విజయనగరం, సెప్టెంబర్ 6: జిల్లాలో ఇప్పటికీ కరవు ఛాయలు తగ్గలేదు. గత మూడు రోజులుగా ఒకమోస్తరు వర్షాలు కురుస్తున్నప్పటికీ వరి నాట్లు జరిగే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఆగస్టు మాసాంతానికే ఖరీఫ్ సీజన్ పూర్తి కాగా, వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో వరి నాట్లు ఇంకా కొనసాగలేదు. అయితే సెప్టెంబర్ మొదటి వారంలో అడపాదడపా కురుస్తున్న వర్షాలు ఖరీఫ్ వరి సాగుకు ఏమంత మేలు చేసేవిగా లేవని రైతాంగం భావిస్తోంది. అయితే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వేసిన వరినాట్లకు ఈ వర్షాలు పూర్తి స్థాయిలో ఉపకరిస్తాయని రైతాంగం పేర్కొంటోంది. కొన్ని ప్రాంతాల్లో వరి నారు ముదిరి పోవడంతో తాజాగా కురిసిన వర్షాలకు వాటిని నాటే పరిస్థితి కన్పించట్లేదు. ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి తీవ్ర వర్షాభావ పరిస్థితులు రైతును కుంగదీస్తూనే ఉన్నాయి. ఈ సంవత్సరం జూన్‌లో సాధారణ వర్షపాతం 128.4 సెంటీమీటర్లుండగా, కేవలం 76 సెం.మీ మాత్రమే కురిసింది. ఈనెల్లో మైనస్ 41 సెంమీ వర్షపాతం నమోదైంది. ఇక జూలైలో సాధారణ వర్షపాతం 178.7 సె.మీ కాగా, 202 సెంమీ కురిసింది. అయితే ఈనెల్లో కురిసిన వర్షాల వల్ల ఖరీఫ్ వరికి ఏమాత్రం ఉపకరించలేదు. ఇక ఆగస్టులో సాధారణ వర్షపాతం 195.1 సెం.మీ కాగా 181.8 సెంమీ నమోదైంది. ఈనెల్లో కూడా మైనస్ 7శాతం వర్షపాతం నమోదైంది. పట్టణ ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. భారీ స్థాయిలో వర్షాలు కురియకున్నప్పటికీ మోస్తరు వర్షాలు రికార్డు కావడంతో వర్షపాతం ప్రాతిపదికన కరవు పరిస్థితులు ప్రకటించే అవకాశాలను దెబ్బ తీస్తున్నాయి. సెప్టెంబర్ నెల్లో తొలి మూడు రోజుల్లో కూడా మైనస్ వర్షపాతమే నమోదైంది. అయితే గత మూడు రోజులుగా కురుస్తున్న కొద్ది పాటి వర్షాలకు చెరువుల్లో నీరు చేరితే స్వల్పకాలిక పంటలకు ఉపకరిస్తుందని వ్యవసాయ శాఖ యంత్రాంగం స్పష్టం చేస్తోంది. వరి రకాలపై పూర్తిగా ఆశలు వదులుకున్న వ్యవసాయ శాఖ ఉద్యాన పంటల వైపు రైతాంగాన్ని మళ్ళించేందుకు చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా కూరగాయలు వంటి ఇతర పంటలు వేసే విధంగా రైతాంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించాలని ఇటీవల జరిగిన జిల్లా సమీక్షా మండలి సమావేశంలో తీర్మానించారు. అయితే ఈ ప్రతిపాదన మేరకు జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించాలంటే కొన్ని సాంకేతిక కారణాలు అడ్డంకిగా మారుతున్నట్టు యంత్రాంగం భావిస్తోందిజాతీయ స్థాయిలో కరవు ప్రాంతంగా ప్రకటించాలంటే వర్షపాతంతో పాటు పంటల దిగుబడి శాతాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఈప్రాతిపదికన చూస్తే జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించే అవకాశాలు తక్కువే. డి.ఆర్.సి.లో తీర్మానమైతే చేశారు గానీ వర్షపాతం వివరాల దృష్ట్యా అధికారులు కరవు నివేదికలను ఇప్పటికీ కేంద్రానికి పంపలేదు. మొత్తం మీద చూస్తే జిల్లాలో కరవు పరిస్థితులు నెలకొన్నప్పటికీ సాంకేతికంగా దీనిపై కేంద్రం తీసుకునే నిర్ణయంపైనే కరవు ప్రకటన ఆధారపడి ఉంటుంది.
కార్యదర్శుల సమ్మెకు పి.ఆర్ ఉద్యోగుల మద్దతు
విజయనగరం , సెప్టెంబర్ 6: గ్రామ పంచాయతీ కాంట్రాక్ట్ కార్యదర్శులు చేపట్టిన సమ్మెకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ భాగస్వామ్య సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. మండల పరిషత్ అభివృద్ధి అధికారుల సంఘం, పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం, ఇ.ఒ.పి.ఆర్.ల సంఘం, పంచాయతీ కార్యదర్శుల సంఘం, నాలుగోతరగతి ఉద్యోగుల సంఘం మద్థతు తెలియజేశాయి. ఈ మేరకు గురువారం ఇక్కడ జెడ్పీ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయా సంఘాలకు పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.వి.రమణమూర్తి మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం మొండివైఖరి అవలంభించడం తగదన్నారు. కార్యదర్శులు చేపడుతున్న సమ్మెకు మద్ధతు తెలియజేస్తూ ఈనెల ఏడోతేదీన నల్లబ్యాడ్జీలతో నిరసన, 10వ తేదీన మధ్యాహ్నభోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. 12వ తేదీన మాస్‌క్యాజువల్ లీవ్‌తోపాటు సిపిఆర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కె.రామకృష్ణరాజు, ఇ.ఒ.పి.ఆర్.డి. సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.ప్రకాశరావు,పంచాయతీరాజ్ నాలుగోతరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.నూకరాజు, గ్రామాభివృద్ధి అధికారుల సంఘం జిల్లా ప్రతినిధి వి.రమేష్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులపై దృష్టి పెట్టండి: కమిషనర్
విజయనగరం , సెప్టెంబర్ 6: పట్టణంలో అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని మున్సిపల్ కమిషనర్ ఎస్.గోవిందస్వామి అన్నారు. గురువారం తన చాంబర్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోవిందస్వామి మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున పెండింగ్‌లో ఉన్న పనులను త్వరిగతిన పూర్తి చేయాలన్నారు. వర్షాల వల్ల రోడ్లు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. బి.ఆర్.జి.ఎఫ్., బి.పి.ఎస్.నిధుల ద్వారా చేపడుతున్న పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా విలీన ప్రాంతాల్లో అభివృద్ధిపనులపై ప్రత్యేకంగా శ్రద్ద వహించాలన్నారు. ఆయా ప్రాంతాల్లో రోడ్లు, కాలువలు నిర్మించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పట్టణంలో అనేక చోట్ల ప్రధాన కాలువల్లో పూడిక పేరుకుపోవడం వల్ల వర్షం రోడ్లపై నిలిచిపోతోందన్నారు. అందువల్ల కాలువల్లో పేరుకుపోయిన పూడికను వెంటనే తొలగించే ఏర్పాట్లు చేయాలన్నారు.
అడ్డంగి జంగిడభద్రలో అతిసార: ప్రజల బెంబేలు
గుమ్మలక్ష్మీపురం, సెప్టెంబర్ 6: మండలంలోని తాడికొండ పంచాయతీ అడ్డంగి జంగిడభద్రలో అతిసారతో ఆరుగురు గిరిజనులు అస్వస్థకు గురయ్యారు. అతిసార వ్యాధికి గురైన రోగులకు ఏ. ఎన్. ఎం. సుశీల, హెచ్.వి. ఎన్. వరహాలమ్మ వైద్యసేవలు అందిస్తున్నారు. అతిసార వ్యాధికి గురైన వారిలో గ్రామానికి చెందిన తోయక సీతమ్మ, తోయక టింగిరి, పత్తిక దాసు, పత్తిక డీకమ్మ, పత్తిక కుమారి, తోయక గుంజన్నలున్నారు. వీరు బుధవారం మధ్యాహ్నం నుంచి వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఇదిలా ఉండగా కురుస్తున్న వర్షాల కారణంగా, గ్రామంలో పేరుకుపోయిన అపారిశుద్ధ్యం, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను తినడం వలన అతిసార వ్యాధికి గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత సీజన్‌లో ప్రతీ ఒక్కరూ కాచి చల్లార్చిన నీటినే తాగాలని, భోజనం చేసే ముందు కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని తాడికొండ పి.హెచ్.సి. వైద్యాధికారిణి భాగ్యరేఖ తెలిపారు. చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా అతిసార సోకకుండా ఉంటుందని వివరించారు. ప్రజలు ఆరోగ్య కార్యకర్తలు సూచనలు పాటించాలని కోరారు. ప్రజలకు ఈ విషయాలను వివరించి చైతన్యం చేయాలని కోరారు. కొద్ది పాటి జాగ్రత్తలతో ప్రమాదం నుంచి బయటపడవచ్చని వివరించారు. రోగ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య సహాయం పొందాలని వివరించారు.
సుమో, ఆటో ఢీ: 8మందికి గాయాలు
మక్కువ, సెప్టెంబర్ 6: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకాధికారి వాహనం, ఆటో ఢీకొన్న సంఘటనలో 8మంది గాయపడిన వైనం ఒకటి వెలుగుచూసింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం మక్కువలో గోవింద కళ్యాణ మహోత్సవానికి బొబ్బిలి వస్తున్న ప్రత్యేకాధికారి రామకృష్ణ సుమో, మక్కువ నుంచి బొబ్బిలి వెళుతున్న ఆటో గురువారం కన్నంపేట మలుపు వద్ద ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక అధికారి రామకృష్ణతోపాటు డ్రైవర్ ఎం. నాయుడు, ఆటోలో ప్రయాణిస్తున్న దబ్బగెడ్డ గ్రామానికి చెందిన సూర్యకాంతం, కె.కుమారి, వెంగాపురానికి చెందిన ఇందిరలతోపాటు బొడ్డవలస గ్రామానికి చెందిన అప్పలనాయుడు, రొంపల్లికి చెందిన ఆదిలక్ష్మి, గోపాలపురానికి చెందిన గంగమ్మలు గాయపడ్డారు. వీరిలో ఇందిర, అప్పలనాయుడుల పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో విశాఖకు తరలించి కేసు నమోదు చేశారు.
వర్షాలకు పెరిగిన తాటిపూడి నీటిమట్టం
గంట్యాడ, సెప్టెంబర్ 6: ఇటీవల వర్షాల కారణంగా తాటిపూడి జలాశయం నీటి మట్టం గణనీయంగా పెరిగింది. గురువారం నాటికి నీటి మట్టం 267.9 అడుగులకు చేరింది. గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు జలాశయంలోకి భారీగా నీరు చేరడంతో సుమారు రెండు అడుగుల మేరకు నీటి మట్టం పెరిగింది. జలాశయ పరివాహక ప్రాంతాల బుధవారం వరకూ వరద ఎం.సి.ఎఫ్.టి.ల ఇన్‌ప్లో ఉంది. గురువారం ఇన్‌ఫ్లో తగ్గు ముఖం పట్టింది. ఆయుకట్టు భూములకు ఖరీఫ్ అవసరాలకు జలాశయం నీటిని ఇప్పటికే ఇస్తున్న విషయం తెలిసిందే. గత నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాల వల్ల జలాశయం నీటి మట్టం రెండు అడుగులు పెరగడంతో ఆయుకట్టు గ్రామాల రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
22వ రోజుకు చేరుకున్న కార్యదర్శుల సమ్మె
విజయనగరం , సెప్టెంబర్ 6: సమస్యల పరిష్కారం కోరుతూ గ్రామ పంచాయతీ కాంట్రాక్ట్ కార్యదర్శులు చేపట్టిన సమ్మె గురువారంనాటి 22వ రోజుకు చేరుకుంది. స్థానిక జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద నిరసన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఆందోళనా కార్యక్రమాలను చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 163 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ కాంట్రాక్ట్ కార్యదర్శుల సంఘం జిల్లా కార్యదర్శి సిహెచ్.అప్పలనాయుడు మాట్లాడుతూ కార్యదర్శులు చేపడుతున్న సమ్మె పట్ల ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. తాము చేపడుతున్న సమ్మె ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ భాగస్వామ్య సంఘాలన్నీ సంపూర్ణ మద్ధతు తెలియజేశాయన్నారు. అదేవిధంగా పలురాజకీయపార్టీలు కూడా సంఘీభావాన్ని ప్రకటించాయన్నారు. గత తొమ్మిదేళ్ల నుంచి చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని చేస్తున్న విజ్ఞప్తుల గురించి ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. కార్యదర్శుల సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం దారుణమన్నారు. కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ, కోశాధికారి తౌడు తదితరులు పాల్గొన్నారు.
పైలట్ ప్రాజెక్టు ఏర్పాటుకు స్థల పరిశీలన
జామి, సెప్టెంబర్ 6: మండల కేంద్రమైన జామిలో ఫైలట్ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రాజెక్టు అధికారి సి.ఇ. సురేంద్ర రెడ్డి గురువారం తమ సిబ్బందితో స్థల పరిశీలన చేశారు. స్థానిక గోస్తనీ నది వంతెన సమీపంలో ఉన్న నదీ పరిసర ప్రాంతాన్ని చూపి సిబ్బందితో చర్చించారు. 9 కోట్ల రూపాయలతో 13 గ్రామాలకు తాగునీరు అందించే యోజనతో ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. మండల కేంద్రానికి చివర నున్న ఎత్తు ప్రాంత గ్రామాలకు తాగునీరు పైలట్ ప్రాజెక్టు ద్వారా అందించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా వి.ఆర్.పాలెం, వెనె్న, గొడ్డు కొమ్ము, జె.డి.వలస, ఆర్.బి.పురం, కిర్ల, కిర్లమెరక, తెలగాపాలెం, మోకాసా కొత్తవలస, సోమయాజుల పాలెం వంటి గ్రామాలకు తాగునీరు అందుతుందని తెలిపారు. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.దీని వలన చాలా గ్రామాల్లో మంచినీటి సమస్య తీరుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్థల పరిశీలన కార్యక్రమంలో ప్రాజెక్టు ఇ.ఇ. శ్రీనివాసరావు, డి.ఇ. గోవింద, జె.ఇ. వైకుంఠం తదితరులు పాల్గొన్నారు.
వర్షాలతో మత్స్య సంపదకు నష్టం
భోగాపురం, సెప్టెంబర్ 6: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు కారణంగా మత్స్య సంపదకు నష్టం వాటిల్లిందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో కొండ్రాజుపాలెం, చేపల కంచేరు, ముక్కాం, భోగాపురం తదితర గ్రామాల్లో కొన్ని చోట్ల చెరువుల్లో చేపడిల్లలు వేసినట్లు వారు తెలిపారు. అయితే ఈ మధ్య కాలంలో వర్షాలు అధికంగా పడటం వల్ల చేపపిల్లలు వర్షం నీరు తాకిడికి బయటకి వచ్చేయటం వల్ల పలువురు పందిర వలలు ద్వారా చేప పిల్లలని పట్టేస్తున్నారని, దీని వల్ల తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. దీని వల్ల వేలాది రూపాయలు ఖర్చు చేసి చెరువుల్లో చేప పిల్లలు పెంచటం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో చేసేది ఏమిలేక నిస్పాకయ స్థితిలో వచ్చిన నష్టాన్ని భరిస్తూ చేసేది ఏమి లేదని ఆందోళన చెందుతున్నారు.
రైతన్న ముఖంలో ఆనందం
భోగాపురం, సెప్టెంబర్ 6: గత రెండు రోజులుగా కురిసిన వర్షాలు కారణంగా చెరువులు నిండటం వల్ల అలాగే పొలాలులో నీరు సమృద్ధిగా ఉండటం వల్ల రైతన్న ముఖంలో ఆనందం వెళ్ళివిరిసింది. అయితే గత కొద్ది కాలంగా వర్షాలు పడక పోవటం వల్ల అలాగే బోరుబావుల్లో నీరు సమృద్ధిగా లేక పోవటం వల్ల తమ పెట్టిన పెట్టుబడి అంతా పోతుందోమని, తీవ్ర నష్టం వాటిల్లుతుందోమోనని భయపడిన రైతన్నని వరుణుడు కరుణించడంతో యదలు వేయటం మొదలు పెట్టారు.
గురజాడ జయంతి ఏర్పాట్ల పరిశీలన
విజయనగరం , సెప్టెంబర్ 6: గురజాడ 150వ జయంతి సందర్భంగాఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు అధికారులకు కేటాయించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ఎ.శోభ చెప్పారు. గురువారం గురజాడ జయంతి ఉత్సవాలను నిర్వహించనున్న గురజాడ గృహం, గురజాడ కళాభారతి, ఆనందగజపతి ఆడిటోరియం ప్రదేశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె గురజాడ గృహం, గురజాడ కళాభారతి, ఆనందగజపతి ఆడిటోరియం చుట్టు ప్రక్కల పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. గురజాడ గృహంలో పేయింటింగ్ వేయించాలని ఆమె డి.ఆర్.డి.ఎ. ప్రాజెక్టు డైరెక్టర్‌కు చెప్పారు. ఈ నెల 19వ తేదీన ప్రారంభించనున్న గురజాడ ఉత్సవాల ఏర్పాట్లపై ఆమె అధికారులకు సూచనలు ఇచ్చారు. లైటింగ్ ఏర్పాట్లు, పువ్వుల అలంకరణ తదితరమైనవి బాగా ఉండాలని ఆమె చెప్పారు. ఆనందగజపతి ఆడిటోరియంలో డెకరేషన్‌కు సంబంధించి ఏర్పాట్లు బాగా చేయాలని, మనుషులు ఏవైనా కావలిస్తే మున్సిపల్ కమిషనర్‌ను సంప్రదించాలని ఆమె సాంఘిక సంక్షేమశాఖ డి.డి.ని ఆదేశించారు. సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి కళాకారులు వారు ప్రదర్శించే స్థలంను ఒకసారి చూడమని చెప్పాలని ఆమె అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డి.ఆర్.డి.ఎ. ప్రాజెక్టు డైరెక్టర్ వాసుదేవరావు, సాంఘిక సంక్షేమశాఖ డి.డి. అప్పారావు, వ్యవసాయశాఖ జె.డి. లీలావతి, జిల్లా పంచాయతీ అధికారి నాగరాజువర్మ, గృహ నిర్మాణ శాఖ పి.డి. ప్రసాద్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోతన్న, ఉడా డి.ఇ. శ్యామసుందర్, గురజాడ సాంస్కృతిక సమాఖ్య కార్యదర్శి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
‘పశుగణనను సమర్థవంతంగా నిర్వహించాలి’
విజయనగరం , సెప్టెంబర్ 6: జిల్లాలో పశుగణనను సమర్థవంతంగా నిర్వహించాలని పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ జె.ఎస్.ఎస్.ఎం.శ్రీ్ధర్‌కుమార్ అన్నారు. గురువారం ఇక్కడ కలెక్టరేట్ ఆడిటోరియంలో పశుగణనపై పశువైద్యాధికారులు, పెరా సిబ్బంది, గోపాలమిత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ్ధర్‌కుమార్ మాట్లాడుతూ ఈనెల 15 నుంచి వచ్చేనెల 15వ తేదీవరక పశుగణన జరుగుతుందన్నారు. గ్రామస్థాయిలో ఇంటింటికి ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. గ్రామస్థాయిలో పశుగణనపై చేపట్టిన నివేదికల ద్వారా పశుగణాభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందన్నారు. అంతేకాకుండా పశుగణనను సమర్థవంతంగా చేపట్టడం వల్ల దేశాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందన్నారు. మారుమూల గ్రామాలకు సైతం పశుగణన ఎన్యూమరేటర్లు వెళ్లి పశుగణన చేపట్టాలని ఆదేశించారు. ఇప్పుడు చేపట్టిన పశుగణనను బట్టి ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తోందన్నారు. బహుళార్థక పశువైద్యశాల డిప్యూటీ డైరెక్టర్ వై.నర్సింహులు, పశుసంవర్థకశాఖ అసిస్టెంట్‌డైరెక్టర్ చందక నర్సింహాలు, గొర్రెల పెంపకందార్లు సహకార సంఘం మేనేజింగ్‌డైరెక్టర్ మహాశంకర పాత్రో, బహుళార్థక పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
రైలు ఢీకొని 31 గొర్రెలు మృతి
దత్తిరాజేరు, సెప్టెంబర్ 6: మండలంలోని కోమటిపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గల బ్రిడ్జి దగ్గర, 31 గొర్రెలను రైలు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందగా 16 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని చుక్కపేట గ్రామానికి చెందిన గొర్రెల పెంపకం దారుడు గడిదేశ గంగులు తన గొర్రెల మందును రెండు రోజులుగా కోమటిపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని బీడు భూముల్లో మేపడానికి తీసుకొనివచ్చాడు. బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత రెండు గంటల సమయంలో గొర్రె మంద సమీపంలోని రైల్వే పట్టాల మీదకు రావడంతో రైలు గొర్రెల మందును ఢీ కొనడంతో మందలోని 26 గొర్రెలు, ఆరు గొర్రెపోతులు అక్కడికక్కడ చనిపోగా, 16 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. సుమారు రెండు లక్షల రూపాయలకుపైగా నష్టం జరిగిందని అంచనా సమీపాన ఉన్న గొర్రెల యాజమాని అకాస్మత్‌గా రైలు డీ కొని గొర్రెలు చని పోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు సమాచార మందించడంతో జిల్లా పశు సంవర్ధశాఖ అదికారులకు సమాచారమందించారు. సంఘటనా స్థలానికి పశు సంవర్ధకశాఖ జె.డి. డాక్టర్ జె.ఎస్.ఎస్.ఎం.శ్రీ్ధర్‌కుమార్, దత్తిరాజేరు పెదమానాపురం పశువైద్యాధికారులు సత్యనారాయణ, శ్రీనివాసరావులు బాధితులను పరామర్శించి గొర్రెలకు ఇన్యూరెన్స్ లేక పోవడంతో నష్టపరిహారం రాదని అధికారులు తెలిపారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన జె.డి
దత్తిరాజేరు, సెప్టెంబర్ 6: జిల్లాలో సుమారు నాలుగు లక్షలకుపైగా గొర్రెలను పెంపకందారులు పెంచుతున్నారని వీటిలో సుమారు 6,750 గొర్రెలకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉందని మిగతా వాటికి పెంపకం దారులు ఇన్యూరెన్స్ చేయించలేదని, దీని వల్ల గొర్రెలు అకాస్మాత్‌గా మరణిస్తే నష్టపరిహారం అందే పరిస్థితి లేదని జిల్లా పశుసంవర్ధకశాఖ జె.డి. డాక్టర్ జె.ఎస్.ఎస్. ఎం.శ్రీ్ధర్‌కుమార్ తెలిపారు. గురువారం ఉదయం కోమటిపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాల దగ్గర రైలు ఢీకొని 31 గొర్రెలు మృతి చెందడంతో వాటిని పరిశీలించడానికి వచ్చారు. చనిపోయిన గొర్రెలకు ఇన్యూరెన్స్ లేక పోవడంతో నష్ట పరిహారం అందదని తెలిపారు. గొర్రెల పెంపకందారులు ముందు జాగ్రత్తగా తమ గొర్రెలను జీవరక్ష పథకం ద్వారా ఇన్యూరెన్స్ చేసుకుంటే నష్టపరిహారం అందే అవకాశాలు ఉండేవని తెలిపారు. గొర్రెల పెంపకం దారులు తమ గొర్రె ఒక్కంటికి 54 రూపాయలు ఇన్యూరెన్స్ కడితే ప్రభుత్వం 80 రూపాయలు భరిస్తుందని మొత్తం 134 రూపాయలు ఇన్యూరెన్స్ కడితే , ప్రమాదవశాత్తు గొర్రెలు చనిపోతే పెద్దవాటికి మూడు వేల రూపాయలు బీమా వస్తుందని తెలిపారు. జిల్లాలో గొర్రెల పెంపకం దారులు తాము పెంచుతున్న గొర్రెల సంఖ్య సమాచారం తమకు తెలిపితే వాటికి అవసరమైన మందులు సరఫరా చేస్తామని తెలిపారు. త్వరలో 19వ పశుగనణ కార్యక్రమం సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు జరుగుతుందని తెలిపారు. అలాగే గొర్రెల కాపరి కూడా బీమా చేయించుకుంటే లక్ష రూపాయలు ఇన్యూరెన్స్ వర్తిసుందని తెలిపారు. పశువైద్యాధికారులు సత్యనారాయణ, శ్రీనివాసరావులు పాల్గొన్నారు.
‘శిశు మరణాల రేటును తగ్గించాలి’
నెల్లిమర్ల, సెప్టెంబర్ 6: శిశుమరణాల రేటును తగ్గించేందుకు ప్రతీ ఒక్కరీ కృషి చేయాలని ఐ.సి.డి.ఎస్. ప్రాంతీయ సంయుక్త సంచాలకులు పి.అనసూయ అన్నారు. గురువారం స్థానిక బైరెడ్డి సూర్యనారాయణ కల్యాణమండపంలో పౌష్టికాహార ముగింపు వారోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా ఐ.సి.డి.ఎస్. నెల్లిమర్ల ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆర్.జె.డి. అనసూయ మాట్లాడుతూ పౌష్టికాహారం లోపం కారణంగా శిశు మరణాలు అధికంగా జరుగుతున్నాయన్నారు. ప్రతీ ఏటా పౌష్టికాహరంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా శిశు మరణాల రేటును తగ్గించలేక పోతున్నామన్నారు. తహశీల్దార్ జయదేవి మాట్లాడుతూ ప్రభుత్వ సమాజంలో స్ర్తికి మహోన్నత స్థానం ఉందన్నారు. భవిష్యత్ తరాలు ముందుకు సాగాలంటే మహిళలు ఆరోగ్యానికి ప్రాథాన్యతనిస్తూ పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సి.డి.పి.ఓ. శాంతకుమారి, సూపర్ వైజర్లు సూర్యకుమారి, ప్రద్మావతి, సైలజ, వెంకటలక్ష్మి, శంకుతల, గుర్ల, నెల్లిమర్ల మండలాలకు చెందిన అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
‘పోషకాహారంపై అవగాహన కల్పించాలి’
గజపతినగరం, సెప్టెంబర్ 6: ఆరోగ్యవంతమైన దేశానికి పోషకరంగం అత్యంత కీలకమని స్థానిక ఐ.సి.డి.ఎస్. సహాయ ప్రాజెక్టు అధికారి శ్రీదేవి అన్నారు. జాతీయ పోషకాహార వారోత్సవాలలో భాగంగా ఇక్కడ మండల పరిషత్ కార్యాలయంలో గురువారం జరిగిన సదస్సులో ఆమె ప్రసంగించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు లభిస్తున్న విషయాన్ని కార్యకర్తలు తల్లులో అవగాహన కల్పించాలన్నారు. మునగాకు, బొప్పాయి, చిక్కుళ్ళు, తదితర వాటిలో పోషకాహారం లభిస్తుందన్నారు. జిల్లాలో 47 శాతం మంది పోషకాహారం లోపంతో బాధపడుతున్నారని దీనిని తగ్గించేందుకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేసే పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా లబ్ధిదారులకు సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. ఫిర్యాదులు వస్తే కార్యకర్తలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బడిబయట ఉండే డ్రాపౌట్స్ పిల్లలును కూడా గుర్తించి సంబంధిత పాఠశాలలో చేర్పించాలన్నారు. ఐ.సి.డి.ఎస్. కార్యాలయం నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకు పలు నినాదాలు చేస్తూ ర్యాలీ జరిపారు. ఐ.సి.డి.ఎస్. సూపర్ వైజర్లు నళినిదేవి, డి.కె.కామేశ్వరి, ఉషారాణి, జగదాంబ, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
‘సంఘీభావ సభను జయప్రదం చేయండి’
లక్కవరపుకోట, సెప్టెంబర్ 6: మండలంలోని శ్రీరాంపురం పంచాయతీ పరిధిలో గల స్టీల్ ఎక్సేంజ్‌లో కాంట్రాక్టు కార్మికులుగా పని చేస్తున్న మోటారు కార్మికులకు యాజమాన్యానికి మధ్య జరుగుతున్న బాధాకరమైన పరిణామాలు నేపధ్యంలో ఈ నెల తొమ్మిదిన గోల్డ్ స్టార్ కూడలి వద్ద సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో ఏర్పాటు చేయునున్న సంఘీభావ సభకు వామ పక్షాల మద్దతును కోరుతున్నట్లు కొత్తవలస డివిజన్ కార్యదర్శి డేగల అప్పలరాజు తెలిపారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే కోళ్ళలలితకుమారిని కలిసి కార్మికుల తరపున సంఘీభావం తెలపాలని కోరారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు చట్టపరమైన కనీస వేతనం, పి.ఎఫ్.ఇ. ఎస్.ఐ. ప్రభుత్వ సెలవులు లేవు కనీసం సరైన గుర్తింపు కార్డు లేదని, ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకునేందుకు జరిపిన చర్చలు జరిపి కార్మికుల కనీస కోర్కెలను తీర్చటానికి ఒప్పుకోక పోవటం యాజమాన్య మొండి వెఖరికి నిదర్శనం అని అన్నారు. కార్మికుల న్యాయపరమైన హక్కుల కొరకు న్యాయపోరాటం సాగిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టీల్ ఏక్సేంజ్ మోటారు కార్మికులు పాల్గొన్నారు.
విజయమ్మ దీక్షకు సంఘీభావం
గజపతినగరం, సెప్టెంబర్ 6: ఉన్నత విద్య అభ్యసించేందుకు అర్హులైన విద్యార్థులందరికీ ఫీజ్ రెయింబర్స్‌మెంట్ మొత్తం ప్రభుత్వమే చెల్లించాలని కోరుతూ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ చేపట్టిన నిరాహార దీక్షకు సంఘీభావంగా ఆ పార్టీకి చెందిన నేతలు ఇక్కడ జాతీయ రహదారి వద్ద గురువారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరంలో నిరాహార దీక్ష చేపట్టారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు డాక్టర్ శీరంరెడ్డి పెద్దినాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ కళాశాలలకు ఫీజు మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేస్తూ రెండు రోజులు నిరాహార దీక్ష జరపనున్నట్లు చెప్పారు. శిబిరంలో నిరాహార దీక్షలు చేస్తున్న వైకాపా నేతలు కార్యకర్తలకు మద్దతుగా పలువురు విద్యార్థులు సంఘీభావంగా పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానం కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కి ఎత్తివేసేందుకు పలురకాల నిబంధనలు విధిస్తూ నాటకాలు ఆడుతున్నట్లు ఆరోపించారు. ప్రభుత్వం నిర్ణయం దారుణమన్నారు. శుక్రవారం ఇక్కడ గల అన్ని డిగ్రీ , జూనియర్ కళాశాల విద్యార్థులుతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వైకాపా మహిళా నాయకురాలు శీరంరెడ్డి శారదానాయుడు, యవజన శాఖ జిల్లా అధ్యక్షుడు మిత్తిరెడ్డి శ్రీనివాసరావు, మాజీ ఎం.పి.టి.సి. మీసాల అప్పలనాయుడు, పాత శ్రీరంగరాజపురం, మాజీ సర్పంచ్ గిడిజాల కామునాయుడు తదితరులు పాల్గొన్నారు.
‘ఎన్నికలు జరుగకుండా చేసేందుకు కుట్ర’
చీపురుపల్లి, సెప్టెంబర్ 6: స్థానిక సంస్థల ఎన్నికల జరగనివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్ను తుందని వై.ఎస్.ఆర్. సి.పి.నాయుకుడు మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు అన్నారు. గురువారం స్థానిక నటరాజ్ రెసిడెన్షినందు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ము దైర్యం సత్తా ఉంటే తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టించాలని గద్దె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సి.ఎం., పి.సి.సి.నేత మంత్రులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా వై.ఎస్.ఆర్. సి.పి. విజయాన్ని ఆపలేరన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయో జగన్మోహన్‌రెడ్డిని ఎప్పుడు సి.ఎం.గా చూస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఇంత వరకు పంచాయతీ, మున్సిపాల్టీ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం హైక్టోరులో కేసు పెండింగ్ లో ఉందని షాక్ చూపిందన్నారు. బి.సి. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ద్వారా ఆదేశాలు తెప్పించుకోవడమో రాజ్యాంగ సవరణ ద్వారా జరిపించుకోవడమో చేయాల్సి ఉందని గద్దె అన్నారు.