Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

నా నువ్వు - నీ నేను -- 22వ వారం

$
0
0

ఒకళ్ల మీద ఒకళ్లు పడిపోయి, చిన్నచిన్న దిళ్లతో కొట్టుకుంటూ ఉంటారు. ఒకళ్ల ఒళ్లో ఒకళ్లు కూర్చుని, ప్రపంచంలో ఉన్న సంతోషమంతా మాదే సుమా అన్నట్టుగా ఉంటారు.
క్రిష్ ప్రత్యేకంగా బ్యూటీ కోసం బార్బీ బొమ్మలు, చింటూ కోసం టెడ్డీబేర్ బొమ్మలు కొన్నట్టున్నాడు.. వాళ్లీ మధ్య వాటితోనే ఆడుకుంటున్నారు. చింటూకైతే రిమోట్‌తో నడిచే కార్లు కొన్నాడు. ఆ కార్లతో వాడు రేస్‌లు పెట్టిస్తాడు.
ఒక్కోరోజు తను వెళ్లేసరికి అతను బ్యూటీని పైకి ఎగరేసి పట్టుకుంటూ ఉంటాడు. ఇంకో రోజు వెళ్లేసరికి అతనే బ్యూటీకి గుర్రమై పరుగులు పెడ్తూ ఉంటాడు. అతనస్సలే పొడుగరి! భుజాల మీద చింటూని కూర్చోబెట్టుకుని వాడ్ని ఫ్యాన్ అందుకోమంటాడు... వాడు అందుకోబోతూంటే తను కిందకు వంగుతాడు. ఫ్యాన్ అందక వాడు గొడవ గొడవగా అరుస్తాడు. మళ్లీ అంతలోనే చింటూకి కథలు చెబ్తూ ఉంటాడు. వాళ్లల్లో ఎవరో ఒకరు కళ్లకు గంతలు కట్టుకుని దాగుడుమూతలు ఆడ్తుంటారు.
తను వాళ్లతో అలా తన్మయం చెందుతూ ఆడలేదు. ఒక్కోరోజు వాళ్లు నిద్ర లేచీ లేవకముందే ఆదరాబాదరాగా ఆఫీస్‌కి వెడ్తుంది. ఇంకో రోజు వాళ్లు నిద్రపోయాక ఇంటికి తిరిగి వస్తుంది. డెడ్ లైన్లు, టార్గెట్లు ఉండటంతో ఇంటికొచ్చినా ల్యాప్‌టాప్ ముందేసుకుని, కూర్చోవాల్సి వస్తోంది. తప్పట్లేదు.. పని వత్తిడి!
అతను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు కాబట్టి పిల్లలకు పగలంతా ఎవయిలబుల్‌గా ఉంటూ పిల్లల మనస్సు గెలుచుకున్నాడు. అందుకే సెలవు రోజుల్లో తనింట్లో ఉన్నా పిల్లలు అతని దగ్గరికే పరుగులు పెడ్తున్నారు.
ఇంతెందుకు? ఒక్కమాటలో చెప్పాలంటే అతను పిల్లలకు తండ్రిలా ఉంటున్నాడు. తండ్రిలా ఏమిటి? అతను తండ్రే కదా? అతనికీ పిల్లలు కావాలి! పిల్లలకూ అతను కావాలి! తన పంతం, కోపం, తను ఎవరిక్కావాలి?
తనొక రోజు పిల్లల్ని క్రిష్ ఇంటికి వెళ్లొద్దూ అని తిడితే అమ్మమ్మ ఆ తర్వాత తనని తిట్టింది. ‘అతను స్వయంగా ఆ పిల్లల కన్నతండ్రి! అతనేదో కాని పని చేసాడని అతనంటే గిట్టక నువ్వు విడిపోయావ్! సరే! ఆ పిల్లలకు అతనేం ద్రోహం చేశాడు? చేసిన నిర్వాకం చాలు కానీ తండ్రి ప్రేమని పిల్లలకి లేకుండా చేసి ఆ పాపం మూట కట్టుకోకు?’
‘నా పిల్లల్తో అతను ఆడుకోవటం నాకిష్టం లేదంతే!’ తను మొండిగా చెప్పింది.
‘హవ్వ! కన్నతండ్రితో పిల్లల్ని ఆడుకోవద్దంటున్నావంటే నాకనుమానంగా ఉంది... అస్సలు నువ్వు కన్నతల్లివా? మారుటితల్లివా?’
తను బదులు చెప్పలేకపోయింది.
ఎంతయినా అమ్మమ్మ వచ్చిందగ్గర్నుంచి క్రిష్‌కి తనంటే భయం పోయింది. ఆవిడ్ని చూస్కుని మరీ ఓవర్ చేస్తున్నాడు. పిల్లల డిసిప్లినంతా మట్టిలో కల్సిపోతోంది. వాళ్లిక తన మాట వింటారా? చూస్తున్నకొద్దీ వాళ్లంతా ఒకటి! తనొక్కత్తే ఒకటి! అన్న ఫీలింగ్ కల్గుతోంది. ఉక్రోషంగా ఉంటోంది. బయటపడితే బావుండదు. కంట్రోల్ చేసుకోవటం చాలా కష్టంగా ఉంది. కానీ ఇదంతా ఇలాగే కంటిన్యూ కావటానికి తను ఒప్పుకోదు. ఏదో ఒకటి చేయాలి! లేదంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో తనకు తెల్సు! పిల్లలు పెద్దవాళ్లవుతారు. నెమ్మదిగా వాళ్లకీ అస్సలు సంగతి తెలుస్తుంది.
అమ్మమ్మలాగా వాళ్లు కూడా రేపటి రోజున అదే మాట అంటారు.. ‘నీకూ, మీ ఆయనకూ ఏవో కొన్ని కారణాల వల్ల సరిపడకపోయుండొచ్చు! ఆయన్నుంచి విడిపోయి నువ్వు దూరంగా ఉండదల్చుకున్నావ్! ఉండు! అంతేగానీ మాకూ ఆయనకూ ఏ ఇష్యూస్ లేవ్! అతను మా కన్నతండ్రి! అతను మాక్కావాలి! అని నిర్భయంగా ఎదురు చెబ్తారు! అందులో సందేహం లేదు. క్రిష్ కూడా అందుకోసమే ఎదురు చూస్తున్నట్టున్నాడు.
ఇలా జరగటానికి వీల్లేదు. తను పిల్లల్ని తీసుకుని క్రిష్‌కి దూరంగా వెళ్లిపోవాలి! తనకా హక్కుంది. చట్టబద్ధంగా కోర్టు ద్వారా అతనితో తెగతెంపులు చేసుకుంది. ఇంకా ఈ డ్రామా, క్షోభా ఎందుకు?
అతడ్నుంచి దూరంగా వెళ్లిపోవాలని ఆలోచిస్తే ఇల్లు, జాబ్, స్కూల్.. తనకెన్నో ఇష్యూలు అడ్డం వస్తున్నాయ్!
‘వేర్ దేరీజే విల్...’ అన్నట్టు అతనికి మనస్సుంది.. తనెక్కడికి వెళ్లినా అతనక్కడికి వస్తాడు. అలా రాకూడదంటే? మమీ అన్నట్టు తన ప్రక్కన తనకంటూ ఒక మనిషి భర్తగా ఉండాలి! అంటే తను మళ్లీ పెళ్లి చేస్కోవాలి! పెళ్లి చేస్కుని ఇక్కడే ఉండి అతని కంట పడటం కంటే ఇతర దేశానికి వెళ్లటమే సరయిన పద్ధతి! అంటే ఆ మనో సంబంధం అర్జెంటుగా కన్సిడర్ చేయాలి! ఏమో తన మనస్సంగీకరించట్లేదు. ఎలా?
తనకెవరు సరయిన పరిష్కారాన్ని సూచిస్తారు?
* * *
‘సో మీరు మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు?’ అంతా విన్న ఇందిరాభాటియా నవుతూ అడిగింది.
‘అయామ్ కన్‌ఫ్యూజ్డ్!’ చెప్పింది అమూల్య.
‘ఎందుకు?’
‘తెలీదు’
‘చట్టబద్ధంగా, ఫిజికల్‌గా మీరు క్రిష్ నుంచి విడిపోయారు! నిజమే! కానీ మీ మనస్సులో, మీ ఆలోచనల్లో అతనింకా ఉన్నాడు’
‘న్నో! న్నో!’ తల అడ్డంగా ఊపింది.
‘లేకపోతే మీకు మళ్లీ పెళ్లి చేసుకోవటానికి అభ్యంతరం ఏమిటి?’
‘క్రిష్ నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు’
‘మన మనస్సులో లేని వ్యక్తులు మనల్ని డిస్టర్బ్ చేయలేరు. యు అగ్రీ విత్ మి?’
ఆమె మాట్లాడలేదు.
‘ఇపుడు సరిగా చెప్పండి! మీరింకో పెళ్లి చేసుకుందామనుకుంటుంటే అతని ఆలోచన్లు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయా?’
కాదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది.
‘అలా అయితే మీ మదర్ తీసుకొచ్చిన పెళ్లి ప్రపోజల్ని మీరు తప్పనిసరిగా కన్సిడర్ చేయండి’
‘ఎందుకు?’
‘పేరెంట్స్ ఒక ప్రపోజల్ తీసుకొచ్చారంటే అందులో చాలా విషయాలు మనక్కావల్సిన విధంగానే ఉండి ఉంటాయ్! ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే మీరు ఇద్దరు పిల్లల తల్లి కాబట్టి తప్పనిసరిగా ఇంకో పెళ్లి చేసుకోవాలి!’
ఇదేమిటి? ఈవిడ ఇలా చెబ్తుంది? ఈ విధంగా ఎందుకు చెబ్తున్నారన్నట్టుగా ఆశ్చర్యంగా, ప్రశ్నార్థకంగా చూసింది.
‘నేనిలా చెబ్తే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మీరింకో పెళ్లి చేసుకోకుండా ఉండిపోయి, మీ జీవితాన్ని త్యాగం చేసి మీ పిల్లల్ని చాలా శ్రద్ధగా పెంచుదామనుకున్నారు. ఇంకో పెళ్లి చేస్కుంటే మీ పిల్లలకు న్యాయం చేయలేనేమో అని భయపడ్తున్నారు. అవునా?’ అడిగింది.
అవునన్నట్టుగా తలూపింది.
‘అది ట్రెడిషనల్, కన్సర్వేటివ్ ఆలోచనా విధానం! మీ మైండ్ సెట్ అలా ఉంది. ఇట్సోకే! కానీ సమస్యకి ఇంకో కోణం కూడా ఉంటుంది. ఇపుడు మనం ఆ కోణంలోంచి ఆలోచించి చూద్దాం!’
మళ్లీ తలూపింది.
‘ఏదో ఒక రకంగా క్రిష్‌కి దూరంగా వెళ్లిపోయి ఇలాగే సింపుల్‌గా మిగిలిపోయి మీరు పిల్లల్ని పెంచుకుంటారు. ఆల్‌రైట్! కానీ మీకు తెల్సా? అలా సింగిల్‌గా ఉండి మీ పేరెంట్స్‌ని మీరు బాధిస్తారు’
ఆ మాటతో గతుక్కుమంది.
‘ఓకే! ఆ సంగతి వదిలేయండి! రేప్రొద్దున మిమ్మల్ని చూసి మీ పిల్లలు ఏం నేర్చుకుంటారని మీరనుకుంటున్నారు?’ అడిగింది.
ఇప్పటిదాకా ఆమె ఎపుడూ ఆ కోణంలో ఆలోచించలేదు.
‘న్యాచురల్‌గా మీ పిల్లలు పెళ్లీ, కుటుంబ వ్యవస్థ పట్ల నమ్మకం పోగొట్టుకుంటారు. వాళ్లూ మీలాగే సింగిల్‌గా ఉండటానికే ఇష్టపడ్తారు. ఎందుకంటే మీ పిల్లలకు మీరే కదా రోల్ మోడల్!’
ఆ మాటతో షాక్ తిన్నట్టుగా చూసింది.
‘సారీ టుసే.. మీ పిల్లలకు మీరన్ని రకాల మెటీరియలిస్టిక్ వస్తువుల్ని ఇవ్వగలరేమో కానీ చిన్న చిర్నవ్వుతో, ఎల్లపుడూ సంతోషంతో, ఆహ్లాదభరితంగా ఉండే ఒక తల్లిని మీరివ్వలేరు! మిమ్మల్ని చూసి, మీ అమ్మాయి మగాళ్ల పట్ల ద్వేషం పెంచుకుంటుంది. మీ అబ్బాయ్ మీలో అప్పటిదాకా ఒక ట్రాజెడీ క్వీన్‌ని చూసి ఉంటాడు కాబట్టి తను జీవితంలో ఏ స్ర్తినీ సంతోషంగా ఉంచలేనని... అస్సలు స్ర్తి అంటేనే కాంప్లికేటెడ్ వస్తువు, ఏం చేసినా వాళ్లు పురుషుల్ని తీవ్రంగా ద్వేషిస్తారు అన్న నిర్ణయానికి వచ్చేస్తాడు. వాళ్లిద్దరూ పెళ్లంటేనే రిస్క్ అనుకుంటారు. పెళ్లినీ, బాధ్యతల్నీ పూర్తిగా ఎవాయిడ్ చేస్తారు. మీ అమ్మాయ్ ముప్ఫయ్యేళ్లు నిండుతుంటే ఓ ఇద్దరు పిల్లల్ని ఎడాప్ట్ చేసుకోవచ్చు! మీ అబ్బాయేమో మగ హార్మోన్ల కారణంగా కొంతకాలం ప్లే బాయ్‌గా ఉండి, ఆ తర్వాత ఇంకొంత కాలానికి ఏ అమ్మాయైనా ఎంకరేజ్ చేస్తే ‘లివింగ్ ఇన్ రిలేషన్‌షిప్స్’లోకి ఎంటరవ్వొచ్చు!’
ఆవిడ భవిష్యత్తుని కళ్లకు కట్టినట్టుగా అలా కళ్ల ముందుంచుతుంటే ఆమె గజగజ వణికిపోయింది.
‘ఒన్ మినిట్! ఇక్కడ ఒక చిన్న విషయం చెబ్తాను.. నేను మీ భవిష్యత్తుని కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి, ఇంకో ఇరవై అయిదేళ్ల తర్వాత మీ అమ్మాయి పెళ్లి చేసుకోదు... అంటేనే జస్ట్ ఆ ఊహకే మీరింత వర్రీ అవుతున్నారు.. మరి మీరిపుడు పెళ్లి చేసుకోను సింగిల్‌గానే ఉంటాను అంటుంటే మీ మదర్ ఎలా ఫీలవుతున్నారో ఒక్కసారి ఊహించుకోండి’
ఆమె కళ్ల ముందు మమీ మెదిలింది. తను మళ్లీ పెళ్లి చేసుకోవాలి! హ్యాపీగా ఉండాలి అని ఆమె అనుక్షణం పడే తాపత్రయం గుర్తొచ్చింది.. ఆ తల్లి మనస్సు అర్థమైంది.
‘ఆ టాపిక్ మనం తర్వాత మాట్లాడుకుందాం! ముందు మీ పిల్లల గురించి మాట్లాడుకుందాం! మీ పిల్లలు మీ ఇద్దరి ప్రేమ దొరకాల్సిన పద్ధతుల్లో దొరక్కపోవటం వల్ల, అభద్రతా భావంతో పెరగటం వల్ల వాళ్లకే తెలియకుండా వాళ్లల్లో మీ పట్ల అంతర్గతంగా ఒక కసి మొదలవుతుంది. వాళ్లని వాళ్లు బాధించుకుని తద్వారా మిమ్మల్ని బాధించి మీ మీద కసి తీర్చుకుంటారు. వాళ్లు చక్కగా సెటిలై సంతోషంగా ఉంటే మీరెక్కడ సంతోషిస్తారోనన్న అయిష్టం వారిది! మిమ్మల్ని బాధించాలన్న ఆశయంతో వాళ్లు జీవితాంతం సంతోషానికి దూరంగా ఉంటారు’
అమూల్య ముఖం తెల్లగా పాలిపోయింది...
‘ఇపుడు మీరు సింగిల్‌గా ఉండటం వల్ల భవిష్యత్తులో వాళ్లు మీకిచ్చే గిఫ్ట్ అది! కావాలంటే ఇప్పటికే మన సమాజంలో అలాటి జీవితాన్ని గడుపుతున్న వ్యక్తుల్ని పరిశీలించి చూడండి.. వాళ్ల వెనకాల ఇలాటి జీవిత గాథలే ఉండి ఉంటాయ్! ఇంకా ఓపిక ఉంటే నెట్‌లో బ్రవుజ్ చేసి చూడండి...
వెస్టర్న్ కంట్రీస్‌లో ఆ కల్చర్‌కి, ఆ డైవర్స్‌లకి, పటిష్టమైన కుటుంబ వ్యవస్థ లేకపోవటానికి, ఆ సింగిల్ పేరెంట్స్‌కి, ఆ లివింగ్ ఇన్ రిలేషన్ షిప్‌లకి వెనక ఉండే కారణాలివే!’
ఆమె ఊపిరి తీసుకోవటం కూడా మర్చిపోయింది.
‘సో... ఫైనల్‌గా నేనేమంటానంటే.. ఇద్దరు పిల్లల తల్లిగా మీరు ఇంకో పెళ్లి చేసుకోవటమనేది ఆమోదయోగ్యమైన, ఆరోగ్యకరమైన ఆలోచన! వాడ్డూ యూ సే?’
సరేనంటానికి కూడా ఆమెకి ఓపిక లేదు.
‘జస్ట్ గో అండ్ మీట్ మనో... హి మే బి యువర్ మిస్టర్ రైట్!’ నవ్వుతూ చెప్పింది.
ఆమె తలొంచుకుని ఒళ్లో ఉన్న చేతుల్ని చూసుకోసాగింది.
‘అతను సరైన వాడు కాడన్పిస్తే ఇంకో ప్రపోజల్ చూసుకోవచ్చు! బట్ వీటన్నిటి కంటే ముందు మీరు చేయాల్సిన పని ఇంకొకటుంది’
ఏమిటన్నట్టుగా చూసింది.
‘మీ డైలమా పూర్తిగా తొలగాలన్నా, మీ పట్ల మీకు సరైన క్లారిటీ రావాలన్నా, మీరు క్రిష్‌తో ఒకసారి మనస్సు విప్పి మాట్లాడాలి!’
‘నేనా?’ నివ్వెరపోయింది.
‘అవును! ఇలా మీరింకో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు అతనికి చెప్పి చూడండి’
‘అతనెవ్వరు? ఇపుడు నాకేమవుతాడు? నేనెందుకు అతనికి నా పర్సనల్ విషయాలు చెప్పాలి?’ ఆవేశంగా అడిగింది.
‘అతను మీ పిల్లలకు కన్నతండ్రి! స్ర్తి విషయంలో పురుషుడు చాలా పాస్సెస్సివ్‌గా ఉంటాడు. అందులోనూ తను ప్రేమించిన స్ర్తి విషయంలో ఇంకా ఎక్కువ సొస్సెస్సివ్‌గా ఉంటాడని చరిఅత చెబ్తోంది’
‘బట్?’
‘ఆగండి! నన్ను పూర్తిగా చెప్పనివ్వండి! అతను మీకు తాళి కట్టాడు. మీతో కాపురం చేశాడు కాబట్టి మీరు తనకే స్వంతమని మనస్ఫూర్తిగా నమ్మి ఉంటాడు. అదీగాక మీరు తన పిల్లలకు తల్లి! పిల్లలు మీ దగ్గరే ఉన్నారు. ఏదో ఒక కారణం చేత అతన్నుంచి విడిపోయినా ఇంతకాలం మీరు సింగిల్‌గా ఉన్నారు. అంటే మీరు అతడ్ని మర్చిపోలేక పోతున్నారని, ఇంకే మగాడి పట్లా ఆకర్షితులవ్వట్లేదని, మీకు తెలీకుండానే మీరతనికి ఇండైరెక్ట్‌గా సిగ్నల్ పంపిస్తున్నారు’
‘వ్వాట్?’ తనెంత పొరపాటు చేసింది? ఆవేశంతో అమూల్య పిడికిళ్లు బిగుసుకున్నాయ్!
‘కాబట్టి అతను కూల్‌గా ఉండి ఉండొచ్చు! పైగా అతనూ పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉన్నాడు. అంటే మీరు తిరిగి తన జీవితంలోకి వస్తారని తను ఎదుర్చూస్తున్నానన్న సిగ్నల్ మీకు పంపిస్తున్నాడేమో! అస్సలతను ఏ ఆశతో, ఆశయంతో మీ ప్రక్క ఫ్లాట్‌లోకి వచ్చాడో ఇప్పటిదాకా మనకు తెలీదు’
నిజమే అన్నట్టుగా తలూపింది.
‘ఇపుడు మీరు ఫ్రెండ్లీగా వెళ్లి ఇలా పెళ్లి ప్రపోజల్ గురించి అతనితో క్యాజువల్‌గా చెప్పటం వల్ల రెండు ప్రయోజనాలుంటాయ్! మొదటిది ఈ రకంగా మీ జీవితంలో అతని ప్లేసేమిటో మీరు అతనికి చూపించినట్టవుతుంది’
ఈ సంగతి ఆమెకు నచ్చింది.
‘ఇక రెండోది మీరిలా చెప్పటం వల్ల అతని నిజ స్వరూపమేమిటో మనకు తెలుస్తుంది. మీ మనస్సులో తను లేను అని అతనికర్థమైంత్తర్వాత అతను జెంటిల్‌మ్యాన్‌లా మీ దారికి అడ్డం రాకుండా తప్పుకోవచ్చు! ఇది ఒక పాసిబిలిటీ! ఇంకో పాసిబిలిటీ ఏమిటంటే తనదీ అనుకున్న స్ర్తి తనకు చెందకుండా పోతోంది అని తెలిస్తే చాలామంది మగాళ్లు చాలా వైల్డ్‌గా రియాక్టవుతారు. చూద్దాం! ఇతనెలా రియాక్టవుతాడో!’
‘అతనెలా రియాక్టయితే నాకెందుకు?’ పంతంగా అంది.
‘ముందు జాగ్రత్త తీసుకోవచ్చు! ఉదాహరణకు మీరు పెళ్లి చేసుకోవటానికి వీల్లేదని అతను గొడవ పెట్టుకున్నాడనుకోండి.. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవచ్చు! అలా మీరు చెప్పటం ద్వారా కాకుండా అతనికి ఇంకెవ్వరి ద్వారా అయినా మీరు పెళ్లి చేసుకోబోతున్నారన్న సంగతి సడెన్‌గా తెల్సి, ఏదయినా న్యూసెన్స్ క్రియేట్ చేశాడనుకోండి! అపుడు పరిస్థితి ఎంత దారుణంగా, ఎంత ఎంబర్రాస్సింగ్‌గా ఉంటుంది? మనో లాటి మూడో మనిషి కూడా అక్కడ ఇన్‌వాల్వ్ అయ్యి ఉంటారు. అందరి సెన్సిటివ్ ఫీలింగ్స్ హర్టవుతాయ్!’ నచ్చజెబ్తున్నట్టుగా చెప్పింది.
ఆవిడ చెబ్తున్న దాంట్లో ఎంతో వాస్తవం ఉందన్పించింది.. తను పెళ్లి చేసుకోబోతున్న సంగతి ఒకవేళ తను చెప్పకపోయినా అమ్మమ్మ అయినా చెప్పే అవకాశముంది... తనకు కేవలం కొన్ని అడుగుల దూరంలో ఉన్నాడు. అతనికి ఎలాగోలా తెలుస్తుంది. అయినా తనేదో తప్పు పని చేస్తున్నట్టు దొంగతనంగా, సీక్రెట్‌గా ఎందుకు పెళ్లి చేసుకోవాలి? నిర్భయంగా పబ్లిక్‌గా అందరికీ చెప్పి చేసుకుంటుంది. తన జీవితంలో మిగిలిన పరిచయస్తులూ, స్నేహితులూ ఎంతో అతనూ అంతే! అంతకన్నా అతనికి ఎక్కువ ప్రాముఖ్యత లేదు.
అతను తన పక్కింట్లోకి వచ్చి స్మార్ట్‌నెస్‌తో, ఓవర్ యాక్షన్‌తో ఆరోగ్యభరితమైన వాతావరణాన్ని తెలివిగా క్రియేట్ చేసి, హ్యాపీగా ఉండగల్గుతున్నాడు. తనూ అలానే చేస్తుంది. ఇన్నాళ్లూ తనతో అతను ఆడుకున్నాడు.. పులి తోకని పట్టుకుని పరిహాసమాడాడు. నిప్పుతో చెలగాటమాడాడు.. ఇపుడు తను ఆడుకుంటుంది. కూల్‌గా ఉండటమంటే ఏమిటో చూపిస్తుంది.
ఐ షుడ్ టీచ్ హిమ్ ఎ లెస్సన్! ఒక స్థిర నిర్ణయానికి వచ్చేసింది. ఆ నిర్ణయంతో ఎక్కడ్లేని శక్తీ వచ్చేసింది.
‘్థంక్ యు గాడ్!’ వీడ్కోలు తీసుకుని బయటకి వచ్చింది.
ఆమెలో ఉత్సాహం ఉప్పొంగుతోంది.
* * *
‘నేను మీతో కొంచెం మాట్లాడాలి!’ క్రిష్‌తో చెప్పింది గుమ్మం దగ్గర నిలబడి!
‘ప్లీజ్ కమ్!’ ఆహ్వానించాడతను.
మాట్లాడనా వద్దా? అనుకుంటూ గుమ్మం దగ్గరే ఆమె సంశయంగా ఆగిపోయింది.
ఏదయినా పర్సనల్ విషయం అయ్యుండొచ్చు! మాట్లాడ్తుంటే అమ్మమ్మ కానీ, గంగ కానీ వస్తారని సందేహిస్తుందేమో అనుకుంటూ, ‘ఇంట్లో ఓకేనా? ఎక్కడికైనా బయటకు వెడదామా?’ అడిగాడతను.
‘ఇట్సోకే!’ అంటూ లోపలికి అడుగుపెట్టింది.
సోఫాలో కూర్చున్నాక ఆమెనే చూస్తూ ‘చెప్పండి!’ అన్నాడతను.
సడెన్‌గా మాటల కోసం తడుముకోవాల్సి వచ్చింది.. ఏం చెప్పాలి? ఎక్కడ్నుంచి మొదలుపెట్టాలి? తనెంతో సులువుగా చెప్పేయగల్ను అనుకుని వచ్చింది కానీ తీరా ఇతని ముందు కూర్చుంటే ఏమ్మాట్లాడాలో అర్థం కాలేదు. ఇంకా అంతకన్నా ఘోరంగా టైమ్ కానీ టైమ్‌లో క్రిష్‌తో జరిగిన పెళ్లిచూపుల ప్రహసనం గుర్తొచ్చింది.
ఆ రోజు ఫ్రెండ్స్, చిన్నీ పరాచికాల మధ్య అరడజను పిన్నుల సాయంతో మమీ చీర కట్టుకోవటం, మ్యాచింగ్ గాజులు వేసుకోవటం, పూలు పెట్టుకోవటం వరసగా మదిలో మెదిలాయ్!... అద్దంలో చూస్కుంటే తనకు తనే నచ్చలేదు. ఏమిటో డ్రామా ఆర్టిస్టులా తయారయ్యాను. వాళ్లకి నచ్చనేమో అనుకుంది! అయినా తను నచ్చానని వాళ్లు చెప్పారు! కర్మ! అకారణంగా నవ్వొచ్చింది. ఏమిటో లైఫ్! ఎంతలోకి గడిచిపోయింది? ఇంకా చిత్రం ఏమిటంటే ఒకరోజున ఏ మనిషి కోసమైతే ప్రత్యేకంగా తయారయ్యిందో అదే మనిషికి ఇపుడు తనకు పెళ్లిచూపులని చెప్పాల్సి రావటం...

ఒకళ్ల మీద ఒకళ్లు పడిపోయి, చిన్నచిన్న దిళ్లతో కొట్టుకుంటూ
english title: 
na nuvvu - nee nenu
author: 
--బొమ్మదేవర నాగకుమారి .. మొబైల్: 92462 78118

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>