ప్రతీ ఉదయం గేవిన్ తన ఇంట్లోని రెండవ పడక గదిలో ఉన్న కంప్యూటర్ ముందు కూర్చుని బ్రౌజ్ చేస్తాడు. మన్‌హేటన్‌లోని ఆ బెడ్‌రూం చాలా చిన్నది. ఆ ఇంట్లో అతను మరో ముగ్గురితో కలిసి అద్దెకి ఉంటున్నాడు. కంప్యూటర్‌తో అతను స్వయం ఉపాధి చేపట్టాడు. ఫైర్‌వాల్, వైరస్ ప్రొటెక్షన్‌లలో అతను నిపుణుడు. గేవిన్ తరచూ స్టెల్లా ఈ మెయిల్ ఇన్‌బాక్స్‌లోకి వెళ్తూంటాడు.
ఆమె అతనికి ఏమీ కాదు. అసలు ఆమె ఎవరో కూడా అతనికి తెలీదు. ఇతరుల ఈమెయిల్ పాస్‌వర్డ్‌ని గేవిన్ తలచుకుంటే వారం నించి పదిహేను రోజుల్లో ఛేదించగలడు. గేవిన్ ఆమె ఈమెయిల్‌లోకి చొరబడ్డాక, అందులోని మెయిల్స్ చదవసాగాడు. ఆమె నాటకరంగ నటి అని గ్రహించాడు. ఆమెకి వచ్చే ఉత్తరాల్లో జో ఉత్తరాలని శ్రద్ధగా చదివాడు. అతని మీద అనుమానం కలగడంతో ఆ ఉత్తరాల్లోని సమాచారం ప్రకారం జో గురించి ఇంటర్నెట్‌లో గేవిన్ సెర్చ్ చేశాడు. అతనికి లభించిన సమాచారం తృప్తికరంగా లేదు.
జో నిత్యం పోర్నోగ్రఫీ సైట్స్‌లోకి వెళ్తుంటాడని, సంవత్సరంలో ఆరు ఉద్యోగాలు మారాడని, అతని క్రెడిట్ హిస్టరీ సరిగా లేదని, అతను ఆమెకి రాసిన దాంట్లో పది శాతమే నిజం ఉందని గేవిన్ ఆ సెర్చ్‌లో గ్రహించాడు. స్టెల్లా తన పెంపుడు పిల్లితో వంటరిగా జీవిస్తోందని కూడా గేవిన్ గ్రహించాడు.
* * *
ఆ రోజు స్టెల్లా సెంట్ ఫోల్డర్‌లో జోకి కోపంగా రాసిన ఉత్తరం గేవిన్‌కి కనిపించింది. బూతు భాషలో జో రాసిన ఉత్తరానికి ఆమె స్పందన అది. గేవిన్ దాదాపు ఒక రోజంతా ఇంటర్నెట్‌లోనే ఉండి, జో కార్యక్రమాలని ట్రేస్ చేశాడు. అతని అసలు పేరు టామ్ అని, అతనికి మరో మూడు ఈమెయిల్ అడ్రస్‌లు, ఓ బ్లాగ్ ఉన్నాయని గ్రహించాడు. అతని బ్లాగ్‌లోకి వెళ్లి చూస్తే, అంతా బూతు బొమ్మలే. దాని ద్వారా జో చిరునామాని తేలిగ్గా సంపాదించాడు. అతని ఈమెయిల్ హెడర్ ద్వారా అది గేవిన్‌కి సాధ్యమైంది. అలా కనుక్కునే పద్ధతి ఎఫ్‌బిఐ, సిఐఎలలోని నిపుణులకి తప్ప సామాన్యులకి తెలీదు. డిస్మిస్ చేయబడక మునుపు గేవిన్ రెండేళ్లు ఎఫ్‌బిఐలోనే పని చేశాడు. అతని బాస్ అనుమతి ఇవ్వని అనేక మంది ఆడవాళ్ల ఈమెయిల్స్‌లోకి చొరబడటంతో గేవిన్ ఉద్యోగం ఊడింది.
స్టెల్లా వంటరిగా నివసిస్తోందని తెలిసిన అరగంటకే, టామ్ ఆమెకి బూతు బొమ్మలు పంపాడని గేవిన్ గ్రహించాడు. ఆ తర్వాత వరసగా వారం రోజులు ఆమెకి టామ్ నించి జో పేరుతో అందిన ఉత్తరాల్లో మొదటి రెండింటిని స్టెల్లా ఓపెన్ చేసి, కఠిన పదాలతో జవాబు రాసిందని, తర్వాతి ఐదు ఉత్తరాలని చదవకుండానే డిలిట్ చేసిందని గేవిన్ గ్రహించాడు. ఆ తర్వాత స్టెల్లా అపరిచిత మగవాళ్లతో ఈమెయిల్ ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలని మానేసిందని కూడా గ్రహించాడు.
జో నించి ఉత్తరాలు వస్తూనే ఉండటంతో స్టెల్లా అతని అడ్రస్ స్పేమ్‌లో పెట్టడంతో అవి ఆమె ఇన్‌బాక్స్‌కి రావడం లేదని గ్రహించాడు. ఆ ఉత్తరాల్లో ‘నేను నీ కోసం వస్తున్నాను - త్వరలో’ అని ఓ ఉత్తరంలో, మూడు రోజుల్లో రెండు రోజుల్లో - రేపే అని మిగిలిన మూడు ఉత్తరాల్లో ఉండటం కూడా గేవిన్ చదివాడు. టామ్‌లో మానసిక రోగులకి ఉండే లక్షణాలన్నీ ఉన్నాయని కూడా గేవిన్ అనుకున్నాడు. అతని లాంటి లక్షణాలు గల అనేక మందిని గేవిన్ ఎఫ్‌బిఐ ఉద్యోగంలో ఉండగా చూశాడు.
ఆ తర్వాత వరసగా మూడు రోజులు గేవిన్ స్టెల్లా ఇన్ బాక్స్‌లోకి వెళ్లాడు. సెంట్ మెయిల్ ఫోల్డర్‌లో ఒక్క ఉత్తరం కూడా లేదు. డ్రాఫ్ట్ ఫోల్డర్‌లో అన్‌సెంట్ మెయిల్ కూడా లేదు. ఆమె కుటుంబ సభ్యుల నించి వచ్చిన ఉత్తరాలకి కూడా ఎప్పటిలా ఆమె జవాబు ఇవ్వలేదని గుర్తించాడు. అతను గత ఏడు నెలలుగా స్టెల్లా ఇన్‌బాక్స్‌లోకి చొరబడుతున్నాడు కాబట్టి అది అతనికి అసాధారణంగా తోచింది. ఆమె ఎన్నడూ కుటుంబ సభ్యుల ఉత్తరాలకి జవాబు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేయలేదు. అంతేకాదు టామ్ నించి మూడు రోజులుగా స్పేమ్‌లోకి ఉత్తరాలు రాకపోవటం గమనించాడు.
ఏదో జరిగిందని అతనికి అర్థమైంది. గేవిన్ ఐస్ కాఫీని తాగుతూ ఏం చేయాలా అని ఆలోచించాడు. ఇదే ఎఫ్‌బిఐలో ఉండి ఉంటే, తగిన చర్యని తీసుకోగలిగేవాడు. కానీ తనకి ఇప్పుడా అధికారం లేదు. కాఫీ తాగగానే గేవిన్ సరాసరి ఇరవై ఆరు మైళ్ల దూరంలోని స్టెల్లా అపార్ట్‌మెంట్‌కి చేరుకున్నాడు. ఆమె అపార్ట్‌మెంట్ తలుపు బయట లీజింగ్ ఆఫీస్ నించి వచ్చిన ఒక నోటీస్‌ని, కార్పెట్ క్లీనర్స్ నించి వచ్చిన ఒక నోటీస్‌ని చూశాడు. ఆమె పెంపుడు పిల్లి అరుస్తోందని పక్కింటి వాళ్లు ఫిర్యాదు చేశారని, తమని కలవమని లీజింగ్ ఆఫీస్ నించి ఆ వచ్చిన నోటీస్ రెండు రోజుల క్రితంది. మూడు రోజుల క్రితం కార్పెట్ క్లీనర్స్ వచ్చి ఇంటి బయట ఉంచిన నోటీస్‌లో కార్పెట్ క్లీనింగ్‌కి మరో రోజు అపాయింట్‌మెంట్‌కి ఫోన్ చేయమని ఉంది.
గేవిన్‌కి తను ఊహించింది నిజమని అర్థం చేసుకున్నాడు. స్టెల్లా ఆఫీస్‌కి పబ్లిక్ ఫోన్ బూత్ నించి ఫోన్ చేశాడు. మంగళవారం నించి ఆమె ఆఫీస్‌కి రావడం లేదని, ముందుగా సెలవు పెట్టలేదని జవాబు వచ్చింది.
ఇంటికి వెళ్లి స్టెల్లా ‘వర్క్ ఈమెయిల్ ఎకౌంట్’లోకి చొరబడే ప్రయత్నం చేశాడు. దానికి ఈమెయిల్ ప్రొవైడర్ సైట్‌లా బలమైన ఏంటీ స్పైవేర్ సాఫ్ట్‌వేర్‌లు లేకపోవడంతో తేలిగ్గా ఆమె ఇన్‌బాక్స్‌లోకి చొరబడ్డాడు. ఎంత పిచ్చిది! తన పెంపుడు పిల్లి పేరునే దానికి పాస్‌వర్డ్‌గా పెట్టుకుంది. అందులో అతనికి ఉపయోగపడే సమాచారం ఏదీ లభించలేదు. కాకపోతే, తను మేజర్ ప్రాజెక్ట్ వర్క్ చేపట్టిందని, కాబట్టి తనని ఎవరూ కాంటాక్ట్ చేయద్దని, అందరికీ ఉత్తరాలు పంపింది. అవి ఆమె పంపలేదని గేవిన్ ఇట్టే గ్రహించాడు. పూర్వం ఓ ఉత్తరంలో తప్పు స్పెల్లింగ్స్ డిప్ చేయడం అంటే, పార్టీకి మరకలున్న దుస్తులని వేసుకెళ్లడంతో సమానం’ అని ఆమె ఒకరికి రాసిన సంగతి గుర్తుంది.
ఆ ఉత్తరాల్లో ఒకటి రెండు స్పెల్లింగ్ మిస్టేక్స్ అతనికి కనిపించాయి.
మరో ఉత్తరంలో ‘్ఫ్ల జ్వరం, డాక్టర్ వారం పాటు ఆఫీస్‌కి వెళ్లద్దన్నాడు’ అని కనిపించింది. అది కూడా ఆమె పంపింది కాదు. సంతకం చేయకుండా స్టెల్లా ఏ ఉత్తరం బయటికి పంపదు. టామ్ బ్లాగ్‌లోకి వెళ్లి చూస్తే కొత్తగా పెట్టిన ఫొటోలన్నీ స్టెల్లావి అని గ్రహించాడు.
గేవిన్ గ్లౌవ్స్ తొడుక్కున్న చేత్తో, పబ్లిక్ ఫోన్‌లోని రిసీవర్‌ని ఎత్తి స్టెల్లా తమ్ముడి నంబర్‌కి డయల్ చేశాడు. అవతల రిసీవర్ ఎత్తాక తన కంఠం వృద్ధురాలి కంఠంలా వినపడే పరికరాన్ని ఉపయోగించి చెప్పాడు.
‘స్టెల్లా నాలుగు రోజులుగా ఆఫీస్‌కి వెళ్లడం లేదు. ఆఫీస్ వాళ్లు అనుకుంటున్నట్లుగా ఆమె జ్వరంతో ఇంట్లో కూడా లేదు. ఆమె మాయమైంది’ చెప్పి, లైన్ కట్ చేశాడు. తర్వాత న్యూయార్క్ సిటీ పోలీసులోని కంప్యూటర్ క్రైమ్స్ డివిజన్‌కి ఫోన్ చేసి టామ్ పేరు, ఓ అడ్రస్ చెప్పి చెప్పాడు.
‘మీరు ఈ ఇంటికి వెళ్తే చట్ట వ్యతిరేకం అయిన పోర్నోగ్రఫీ బొమ్మలు, అక్రమంగా బాధించబడ్డ యువతిని మీరు చూస్తారు. ఆమెకి బాగా డ్రగ్స్ ఇచ్చారు’ తర్వాత లైన్ కట్ చేశాడు.
* * *
రెండవ రోజు ఉదయం కాఫీ తాగుతూ ఇంటర్నెట్‌లో గేవిన్ ఎప్పటిలా న్యూయార్క్ టైమ్స్ దినపత్రికని చదవసాగాడు. అతడు ఓ వార్తని శ్రద్ధగా చదవలేదు. చదివి ఉంటే జేమ్స్ ఉరఫ్ టామ్ ఉరఫ్ జో అనే అతను ఇంటర్నెట్ ద్వారా వంటరి యువతులతో ఛాటింగ్ ద్వారా పరిచయం చేసుకుని, వారి చిరునామాని కనుక్కుని, వారిని తన ఇంటికి రప్పించి, మత్తు మందు ఇచ్చి అశ్లీల ఫొటోలు తీసి ఆమ్‌స్టర్ డేమ్‌లోని ఓ సంస్థకి అమ్ముతున్నాడనీ, పోలీసులకు సమాచారం అందడంతో అతన్ని అరెస్టు చేసి, ఆ సమయంలో నిర్బంధంలో ఉన్న స్టెల్లా అనే యువతిని విడిపించారని ఉంది.
అదే రోజు సాయంత్రం గేవిన్‌కి ఎఫ్‌బిఐలో అతను పని చేసినప్పటి పాత బాస్ నించి ఫోన్ వచ్చింది.
‘గేవిన్.. నీ పాత ఉద్యోగంలో చేరే ఆసక్తి నీకుంటే వెంటనే వచ్చి చేరచ్చు’
‘మీరు మనసెందుకు మార్చుకున్నారు?’ గేవిన్ ఆశ్చర్యంగా అడిగాడు.
‘ఎఫ్‌బిఐ ఇంటర్నెట్‌లోని నీ చర్యలన్నిటినీ, నువ్వు ఉద్యోగం వదిలినప్పటి నుంచి గమనిస్తోంది. వంటరి యువతుల ఈమెయిల్ ఇన్ బాక్స్‌ల్లోకి నువ్వు ఎందుకు చొరబడుతున్నావో నాకిప్పుడు అర్థమైంది. ఆ పనిని వ్యక్తిగతంగా కాక, వృత్తిగా ఎఫ్‌బిఐలో చేయడం మంచిది కదా?’
గేవిన్ ఆనందంగా చెప్పాడు.
‘రేపటి దాకా కాదు. ఇవాళ్టి నించే చేరుతాను’ రిచర్డ్ అనే వ్యక్తి అధీనంలో యాన్ అనే ఒంటరి మహిళ చిక్కుకుందని నేను అనుమానిస్తున్నాను. మనం త్వరపడాలి’
( గ్రెగరి పికర్డ్ కథకి స్వేచ్ఛానువాదం)