమాధానం పంపడం గమనార్హం. సీతంపేట మండలంలో నాయకమ్మగూడలో చంద్రయ్య (36),, రాజన్నగూడలో సవర బాపడు (42), మిర్తివలసకు చెందిన పొన్నాడ స్వాతి (28), జీ.ఎస్.పురం గ్రామానికి చెందిన శాసపు రమేష్ (23) గోవిందపురం గ్రామానికి చెందిన ఎం.రామస్వామి (55), ఎం.రమణమ్మ (35), ఎ.లక్ష్మీ (45), లైదాం గ్రామంలో రాకోటి అప్పారావు (68), పిల్లా గౌరి (18), లొట్ట అప్పయ్య (62), జావాం గ్రామంలో అల్లిన మన్మధరావు (28), కర్నాన సీతాలక్ష్మీ (28) కె.రామలక్ష్మీ (30), సంతకవిటిలో బొద్దాన తవిటమ్మ (40), కాకరాపల్లి గ్రామంలో గుత్తి రాజేశ్వరి (65), ముకుందాపురంలో జి.దాలెమ్మ (60), మండాకురిటి గ్రామంలో జి.సూరిబాబు (35), మామిడిపల్లి గ్రామంలో ఎం.జగన్మోహనరావు (16), మొదలవల్సలో కింతలి లక్ష్మీ (33), గరికపాడు గ్రామంలో ఎల్.రమణమ్మ (30), ఎం.రామస్వామి (70), తానేం గ్రామానికి చెందిన బాకి కృష్ణారెడ్డి (55) మృత్యువాత పడ్డారు. జిల్లాలో ఈ మృత్యుఘోష ఇంకా సంతకవిటి, పొందూరు, జి.సిగడాం, వంగర, సోంపేట మండలాలకు కూడా వ్యాపిస్తోంది. అయితే జిల్లా వైద్యాధికారులు మాత్రం కాకి లెక్కలు చెబుతున్నారు. జూలై నెలలో 19,288 మందికి రక్తపరీక్షలు నిర్వహించామని, అందులో 214 మంది జ్వరపీడితులుగా ఉన్నట్లు ధ్రువీకరించామని, మృతులైతే ఎవరూ లేరంటూ గణాంకాలు సర్కార్‌కు పంపారు. అలాగే ఆగస్టు మాసంలో 17,231 రక్తనమూనాలు సేకరించి పరీక్షలు చేయగా, 158 మందికి జ్వరాలు ఉన్నట్లు గుర్తించామని, వారిలో ఇద్దరు డెంగ్యూ లక్షణాలతో మృతి చెందినట్లు సీతంపేట, వంగర గ్రామాల్లో ప్రైవేటు ప్రాక్టీసనర్లు చెప్పారే తప్ప, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆ లక్షణాలతో మృతి చెందినట్లు దాఖలాలు లేవని జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ గీతాంజలి చెప్పారు. సురక్షితమైన తాగునీరు లేక, అపరిశుభ్ర పరిస్థితులను చక్కదిద్దలేని జిల్లా యంత్రాంగం కనీసం పల్లె ప్రజలను చైతన్యం చేసారా అంటే అదీలేదు. ఏమీ చేయలేక..ప్రజలను విష జ్వరాలకు వదిలేసి...‘చావు’కబురు తెలియకుండా జాగ్రత్త పడుతూ సర్కార్ అడిగితే కాకి లెక్కలతో నివేదికలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. వైద్యశాఖ చిత్తశుద్ధితో జ్వరాలను అరికట్టేందుకు పనిచేయకపోగా, పరిస్థితి తీవ్రతను తగ్గించి చూపుతూ నివేదికలు పంపుతోంది. వాటినే ప్రామాణికంగా తీసుకుంటున్న ప్రభుత్వం ‘సిక్కోలు మృత్యుఘోష’ను వినిపించుకోవడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి శ్రీకాకుళం జిల్లాలో విషజ్వరాలతో విలవిల్లాడుతున్న ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రత్యేక వైద్య బృందాలు పంపించాల్సి ఉంది.
అగ్రికెమ్ ఎదుట ఉద్రిక్తత
శ్రీకాకుళం, సెప్టెంబర్ 6: మా ప్రాణాలతో ఆటలాడుకోవద్దు... ఇప్పటి వరకు ఈ ఫ్యాక్టరీ వలన పడిన ఇబ్బందులు ఇక చాలు... కాలుష్యాన్ని వెదజల్లే నాగార్జున ఆగ్రికమ్‌ను తెరిపించాలని చూస్తే ఖబడ్దార్... అంటూ పరిసర గ్రామాల ప్రజలంతా పోరాట కమిటీ ప్రతినిధుల పిలుపు మేరకు కథం తొక్కారు. చిలకపాలేం, అల్లినగరం, ఎ.ఎ.వలస, నర్సాపురం, బేరిపేట తదితర గ్రామాల ప్రజలు పిల్లాపాపలతో గురువారం పరిశ్రమ ప్రధాన గేటు వద్దకు చేరుకొని నిరసనకు దిగారు. కనీసం మంచినీరైనా తాగలేక పోతున్నామంటూ మహిళలు శాపనార్ధాలు, పోరాట కమిటీ ప్రతినిధుల నిరసనలతో పరిశ్రమ ఆవరణ దద్దరిల్లింది. ఉదయం తొమ్మిది గంటల నుండి ఒంటి గంట వరకు సుమారు నాలుగు గంటల సేపు ధర్నా కొనసాగింది. తొలుత పోరాట కమిటీ ప్రతినిధులు శ్రీనివాసానందా, ఎం. మురళీధరబాబా, సనపల నారాయణరావు, కలిశెట్టి అప్పలనాయుడు, డొంక అప్పలరాజు, డొంక రమణ, చిలక రాము, ఎస్. వెంకటసన్యాసిరావు, తాండ్ర ప్రకాష్, కోరాడ నారాయణరావు, తోనంగి నందోడు, గాడు నారాయణరావు, గట్టిం రాములు తదితరులు ఆందోళనకారులతో పెద్ద ఎత్తున పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. వీరంతా పరిశ్రమను శాశ్వతంగా మూసివేయాలంటూ నినాదాలు చేశారు. జిల్లా కలెక్టర్ ఇక్కడకు రావాలని వారు ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. యాజమాన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని, దొడ్డి దారిన పరిశ్రమ తెరిపించేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తోందని వారంతా దుయ్యబట్టారు.
ఉద్రిక్తత...
మహిళలు, యువతతో పాటు పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పరిశ్రమ వద్దకు చేరుకుని శాశ్వతంగా మూసివేయాలన్న డిమాండుతో నినాదాలు కొనసాగించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల వలనే యాజమాన్యం దొడ్డి దారిన పరిశ్రమను తిరిగి తెరిపించేందుకు ప్రయత్నాలు చేస్తోందని వారంతా ఆందోళనకు దిగారు. ఒకానొక దశలో పరిశ్రమ లోకి చొచ్చుకొచ్చేందుకు ఆందోళన కారులు యత్నించినప్పటికీ పోలీసులు నివారించగలిగారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జె.ఆర్.పురం సి.ఐ. కె. వేణుగోపాలనాయుడు, స్థానిక ఎస్.ఐ. ఎల్. సన్యాసినాయుడు, లావేరు, రణస్థలం, పొందూరు సబ్ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది భారీగా మొహరించారు.
* తెరిపించాలని యత్నిస్తే... తాట తీస్తా
మాజీ మంత్రి తమ్మినేని
ఆగ్రికెమ్ గేటు వద్ద ధర్నా సాగుతుందన్న సమాచారం తెలుసుకున్న మాజీ మంత్రి తమ్మినేని సీతారాం, బి.జె.పి. రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాలంలు అక్కడకు చేరుకొని ఆందోళన కారులకు మరింత స్ఫూర్తి నింపారు. ఇదే సమయానికి రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకుని చర్చలకు రావాలని తీసుకువచ్చిన నోటీసును పరిశీలించిన సీతారాం కార్మికులతో చర్చలకు రావాల్సిన పనిలేదని, వారు కూడా ప్రజల్లో భాగమేనని కొట్టిపారేసారు. తక్షణమే యాజమాన్యం చర్చలకు రాకుండా దొడ్డి దారిన పరిశ్రమను తెరిపించాలని చూస్తే ప్రజలు తాట తీస్తారని అధికారులకు హెచ్చరించారు. ఇప్పటి వరకు యాజమాన్యం ఆటలు సాగాయని ఇక నుండి అటువంటి ఆగడాలు సాగనివ్వమన్నారు. స్థానికులు సహనం కోల్పోయి పరిశ్రమను శాశ్వతంగా మూసి వేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ధర్నా సాగిస్తుంటే ఇక్కడకు యాజమాన్య ప్రతినిధులు రాకుండా అధికారులతో రాయబారాలు నడపడం సరైంది కాదని హెచ్చరించారు. కార్మికుల వేతనాలు కోసం గతంలో యాజమాన్యం పై పోరాటాలు చేసిన సందర్భాలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. యాజమాన్యం ద్వంద వైఖరి విడనాడి పరిసర గ్రామాల ప్రజలు మనోభావాలకు అనుగుణంగా పరిశ్రమను శాశ్వతంగా మూసివేయాలన్నారు. ఇంతలో ధర్నా వద్దకు తహశీల్దార్ వి. శివబ్రహ్మానంద్ చేరుకొని యాజమాన్యానికి నోటీసు అందిస్తున్నామని వివరించారు. ఆదేవిధంగా 3గంటలకు జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యలయంలో చర్చలు సాగించేందుకు ఉన్నతాధికారులు నిర్ణయించారని తహశీల్దార్ చెప్పడంతో వారంతా చర్చలకు సమ్మతించి ధర్నాను విరమించారు. దీంతో నిరసన కార్యక్రమాన్ని పోరాటకమిటి ప్రతినిధులు ముగిస్తున్నట్లు ప్రకటించగా పరిసర గ్రామాల ప్రజలు ఇళ్లకు వెనుదిరిగారు.
రూ.1200 కోట్ల పంట రుణాల లక్ష్యం
నరసన్నపేట, సెప్టెంబర్ 6: రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా పంట రుణాలను అందించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ తెలిపారు. గురువారం ఆంధ్రాబ్యాంకు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రుణమేళా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఖరీఫ్ సీజన్‌లో బ్యాంకుల ద్వారా 1200 కోట్ల రూపాయలను పంట రుణాలుగా ఇస్తున్నామని వెల్లడించారు. గతంలో ఎకరాకు కేవలం 16 వేల రూపాయలు మాత్రమే పంట రుణం అందించారని, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశాలతో నేడు 23,850 రూపాయలుగా మంజూరు చేస్తున్నామన్నారు. దీనిపై ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించేలా ప్రచారం చేయాలని బ్యాంకు అధికారులకు సూచించారు. గత ఏడాది కేవలం రెండువేల కౌలురైతులను మాత్రమే గుర్తించామని, ఈ ఏడాది 25 వేల మంది కౌలురైతులను గుర్తించినట్లు తెలిపారు. సుమారు 50 కోట్ల రూపాయలు రుణాలను వీరికి అందజేయాలన్నారు. ఈ నెల పదవ తేదీ నుండి 15వ తేదీవరకు ఆయా డివిజన్ పరిధిలోని మండలాల్లో ఆర్డీఓల సమక్షంలో గుర్తింపుకార్డులను కౌలురైతులకు అందేలా చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటివరకు బ్యాంకుల ద్వారా ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 600 కోట్లరూపాయల రుణాలను అందించామని స్పష్టం చేశారు. ఎస్సీ, బిసి, యువజన సంఘాల ద్వారా మహిళా, వికలాంగులకు, వితంతువులకు ఐదుకోట్ల రూపాయలు రుణాలు ఇచ్చేందుకు కృషిచేయాలని సూచించారు. అలాగే ప్రతీ ఒక్కరూ బ్యాంకు ఖాతాలను తెరవాలని, రానున్న రోజుల్లో అన్ని పథకాలకు సంబంధించి నేరుగా ఆయా ఖాతాలు ద్వారానే నడుస్తాయన్నారు. 20 శాతం మేర జిల్లాలో ఆధార్‌కార్డులను పంపిణీ చేశామని, వీటి ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రాబ్యాంకు డిజిఎం రామకృష్ణ, లీడ్‌బ్యాంకు మేనేజర్ శ్రీనివాసశాస్ర్తీ, డిఆర్‌డిఏ పిడి రజనీకాంతరావు, అధికారులు పాల్గొన్నారు.
‘మడ్డువలస’కు జలకళ
వంగర, సెప్టెంబర్ 6: మండలంలోని మడ్డువలస ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. ఇటీవల మడ్డువలస ఎగువ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురియడంతో అధికంగా ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టు ప్రాంతమంతా నీటితో కళకళలాడుతుంది. వేగావతి,సువర్ణముఖి నదుల నుండి నీరు ఎక్కువగా వచ్చి చేరడంతో నీటి మట్టం రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. గురువారం నాటికి ప్రాజెక్టులో నీటి మట్టం 6.9 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టులో గరిష్టనీటి మట్టం 65 మీటర్లు కాగా ఈ ఏడాదిలో అధికంగా నీరు వచ్చి చేరడంతో ఖరీఫ్‌తో పాటు రబీ సీజన్‌లో కూడా ఆయకట్టు భూములకు నీరు అందుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు మరమ్మతుల కోసం గత మూడు నెలల కిందట పూర్తిగా దిగువ ప్రాంతానికి విడిచిపెట్టారు . దీంతో ఖరీఫ్ సమయానికి ప్రాజెక్టులో నీరు చేరకపోవడంతో రైతులు పంట పొలాలకు సాగునీరు లేక అనేక ఇబ్బందులకు గురయ్యారు. ప్రాజెక్టులో నీరు వచ్చి చేరడంతో తమ పంటలకు భరోసా ఏర్పడిందని రైతులు సంబరపడుతున్నారు.
‘పల్లెకుపోదాం’ మరింత క్రియాశీలకం
శ్రీకాకుళం, సెప్టెంబర్ 6: పల్లెకుపోదాం కార్యక్రమం మరింత క్రీయాశీలకంగా మారనుంది. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు సమర్ధవంతంగా చేరవేసేందుకు పాలనలో పారదర్శకతకు జిల్లాలో పల్లెకుపోదాం అనే వినూత్న కార్యక్రమానికి గత జిల్లా కలెక్టర్ జి.వెంకట్రామ్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ప్రజలకు సక్రమంగా చేరవేయుట, గ్రామాల్లో నిలయమైన ప్రభుత్వ సంస్థల పనితీరును మెరుగుపరుచట, గ్రామస్థాయి అధికార యంత్రాంగాన్ని పటిష్టపరుచుట ప్రధాన ఉద్దేశ్యంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటిని ప్రత్యక్షంగా, వెనువెంటనే పరిశీలించి పరిష్కరించే దిశగా కార్యక్రమాన్ని రూపొందించారు. అధికారుల బృందం అంగన్‌వాడీ కేంద్రం నుంచి ఆసుపత్రుల వరకు అన్ని ప్రభుత్వ సంస్థలను తాగు నుండి సాగునీటి వరకు, వ్యక్తిగత పారిశుద్ధ్యం నుండి గ్రామ పారిశుద్ధ్యం వరకు ఏ ఒక్క వ్యవస్థను వదిలిపెట్టకుండా పరిశీలించి పల్లెవాసులకు అందుతున్న సేవలను పరిశీలించి లోపాలుంటే సరిదిద్ది సక్రమంగా అందించే ఏర్పాటు చేసేందుకు ప్రవేశపెట్టారు. వ్యవసాయాధికారులు పొలంబడి కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్యశాఖ వైద్యశిబిరాన్ని విధిగా ఏర్పాటు చేసి పల్లెవాసులకు సేవలను అందజేయాల్సి ఉండేది. వీటన్నింటి పర్యవేక్షణను జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ ప్రత్యేకమైన దిశ, నిర్ధేశాలు జారీ చేస్తూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అన్ని శాఖల అధికారులు విధిగా గురువారం నిర్వహించే పల్లెకుపోదాం కార్యక్రమానికి హాజరు కావాలి. పల్లెకుపోయే అధికారుల బృందం గ్రామంలో ప్రతీ విషయాన్ని క్షుణ్నంగా పరిశీలించి ప్రజలకు తగు సమాచారాన్ని అచ్చటనే అందించాలి. ప్రతీ శాఖ తమ కార్యకలాపాలకు సంబంధించిన వివరాలు, రిజిష్టర్లు గ్రామానికి తీసుకువెళ్లాలి. శాఖాపరంగా గ్రామంలో జరుగుతున్న, జరగబోయే కార్యక్రమాలను స్పష్టంగా పర్యవేక్షించాలి. అడంగల్, 1 బి రిజిస్ట్రార్, ప్రభుత్వ భూముల రిజిస్ట్రార్, గ్రామపఠం, గ్రామానికి చెందిన మీసేవ ద్వారా అందించిన సేవల వివరాలను ప్రజలకు తెలియజేయాలి. అదే విధంగా రేషన్‌కార్డుల వివరాలు పంపిణీ రిజిస్ట్రార్, రచ్చబండలో వచ్చిన రేషన్‌కార్డుల దరఖాస్తులు, ఆన్‌లైన్‌లో వచ్చిన కార్డులవివరాలు, సామాజిక పింఛన్ల ఎక్విటెన్స్, రిజిష్టర్, సదరమ్ స్థితిగతులు, ఆన్‌లైన్ పింఛనుజాబితా, నూతన పింఛన్ల వివరాలు, ఇందిరమ్మ గృహాల వివరాలు ఇందులో ప్రతీ లబ్ధిదారుని వివరాలు రచ్చబండలో వచ్చిన దరఖాస్తుల ఆన్‌లైన్ జాబితా, ఉపాధిహామీలో గ్రామ పంచాయతీ వివరాలు, శ్రమశక్తి సంఘాలకు రెండు లక్షల రూపాయలు విలువ గల పనుల కల్పన ప్రతిపాదనలు ప్రజలు అడిగిన వెంటనే తెలియజేయాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యపై నిర్ధిష్టంగా చర్చ జరిగి బడిబయట గల విద్యార్థులు, విద్యార్థుల విద్యాభ్యాసం స్థాయి పరిశీలించాలి. ముఖ్యంగా ఆరోగ్యవిషయంపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో గర్భం దాల్చిన మహిళల వివరాలు, ఆసుపత్రి ప్రసవాలు, కుటుంబ నియంత్రణా శస్తచ్రికిత్సలు, ఇంటింటా చెత్తసేకరణ కార్యక్రమం, నీటినమూనాల పరీక్షల వివరాలు, క్లోరినేషన్, గ్రామాల్లో లభ్యమైన నీటిపరీక్షా కిట్‌లు వినియోగించే అంశాలను అధికారులు తనిఖీ చేయాలి. అక్షరాస్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కలెక్టర్ సాక్షర భారత్ కేంద్రాల నిర్వహణ లోపభూయిష్టంగా ఉండరాదన్నారు.
స్వయం సహాయక సంఘాల సభ్యులు వందమంది చేరాలని, ఆ కార్యక్రమం ఏ మేరకు నిర్వహిస్తున్నదీ పరిశీలించాలి. సాక్షర భారత్ కేంద్రాల తనిఖీలు నిర్వహించాలని, వాచకాల పంపిణీ పరిశీలించాలన్నారు. గ్రామంలోని యువజన సంఘాలను, గ్రామ పారిశుద్ధ్య ఆరోగ్య, ఇతర కార్యక్రమాల్లో భాగస్వామ్యులను చేయాలన్నారు. ఈ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. పల్లెకుపోదాం కార్యక్రమం నిర్వహణ అనంతరం నిర్ధేశిత ప్రొఫారమ్‌లలో నివేదిక సమర్పించాలన్నారు.
రైతు ముంగిటకే పాసుపుస్తకాలు
గార, సెప్టెంబర్ 6: ప్రభుత్వపరంగా ఎటువంటి లబ్ధి చేకూరాలన్నా రైతాంగానికి పట్టాదారు పాసుపుస్తకాలు తప్పనిసరని, ఇంత వరకు పట్టాదారు పాసుపుస్తకాలు అందని వారిని దృష్టిలో ఉంచుకొని రైతు ముంగిటకే పాసు పుస్తకాలు పంపిణి కార్యక్రమాన్ని నిర్వహింపజేయనున్నామని జె.సి. పోలా భాస్కర్ చెప్పారు. పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని కొర్లాం పంచాయతీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టాదారు పాసుపుస్తకాలు ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని ఇంత వరకు పాసుపుస్తకాలు పొందని రైతులను గుర్తించి నేరుగా వారి వద్దకే వెళ్లి పుస్తకాలు అందించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమం ప్రస్తుతం బూర్జ మండలంలో నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని అన్నీ మండలాల్లోనూ పంచాయతీలు వారీగా ఈ కార్యక్రమాన్ని ప్రాధాన్యత క్రమంలో నిర్వహిస్తామన్నారు. భైరి దేశిగెడ్డ ఆయకట్టులో శివారు భూములైన తమ పంట పొలాలకు సాగునీరు సరిగా అందడం లేదని సాగునీటి కల్పనకు చర్యలు చేపట్టాలని స్థానిక రైతులు జె.సి. దృష్టికి తీసుకువచ్చారు. తాగునీరు సౌకర్యం పై తమ గోడును స్థానికులు వెలుబుచ్చారు. గ్రామంలో గల చౌకధరల దుఖాణం, వైద్య శిబిరాన్ని జె.సి. భాస్కర్ పరిశీలించారు. పింఛన్లు, రేషన్ కార్డులు తదితర వాటిపై అంశాల వారీగా సంబంధిత అధికారులతో సమీక్షించారు. కొర్లాం పంచాయతీ కొమరవానిపేట గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం కల్పించాలని స్థానికులు విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి ఎం. రవికిరణ్, ఎంపిడిఒ. ఆర్. స్వరూపారాణి, తహశీల్దార్ బి. శాంతి, మండల విద్యాధికారి కె. త్రినాధస్వామి, వ్యవసాయాధికారి బి.వి.తిరుమలరావు, సి.ఎస్.డి.టి. గరిమెళ్ళ రమేష్‌కుమార్, ఆర్.ఐ. మురళినాయక్‌లతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం వైకాపా ధర్నా
నరసన్నపేట, సెప్టెంబర్ 6: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి నిరుపేద కుటుంబాల విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించాలన్న ఆశయంతో ఫీజురియింబర్స్‌మెంట్ పథకాన్ని అమలులోకి తెచ్చారని, అయితే నేటి ప్రభుత్వం దానిని తుంగలో తొక్కిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. గురువారం మండల కేంద్రంలోని సత్యవరం కూడలి వద్ద జాతీయ రహదారిపై ఈ మేరకు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ అధినేత్రి వైఎస్ విజయమ్మ ఫీజు రీయింబర్స్‌మెంట్ దీక్ష చేపడుతున్న నేపథ్యంలో ఆమెకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. కార్పొరేట్ సంస్థల్లో ఉచిత విద్యను అందించాలన్న ఆశయంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని తలపెట్టారన్నారు. కాలక్రమంలో ఫీజురీయింబర్స్‌మెంటు పథకానికి తిలోదకాలు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఇటీవలి విద్యుత్ సంక్షోభం పట్ల ఆందోళన చేపట్టిన నరసన్నపేట శాసనసభ్యుడు ధర్మాన కృష్ణదాసు, జిల్లా పార్టీ కన్వీనర్ ధర్మాన పద్మప్రియపై లేనిపోని కేసులను పోలీసులు బనాయించారని, వాటిని ఉపసంహరించాలని డిమాండ్ చేసారు. ఆదేవిధంగా గార ఎస్సై బి. నారీమణిని సస్పెండ్ చేయాలని నినాదాలు చేసారు. జాతీయ రహదారిపై నేతలు భైఠాయించడంతో సుమారు గంటన్నర పాటు ఇరువైపులా వాహనాలు రాకపోకలు స్తంభించిపోయాయి. పోలీసులు రంగంలోకి దిగి నేతలను అదుపుచేయడంతో ప్రశాంతంగా ధర్నా కార్యక్రమం ముగిసింది. దువ్వాడ శ్రీనివాస్, మార్పు ధర్మారావు, వరుదు కళ్యాణి, బల్లాడ జనార్ధనరెడ్డి, దుప్పల రవీంద్రబాబు, హేమమాలిని రెడ్డి, ధవల రమేష్ కుమార్, బొడ్డేపల్లి పద్మజ, మాధురికుమారి, ఆరంగి మురళిధర్, పీస శ్రీహరిరావు, కరిమి రాజేశ్వరరావు, మెండ రాంబాబులతో పాటు వెయ్యి మంది ధర్నాలో పాల్గొన్నారు.
ముగిసిన ధ్రువపత్రాల పరిశీలన
ఎచ్చెర్ల, సెప్టెంబర్ 6: ఈ ఏడాది ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఎంసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు గత నెల 27వ తేది నుండి స్థానిక ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో కొనసాగుతున్న ధ్రువపత్రాల పరిశీలన గురువారంతో ముగిసింది. ఇప్పటి వరకు 2340 మంది అభ్యర్థులు కౌనె్సలింగ్‌కు హాజరయ్యారు. వీరిలో ఒ.సి.,బి.సి. కేటగిరిలకు చెందిన వారు 2084 మంది, ఎస్.సి., ఎస్టిలు 256 మంది ఉన్నారు. వీరిలో ప్రభుత్వం ప్రకటించిన పూర్త్ఫిజు రాయితీని పొందేందుకు పదివేలు ర్యాంకు వచ్చిన వారు 155 మంది ఉండడం విశేషం. అయితే లక్ష రూపాయలు వార్షిక ఆదాయ పరిమితిని పూర్తి ఫీజు రియంబర్స్‌మెంట్ నిబంధన విధించడంతో కేవలం 98 మంది మాత్రమే అర్హత సాధించారు. మిగిలిన 61 మందికి పూర్తి ఫీజు రాయితీ చేజారింది. కౌనె్సలింగ్‌కు హాజరైన అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా కన్వీనర్ డాక్టర్ కె. ప్రసాద్, ఇన్‌చ్ఛార్జ్ మేజర్ కె. శివకుమార్‌లు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఫీజు రియింబర్స్‌మెంట్ పై సర్కార్ ద్వంద వైఖరి ఓ కారణమైతే, ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్ధులకు ప్లేస్‌మెంట్ కల్పించడంలో కూడా సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఆసక్తి కనబర్చకపోవడం మరో కారణంగా విద్యాధికులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇంజనీరింగ్ కళాశాలలు మాత్రం సీట్లు భర్తీ ఏవిధంగా చేపట్టాలని మల్లాగుల్లాలు పడుతున్నాయి.
మా జీతాలు మాకివ్వండి
పాతశ్రీకాకుళం, సెప్టెంబర్ 6: దీర్ఘకాలికంగా చెల్లించని నెలసరి జీతాలను, బకాయిలతో సహా వెంటనే చెల్లించాలని ఆలయ అర్చకులు దేవాదాయ ఉప కమిషనర్ సి.హెచ్.రమణమ్మ ముందు మొరపెట్టుకున్నారు. గురువారం దేవాదాయ శాఖ జిల్లా కార్యాలయంలో అర్చకుల సమస్యలపై నిర్వహించిన సమీక్షలో అర్చకులు పలు సమస్యలపై వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ సకాలంలో జీతాలు అందకపోవడంతో తమ కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపకమిషనర్ వినతులు స్వీకరించిన పిదప మధ్యాహ్నం అర్చకుల సమస్యలపై ఆలయ అధికారులతో నిర్వహించిన సమావేశంలో అర్చకులు సమస్యలపై చర్చించారు. ఆదాయ వనరులు అవసరాల మేరకు నిధులు సమకూరనందున తాము జీతాలు చెల్లించే పరిస్థితి లేదని ఆలయ మేనేజర్లు చేతులెత్తేశారు. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ ఆలయ ఆదాయాలపై ఆరాతీశారు. సంబంధించి రికార్డులను తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని సహాయ కమిషనర్ ఎ.వి.వి.సత్యనారాయణమూర్తికి ఆదేశించారు. సమావేశంలో ఆలయ ఇఓలు బలివాడ ప్రసాద్‌పట్నాయిక్, వాసుదేవరావు, సన్యాసిరాజు, గురునాధరావులతోపాటు ఇఒలు, మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
సామాన్యుల చావు సర్కారుకు పట్టదా..?
ఎచ్చెర్ల, సెప్టెంబర్ 6: జిల్లాలో గిరిజన, మైదాన ప్రాంతాల్లో మలేరియా, డెంగ్యూ, రక్తకణాలు తగ్గిపోయి రోజురోజుకు మృతులు సంఖ్య పెరిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమని మాజీ ఎమెల్సీ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గొర్లె హరిబాబునాయుడు విమర్శించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైద్య, విద్యా శాఖ మంత్రి సొంత నియోజక వర్గమైన సంతకవిటిలో మరణమృదంగం వినిపిస్తున్నా కిరణ్ సర్కారుకు చీమకుట్టినట్లైనా లేకపోవడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ప్రభుత్వ అసమర్ధత వలన గ్రామాల్లో ప్రాధమిక అవసరాలు కూడా పౌరులకు తీరే పరిస్థితులు లేవన్నారు. ఎక్కడి కక్కడే పారిశుధ్యం పేరుకు పోయి మంచినీరు కలుషితం అవుతున్నాయన్నారు. ఇదేమాదిరి వీధి లైట్లు కూడా వెలగని దుస్థితిలో పల్లెలు ఉన్నాయని, వీటంతటికీ ప్రభుత్వ అసమర్ధతే కారణమన్నారు. నియోజక వర్గం లావేరు మండలం సుభద్రాపురం కూడలిలో ప్రతీ సోమవారం స్థానికుల నుండి వినతులు స్వీకరించి వీటి పరిష్కారానికి మండల, జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకు వెల్తానన్నారు. తాజాగా లావేరు, రణస్థలం మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటాయని, బోర్లు తవ్వించుకునేందుకు సంబంధిత శాఖాధికారులు అనుమతులు తిరస్కరిస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని, ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు నివేదించామన్నారు.
అదేవిధంగా మంగళవారం రణస్థలంలో, బుధవారం జి.సిగడాంలో, శుక్రవారం ఎచ్చెర్లలోను స్థానికుల నుండి వివిధ రకాల సమస్యలుపై వినతులు స్వీకరించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే ఇందరమ్మ బిల్లులు అందక పలువురు లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని, పింఛన్లు, రేషన్ కార్డు ధరఖాస్తులు వంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వెళ్తానన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజలకు చేరువ చేసే దిశగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా ప్రజల సమస్యలను పార్టీలకు అతీతంగా అధికారుల దృష్టికి తీసుకు వెళ్లేందుకు సంధాన కర్తగా వ్యవహరిస్తానని హరిబాబునాయుడు స్పష్టం చేసారు. ఈయనతో పాటు సీపాన వెంకట్రావు, నేతింటి సత్యన్నారాయణ తదితరులు ఉన్నారు.
చిలకపాలెం బంద్ విజయవంతం
ఎచ్చెర్ల, సెప్టెంబర్ 6: మండలంలోని ఎ.ఎ.వలస పరిధిలో ఉన్న నాగార్జున అగ్రికెమ్‌ను శాశ్వతంగా మూసివేయాలని పోరాట కమిటీ ప్రతినిధులు ఇచ్చిన పిలుపు మేరకు చిలకపాలెం కూడలిలో గురువారం బంద్ విజయవంతమైంది. నిత్యం జనం రద్దీతో కిక్కిరిసిన ఈ కూడలి బంద్ కారణంగా వెలవెలబోయింది. హోటళ్లు, దుకాణాలు వివిధ వ్యాపార సముదాయాలకు స్వచ్చంధంగా తాళాలు వేసి బంద్‌కు సంఘీభావం తెలిపారు. అలాగే స్థానికంగా ఉన్న గ్రామీణ వికాస్‌బ్యాంకు మూతపడడంతో ఖాతాదారులు పలు అవస్థలు ఎదుర్కొన్నారు. టీ దుకాణాలు, పాన్‌షాపులు సైతం మూసివేయడంతో చిలకపాలెం, పొందూరు వెళ్లే రహదారి బోసిపోయింది.
రాస్తారోకోతో
నిలిచిపోయిన వాహనాలు
పరిశ్రమ గేటు బయట ఆందోళనకు దిగిన యువకులంతా అధికారులు సానుకూలంగా స్పందించకపోవడంతో రాస్తారోకోకు పూనుకున్నారు. ఒకేఉదుటన పరిశ్రమ నుంచి పొందూరు వెళ్లే రహదారి వద్దకు చేరుకుని నర్సాపురం కూడలిలో రోడ్డుపై బైటాయించారు. ఫ్యాక్టరీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
చిలకపాలెం, ఎఎ వలస, అల్లినగరం, నర్సాపురం, బేరిపేట గ్రామాలకు చెందిన యువత, మహిళలు ఇక్కడకు చేరుకుని రోడ్డుపై బైటాయించి నిరసనకు దిగారు.
తక్షణమే ఆందోళనకారుల వద్దకు ఉన్నతాధికారులు చేరుకుని పరిశ్రమను శాశ్వతంగా మూసివేయాలని నినాదాలు సాగించారు. యాజమాన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారని వారంతా విమర్శించారు.
రాస్తారోకో కారణంగా పొందూరు, రాజాం, జి.సిగడాం, సాలూరు, బొబ్బిలి వంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు, వివిధ వాహనాలు నిలిచిపోయాయి. ఎస్సై ఎల్.సన్యాసినాయుడు నిరసనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారంతా ససేమిరా అన్నారు. సుమారు అర్ధగంట సేపు రాస్తారోకో సాగించి తిరిగి అగ్రికెమ్ ప్రధాన గేటు వద్దకు చేరుకోవడంతో యధావిధిగా వాహనాలు రాకపోకలు సాగించాయి.
శవమై తేలిన బాలుడు
జలుమూరు, సెప్టెంబర్ 6: మండలం ముఖలింగం సమీప వంశధార నదిలో బుధవారం గల్లంతైన సీపాన గణేష్(14) మృత దేహం గురువారం ఉదయం నగిరికటకం ప్రాంతంలో లభ్యమైంది. మృతి చెందిన గణేష్ కోసం పలు శాఖలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినా లభ్యం కాలేదు. దీంతో చేసేదేమి లేక అధికారులు వెనుతిరిగారు. కుటుంబీకులు, గ్రామస్థులకు అందిన సమాచారం మేరకు నగిరికటకం ప్రాంతంలో మృతదేహం ఉన్నట్లు తెలుసుకొని అక్కడకు చేరుకున్నారు. గణేష్ మృత దేహం వద్ద బంధువులు, కుటుంబీకులు, స్నేహితులు బోరున విలపించారు. వీఆర్వో జి. విజయబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి శవ పంచనామా జరిపి పోస్టుమార్టం కోసం నరసన్నపేట తరలించారు.