Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

నా సుఖమే కోరుతోంది..

$
0
0

నేడు పగలే నక్షత్రాలు పొడిచాయి
నా నల్లని గొడుగు
చిరు ఆకాశమయింది
ముసలితనమొచ్చిన
తోలుతిత్తికి పడిన
కన్నాలను తలపిస్తోంది
ముదిమి వయస్సుకు
పగలే చుక్కల్ని చూపుతోంది
దారిపట్టిన కాలికి మూడో కాలిలా
తూలే దేహానికి చేతికి ఊతంలా
తన పయనం ఎప్పటికీ నాతోనేనంటూ...
ఎండావానల్లో నా వెన్నంటే వస్తుంది
ఈ జీవనయానంలో
అలసిన నాతో ఇన్నాళ్ళు సాగిసాగి
తనూ ముతకబారింది
చిరుగు దశకు చేరింది
వర్షమొస్త్తే ఆ సన్నని చుక్కలు
కట్టలు తెగిన కాల్వలవుతాయి
ఒళ్ళంతా తడిపి
సరిగంగ స్నానాలు చేయిస్తుంది
తనకు తోడుగా...
ఎండ కాస్తే ఒళ్ళంతా
ఎండి యాసపోతాం
ఒడ్డునపడ్డ చేపలమవుతాం
అప్పుడప్పుడు
గాలిగాడు తనతో
ఎగరేసుకుపోవాలని చూస్తాడు
నానుండి తనను దూరంగా..
మా బంధాన్ని తెంచటం
అంత సులభమా?
అది నా తోడున్నంత దూరం
పగలే వెనె్నల!
తన దేహం అతుకుల బతుకయినా
నా బతుకుకు అతుకులెన్ని పడినా
మేమిద్దరం జీవన నేస్తాలం!
నేనీ లోకాన్ని విడిచి వెళ్ళినా
నా చిరు జ్ఞాపకంలా
నిలుస్తుందనుకున్నా
నిన్నమొన్నటి దాకా
చాచిన తన చేతులతో
వంగిన నీలాకాశంలో
నన్ను కాచిన ఛత్రానికి
నేడు ఏమయిందో!?
తాను చెదిరిన గోపురమై
మరోదారి చూసుకోమంటోంది
తన కష్టంలోనూ
నా సుఖమే కోరుతోంది..

‘విశ్వ’గీతం.. ఓ సందేశం..
దేశభక్తితో దేశానికి జాతీయ గీతాన్ని రచించి అంకితమిచ్చాడు రవీంద్రనాథ్ ఠాగూర్. నోబెల్ బహుమతి పొందిన వారిలో ఆసియా ఖండానికే మొదటివాడిగా నిలిచాడాయన. సాహితీవేత్త, సంగీతవేత్త, విద్యావేత్త, చిత్రకారుడిగా ఖ్యాతి గడించాడు. సృష్టి మొత్తం భగవంతుడే వ్యాపించి ఉన్నాడని చెబుతూ గీతాలతో అంజలి ఘటించిన గొప్ప రచయిత ఆయన. ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఉన్నాడని చాటిచెప్పిన మానవతావాది. అంధ విశ్వాసాలనూ ప్రతిఘటించాడు రవీంద్రుడు.
గురుకుల శిక్షణ వల్ల బాలల హృదయాలు వికసిస్తాయనీ, శ్రమ చెయ్యడంలోనే గొప్పతనం ఉందనీ చెప్పాడాయన.
శాంతినికేతన్ గురుకులమై
శ్రమే గొప్పదని చాటిందోయ్
శ్రీనికేతన్ నిర్మితమై
గ్రామ ప్రగతిని పెంచిందోయ్..
కులమతాలకు అతీతంగా మనుషులంతా స్నేహభావంతో మెలిగితేనే దేశ ప్రగతి సాధ్యమవుతుందని చెప్పాడు.
కులమతాలు మాకొద్దోయ్
అందరినీ కలిపి వుంచేది స్నేహమేనోయ్
సంఘ గౌరవం పెంచాలోయ్
అదే దేశాభ్యుదయమని తెలియాలోయ్..
తలుపులు బంధించి చీకటి గదిలో కూర్చుని భగవంతుణ్ణి చూడాలనుకోవడం కాదు.. ఎదుటి మనిషిలో ఉన్న భగవంతుణ్ణి చూడాలి అన్నాడు ఠాగూర్.
రెండు కళ్ళూ మూసుకుని
జపమాలలు తిప్పడం వదిలేసెయ్
మనసు తెరిచి గమనించు
మనసులో ఉన్నాడు పరమాత్మ..
దేశంలో ప్రతి పౌరుడూ ఆలపిస్తున్న జాతీయ గీతం ‘జనగణమన’ రచించి జాతికి అంకితం చేసిన దేశభక్తుడాయన.
దేశభక్తిని ప్రకటించి
దేశప్రజలకది పంచాడోయ్
జాతీయ గీతాన్ని ఆలపించి
జాతికి అంకితమిచ్చాడోయ్..
సాహిత్య లోకంలోకి మాతృభాషతో అడుగిడి ప్రపంచ భాషల్లోకి అనువాదమైన రచనలతో విశ్వకవిగా ప్రఖ్యాతుడయ్యాడు.
ప్రకృతి సౌందర్యానికి పులకించి
ప్రకృతి రహస్యాన్ని ఛేదించి
గీతాలతో అంజలి ఘటియించి
విశ్వకవిగా విఖ్యాతినందాడోయ్..
అమ్మ భాషలో పరిపక్వత సాధిస్తేనే మరే భాషయినా స్వేచ్ఛగా నేర్చుకునేందుకు వీలవుతుందని చెప్పాడాయన.
నోబెల్ బహుమతి పొందాడోయ్
మన ఖండానికే మొదటివాడిగా నిలిచాడోయ్
అమ్మ భాషనే గెలిచాడోయ్
ప్రపంచ భాషల్లో నిలిచాడోయ్..
శ్రమపడితే మంచి లాభాల్ని పొందవచ్చు. మాతృభాషని గౌరవిస్తే అన్ని భాషలు మనల్ని గౌరవిస్తాయి- అని చెప్పాడు రవీంద్రుడు. 1861లో జన్మించి సమాజాన్ని మంచిమార్గం వైపు నడిపించాలని తపించి తన 150వ పుట్టిన రోజుని సంవత్సరమంతా ఘనంగా జరిపించుకున్న విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్‌కు ముకుళిత హస్తాలతో అంజలి ఘటిద్దాం..

- భమిడిపాటి బాలాత్రిపుర సుందరి
విజయవాడ
9440174797

మనోగీతికలు మనోగీతికలు మనోగీతికలు

ప్రశ్నోపనిషత్

ఎదురు నడిచే తలలు
ఎప్పుడైనా ఎక్కడైనా
ఎదురుగాలులెన్ని వీచినా
గౌరవార్హంగానే నిలుస్తాయి
కొంటెగా ప్రశ్నించడం గొప్పకాదు
గాఢంగా నిలదీయగలగాలి
ప్రశ్న ప్రశ్నగా మిగిలిపోయినా
పరిమళాలసౌరును విదల్చగలగాలి
***
మనం మాటాడే పలుకులు
పొల్లుగా తేలిపోకూడదు
సాంద్రత లేని మాటలుగా మారి
దంటుపుల్లలై విరగకూడదు
***
ప్రశ్నించడం కోసమే
ప్రశ్నలనెప్పుడూ సంధించకూడదు
ఏదోఒక సమాధానం వొస్తే చాల్లెమ్మని
ప్రశ్నలను ప్రయోగించడం ధర్మంకాదు
***
సరైన జవాబులు రాబట్టాలన్న తపన
ప్రశ్నించడంలోనే స్ఫురించాలి
ప్రశ్నలను ప్రశ్నలుగానే మిగిలిపోనివ్వకుండా
జలధారల్లా జవాబులు ప్రవహించాలి
అప్పుడే ప్రశ్నోపనిషత్తు
ప్రశ్నించే వ్యక్తికి
గౌరవాన్ని ప్రసాదిస్తుంది
జవాబులనందించే
జనావళికి పురస్కారమై
నిత్య పులకితయై మురిసిపోతుంది

- రావెల
పురుషోత్తమరావు
గుంటూరు
9394100531

పరమపాపి
సీతా సంరక్షణలో...
రావణుడితో తలపడి, రెక్కలు తెగి నేలపై పడి
రామునికి సీతమ్మ ఉనికిని తెలిపిన
జటాయువు పక్షీంద్రుడు
సీతానే్వషణలో...
రామునికి సాయపడిన మిత్రుడు
సుగ్రీవుడు వానరుడు
శతయోజన సాగరాన్ని లంఘించి లంకచేరి
సీతమ్మజాడ కనుగొన్న కోతి హనుమంతుడు
దుష్టరావణ సంహారానికి శ్రీరాముని పక్షాన చేరిన రాక్షసుడు విభీషణుడు
దాశరథి తలపెట్టిన వారధి నిర్మాణానికి
తన తనువును అనువుగా మలచిన
జలనిధి సముద్రుడు
మట్టిలో పొర్లి తన ఒంటికంటిన
మట్టిని రామసేతువుపై దులిపిన
బుడుత ఉడుత పా‘వన’ జీవుడు!
సంపూర్ణ రామాయంలో...
ఆ రామునికి ఎన్నడూ ఎక్కడా
ఏ రీతినా సాయపడని వాడు
కడకు పరమపావని సీతమ్మపైనే
పాడునింద మోపినవాడు
ఆమెను మళ్ళీ
అడవులపాలు చేసినవాడు
పరమపాపి.. మానవుడు!

- బి.ఎం.పి. సింగ్ (సాయిప్రసన్న)
విజయవాడ. 9395594114

ఈ రోడ్డు ఎక్కడికీ పోదు
కాంట్రాక్టరు కాశయ్య నుండి
అధికారి అమరేశ్వరరావు వరకు
ఈ రోడ్డు మీదే దృష్టి
సర్వీస్ మొత్తంలో
సరిగ్గా ఇటువంటి రోడ్డు
సంపాదన కట్టపెడుతుందనే - దీని సృష్టి!
బీళ్ళగుండా తుప్పల మధ్య
ఇళ్ళువాకిళ్ళు, జనసంచారం లేని
సన్నని అడవులగుండా
వందల కిలోమీటర్ల రహదారి
అమాత్యుల అంతఃకరణ
అర్థం చేసుకున్న అధికార ‘అసురగణం’
ఆర్భాటం లేకుండా
అందిపుచ్చుకున్న మహదావకాశం!
నిశ్శబ్దంగా శతాబ్దాల చరిత్రగతిని
మార్చగలిగిన సమాహారం
కాగితాల కట్టల్లో నిక్షిప్తమైన
అభివృద్ధి ఆశాకిరణం!
దీనిగుండా ఎవ్వరూ నడవరుగాక నడవరు
అరిగిపోయే అవకాశమే లేదు
ఇక్కడొక మార్గం వుందని
గుర్తించరుగాక గుర్తించరు
అప్పటికే అది మూసుకుపోతుంది కనుక!!
అవకాశం ఆలంబనగా
అందివచ్చిన ఆదరువు
ఆర్థిక లాభాపేక్షకు
అవస్యం తీరుతుంది కరువు
కలిసొచ్చే కాలానికి
కంకర రోడ్డే కాంక్రీటు రోడ్డయ
కొత్త అవతారం ఎత్తుతుంది
వర్షాకాలంలో వేస్తే ఎండాకాలానికల్లా
పచ్చదనంతో కళకళలాడుతుంది
తనిఖీకి తాఖీదులకు
జవాబివ్వక్కర్లేదు
ప్రకృతి ప్రసాదించిన ప్రమోదం
రహదార్లు కోట్లు మింగాయి
కరెన్సీ కలలు నిజమయ్యాయి!
సమనుకు సమాధానం ఎవరూ చెప్పరు
అయినా ‘ఈ రోడ్డు ఎక్కడికీ పోదు’
మరో జాతీయ గుర్తింపు కోసం
కలవరపడదు
‘టెండర్ల’ ప్రకటనకు
‘టెంప్ట్’ అవ్వకామానదు!!

- బియస్ నారాయణ దుర్గ్భాట్టు
తెనాలి
9346911199

ముఖాముఖి

చొప్పకట్ల చంద్రవౌళి

కవిత్వం చదివే వాళ్లకంటే రాసేవాళ్లే అధికం

ప్రశ్న: సాహితీ రంగంలోకి మీరెలా వచ్చారు?
జవాబు: నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు మా ఇంటికి దగ్గర్లోనే మా బంధువుల ఇంట్లో హనుమాజీపేట విద్యార్థులైన నా మిత్రులు కిరాయికుండేవారు. సి.నారాయణ రెడ్డి గారు వచ్చినప్పుడల్లా వాళ్ల దగ్గరనే ఆగేవాడు. కవిత్వం రాయమని మమ్మల్ని ప్రోత్సహించేవాడు. అతనప్పుడు హైదరాబాద్‌లో విద్యార్థిగా ఉండేవాడు. అప్పుడే నాకు తెలుగు సాహిత్యం, కవిత్వాల గురించి పరిచయం అయింది. అంతకుపూర్వమే నేను కాళిదాసు రఘువంశం, కుమార సంభవం, మేఘసందేశం కావ్యాలు సంస్కృత విద్యార్థిగా చదువుకున్నాను. అయితే చదువు పదచ్ఛేదం, అన్వయం, అర్థం, తాత్పర్యాలకి పరిమితం. ఇక్కడ తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీ మహాప్రస్థానం, ఆరుద్ర త్వమేవాహం మొదటిగా పరిచయం అయ్యాయి. శరత్ నవలలు, చలం కథలూ అప్పుడే చదివాను. ఇక సుప్రసిద్ధ జర్నలిస్టు, సోషలిస్టూ లోహియా అంతేవాసి సురవౌళి మాకు హిందీ టీచర్‌గా ఉండేవాడు. అన్ని రంగాలలో మాకు అవగాహన కలిగించేవాడు, ప్రోత్సహించేవాడు. సినారె మా చేత ‘విద్యోదయ’ అనే లిఖిత మాసపత్రిక తీయించాడు. అందులో నేనో సంపాదకుడిని. కాళోజీ ‘నా గొడవ’ కూడా అప్పుడే చదివాను. సినారె వచ్చినప్పుడల్లా ఒక్కొక్కరిని ఏం రాశావు, రాస్తున్నావా? అని అడుగుతూ రాసిన వాటిని చక్కదిద్దేవాడు. అతను హనుమాజీపేట చేరినప్పుడల్లా మేం సైకిళ్ల మీద వెళ్లి రెండు, మూడు గంటలు గడిపి వచ్చేవాళ్లం. ఇప్పటికీ అదేవిధంగా చేస్తున్నాం.
ప్రశ్న: మీ సాహితీ యాత్ర గురించి చెప్పండి?
జవాబు: ఆ కాలంలోనే ‘శరత్’ ప్రేరణతో ఏవేవో నవలలూ, కథలూ రాశాను. అవేవీ వెలుగులోకి రాలేదు. నేను పదో తరగతిలోకి రాగానే మా తల్లి చనిపోవడంతో మా కుటుంబ పరిస్థితులు అస్తవ్యస్తమయ్యాయి. మేమంతా చిన్నపిల్లలం. నేను టెన్త్ పాసయ్యాక అతికష్టం మీద హైదరాబాద్ నిజాం కాలేజీలో ఇంటర్మీడియట్‌లో చేరాను. దాన్ని ఎఫ్‌ఎ అనేవారు. మాతోనే అది చివరి బ్యాచ్. బాపురెడ్డి సీనియర్‌గా ఉండేవాడు. సురవౌళి, రెడ్డి చినవెంకట రెడ్డి (రేడియో ఎల్లయ్య)ల ఆసరాతో కొంత సాహిత్య వాతావరణం, సాహితీపరులతో పరిచయాలూ ఏర్పడ్డాయి. నిజాం కాలేజీ ‘తెలుగు విద్యార్థి’ అనే కళాశాల తెలుగు సంచికలో 1955-56లో నా కథ ‘గుడి గంటలు’ అచ్చయ్యింది. దానికి మంచి స్పందన వచ్చింది. హిమాయత్‌నగర్‌లో ‘సూర్యదేవర రాజ్యలక్ష్మి’ సంపాదకత్వంలో ‘తెలుగుదేశం’ అనే పత్రిక వస్తుండేది. అందులో నా కథలూ, స్కెచ్‌లూ, కవితలూ అచ్చయ్యాయి. తరువాత అభ్యుదయ అనే లిఖిత పత్రికను కొంతకాలం నిర్వహించాం. దానికి నేనో సంపాదకుడిని. స్కూల్ మ్యాగజైన్లను నేనే నిర్వహించేవాడిని. 1960 కాలంలో ఒడిదుడుకులైన నా వ్యక్తిగత పరిస్థితులలో మాత్రాఛందస్సులో చాలా గేయాలు రాశాను. బాగా అనిపించిన రెండు, మూడు గేయాలను ఈ సంచికలో కూడా చేర్చాను. ఇందులో కొన్ని కవితలు కొంత అస్పష్టంగా ఉంటాయి.
ప్రశ్న: కవిత్వం ఇప్పుడెలా ఉంది?
జవాబు: చెప్పదలిచిందాన్ని సూటిగా, స్ఫుటంగా, అందంగా చెప్పడం చేతగానప్పుడు తప్ప కవిత్వంలో అబ్‌స్క్యూరిటీ ఉండవలసిన పనిలేదు. సెల్ఫ్ రైచస్‌నెస్‌తో అబ్‌సీనిటికి కూడా కవిత్వమని పేరు పెడుతున్నారు. మళ్లీ వీళ్లు ప్రజల కోసం ప్రజల భాషలో రాస్తున్నామంటారు. కవిత్వం చదివేవాళ్లకంటే రాసేవాళ్లే ఎక్కువగా ఉన్నారనిపిస్తుంది. కథలు, పత్రికలూ చదివేవాళ్లలో సగం మంది చేతైనా చదివించలేకపోతోంది. ఈనాటి కవిత్వం సులభమైన పదాలతోనే అయఃపిండాలవంటి కవితలు రాయడాన్ని ఒక లలితకళగా రూపొందిస్తున్నారు కొంతమంది. ఇంగ్లీష్‌లో అమెరికన్ కవి అగ్టేన్‌నేష్ ఎండ్‌రైమ్స్‌తో పోయట్రీని వడపోశాడు. రైమ్‌కోసం భాషను ప్రతిభావంతంగా మార్చుకున్నాడు. కొని చదివించే కవిత్వంతో సంపన్నుడయ్యాడు. మన ప్రాచీనాలంకారికుల రస సిద్ధాంతాన్ని కొట్టిపారేయడం ఒక ఫ్యాషన్ అయింది. మన నిత్యజీవిత విషయాలనే తిరిగి ఆహ్లాదకరంగా, చమత్కారంగా, వ్యంగ్యంగా జ్ఞాపకం చేసే కవిత్వంలోనే కవి పనివాడితనం ఉంది. పూర్వం కఠిన పదాలు అర్థంకాక పద్యాలు అర్థం అయ్యేవికావు. కాని నేడు పదాలకు అర్థం తెలిసినా కవిత్వం అర్థంకాని రీతిలో శిల్పం మారిపోయింది.
ప్రశ్న: కవిత్వమంటే ఎట్లా ఉండాలి?
జవాబు: వినగానే మధురంగా అనిపించేది సంగీతమని! ఆలోచిస్తే అమృతంలా ఉండేది కవిత్వమనీ.. అంటారు. ఆరుద్ర మాటల్లో చెప్పాలంటే మంచి కవిత్వం చదివాక బాగా భోంచేసినట్టుండాలి. మనస్సుకు జ్వరం రావాలి. ఒళ్లు కొంచెం తిరిగినట్టుండాలి. నార్ల వారి మాటల్లో చెప్పుకుంటే గుండెను కరిగించాలి. మనసును కదిలించాలి. తిలక్ చెప్పినట్టు కవిత్వం ట్రాన్స్‌పరెంట్ చీకటిలా ఉండాలి. గడిచిన మూడు దశాబ్ధాలలో కవితావస్తువు ఇతర ఉద్యమాల వైపు మళ్లింది. ఏ ఇజం గురించి రాయాలన్నా కవులు సమస్యలనే కవితలతో బహిర్గతం చేస్తున్నారు.
ప్రశ్న: సాహితీ సంస్థలు సాహిత్య అభివృద్ధికి
దోహదం చేస్తాయా?
జవాబు: వేములవాడలో 1976 కాలంలో ఆవిర్భవించిన సాహిత్య సాంస్కృతిక సంస్థ ‘నటరాజ కళానికేతన్’లో నేను సలహాదారుడిని. సలహాలతో పాటు బాధ్యతలు కూడా అభిమానంతో వహించవలసి వచ్చింది. మంచె సత్యనారాయణ, జింబో, వఝల శివకుమార్, వారాల ఆనంద్, పిఎస్ రవీంద్ర తదితరులు కార్యవర్గంలో ఉన్నారు. కొనే్నళ్లపాటు చాలా విజయవంతంగా నడిచింది సంస్థ. శివకుమార్, జింబోలు తరువాత రాష్టస్థ్రాయ రచయితలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ఆనంద్ ఫిలిం సోసైటీ రంగంలో ప్రసిద్ధుడయ్యాడు. మా ఈ సంస్థ కార్యక్రమాలు విస్తరించడంతో జిల్లెళ్లలో, ఎల్లారెడ్డిపేటలో, కరీంనగర్‌లో మరో మూడు శాఖలు ఏర్పడ్డాయి. ఎల్లారెడ్డిపేటలో బహుభాషావేత్తగా, అనువాదకుడూ, రచయితగా నలిమెల భాస్కర్ ప్రసిద్ధుడయ్యాడు. ప్రతీ కవి సమ్మేళనం నా అధ్యక్షతన జరిగేది. జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, దాశరథి రంగాచార్య, గజ్జెల మల్లారెడ్డి, రాంభట్ల కృష్ణమూర్తి, కుందుర్తి, శివారెడ్డి, దేవీప్రియ, రెడ్డి చిన్నవెంకటరెడ్డి, సురవౌళి, ఏటుకూరి ప్రసాద్, ఎల్లోరా ప్రభృతులు తమ ప్రసంగాలతో ఇక్కడి వారిలో సాహితీ చైతన్యం కలిగించారు. ‘నవత’ అనే సైక్లోస్పైల్ మాసపత్రిక నా సంపాదకత్వంలో వెలువడేది. దానికి ఆగాచార్య చక్కని బొమ్మలు వేసేవాడు. 13-4-1979 రోజున నాకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి, ఒక అభినందన సంచికను కూడా ప్రదర్శించారు.
ప్రశ్న: ఆధునిక సాహిత్యంలో తెలంగాణ భాషపై
మీ అభిప్రాయం చెప్పండి?
జవాబు: నా సాహితీ మిత్రులు విమర్శించినా ఫర్వాలేదు. ఇప్పుడు నిత్య జీవితంలో అలవాటు, అభ్యాసం లేనివారు రచయితలు పట్టుదలతో తెలంగాణ భాషలో రాయబోతే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. నాకు తెలిసినంతలో తెలంగాణ భాషలో మొదట రచన చేసిన వారు సురవౌళి. 1952 కాలంలో ఆంధ్రపత్రిక, అంగడి పొద్దు, మంకు అనే పేర్లతో కథలు రాశాడు. తరువాత ఇక్కడి ప్రాంతీయ పేపర్లలో చాలా రాశాడు. తెలంగాణ భాషలో పాట మాత్రం అద్భుతంగా విజయం సాధించింది. ఎన్నో ఉద్యమాలకు ఊపిరిపోసింది.

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. vijmerupu@gmail.com

నేడు పగలే నక్షత్రాలు పొడిచాయి
english title: 
naa sukhame
author: 
ఆత్మకూరు రామకృష్ణ విజయవాడ 9493405152

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>