Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

నట్టింట్లో మురారే

$
0
0

ఆంధ్రభూమి - నాటా కథల పోటీలో ఎంపికైన రచన
---------------------
‘మీ మురారితో వేగలేకపోతున్నాను. మీరు అతనికి ఏదైనా ఉద్యోగం చూడాల్సిందే’ అని ఆ వేళ పట్టుబట్టింది సావిత్రి.
రాజా మండిపడ్డాడు. ‘ఉద్యోగాలు చెట్లకు కాస్తున్నాయా? మా అక్కయ్యకు మాటిచ్చాను కాబట్టి ఇంట్లో పెట్టుకున్నాను. ఉద్యోగాలు వెతుక్కోవలసినది వాడు. దానికి సిఫార్సులు, లంచాలు చూసుకోవాల్సింది వాళ్ల నాన్న. మధ్యలో నాకేంటి? సిటీలో అవకాశాలు ఎక్కువ కదా పంపుతానంది మా అక్క. సరే నన్నాను తప్పా...’
‘అతను వచ్చి ఏడాది కావస్తోంది. ఇప్పటిదాకా ఎక్కడా చెల్లుబాటు కాలేదు. ఇంటర్వ్యూ బాగా చేయాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి కదా, ఏదైనా కోర్సులో చేరమంటే చేరడు. అతనికంటె నా ఇంగ్లీషు లక్ష రెట్లు నయం. పొద్దస్తమానం ఫ్రెండ్స్‌నేసుకుని తిరిగితే ఉద్యోగాలేమొస్తాయి? మీ అక్కయ్యగారేమో రెండు రోజులకోసారి నాకు ఫోన్ చేసి ‘మా వాడికి మినిస్టర్ల దగ్గర్నుంచి తెలుసుకదా, చెప్పి ఎక్కడైనా వేయించు’ అని బతిమాలడాలు...
‘బాగుంది గోల, తెలిసినది ఒక్కగానొక్క మినిస్టర్. అదీ డైరెక్టుగా కాదు. ఆయన పిఏ చలపతి నా క్లాసుమేటు కాబట్టి. అది కూడా వ్యాపారబంధం.. అయినా మనవాడి దగ్గర సరుకుండాలిగా. ఆ ముక్క నేను అక్కయ్యకు డైరెక్టుగా చెప్పలేను. నువ్వే ఎలాగోలా డొంకతిరుగుడుగా చెప్పేయ్’ అన్నాడు రాజా.
సావిత్రి మూడు వంకర్లు తిప్పింది. ‘ఆ చెడ్డ పేరు కూడా నాకే దక్కాలా? ఇప్పటికే మురారి తినేస్తున్నాడు. తనకు ఉద్యోగం రాకపోవడానికి కారణం అవినీతి అని కొత్తగా కనిపెట్టాడు. అన్నాహజారే చెప్పాట్ట - అవినీతి తొలగిపోతే, స్విస్ బ్యాంకుల్లోంచి కోట్లాది కోట్లు దేశంలోకి వచ్చిపడి అందరికీ ఉద్యోగాలు వస్తాయట. అసలు ఎవరూ ఉద్యోగాలే చేయనక్కరలేదేమో కూడా.. ఏదో చెప్పాడమ్మా, గుర్తులేదు...’
‘...అన్నా హజారే గొడవెందుకు మధ్యలో?’
‘..నాతో అంటే అన్నారు. మీ మురారితో అనకండి. ఇప్పుడతను అన్నాహజారే ఉద్యమంలో పడి కొట్టుకుపోతున్నాడు. తన పేరు అన్నా మురారే అని మార్చుకున్నాడు. రోజూ ఫ్రెండ్స్‌ని వేసుకుని దేశం నుండి అవినీతి ఎలా తరిమికొట్టాలని హాల్లో గంటల తరబడి చర్చలు, ప్లాన్లు, అవినీతిపరుల భరతం పడతారట. వాళ్ల భరతం మాట ఎలా వున్నా నా చేత భరతనాట్యం చేయిస్తున్నారు. మాటిమాటికీ కాఫీలు, టిఫిన్లు అంటూ, టీవీ సీరియల్స్ చూడటానికి వీల్లేకుండా పోయింది...’
రాజాకు కోపం ఉవ్వెత్తున ఎగసింది. ‘ఎలాగోలా లంచం పెట్టయినా ఉద్యోగం చూసి పెట్టు మామయ్య అని మొన్నటిదాకా చెప్పి ఇప్పుడు హఠాత్తుగా అవినీతి, అన్నాహజారై అంటూ కబుర్లా? వీడికి ఆ పేరెత్తే అర్హత ఉందాని...’
* * *

రాజా కోపం ఆ రోజే తారా స్థాయికి చేరడం వల్ల వారం తర్వాత మురారి వాళ్లింటికి ‘ఇది అన్నా మురారే నిలయం, అవినీతికి విలయం’ అని బోర్డు కట్టినప్పుడు అంతకంటె పైకి వెళ్లలేకపోయింది. అందు కని అతను వేరే స్థాయిలో కథక్ స్టైల్లో శివతాండవం చేశాడు. అతని బాధ అతనిది. పంచాయితీరాజ్ మినిస్టర్ ఏకాంబరం గారి పిఏ చలపతి తన ఇంట్లోనే అడ్డా పెట్టాడు. కాంట్రాక్టర్ల నుండి కమిషన్లు ఇక్కడే తీసుకుంటాడు. మధ్యలో తనకు దక్కేదేమిటంటే - కాంట్రాక్టర్ దగ్గర మొహమాటం. వాళ్లకు స్టేషనరీ, ట్రాన్స్‌పోర్ట్ లాటివి సప్లై చేసి వ్యాపారం చేసుకుని నాలుగు డబ్బులు సంపాదిస్తాడు. ఏదో గడిచిపోతోంది. ఇప్పుడు తను పోయిపోయి అన్నా టీములో చేరాడని తెలిస్తే చలపతి ఇటు రాడు. తనకు వచ్చే బిజినెస్ రాదు. భుక్తి గడవదు. ఇవన్నీ తెలిసి కూడా మురారి ఇక్కడ ఈ దుకాణం పెడితే ఎలా? పైగా ఇంటివాడు గోల పెట్టడూ? తీసుకున్న అద్దెకు పూర్తిగా రసీదు ఇవ్వాలని అడుగుతామని భయపడి వెళ్లగొడతాడేమో!
మురారిని పిలిచి తిడదామంటే వాడు తన ఫ్రెండ్స్‌ని విడిచి ఒక్క క్షణం కూడా విడిగా దొరకడం లేదు. ‘అన్నా మురారే దళం’ అని బ్యానరు ఒకటి పట్టుకుని షాపింగ్ మాల్స్‌లో, పెట్రోల్ బంకుల్లో తక్కువ కొలతల గురించి ఉద్యమం చేస్తున్నాడు. పొద్దున్న పదిదాకా లేవడు, రాత్రి పనె్నండు దాకా రాడు, ఏతావతా రాజాకు దొరకడు. అందువలన సావిత్రే రాజా ఏడుపంతా వినాల్సి వచ్చింది. ‘దేవుడు ఏదో ఒకటి చేయకపోడు, దిగాలు పడకండి. చలపతి ఇలాటివి ఎన్ని చూశాడో, ఏమీ పట్టించుకోడు. మీ వ్యాపారం ఎక్కడికీ పోదు’ అంటూ ధైర్యం చెప్పింది.

సావిత్రి చెప్పింది కరెక్టే. చలపతి ఎప్పటిలాగా ఫోను చేశాడు. ‘పనె్నండు తారీఖున జానకిరామయ్య వచ్చి ఇవ్వాల్సింది ఇస్తానన్నాడు. సాయంత్రం నాలుగు గంటలకు మీ ఇంట్లో కలుస్తాం. చెల్లెమ్మను మాంచి సేమ్యా ఉప్మా చేయమను’ అంటూ ‘మాల్‌దార్ పార్టీ. మంచి చేసుకున్నావంటే నువ్వు సప్లయి చేయలేనంత ఆర్డర్లిస్తాడు.. చూస్కో’ అని కూడా ఆశ పెట్టాడు.
ఏడో తారీఖున ఏకాంబరంగారి పర్సనల్ సెక్రటరీ సుబ్రమణి నుండి కబురు వచ్చింది. ఆఫీసులో వద్దు, క్లబ్‌లో కలవమన్నాడు. ‘మీ చలపతి మినిస్టర్‌గారికి పెద్ద న్యూసెన్సుగా తయారయ్యాడు. ఆయన పేరు చెప్పి కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ కొట్టేస్తున్నాడు. ఇకనైనా మానేయ్ అంటే ఏం పెంట పెడతాడో తెలియదు..’ అన్నాడు సుబ్రమణి.
రాజా తెల్లబోయి ‘అదేమిటి, ఆయనకే ఇస్తున్నానని నాకు చెప్తూంటాడే...’ అన్నాడు.
‘ఆ ఇచ్చాడులే.. సగానికి పైగా తనే బొక్కేస్తున్నాడు. ఏది ఏమైనా మినిస్టర్‌గారు వాణ్ణి వదుల్చుకుందామని చూస్తున్నారు. దానికి మీ సాయం కావాలి. మీ మేనల్లుడు అన్నా హజారే ఉద్యమంలో తిరుగుతున్నాడు కదా. మీ ఇంట్లో ఫలానా రోజున చలపతి, జానకిరామయ్య కలవబోతున్నారని చెప్తాం. అతను మీడియాను పిలిచి చలపతిని ఎక్స్‌పోజ్ చేస్తాడు. తన పేరును వాడుకుని ఇలాటి పనులు చేస్తున్నందుకు మినిస్టర్‌గారు బహిరంగంగా విచారం వ్యక్తం చేసి, చలపతిని సస్పెండ్ చేసేస్తారు...’
‘..య్యిది.. నా.. నాకెందుకు చెప్తున్నట్టు?’ రాజా పెదాలు తడుపుకుంటూ అడిగాడు.
‘..మీ ఇంట్లో జరుగుతోంది కాబట్టి మీడియా వాళ్లు మిమ్మల్ని వివరాలు అడుగుతారు. మీరు చలపతి బలవంతం మీద ఒప్పుకున్నానని చెప్పండి. మినిస్టర్‌గారి పేరు బయటకు రానీయకండి. చలపతి ఇరుక్కోవాలంతే. మీకేమీ కాదు. తన పిఏ వ్యవహారం బయటపెట్టి తన ఇమేజ్ కాపాడినందుకు సంతోషించి మంత్రిగారు మీ మేనల్లుడికి ఉద్యోగం వేయిస్తారు. నాదీ గ్యారంటీ. పబ్లిక్ ఎనౌన్స్‌మెంట్ ఇప్పిస్తాను...’
‘...ఈ మాట ముందే చెప్తే వాడు నానా హడావిడి చేస్తాడు. చలపతికి తెలిసిపోతుంది...’
‘..మీ మేనల్లుడి సంగతి కనుక్కునే ప్లాను చేశా. అతనికి ఏమీ చెప్పం. ఉద్యోగం సంగతి కూడా. పనె్నండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకు మాత్రమే ఫలానా చోట అవినీతి డబ్బు చేతులు మారుతోంది. మీ టీముతో వెళ్లి పట్టుకో అని ఆకాశరామన్నలా ఫోన్ చేసి చెప్తాం...’
‘..సరేననుకోండి. కానీ ఇది జరిగాక చలపతి నా మీద కసి పెట్టుకుని, నాకు వచ్చే బిజినెస్ రాకుండా చేస్తే..?’
‘..వాడి మొహం. పనె్నండు సాయంత్రానికే సస్పెన్షన్. ఆర్నెల్లు తిరక్కుండా డిస్మిస్. మినిస్టర్‌గారితో పెట్టుకున్నాడు.. ఇక వాడు మీకు చేయగల మంచీ లేదు, చెడూ లేదు..’
రాజా ఈ సంభాషణంతా చెప్పి సావిత్రిని సలహా అడిగాడు. ‘చలపతికి చెప్పి హెచ్చరించమంటావా?’ అని.
సావిత్రికి ఒళ్లు మండిపోయింది. ‘ఏం? మీ మేనల్లుడికి ఉద్యోగం రావడం మీకిష్టం లేదా? ఉద్యోగం అంటూ వస్తే ఈ అన్నా లేదు, తమ్ముడూ లేదు. అన్నీ కట్టిపెట్టి, పెళ్లి మీద పడతాడు. ఇప్పుడు వేరే వ్యాపకం లేదు కాబట్టి దేశాన్ని ఉద్ధరిస్తున్నాడు. అది చూసి మీ అక్కగారు మురిసిపోయి నాకు ఫోన్లు మీద ఫోన్లు. మధ్యలో నేను ఛస్తున్నాను. టీవీ వదలడు. అన్నా న్యూస్ ఎక్కడ వస్తుందాని ఛానెల్సన్నీ మార్చిమార్చి చూస్తూ ఉంటాడు. అతనికి తోడు వాసూగాడు తయారయ్యాడు. వీడూ స్కూలు మానేసి అతని వెనక్కాల తిరుగుతున్నాడు.. కొడుకు ఏం చేస్తున్నాడో, చదువు ఏం వెలగబెడుతున్నాడో చూడ్డానికి మీకు టైముండదు. వాడూ మొదలెట్టాడు - స్విస్ బ్యాంకు డబ్బు వచ్చేస్తే ఎవరూ చదవక్కరలేదట...’
రాజా పళ్లు నూరుకున్నాడు. ‘..తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచిందని.. వాసూగాణ్ణి దీనిలోకి లాగవద్దని మురారికి గట్టిగా చెప్పు...’
‘..వినేవాడెవడు? పంచె కట్టి, గాంధీ టోపీ ఒకటి నెత్తిన పెట్టి వాసూరే వాసూరే అని మురారీ, అతని ఫ్రెండ్సూ పిలుస్తూంటే మనవాడికి మత్తెక్కిపోతోంది’
ఆ క్షణాన రాజా నిశ్చయించుకున్నాడు. చలపతి ఏ గంగలోనైనా దూకనీ, సుబ్రమణి చెప్పినట్టు చేసి తీరాలని. సావిత్రి చెప్పినట్టు మురారిగాడికి ఉద్యోగం వస్తే ఇంట్లోంచి పొమ్మనవచ్చు. కాఫీ, టిఫిన్ల ఖర్చు తగ్గుతుంది. వాసు చదువు బాగుపడుతుంది.
ఆ క్షణాన చలపతి ఆఫ్టరాల్ గాడనిపించాడు. కానీ పనె్నండు తారీఖు మధ్యాహ్నం మూడు గంటలయ్యేసరికి దశకంఠుడిలా అనిపించాడు. తను చాలా రిస్క్ తీసుకుంటున్నట్లనిపించి రాజా ఇంట్లో ఉండలేకపోయాడు. ఇప్పుడే.. వాళ్లు వచ్చేలోపల తిరిగి వచ్చేస్తా అంటూ పారిపోయి సినిమాకెళ్లి కూర్చున్నాడు. సెల్‌ఫోన్ ఆఫ్ చేసేశాడు. దిక్కుమాలిన సినిమా, మిత్రద్రోహం సబ్జెక్టు మీద తీశారు. ‘ఇనే్నళ్లుగా వున్న బంధాన్ని, స్వార్థం కోసం విస్మరిస్తావా?’ అని నిలదీస్తున్న హీరోకి, చలపతికి పోలికలు ఎలా కుదిరాయో రాజాకు అర్థం కాలేదు. మధ్యలో లేచి వెళ్లిపోదామనుకున్నాడు. ఇంటి దగ్గర గొడవ ముగిసిందో లేదో తెలీదు.
ఉండబట్టలేక సెల్‌ఫోన్ ఆన్ చేసి ఇంటికి ఫోన్ చేశాడు. సావిత్రి తీసుకుని ‘ఏవండీ.. మీరా.. హమ్మయ్య అయినా ఎక్కడికి వెళ్లిపోయారండీ. గంట నుండీ ప్రయత్నిస్తున్నాను. వాసూ పడిపోయాడండి. ఒకటే రక్తం. రండి. ఆస్పత్రికి తీసుకెళ్లాలి’ అంటూ సావిత్రి హడావిడిగా మాట్లాడి ‘వస్తున్నారా బాబూ వాసూ, వస్తున్నా’ అని అరుస్తూ ఫోన్ పక్కన పడేసి వెళ్లిపోయింది.
‘కాంట్రాక్టర్ వచ్చాడా? మీడియా వాళ్లు వచ్చారా?’ అని తెలుసుకుని వెళదామని రాజా అనుకున్నాడు. కానీ ఫోన్ సరిగ్గా పెట్టలేదు కదా. చుట్టూ గందరగోళంగా మాటలూ అవీ వినపడుతున్నాయి. వాసూకి రక్తం బాగా పోతోందేమో. ఈ మురారిగాడేం చేస్తున్నట్టు? ఆస్పత్రికి తీసుకెళ్లవద్దా? తీసుకెళ్లకపోవడమే మంచిది. అక్కడ అడ్మిషన్ చేసుకోవడానికి డబ్బడిగితే వీడు ‘్భరతీయుడు’లో ముసలి కమలహాసన్‌లా వాళ్లతో పోట్లాడి, కొనఊపిరితో ఉన్న వాసూను వరండాలో వదిలేసి.. బాబోయ్.
ఏమైతే అయిందని రాజా ఇంటికి ఆటో కట్టించుకున్నాడు.
* * *
నిజానికి వాసూకి ఏమీ అవలేదు. వాసూకే కాదు, అక్కడ ఎవరికీ ఏమీ జరగటం లేదు. ఎందుకంటే నాలుగుకి ఐదు నిమిషాల ముందే కాంట్రాక్టర్ జానకిరామయ్య వచ్చాడు. అతన్ని గెస్ట్‌రూంలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి బయట గడియ పెట్టారు. ఆ తర్వాత పావుగంటకి మురారి ఫోన్‌కాల్‌తో మీడియా కదిలి వచ్చి ఇంటి వెనక్కాల మాటు వేసింది. ఇంతా చేసి డబ్బు పుచ్చుకోవాల్సిన చలపతి మాత్రం రాలేదు. అతను రాకపోతే నేరమూ లేదు. అన్నా మురారే టీముకి కవరేజీ లేదు.
అయిదవుతూంటే మురారి సావిత్రి దగ్గర మొత్తుకున్నాడు - ‘ఏమిటి అత్తయ్యా.. ఇలా చీదేసింది! నాకు చెప్పినవాడు నాలుగ్గంటలకల్లా చలపతి వస్తాడని చెప్పాడే?! ఆ జానకిరామయ్యను ఎంతసేపు కూర్చోబెడతాం? ఉప్మా ప్లేటు మీద ప్లేటు లాగించేస్తున్నాడు. పకోడీలున్నాయా? అని అడుగుతున్నాడు.’
సావిత్రి పళ్లు పటపటలాడించింది. ‘పకోడీలా? గాడిదగుడ్డుతో ఆమ్లెట్టు వద్దూ...’
మురారి కాస్త బతిమాలుతున్నట్టు ‘అత్తయ్యా, నువ్వు ఆయన గురించి ఎలాగూ పకోడీలు వేయాలి కదా. కాస్త మా ఫ్రెండ్స్‌కీ... అదే చేత్తో మీడియా వాళ్లకీ.. నాలుగేసి చాల్లే...’
సావిత్రి కళ్లల్లోంచి నిప్పులు కురిపించింది. ‘బావుందయ్యా వ్యవహారం. నువ్వు వచ్చి చెప్పగానే టీవీలో పడుతుంది కదా, సర్దకపోతే బాగుండదని నడుం పడిపోయేట్లా రెండు గంటలుగా ఇల్లంతా సర్దాను. ఈయనకి కుంభాలకొద్దీ ఉప్మా మెక్కబెట్టాను. నువ్వేమైనా సాయం చేశావా? మ్యాచింగ్ జాకెట్టు ఇస్ర్తి చేసి పెట్టవయ్యా అంటే ఫ్రెండ్స్ వచ్చారంటూ ఉడాయించావ్. రేపు టీవీలో మీ అత్తయ్య మాచింగ్ బ్లౌజ్ లేకుండా పడితే ఎంత నగుబాటు.. ఏమైనా ఆలోచించావా? ఎంతసేపూ నువ్వూ మీ ఫ్రెండ్స్ షోగ్గా తయారవడమే తప్ప...’
‘అయ్యో మ్యాచింగ్ బ్లౌజా? నువ్వలా చెప్పలేదు కదా.. ఏదో ఉత్తినే అడిగావనుకున్నాను. మా వాళ్లకు చెప్తాను. చేసేస్తారు. ఈ లోపున చేయి ఖాళీగా ఉండకుండా కాస్త పకోడీలు...’
‘..ఎందుకయ్యా పకోడీలు? అవినీతి గురించి కవర్ చేయడానికి టీవీ వాళ్లకు పకోడీ లంచమా? డబ్బులు పోగేస్తున్నారుగా... హోటల్లోంచి కొనుక్కుని పట్టుకురా...’
‘.. ఆ డబ్బులయిపోయాయత్తయ్యా. మేమంతా మా ఎంబ్లమ్‌తో జీన్స్, టీ షర్ట్స్ కొన్నాం కదా.. చూశావా.. ‘అన్నా మురారే.. అవినీతి పరారే..’ ఎలా ఉంది స్లోగన్?’
‘అది సరేలే.. మీ మామయ్య సెల్ తీయడం లేదు కదా. చలపతి ఎప్పుడొస్తాడో ఏమో జానకిరామయ్యకు చెప్పాడా? ఈయన్నోసారి ఫోన్ చేసి అడగమను’
‘ఈయన చేయడట. ఇలా కలిసే రోజున ఫోన్ చేయకూడదని వాళ్లిద్దరి మధ్య ఒప్పందంట. నా బోటివాడు ట్రేస్ చేస్తాడని భయమేమో...’
‘...ఒకవేళ చలపతి వీధి చివరి దాకా వచ్చి మీ అందర్నీ చూసి వెనక్కి వెళ్లిపోయాడేమో...’
సావిత్రి సంశయం వినగానే మురారి దిగాలు పడిపోయాడు. అంతకంటె ఎక్కువగా సావిత్రి దిగాలుపడింది. ఇవాళ్టితో ఈ మురారి గోలకు మంగళం అనుకుంది. తీరా చూస్తే...
ఇంతలో రాజా సెల్‌ఫోన్ మోగింది. సావిత్రికి హఠాత్తుగా ఐడియా వెలిగింది. రాజాను ఇంటికి ఆదరాబాదరాగా రప్పించింది. ఈ లోపునే మురారిని పిలిచి ఏం చేయాలో చెప్పింది. వాసూని సూపర్ బజార్‌కి వెళ్లి చాక్లెట్లు కొనుక్కోమంది.
* * *
రాజా ఆటో దిగి ఇంట్లోకి రాగానే మురారి ఎదురు వచ్చాడు. ‘మామయ్యా’ అంటూ ఆదుర్దాగా చేయి పట్టుకుని లోపలకి తీసుకెళ్లాడు. గెస్ట్‌రూం గడియ తీసి లోపలకి తోశాడు. అతన్ని చూడగానే జానకిరామయ్య దిగ్గున లేచాడు. ‘హమ్మయ్య, ఎక్కడికి వెళ్లిపోయారండీ బాబూ! మీ కోసం వెయిట్ చేసి చేసి పిచ్చెక్కిపోయింది.

చలపతిగారు ఇప్పుడే ఫోన్ చేసి మీ చేతికి ఇమ్మన్నారు. తనకేదో పని వుందట. రాలేనన్నారు’ అంటూ వంగి బ్రీఫ్‌కేసు చేతిలోకి తీసుకుని రాజా చేతిలో పెట్టాడు.
రాజా ‘ఇదేమిటి? వాసూ ఏడి?’ అని అడుగుతూండగానే ఇద్దరి మీదా ఫ్లాష్ లైట్లు పడ్డాయి. చుట్టూ టీవీ కెమెరాలే. హాల్లోంచి సావిత్రి ఆనందంగా కేక - ‘ఏమండోయ్, మీ బొమ్మ టీవీలో వస్తోందండోయ్’ అంటూ.
రాజా హాల్లోకి పరిగెట్టాడు. తనే! చేతిలో బ్రీఫ్‌కేస్‌తో. మురారి వచ్చి చొరవగా బ్రీఫ్‌కేస్ లాక్కుని, తెరచి కెమెరాలకు చూపించాడు. లోపల నోట్ల కట్టలు. కాంట్రాక్టర్ తెల్లబోయి చూస్తున్నాడు. సావిత్రి పకోడీల పళ్లెం టీపాయ్ కిందకు తోసేసి, చీర చెంగుతో మూతి తుడిచేసుకుని కెమెరాకేసి చూస్తూ చిరునవ్వులు చిందిస్తోంది. అప్పుడే సూపర్ బజార్ నుండి వచ్చిన వాసూని కెమెరా ముందుకు లాగింది. అంతలోనే వాడి చేతిలో సగం కొరికిన చాక్లెట్ చూసి, చికాకు పడి ‘పడేసి చప్పున రా, వీళ్లు వెళ్లిపోతారు’ అంది.
వాసూ వచ్చేలోపునే టీవీ కెమెరా వాళ్లు ఇల్లంతా షూట్ చేస్తున్నారు. సావిత్రి దేవుడి మందిరం తలుపులు తీసి, దేవుళ్లందరూ పడేట్టు చూసింది. ఆ తర్వాత మైక్రో ఓవెన్‌లో కబాబులు కాలుస్తున్నట్లు దాని పక్కన పోజు పెట్టి నిలబడింది. వాసూ తనకు గేమ్స్‌లో వచ్చిన కప్పులను, క్రికెట్ బ్యాట్‌నీ తీయమని పట్టుబట్టాడు.
ఈలోగా వచ్చిన విలేకరులతో సగం మంది రాజాను, ఇంకో సగం మంది జానకిరామయ్యను చుట్టుముట్టి ప్రశ్నలు గుప్పించారు. రాజాకు అంతా అయోమయంగా ఉంది. ఏమడిగినా నాకేం తెలియదు అంటున్నాడు. మీ పేరు? అని ఎవరూ అడగలేదు కానీ లేకపోతే దానికీ అదే సమాధానం చెప్పేవాడు. జానకిరామయ్య మరీ అంత గత్తరబిత్తర పడలేదు. మా లాయర్‌ను అడగకుండా నేనేమీ చెప్పలేను అని చెప్పేసి కూర్చున్నాడు. ఇక మీడియా వాళ్లకు విసుగేసింది. మురారిపై ఫోకస్ చేశారు. మురారి అదరగొట్టేశాడు. ‘చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్’ అన్నట్టు అవినీతి అంతం కూడా ఇంటి నుండే ప్రారంభం కావాలన్నాడు. తనకు స్వపరభేదం లేదన్నాడు. తన టీమునంతా పేరుపేరునా పరిచయం చేశాడు. పూర్తిగా తృప్తి చెందాకనే మీడియా వెళ్లింది.
జానకిరామయ్య లేచాడు. ‘మీరూ, మీ మేనల్లుడూ కలిసి నన్ను బాగానే ముంచారు కదా’ అన్నాడు కోపంగా.
‘మధ్యలో నన్నాంటారేమిటండీ, అసలు ఆ బ్రీఫ్‌కేస్ నా చేతిలో ఎవడు పెట్టమన్నాడు? అది లేకపోతే నాకీ బెడదే లేదు కదా’ అని రాజా ఎదురుతిరిగాడు.
‘చలపతిగారే చెప్తే ఇవ్వక ఛస్తానా?’
‘చలపతిగాడు అలా ఎందుకు చెప్పాడు? నన్ను గోతిలోకి తోయడానికా?’ అరిచాడు రాజా.
‘అడగండి. ఫ్రెండ్ కదా. ఆ బ్రీఫ్‌కేస్ ఇలా ఇవ్వండి. ఎదవ సంత వచ్చి పడింది. గట్టిగా ఏమైనా అంటే కాంట్రాక్టు సంతకెళుతుంది’ అని తిట్టుకుంటూ జానకిరామయ్య వెళ్లిపోయాడు.
సుబ్రమణి రాజాకు ఫోన్ చేశాడు. ‘మంత్రిగారి స్టేట్‌మెంట్ టీవీల్లో రాబోతోంది చూడండి. మీ మేనల్లుణ్ణి మెచ్చుకుంటారు. ఉద్యోగం ఎనౌన్స్ చేస్తారు. హ్యేపీయేనా?’ అని.
‘ఏం హ్యేపీ లెండి? ఆ చలపతిగాడు తప్పించుకున్నాడు. మధ్యలో నేను ఇరుక్కున్నాను’ అన్నాడు రాజా సగం ఏడుస్తూ.
‘ఎక్కడికి పోతాడు లెండి? మీదీ చలపతిదీ ఒకే ఊరని, క్లాస్‌మేట్సనీ, ఇద్దరూ కలిసే ఈ దందా చేస్తున్నారని మీడియాకు లీకు ఇచ్చాం. అది వచ్చిన పావుగంటకు మంత్రిగారు ఎంక్వయిరీ ఆర్డరేస్తారు. రెండు రోజుల్లో సస్పెన్షన్..’
‘మొత్తం మీద నన్ను సెంటర్లో పెట్టి కథ నడుపుతున్నారా? అన్యాయం సార్.. మీరూ మీరూ బాగానే ఉన్నారు’
సుబ్రమణి ఫోన్ కట్ చేశాడు.
మంత్రిగారి స్టేట్‌మెంట్ వస్తూండగానే రాజా ఇంట్లో హర్షధ్వానాలు కప్పులేపేశాయి. తనతో ఏ సంబంధమూ లేకపోయినా తన పేరు వాడుకుని డబ్బు చేసుకుంటున్న రాజా ప్రవర్తనని ఖండిస్తున్నానన్నారు. అటువంటి వాళ్ల ఆట కట్టించిన అన్నా మురారే టీము రాష్ట్రానికే తలమానికం అన్నారు మంత్రిగారు. వారి జీవితం, లక్ష్యం అందరికీ ఆదర్శప్రాయం అన్నారు. ఇంటింటికీ అన్నా మురారే వెలవాలన్నారు. మురారికి ఉద్యోగం కల్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు. మురారి టీమంతా డాన్సు చేశారు. సావిత్రి కూడా మంచి హుషారుగా వుంది. టీవీలో వాళ్ల ఇల్లు బాగా పడిందని, చీర గ్రాండ్‌గా ఉందని, తను గ్లామరస్‌గా ఉందనీ ఫ్రెండ్సందరి నుండీ ఫోన్లు రావడంతో తనూ వాళ్లతో కలిసి డాన్సు చేసింది. మురారి తన ఫ్రెండ్సందరినీ డిన్నర్‌కి తీసుకెళతానన్నాడు. సావిత్రినీ రమ్మనమని బతిమాలాడు.
‘లేదయ్యా, మీ మామయ్య మొహం వేలాడేసుకుని కూర్చున్నారుగా, ఓదార్చకపోతే బాగుండదు. వాసుని తీసుకెళ్లు’ అంది సావిత్రి.
టీవీలో రాజా మీద కథనాలు పూర్తయ్యాక చలపతి నుండి ఫోన్ వచ్చింది. ‘ఏరా నమ్మకద్రోహీ, నీకు బాగా బుద్ధి చెప్పాను కదా’ అని.
‘ఏమైపోయావురా? డబ్బు నాకిమ్మని జానకిరామయ్యకు ఎందుకు చెప్పావ్? ఏమిటీ డ్రామా?’
‘డ్రామా నాది కాదురా. నీది. ఆ సుబ్రమణిగాడు నన్ను ట్రాప్ చేద్దామని చూస్తే, నువ్వు వాడితో చేతులు కలుపుతావా? నాకు చెప్పద్దా?’ అరిచాడు చలపతి.
రాజా నోరెత్తలేకపోయాడు. చలపతే మాట్లాడాడు. ‘ఇప్పుడు మంత్రిగారు స్టేట్‌మెంట్ ఇచ్చారు చూడు. అది మధ్యాహ్నమే తయారైంది. రాసి పెట్టినవాడు నాకు రహస్యంగా చెప్పాడు. ఒరిజినల్ స్టేట్‌మెంట్‌లో నా పేరుందిలే. నేను తప్పుకోవడంతో నీ పేరు వచ్చింది. కంగ్రాట్యులేషన్స్. రాష్టమ్రంతా నీ పేరే మారుమ్రోగిపోతోంది. ఇంకెప్పుడూ నాకు ఫోన్ చేయాలని చూడకు. దీన్లోంచి ఎలా బయటపడాలో నాకు తెలుసు. మేమూ మేమూ రాజీ పడతాం. మధ్యలో మునిగిపోయేది నువ్వే...’
రాజా అమృతాంజనం రాసుకుని పడుక్కున్నాడు. జరిగిన దానికి బాధపడటం ఒక ఎత్తయితే, సావిత్రి కులుకు చూసి బాధపడటం మరో ఎత్తయింది. ‘నీ టీవీ సంబరం మండిపోనూ.. అవతల పేరు పోయి నేనేడుస్తూంటే...’ అని తిట్టిపోశాడు.
‘పోనె్లద్దురూ వెధవ పేరు! వారం రోజుల్లో అందరూ మర్చిపోతారు. ఇవాళ్టికైతే మనం హీరోలం కదా..’ అంది సావిత్రి.
‘ఎంత అప్రతిష్ట! నా పాటికి నేనేదో నిజాయితీగా బతుకుతూ ఉంటే...’ కళ్లవెంబడి నీళ్లు వచ్చాయి రాజాకి.
‘అబ్బ! ఎవడికి గుర్తండీ. రేపీపాటికి టీవీ వాళ్లు ఇంకోడి మీద పడతారు.. మరీ చిన్నపిల్లాడిలా ప్రవర్తించకండి. మహామహావాళ్లే జైలుకి వెళుతున్నారు. మిమ్మల్ని అరెస్టు కూడా చేయలేదు. అసలు ఎవరైనా ఫిర్యాదు చేస్తే కదా.. అయినా మీరొకటి మర్చిపోతున్నారు. ఈ మురారిగాడి పీడ వదిలిపోయింది. ఉద్యోగం వస్తోందనగానే వాడప్పుడే బంజారాహిల్స్‌లో ఫ్లాట్ అద్దె ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. పై సంపాదన బాగా వుండే సీటు వేయించుకుంటాడు చూస్తూ ఉండండి... వాళ్లమ్మగారు అప్పుడే కట్నం ఎంతొస్తుందంటావ్ అని అడుగుతున్నారు...’
మురారి పీడ వదులుతుందన్న భావన రాజాకు కాస్త ఉపశమనం కలిగించింది. దుప్పటి కప్పుకుని మూలుగుతూ పడుక్కున్నాడు. తమ కథ ఏ ఛానెలైనా రిపీట్ చేయకపోతుందాన్న ఆశతో సావిత్రి ఛానెల్స్ తిప్పుతూ కూర్చుంది.
రాత్రి పది గంటల వేళ తలుపు చప్పుడైంది. అట్నుంచి అటే సినిమాకు వెళతానన్నారు కదా, టిక్కెట్లు దొరకలేదా? అనుకుంటూ సావిత్రి వెళ్లి తలుపు తీసింది. వచ్చినతని పేరు భీమశంకరంట. రాజాతోనే మాట్లాడతాడట. సావిత్రికి కాస్త భయం వేసింది. మఫ్టీలో వున్న పోలీసా అని. రాజా అతనితో మాట్లాడుతూంటే పక్క గదిలో చెవులు రిక్కించి వింది.
వచ్చినతను చెప్తున్నాడు.. ‘..మా మినిస్టరుగారిది పంచాయతీరాజ్ కంటే పెద్ద శాఖ. బడ్జెట్ రెట్టింపుంటుంది. మీరు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినా మినిస్టర్‌గారి పేరు గాని, పిఏ పేరు గాని చెప్పకుండా ఠలాయించినందుకు మా మినిస్టరుగారు చాలా ముచ్చటపడ్డారు. నిజాయితీగా ఉండటమే కాక, అలా పెదవి విప్పకుండా వుండేవాడే మనకు కావాలి. వెళ్లి బేరం కుదుర్చుకుని రా అన్నారు. మీరు సరేనంటే ఇప్పట్నుంచి మా కాంట్రాక్టర్లకు మీ దగ్గరే ఇమ్మనమని చెప్తాను. వాళ్లు వెళ్లిపోయిన పది నిమిషాలకు నాకు ఫోన్ చేయండి. వచ్చి వాలతాను. నేను ఆయన దగ్గర పిఏను. కమిషన్‌లో మీ టెన్‌పర్సెంట్ మీకు ఇచ్చాకనే తక్కినది పట్టుకెళతాను.. మీరు సరేనంటే రేపే ఓ పార్టీని మీ దగ్గరకు పంపుతాను..’
‘అబ్బే, నేను ఎప్పుడూ పర్సెంటులు తీసుకోలే...’ అని రాజా అనబోతూండగానే సావిత్రి ఛంగున ఆ గదిలోకి దూకి ‘అలాగే కానీయండి అన్నయ్యగారూ.. వేడికాఫీ తెస్తా.. షుగర్ వేయనా, వద్దా?’ అని అడిగింది.
=========
రచయిత చిరునామా
ఎబీయస్ ప్రసాద్
ఇ 101, సత్యనారాయణ ఎన్‌క్లేవ్
మదీనాగూడ, హైదరాబాద్-500 049.
040-65874123/9849998139

-ఎబీయస్ ప్రసాద్
english title: 
nattintlo murari

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>