Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

నిర్ణయం

$
0
0

ప్రపంచీకరణ తెచ్చిన మార్పులు..ఆధునిక జీవనానికి కావలసిన సమీకరణలు..జన జీవితాల్లో ఊహించని మార్పులెన్నో తెస్తున్నాయి. ఆప్యాయతల్ని, అనురాగాల్ని అవసరాలు డామినేట్ చేస్తున్నాయి. తరాల అంతరాల మధ్య ఒదిగిపోయిన అనుబంధ బాంధవ్యాలు ఇరుకవుతున్న సమయాల మధ్య విలవిల్లాడుతున్నాయి. మనలోంచి మనం వేరై..జీవన యాంత్రికత నుండి విడివడి..విలక్షణమై..సామాజిక చైతన్యానికి పాటుపడాలి. మానవ సేవే మాధవ సేవ! సమాజ సేవకై కొంత సమయం వెచ్చించినా చాలు. రాత్రి ఎనిమిది దాటకముందే సభ మధ్యలోంచి బయటపడి ఇంటికి తిరుగుముఖం పడుతుంటే స్వామీజీ మృదు ప్రవచనాలు గుర్తుకొచ్చాయి. వెర్రిగా నవ్వుకున్నాడు సాగర్. తన తల్లికి సేవలందించడానికే సతమతమవుతుంటే ఇంకెక్కడి సమాజసేవ? వారం నుండి జరుగుతున్న ఆధ్యాత్మిక సమావేశాల్లోకి క్రమం తప్పక వెళ్తున్నాడతను. మనసు సాంత్వన కోసం కాసేపు గడిపి వస్తున్నాడు. ఏమాలోచించారు? ఇంట్లోకి అడుగుపెట్టడమే ఆలస్యం..్భర్తను నిలదీసింది సుభాషిణి. వౌనముద్ర దాల్చాడు. ఆమెను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఇంటి చాకిరి, వంట చాకిరి చేయాలి. అటు ఉద్యోగం వెలగబెట్టాలి. బోనస్‌గా అత్తయ్య బాగోగులు చూడాలి. నావల్ల కావడం లేదని ఎంత పోరు పెడుతున్నా చెవికెక్కించుకోరేం? రుసరుస లాడింది. వృద్ధురాలైన కన్నతల్లి..ఎదిగిన ఒక్క కొడుకుని. నాదే కదా అమ్మ బాధ్యత. సగభాగానివి నీకూ ఉంటుంది కదా భాగస్వామ్యం, ‘కాదన్నానా?’ ‘నాది ఫీల్డ్ వర్క్ జాబ్, టూర్లెక్కువ. ట్రై టు అండర్‌స్టాండ్..’ ‘పోనీ జాబ్ మానేయనా?’ సూటిగా ప్రశ్నించింది. ‘అమ్మో? తనొక్కడి జీతంతో కుటుంబ జీవితాన్ని సర్ధలేడు. భార్య పరిస్థితిని కూడా అవగాహన చేసుకోగలడు..ఇప్పటికెందరు పనివాళ్లు మారారో? మరి ఈ సమస్యకు పరిష్కారం మాత్రం తన దగ్గర లేదు. అందుకే ఆమెకే వదిలేస్తే?’ ‘సరే సుభా! ఏం చేద్దామో నువ్వే చేల్చు?’ ‘కేర్ సెంటర్‌లో చేయండి. నెలకి వెయ్యో..రెండు వేలో..పే చేద్దాం..’ నిర్ద్వంద్వంగా చెప్పేసింది. సాగర్ మనసు చివుక్కుమంది. భర్త వౌనాన్ని మరోలా అర్థం చేసుకున్న సుభాషిణి ‘పిల్లల్ని హాస్టల్లోనే కదా ఉంచాం’ అంది. పిల్లల్ని హాస్టల్లో వేయడం..అమ్మ వార్ధక్యాన్ని వృద్ధాశ్రమంలో తోసేయడం..సమన్వయ పర్చాల్సిన అంశాలేనా? అలా అని తొందరపడి తీసుకోవాల్సిన నిర్ణయం కాదిది. కొడుకు తనానే్న ప్రశ్నిస్తున్న మృదుకోణమిది. ‘అమ్మను చూసుకునే బాధ్యత నీకు తప్పించాలి. అంతే కదా! ఆధ్యాత్మిక సభల ప్రభావమేమో కాస్తంత సౌమ్యంగానే బదులిచ్చాడు. ‘ఊ..’ అంది పొడిగా. ‘్ఫ్లజ్ సుభా! నన్ను ఇబ్బంది పెట్టక ఒక్కవారం రోజులు టైమివ్వు’ అర్థింపుగా అన్నాడు. వౌనం అంగీకారంగా అక్కడి నుంచి నిష్క్రమించింది. సాగర్ యధాలాపంగా ఒక నిట్టూర్పు వదిలాడు. అనారోగ్యంతో మంచంలో జీవచ్ఛవంలా పడి ఉన్న కన్నతల్లి నొకసారి ఆప్యాయంగా పలకరించి వెళ్దామని..తల్లి గదిలోకి ప్రవేశించాడు. ఆదివారం ఉదయం ఎనిమిదవుతోంది. ఆరింటికి రావాల్సిన పాలవాడింకా రాకపోవడంతో పాల పాకెట్ కోసం వీధి మలుపులో ఉన్న షాపుకి కాలినడకన బయల్దేరాడు సాగర్. మార్గమధ్యలో జనం గుమిగూడి ఉండడం గమనించి అక్కడ ఆగాడు. పలుచగా ఉన్న జనంలో దూరి ఏమిటని ఆసక్తిగా చూసాడు. ఓ నడి వయస్కురాలు స్పృహ తప్పి పడి ఉంది. గుర్తు పట్టాడు. ఆమె నర్సవ్వ! గడప గడపకు తిరిగి రోజూ ఇడ్లీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది. పిల్లలు యాక్సిడెంట్‌లో పోయారట. ఒంటరిగా ఉంటోంది. టిఫిన్ క్యాంటీన్‌లో కమీషన్‌కి ఇడ్లీలు తెచ్చి అమ్ముకుంటుంది. జనం చోద్యంలా చూస్తున్నారే తప్ప ఎవరూ జోక్యం చేసుకోకపోవడంతో సాగర్ గబ గబా వెళ్లి ఆటోని పిలిచాడు. ఒకరిద్దరి సాయంతో ఆమెని ఆటోలో పడుకోబెట్టి ఏరియా ఆసుపత్రిలో జాయిన్ చేశాడు. అరగంటలో కోలుకుందామె. ‘నీ కడుపు చల్లగ ఉండాలి బాబూ!’ నర్స్ ద్వారా విషయం తెలుసుకున్న నర్సవ్వ సాగర్‌కి రెండు చేతులెత్తి మొక్కింది. వీధిలో వాళ్లు చెప్పే ప్రతి పని కాదనకుండా చేసి పెడుతుంది ఆమె. కూరగాయలు తెస్తుంది. స్కూల్ వ్యాన్ మిస్సవుతే పిల్లల్ని బడిలో వదిలిపెట్టి వస్తుంది. ఎవరైనా డబ్బివ్వబోతే తీసుకోదు. ఓ పూట భోజనం పెడితే మాత్రం కాదనదు. ఇదంతా గుర్తుకు వచ్చి. ‘వద్దమ్మా! నాకంటే వయస్సులోనే కాదు. సహాయం చేయడంలో కూడా గొప్పదానివి. నీవు పరులకు నిస్వార్థంగా చేస్తున్న సేవ ముందు నేను నీకు చేసిన సహాయం అంత గొప్పదేం కాదు’ అంటూ వెళ్లిపోయాడక్కడి నుండి. ఒక రోజు ఇల్లు వెతుక్కుంటూ వచ్చి గుమ్మం ముందు వౌనంగా నిలబడిన సాగర్‌ని చూసి, ‘అలా నిలబడ్డావేం? ఏం కావాలి బాబు? అనడిగింది నర్సవ్వ. ‘అమ్మ కావాలి’ అన్నాడు తలొంచుకుని. స్థాణువైపోయిందా మాటకు. అతడేం మాట్లాడుతున్నాడో ఆవిడకేమీ అర్థమవక అలాగే కొయ్యబారి పోయింది. ‘అవునమ్మా! మా అమ్మని అమ్మలా చూసుకునే ఓ అమ్మ కావాలి. మా అమ్మని ప్రాణంగా చూసుకునే ఓ అమ్మ కావాలి. మా అమ్మ వృద్ధాప్యానికి ఓ ఆసరా కావాలి. రోజంతా ఆమెకు తోడు కావాలి. కష్ట సుఖాలు చెప్పుకునేందుకో మనిషి కావాలి’ గుక్క తిప్పుకోకుండా చెప్పుకుపోతున్నాడు. ‘మా ఇంట్లో ఒకదానివిగా ఉండాలి. నీ సేవకు వెలగట్టలేనేమో గానీ నీకేలోటు రాకుండా చూసుకునే బాధ్యత నాది’ ఈ విధంగానైనా ఓ పేదరాలిని ఆదుకునే అవకాశం చిక్కించుకున్నాడు. కాసేపు ఆలోచనల్లో పడిందామే. ఆమె నిర్ణయం కోసం వేచి ఉన్నాడతను. ‘నీ బాధ నాకర్థమయ్యింది. తప్పక మీ అమ్మకి సేవలందిస్తాను. నా సేవలు మీ అమ్మకే కాదు. ఎవరికి ఏ అవసరమొచ్చినా వారికి చేదోడు వాదోడుగా నిలుస్తాను. నేనందరిదానను. నన్ను కాదనకూడదు. అలాగే మీ అమ్మనూ కంటికి రెప్పలా చూసుకుంటాను’ అందామె. ఒప్పుకొని, ఆమెను వెంట తీసుకొని బయలుదేరాడు. తను ఆమెకా..ఆమె తనకా..ఎవరికెవరు చేయూతగా నిలుస్తున్నారో..అర్థం కాని సంశయంలో పడుతూ..!
..........................
- మనో గీతికలు -

ది జడ్జ్
నాలుగు గోడల మధ్య
కొవ్వొత్తిలా కరిగిపోతూ
సమాజానికి వెలుగును పంచే
ఉదయాస్తమయాలు లేని
సూర్యుడివి నువ్వు
నలుదిక్కులు దాడి చేస్తున్న
అంతర్గత శత్రువులపైన
‘న్యాయ ఖడ్గం’తో పోరాటం చేస్తున్న
ఆయుధం ధరించని
సైనికుడివి నువ్వు
కళ్లకు గంతలు కట్టుకున్నా
కపాలం లోని ‘మస్తిష్కం’తోనే
మానవీయాన్ని దర్శించగల
వౌనివి నువ్వు
దగాపడ్డ జీవితాలకు
మీ తీర్పులు ఎన్నిసార్లు
బాసటగా నిలువలేదూ..
దారి తప్పిన సంఘాన్ని
గాడిలో పెట్టేందుకు
మీ గలం ఎన్నిసార్లు
కలమై గర్జించలేదూ..
ప్రజాస్వామ్యమనే పూలవనంలో
పూసిన తెల్ల గులాబివి నువ్వు
న్యాయాన్ని ముద్దాడిన మీ పెదాన్ని
మట్టిరేణువులు కీర్తిస్తాయి
పునాదుల్తో సహా కూలిపోతున్న వ్యవస్థను
మూల స్తంభినివై మోస్తున్న వాడివి
నీ భుజాలపై మొలచిన
ఉన్నతమైన శిరస్సును
భరతమాత ముద్దాడుతుంది

- టి.వేణు (జూనియర్ అసిస్టెంట్)
కరీంనగర్, సెల్.నం.9866973959

ఆశలు
అర్హత లేకున్నా నాకు
అందలం కావాలి
సాధించిన దేమీ లేదు
సన్మానం కావాలి
తక్కువ సమయంలో
ఎక్కువ సంపాదించాలి
తప్పొప్పులు నాకు తెలియవు
గొప్పవాడిని కావాలి
పిల్లలు కావాలి గానీ
తల్లిగ పాలివ్వ లేను
పండు ముసలితనం వచ్చినా
పడచులాగా కన్పించాలి
ప్రతిభతో పని ఏముందీ
పత్రికల్లో మన పేరుండాలి
పని చేయడం నాకు కుదరదు
ఫస్టుకు జీతం కావాలి
కవిత్వం నే వ్రాయలేను
కవిగా కీర్తి రావాలి
ప్రజలంటే నాకసహ్యం
పదవి మాత్రం కావాలి
మంచి చెడూ అంటే ఎలా
దండిగ సంపాదించాలి
లోకులేమి అంటే ఏమీ
మనం సుఖంగా ఉండాలి

- కాళిదాసు, సెల్: 8686706463

ఘన సంస్కృతి
చుట్టూరా కాలుష్యం పెరిగిపోయినప్పుడు
స్వచ్ఛమైన విలువల కోసం పాకులాడటం
ఓ వృథా ప్రయాస అనీ తెలుసు
ఖచ్చితత్వం ప్రామాణికం కానప్పుడు
తంచ్ఛదనమే రాజ్యమేలుతుందనీ తెలుసు
గమనం సవ్యంగా లేనప్పుడు
గమ్యం చేరడం కష్టమనీ తెలుసు
నట్టింట్లో నడయాడుతూ విషం చిమ్ముతున్నా
‘్ఛన్నళ్ల మారి’ కేబుల్ కనెక్షన్‌తోనే తెగకోసినప్పుడు
పల్లెల మూలాల్ని కదిలిస్తున్న
విదేశీ సంస్కృతిపై అడుగడుగునా నిరసనలు వెల్లువెత్తినపుడు
డాలర్ వేటలో పడి
ఆత్మీయతాను రాగాల సిరుల్ని దూరం చేసుకొంటున్న
మేధోవలసల్ని నిలువరించగలిగినప్పుడు
మరచిపోతున్న సంప్రదాయాల్ని జ్ఞప్తికి చేసుకుంటూ
మన పండుగలన్నీ మళ్లీ వైభోగంగా జరుపుకున్ననాడు
అప్పుడే కదా!
మానవీయ కోణం ఆవిష్కృతమయ్యేది
మళ్లీ మన ఘన సంస్కృతికి మంచి రోజులు వచ్చేది

- శ్రీ దాస్యం లక్ష్మయ్య, సెల్.నం.9440155240

జీతం బ్రతుకుల చిత్రాలు
నెల నెలా బడ్జెట్
జమలు - తీసివేతలు
అయినా క్యారీఫార్వర్డ్
అయ్యేకొన్ని కోరికలు/ఇష్టాలు
ప్రొద్దునే్న ఇల్లాలు.. వంటకై కుస్తీపాట్లు
మధ్యాహ్నం లంచ్ బాక్స్‌లుగా
ప్రేమ దర్శనమిస్తుంది.. ప్రొద్దునే్న బస్సులో
సగం జీవిత ప్రయాణాలు
నెల నెలా జీతం బతుకులు
సాధారణమైపోయింది.. సాయంత్రం జీవితాలు
రాత్రి ఆలస్యంగా నిద్రలు
ప్రొద్దునే్న బస్సులో కునికిపాట్లు
వేతన జీవులకు తప్పని కష్టాలు
వారంలో ఆరు రోజుల బిజీ లైఫ్
ఆదివారం బద్ధకంగా
నిద్రలేస్తుంది వొళ్లు విరుస్తూ..

- వాసాల వరప్రసాద్, మంచిర్యాల, సెల్.నం.9490189847

సందర్భం

ఇటీవల డాక్టర్ బి.దామోదర్ రావు రచించిన ఆణిముత్యాలు పుస్తకావిష్కరణ కరీంనగర్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో బి.దామోదర్ రావు, డాక్టర్ డింగరి నరహరి ఆచార్య, అనంతాచార్య తదితరులు పాల్గొన్నారు.

ప్రకృతి ఒడిలో కేరింతలు
ప్రకృతి దృశ్యాలు పిల్లల మనస్సులు స్వచ్ఛంగానూ, అందంగానూ ఉంటాయి. మరి ఆ రెండు కలిస్తే..వేగవంతమైన నగర జీవితంలో కనీసం ఆట మైదానాలైనా కనిపించని స్థితిలో బడి, ఇల్లూ రెంటి మధ్యా తిరిగే విద్యార్థులు ఓ రోజు ప్రకృతిలోకి వెళితే వారంతా కేరింతలు కొడతారు, ఎగిరి గంతులు వేస్తారు. నాలుగు మాటల్లో వారి భావాల్ని వ్యక్తం చేయమంటే..ఏం రాస్తారు. భీముని మల్లారెడ్డిపేటకు వెళ్లిన విద్యార్థులు ‘మెరుపు’కోసం తమ భావాల్ని వ్యక్తం చేశారు. వారి మాటల్లోనే చదవండీ..

పచ్చని పొలాలు.. అందమైన నెమళ్లు
నా పేరు బి.విష్ణుప్రియ, నేను 9వ తరగతి చదువుకుంటున్నాను. కరీంనగర్‌లోని, సప్తగిరి కాలనీలోని సప్తగిరి పాఠశాలలో మేము 26-8-12 నాడు ఆదివారం రోజు పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరం కలిసి సిరిసిల్లలోని భీమునిమల్లారెడ్డిపేటకు వెళ్లాము. చాలా విశాలమైన ప్రదేశం. పచ్చని పొలాలు, అందమైన నెమళ్లు, గుట్టలు చాలా అందంగా ఉన్నాయి. మేము అందరం బస్సులో వెళ్లేటప్పుడు పాటలు పాడుతూ చాలా ఆనందంగా గడిపాం. నా స్నేహితులతో ఉన్నంతసేపు నాకు కాలం గడిచిపోయింది. మా స్నేహితులతో కలిసి పాటలు పాడుతూ, డ్యాన్సులు చేయడం, అక్కడ ఉన్న గుట్టలు ఎక్కి దేవున్ని దర్శించుకొని అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి, ఆంజనేయుడు, నంది, శివుడిని దర్శించుకున్నాము. అక్కడ మూడు గుళ్లకు ఎదురుగా మూడు ధ్వజస్తంభాలు ఉన్నాయి. వాటి మీద దశావతారాలు ఉన్నాయి. అది చాలా అందమైన ప్రదేశం. -బి.విష్ణుప్రియ, 9వ తరగతి

చల్లటి గాలి.. పచ్చని చెట్లు
భీమునిమల్లారెడ్డిపేట ఒక ప్రకృతి రమణీయకరమైన ప్రదేశం. అక్కడి ప్రకృతి సౌందర్యం, కొండ లోయలు, పొలాలు, గుహలు ఎంతో ఆహ్లాదపరుస్తాయి. మేము ఉదయం 9 గంటలకు మా స్నేహితులతో, మా పాఠశాల విద్యార్థులతో, మా ఉపాధ్యాయులతో కలిసి అందరం అక్కడికి వెళ్లాం. అక్కడికి 12 గంటలకు మేము చేరుకున్నాం. అక్కడి ప్రకృతి సౌందర్యం, అడవులు, పక్షులు, నెమలులు మా అందరిని ఎంతో ఉత్సాహపరిచాయి. అక్కడ కొండ మీద ఆంజనేయుని దేవాలయం ఉంది. జలపాతం ఉంది. ఆ జలపాతం దగ్గర మేము ఎంతో ఆడుకున్నాము. అక్కడ ఒక కోనేరు కూడా ఉంది. అక్కడి వాతావరణం, చల్లటి గాలి, చెట్లు చాలా ఉత్సాహపరిచాయి. అక్కడి ప్రకృతి వాతావరణం, కాలుష్యంకు దూరంగా ఉన్న ఆ ప్రదేశాన్ని ఎంతటి వారైనా అందులో కలిసిపోతారు. అందుకే ప్రతీ ఒక్కరు ఆ ప్రదేశాన్ని తప్పనిసరిగా చూసి తరించాలి. -కె.వినయ్, 9వ తరగతి

జలపాతం బాగుంది
మేము మా స్నేహితులతో, మా ఉపాధ్యాయులతో కలిసి పిక్నిక్ వెళ్లాము. దాని పేరు భీముడి మల్లారెడ్డిపేట, ఆ ఊరు ఎంతో ప్రసిద్ధి చెందింది. అది సిరిసిల్ల దగ్గరలో ఉంది. అక్కడ ఎక్కడినుంచో వస్తున్న నీరు ప్రవహిస్తుంది. అక్కడ ఉన్న చుట్టూ ఊరిలో కొంచం మీదికి ఉంటాయి. కానీ భీముడి మల్లారెడ్డిపేట కిందికి ఉండడం వల్ల వర్షం పడ్డనీళ్లు కిందికి వస్తుంటాయి. అందుకే ఎప్పుడైనా ఏ కాలం అయినా అక్కడ నీళ్లు ప్రవహిస్తుంటాయి. అక్కడ ఒక జలపాతం లాగా మారింది. అక్కడికి వెళ్తున్న దారిలో ఎన్నో నెమళ్లు కనిపించాయి. అవి ఒక ట్యాంక్ మీద నుంచి ఎగరడం చూశాము. అక్కడికి వెళ్లి చూశాక ఆ ప్రకృతి సౌందర్యం చూసి నా మనస్సు ఎక్కడికో ఎగిరిపోయింది. అక్కడ పచ్చటి పొలాలు చూసి ఆనందించాము. తరువాత నాంపెల్లికి వెళ్లి అక్కడ ఉన్న గుట్ట ఎక్కి లోపలికి వెళ్లి లక్ష్మినరసింహా స్వామిని దర్శించుకొని స్కూల్‌కి వచ్చాము. -పి.నిఖిల్, 9వ తరగతి

అద్భుతం.. ఆహ్లాదకరం
కరీంనగర్‌కు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమునిమల్లారెడ్డిపేట అనే గ్రామానికి సప్తగిరి హైస్కూల్ విద్యార్థులందరు కలిసి విహారయాత్రకు వెళ్లాము. అక్కడి ప్రదేశము ఎంతో అద్భుతంగా ఉంది. అక్కడ పురాతనమైన దేవాలయాలు, కొండలు ఉన్నాయి. భాగవతంలో శ్రీ కృష్ణుడు తన చిటికిన వేలితో గోవర్ధన పర్వతాన్ని ఎలా ఎత్తాడో అలాగే ఈ గ్రామంలో భీముడి ఒక కొండను తన హస్తాలతో ఎత్తాడు. భీముని గుహ పైకి వెళ్లినట్లయితే ఆంజనేయుని ఆలయ ఉంది. ఆంజనేయుని ఆలయం చాలా పురాతనమైంది. ఆంజనేయుని విగ్రహం చాలా అందంగా పెద్దగా చెక్కబడి ఉన్నది. కొండల పక్కన పచ్చని పంటలు మరియు అందమైన ప్రకృతిని చూస్తే కనులకు కనువిందుగా అనిపిస్తుంది. ఆ పచ్చని పంటలలో నెమళ్లు వాటి గూళ్లు చాలా చక్కగా ఉన్నాయి. నెమళ్లు చాలా పెద్దగా, అందంగా ఉన్నాయి.
- 10వ తరగతి విద్యార్థినులు

ప్రకృతి సౌందర్యం..రమణీయం
భీముని మల్లారెడ్డిపేట ప్రకృతి సౌందర్యంతో నిండిన ప్రదేశం. ఇది కరీంనగర్ పట్టణం నుండి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ కొండలు విశాలంగా వ్యాపించి ఉన్నాయి. ఆ కొండల మీది నుండి నీరు ప్రవహిస్తూ ఉంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. కొండల మీద ఆంజనేయుడి గుడి ఉంది. గుడి చాలా పురాతనమైంది. అక్కడ పూర్వీకుల శిల్పకళా నైపుణ్యం కనబడుతుంది. ఈ ప్రదేశానికి ఒక చరిత్ర ఉంది. భాగవతంలో శ్రీ కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తినట్టు ఈ ప్రదేశంలోని ఒక పెద్దరాయిని భీముడు ఎత్తినట్లు ఆనవాళ్లు స్పష్టంగా కనబడుచున్నవి. అక్కడ నెమళ్లు పించం విప్పి పర్యాటకులను కనువిందు చేశాయి. ఈ విధంగా భీమునిమల్లారెడ్డిపేట ప్రకృతితో మృదుమధురంగా, రమణీయంగా పర్యాటకుల మనసులు దోచుకుంటూ ఇప్పుడిప్పుడే పర్యాటక స్థలంగా వెలుగులోకి వస్తుంది.
- ఆర్.సాయికుమార్, జి.అఖిల్ రెడ్డి

ప్రకృతిని ఆస్వాదించాం
మేము విహారయాత్రకు భీమునిమల్లారెడ్డిపేటకు వెళ్లాము. అది ప్రకృతి సౌందర్యాలతో నిండి ఉన్న ప్రదేశం. మనం బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు కూడా దారిలోని ఆకర్షనీయమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ గడపవచ్చు. దారిలో మేము వెళ్లేటప్పుడు నెమళ్లు అక్కడ సంచరిస్తూ కనులకు విందు చేశాయ. దారిలో వెళ్లేటప్పుడు పచ్చని పైర్లు, పశువులు, నెమళ్లు, పిచ్చుకలు, చెట్లు, అక్కడి ప్రకృతిని చూస్తుంటే మనసుకు ఆహ్లాదకరాన్ని, కనులకు కనువిందును కలిగిస్తాయి. అక్కడకు చేరుకున్న తరువాత అక్కడ గుట్టమీది నుంచి సెలయేళ్లకు నీరు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియవు కానీ ఆ నీటి శబ్ధం చెవులకు వినసొంపుగా ఉంది. ఆ నీటిలో పువ్వులు ఎంతో సుందరంగా ఉన్నాయి. అక్కడి గుట్ట మీద పురాతనమైన గుడి ఉంది. అక్కడి ప్రదేశం ఎంతో విశాలంగా, సుందరంగా ఉంది. నాకు అక్కడ ఉన్న నీటి ప్రవాహం ఎంతో నచ్చింది.
- జి.విశాల్ రెడ్డి, 10వ తరగతి

బుక్ షెల్ఫ్

విద్యపై వినోబా
అనువాదం : వి.ఎన్.అప్పారావు
సంక్షిప్తం : దుర్గం రవీందర్
వెల : 18/-
ప్రతులకు: చరిత్ర ఇంప్రెషన్స్
మంచి పుస్తకం
12-13-439, వీది నెం.1
తార్నాక
సికింద్రాబాద్ - 500017

పిల్లలూ..మీరు మంచి విద్యార్థులు కావాలంటే..?
టి.వేదాంత సూరి
వెల : 30/-
ప్రతులకు: సరోజారాయ్ కమ్యూనికేషన్స్
1-9-319/1/1/జి 2
విజయదుర్గ రెసిడెన్సీ,
విద్యానగర్, హైదరాబాద్.

జయహో..
(మిమ్మల్ని మీరు
జయించడమెలా?)
టి.వేదాంత సూరి
వెల : 30/-
ప్రతులకు: ప్రసన్ పబ్లికేషన్స్
1-9-319/1/1/జి 2
విజయదుర్గ రెసిడెన్సీ
విద్యానగర్, హైదరాబాద్

పిల్లలూ..
మీరెలా ఉండాలి..?
టి.వేదాంత సూరి
వెల :30/-
ప్రతులకు: హిమకర్ పబ్లికేషన్స్
1-9-319/1/1/జి 2
విజయదుర్గ రెసిడెన్సీ,
విద్యానగర్
హైదరాబాద్

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం కోసం ఈ క్రిందిచిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫోటో, చిరునామాతో ఈ మెయిల్ అడ్రస్‌కు పంపించండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. knrmerupu@deccanmail.com

నిర్వహణ: వారాల ఆనంద్ varalaanand@yahoo.com

కథ
english title: 
nirnayam
author: 
- ఎనుగంటి వేణుగోపాల్ సెల్.నం.9440236055

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>