ఇటలీలోని మూడవ పెద్ద నగరమైన నేపుల్స్ ప్రపంచంలోని అతి పురాతన నగరాలలో ఒకటి. క్రీ.పూ.6వ శతాబ్దంలోనే నేపుల్స్ నగరం ఉందన్న చారిత్రాత్మక ఆధారాలు లభించాయి. 118 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గల దీని జనాభా దాదాపు 10 లక్షలు. క్రీ.శ.12వ శతాబ్దం నించి 18వ శతాబ్దం దాకా ఇది రోమన్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. 4200 ఎకరాల మేరగల సిటీ సెంటర్‌ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించారు. నేటో సైనికులకి, అనేక పెద్ద కంపెనీలకి ఇది హెడ్ క్వార్టర్స్. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అత్యధికంగా బాంబింగ్ జరిగి తిరిగి పునరుద్ధరింపబడ్డ ఈ నగరంలో చూడదగ్గ విశేషాలు..
కేజిల్ నువావో: 1282లో నిర్మించబడ్డ ఈ కోట అనేకసార్లు ఆధునీకరించబడింది. సాండ్ స్టోన్‌తో నిర్మించబడిన ఇది ఇంకా చెక్కుచెదరకుండా ఉంది. ఈ కోట చుట్టూ కందకాలని నేటికీ నిర్వహిస్తున్నారు. ఈ కోటలో విలువైన శిల్పాలు అనేకం ఉన్నాయి. ఇందుగల రియా ఉంబర్టో అనే 18వ శతాబ్దంలో నిర్మించిన పెద్ద డోమ్ ఎత్తు 184 అడుగులు. ఇది గ్లాస్ రూఫ్ డోమ్. ఇక్కడ నేపుల్స్ పౌరులు రాజకీయాలు చర్చించుకుంటూ కనిపిస్తూండటం విశేషం. ఆ ఆసక్తిగల పౌరులంతా ఇక్కడికి కాలక్షేపానికి వస్తూంటారు.
బే ఆఫ్ నేపుల్స్ అండ్ వౌంట్ వెసువియస్: నేపుల్స్‌కి తూర్పున తొమ్మిది కిలోమీటర్ల దూరంలో, సముద్రపు ఒడ్డున గల్ఫ్ ఆఫ్ నేపుల్స్‌లో వెసువియస్ అనే అగ్నిపర్వతం ఉంది. గత వందేళ్లలో 1944లో ఇది ఓసారి బద్దలైంది. ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. క్రీ.శ.79లో ఇది పేలినప్పుడు నాశనమైన రోమన్ నగరాలు పాంపే, హెర్కులేనియంల శిథిలాలు ఇక్కడికి సమీపంలో ఉన్నాయి. దీనివల్ల సార్నోనది దిశ మారడంతో పాంపే నగర శిథిలాలు ఆ నదిలోగాని, పక్కన సముద్రంలో కాని కలిసిపోయాయని భావిస్తున్నారు. ఈ అగ్నిపర్వతం మరోసారి పేలితే 30 లక్షల మంది ప్రజలు ప్రమాదంలో పడతారు.
స్పాకానపోలీ: అంటే ఇటలీ భాషలో వీధి అని అర్థం.చాలా పొడవైన ఈ వీధి నేపుల్స్‌ని రెండుగా చీలుస్తోంది. రోమన్ కాలం నించి గల ఈ వీధి, పాత నగరంలోగల చారిత్రాత్మకమైన వీధి. టూరిస్ట్‌లని ఆకర్షించే దుకాణాలు, తినుబండారాల స్టాల్స్, సావనీర్ షాపులు ఈ సన్నటి సందులో చూడొచ్చు.
శాన్‌డొమెనికో మేగియోర్ చర్చ్: ఇదే పేరుగల స్క్వేర్‌లోగల ఈ చర్చ్‌పైన పేర్కొన్న స్పాకానపోలీలో ఉంది. 1283లో నిర్మాణం ఆరంభమై, 1324లో పూర్తయిన ఈ చర్చ్, 10వ శతాబ్దపు ఓ ప్రాచీన చర్చి స్థానంలో నిర్మించబడింది. గోథిక్ స్టయిల్‌లో నిర్మించబడిన ఈ చర్చ్‌కి అనుబంధంగా ఉన్న మోనాస్ట్రీలోనే యూనివర్సిటీ ఆఫ్ నేపుల్స్ ఆరంభించబడింది. మతం, వేదాంతాల్లో ప్రసిద్ధి చెందిన అనేక మంది తత్వవేత్తలు ఇక్కడే జీవించారు. బైబిల్ కథల ఆధారంగా పదమూడవ శతాబ్దంలో గీయబడిన అనేక చిత్రాలని ఇక్కడ చూడొచ్చు.
శాన్‌ఫ్రాన్సిస్కో డెలె మోనాష్ చర్చ్: నేపుల్స్‌లోని మరో పురాతన చర్చి అయిన ఇది 14వ శతాబ్దంలో నిర్మించబడి, 18వ శతాబ్దంలో పునర్ నిర్మించబడింది. ప్రస్తుతం ఇందులో ఓ కల్చరల్ సెంటర్, ఓ స్కూల్ నిర్వహించబడుతున్నాయి. ఇది కూడా స్పాకానపోలీ వీధిలోనే ఉంది.
శాంతాషియారా: ఇది క్వీన్ సాంచా ఆఫ్ మజోర్కి క్రీ.శ.1340లో నిర్మించిన క్రైస్తవ సన్యాసుల మోనాస్ట్రీ, చర్చ్. తిరిగి 17వ శతాబ్దంలో గోథిక్, బరోక్యు స్టయిల్స్‌లో దీన్ని పునర్నిర్మించారు. 111 మీటర్ల పొడవు, 33 మీటర్ల వెడల్పు, 47 మీటర్ల ఎత్తుగల ఈ సముదాయం 2వ ప్రపంచ యుద్ధంలో మిత్ర సైన్యాల బాంబింగ్‌కి తగలబడిపోయింది. 1952లో దీన్ని తిరిగి యధాతథంగా నిర్మించారు.
ఇక్కడ అనేక చిత్రాల గేలరీలు, బెల్ టవర్ చూడదగ్గవి.
ఇంకా ఇక్కడ ఫలెజో పెట్రీకి, ఫలెజో పెన్నిలీ, ఫలెజో మారిగ్లియానో, ఫలెజో డిశాంగ్య్రో, నేషనల్ మ్యూజియం ఆఫ్ కపోడీ, వౌంటె విల్లా పిగానాటెల్లీ, అందులోని తోట మొదలైనవి చూడొచ్చు. కపోడిచినో ఏయిర్‌పోర్ట్ ద్వారా లేదా రైలు మార్గంలో ఇక్కడికి చేరుకోవచ్చు. మే నించి సెప్టెంబర్ దాకా సీజన్.