యంత్రం ఆరు గంటలు. చిన్న జల్లు కురుస్తూనే ఉంది. ఆఫీసునుండి వచ్చి, ఇంట్లో అడుగు పెట్టేసరికి గుండె ఝల్లుమంది.
‘‘మైగాడ్ పనిమనిషి ఈరోజూరాలేదా?! బాగా అలసిపోయాను.. ఈ ఇంటిపని.. వంటపని.. హే! భగవాన్’’ అని మనసు బాధగా శబ్దం చేసింది. వెంటనే సావిత్రిమీద కోపం తన్నుకొచ్చింది.
‘‘చిన్నా! సావిత్రి రాలేదా!?’’ అరడిగాను చిన్నాడిని.
‘‘ఇల్లు చూస్తే తెలుస్తుందిగా మమీ’’ వాడి గదిలోచి వస్తూ ఖుషీగా, జోక్‌లా వాడంటుంటే.. కోపం నషాళానికెక్కి ‘‘ఏరా! షింక్‌లో ఎంగిలి తీసి, ప్లేట్లు వేయొచ్చుకదా! ఎక్కడి వస్తువు నేనెళ్ళేసరికి ఉంటుందో.. అక్కడే వచ్చేవరకు ఉంటాయి. ఆ బట్టలలా, మంచాలమీదా.. సోఫాలమీద కాకుండా.. ’’
మాట పూర్తి కాకుండానే ‘‘ అవి నావు కాదు మమీ... ఇవి అన్నయ్యవి.. ఇదిగో ఇవి నాన్నవి.. నేను కాలేజినుంచి ఇప్పుడే వచ్చాను.. గానీ నువ్వు టెన్షన్ పడకు నేనే పనులు చెయ్యాలో చెప్పు.... ఇద్దరం కలిసి చకచకా చేసుకుందాం’’ అంటూ వచ్చి తియ్యగా ఓ ముద్దిచ్చాడు.
వాడి ముద్దుతో నా కోపం తగ్గిపోయింది. వాడ్ని ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ...
‘‘సరే నాన్నా! ముందు ఫ్రెష్ అయ్యి, వేడివేడిగా, నువ్వు పాలు.. మేను కాఫీ తాగాక పని ప్రారంభిద్దాం’’ అన్నాను.
నా చిన్న కొడుకు సహాయంతో ఇల్లు, గినె్నలు క్లీన్ అయ్యాయి. కూరగాయలు తరిగి ఇచ్చేసాడు.. వంట ఇన్‌టైమ్‌కి చేశాను.
తెల్లవారు స్నానం, పూజ అయ్యేసరికి...
‘‘అమ్మా!’’ బెదురుబెదురుగా.. ముఖారవిందం పెడుతూ, పిలుస్తూ నిల్చుంది.
‘‘రామ్మా! సావిత్రీ! రా! రా! నీకు డబ్బలివ్వటం లేదా! మన్ను ఇస్తున్నానా! ఎందుకే నన్నిలా ఇబ్బంది పెడతావ్! చెప్పా పెట్టకుండా పనెగ్గొడతావ్. నేను ఇంట్లో ఉన్నదాన్ని, నీకిష్టం లేకపోతే, కష్టంగాఉంటే నా పని మానేయ్. నేనింకెవరినైనా చూసుకుంటాను... ’’ ఇంకేదేదో కోపంలో అరిచేసాను.
‘‘అది కాదమ్మా! మరేమో’’
‘‘మరింకేం చెప్పమాక.. ఖచ్చితంగా చేస్తావా! చెయ్యవా!? అది చెప్పు’’ అన్నా.
‘‘మీ ఇల్లు వదలనమ్మా!’’
ఇంతలో నా చిన్న కొడుకు ప్రవేశించి ‘‘టెన్షన్ వద్దు మమీ! చేస్తానంటుంది కదా, నువ్వు లోపలికెళ్ళు సావిత్రీ!’’ సావిత్రికి దారి చేసినట్టు నన్ను పట్టుకొని పక్కకి తీస్తూ! ‘‘అమ్మా! నువ్వే చెబుతావు కదా, చిన్నచిన్న సమస్యలకు వర్రీ కాకూడదు, సావధానంగా చర్చించుకొని, పరస్పర అవగాహన చేసుకుంటే ఏ సమస్యలూ ఉండవని.. పనిపిల్ల విషయంలో ఎందుకంత కోపం.. కూల్ బేబీ.. కూల్.. ’’ అని సముదాయించాడు.
నిజమే, చిన్నా చెప్పాడు. సావిత్రి ఎందుకిలా చేస్తుందో.. తన మాటస్సలు నేను విన్పించుకోవటం లేదు. డబ్బులిస్తున్నానని.. నేను పని చేయాల్సివస్తుందన్న బాధ, చేసుకోలేక నీరసం. ఇలా అంతర్మధనం ప్రారంభమైంది నా లోలోన.
ఎప్పుడూ ఏదో ఒకటి సావిత్రితో మాట్లాడుతూ పనులు చేసేదాన్ని ఈరోజు కామ్‌గా, గంభీరంగా ఉన్నా. సావిత్రి విచారంగానే కనిపిస్తోంది. శ్రద్ధగా, నీట్‌గా తన పని తాను చేసుకుంటోంది.
‘‘అమ్మా! నా పని అయిపోయిందమ్మా’’ అంది
‘‘సరే కూర్చొ.. టిఫిన్ తిందువుగాని’’
‘‘ఇంటికి తీసుకుపోతానమ్మా, బేగి యింకో ఇంటికి పనికెళ్ళాలమ్మా!’’
‘‘ఎన్నిళ్ళు చేస్తున్నావు సావిత్రీ’’ అడిగాను
మీ ఇంటితో నాలుగిళ్ళమ్మా! అమ్మా! ఈ మజ్య కొత్తిల్లు ఒప్పుకుంది. సాన బిరైపోతున్ననమ్మా. నన్న సెమించమ్మా. మీరు నా కట్టము కనిపెడ్తారని, అప్పుడప్పుడ మీ ఇంటిపని మానేస్తున్నాను. మీకు కోసం తెప్పిస్తున్నాను. నన్ను మానీమని అనకండమ్మా. ఈసారెప్పుడూ పని మాననమ్మా! అపతిరోజూ వచ్చేస్తాను’’ కళ్ళనీళ్ళ పర్యంతంగా అంటుంటే నా మనసు కలుక్కుమంది.
‘‘సర్వే సావిత్రీ ఏడవకు. నేను ఆఫీసుకు వెళ్ళాల్సిన దాన్ని కదా! ఆఫీసు నుంచి వచ్చేసరికి చాలా నీరసంగా ఉంటోంది. మళ్ళీ, నీ పని నేను చేసేసరికి బాధ, కోపం. టిఫిన్ తీసికెళ్ళు, రేపు ఆదివారం కదా మీ అమ్మను తీసుకొని రా! తనతో మాట్లాడాలి’’ అని సావిత్రిని పంపేసాను.
‘‘అమ్మా’’ అంటూ చీపురందుకున్న సావిత్రితో, ‘‘మీ అమ్మేది?’’ అన్నాను.
‘‘నీలు మోస్తోంది, వస్తుందమ్మా, లేటవుతాదని నేను ముందు వచ్చేసానంటూ పనిలో లీనమైంది.
గంట గడిచాక ‘‘దండాలమ్మా’’ అంటూ సావిత్రి తల్లి వచ్చింది.
‘‘బాగున్నావా! నీలమ్మా! రా కూర్చో’’ అని పీటిస్తే.. నాకెందుకమ్మా అంటూ కిందే కూర్చుంది.
‘‘సావిత్రి తరచూ నా పని మానేస్తోంది. ఈ విషయమే నీతో మాట్లాడదామని, రమ్మన్నాను’’ అన్నాను ఆమెతో.
‘‘అమ్మా! మీరు, మా దొడ్డ మడిసని, కట్టం, సుకం సూత్తారని సెప్పినాది. దాని ఒంటికి కట్టంగా ఉన్నప్పుడు, మీ యింటిపనే మానేత్తుంది. గానీ సాన బాధ పడతాది. మిగతా ఆ మూడిళ్ళోల్లు, ఓ పూట మానినా ఒప్పుకోరు. జీతం లెక్కవేసి, కట్చేసి ఇత్తామంటే, జడిసి పోతుందమ్మా. మాం మేదోళ్లమి కూలాడితే కుండాడుతాది. పనికెల్లకపోతే కాదు. ఏటి సేస్తానమ్మా! మునే్నటిరవై రోజుల కట్టబడమని బమ్మ మా నుదుటిన రాసాడు, కానీ పరకా కూడికచేసి, దాన్నో ఇంటిదాన్ని సెయ్యాల. తల్లీపిల్లా కట్టపడుతున్నాం’’
‘‘నీలమ్మా! అదే, సావిత్రి పని గురించే, నాలుగిళ్ళు చేస్తుంది కదా! వారానికి ఓ పూటో, ఓ రోజో సావిత్రి పనికి రాదు. దానికి రెస్టు ఉండాలి కదమ్మా! అని తన పనిచేసి ఇళ్ళ యజమానురాళ్ళతో నువ్వు మాట్లాడి ఒప్పించు’’
‘‘అమ్మో! ఆలు వప్పుకుంతారా.. పనిలోంచి తప్పుకో అంటారు’’. ‘‘నువ్వెళ్ళి మాట్లాడు. సావిత్రి నీరసం అయిపోతోంది. మీతోపాటు పనిచేసి నోళ్లకి ఈ మాట చెప్పు. అందరూ (పనిమనుషులు) ఇది పాటిస్తే... తప్పక యజమానులు ఒప్పుకుంటారని మీ వాళ్ళందరికీ చెప్పు’’
‘‘అవునమ్మా! మంచిమాట సెప్పావు. నీ ఒక్కింటికే సిట్టపెట్టాం. రేపు సాయంత్రమే, తిరిగి ఏమాటో సెపుతా’’నంటూ నీలమ్మ వెళ్లిపోయింది.
సావిత్రి, నీలమ్మ వచ్చారు.
‘‘అమ్మా! వారానికోపూట మాకు ‘సెలవు కావాలి’ అంటే అయిట్టంగా అందరు యజమానులు తలూపారమ్మా, ఉత్సాహంగా నీలమ్మ చెబుతోంది.. నన్ను మెచ్చుకోలుగా చూస్తూ...
నవ్వుల సిరి... రాగతి
పండరి!
నవ్వు నాలుగు విధాలా చేటు కాదు... నలభై విధాలా గ్రేటు! నవ్వు ఒక టానిక్. నవ్వొక యోగం... అలా ఆంధ్రదేశమంతటా నవ్వుల టానిక్ పంచుతున్న అచ్చ తెలుగు మహిళా కార్టూనిస్టు రాగతి పండరి. దాదాపు అన్ని తెలుగు పత్రికలలోను ఆమె కార్టూన్లు ప్రచురించబడ్డాయి. సునిశిత హాస్యం, కాస్త వ్యంగ్యం, కొద్దిగా చురక, ఆలోచింపజేసే తీరుతో ఆమె గత ముప్ఫై ఏళ్ళుగా కార్టూన్లు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కల్చరల్ కౌన్సిల్ వారి ప్రత్యేక అవార్డును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా అందుకున్న రాగతి పండరి 2009 కళారత్న అవార్డును కూడా దక్కించుకున్నారు. ఒక మహిళా కార్టూనిస్టు ఈ అవార్డును అందుకోవడం అదే తొలిసారి. దీనిపై ఆమె స్పందిస్తూ ఇది తన ఒక్కదానిదే కాదని, అందరు కార్టూనిస్టులది అని అంటారు. తన కార్టూన్ల ప్రస్థానంపై ఆమె మాట్లాడుతూ తనకు ఎనిమిదేళ్ళ వయసు ఉన్నప్పుడు తన తొలి కార్టూను ఆంధ్రజ్యోతి ప్రచురించబడిందంటారు. అప్పుడు ఆంధ్రజ్యోతి సంపాదకులు పురాణం సుబ్రహ్మణ్యశర్మ. పోలియోకు గురైన రాగతి పండరికి ఆమె కుటుంబ సభ్యులే చక్కని ప్రేరణగా నిలిచారు. ముఖ్యంగా ఆమె తల్లి పండరి మంచి కార్టూనిస్టుగా ఎదిగేందుకు ఎంతో తోడ్పడ్డారు. ప్రముఖ కార్టూనిస్టు జయదేవ్‌కు రాగతి పండరి ఏకలవ్య శిష్యురాలు. ఆయన లైనింగ్, క్యాప్షన్‌లోని క్లుప్తత అంటే ఇష్టపడే రాగతి పండరి అదే ఒరవడిలో కార్టూన్లు గీస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలా కార్టూన్లు గీస్తూ దానిపై పట్టు సాధించిన తర్వాత ఆమెకు అన్ని పత్రికలు ఎంతగానో ప్రోత్సాహాన్ని అందించాయి. ముఖ్యంగా యువ, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి వంటి పత్రికలు ఆమెను ఎంతగానో ప్రోత్సహించాయి. ఆమె దశాబ్ద కాలం పాటు రాజకీయ చదరంగం పేరిట ఒక కార్టూన్ కాలమ్ నిర్వహించారు. చుట్టుపక్కల వారిని గమనించి తాను కార్టూన్లు వేస్తానని, దాని వల్ల సమకాలీన సమస్యలు, వ్యక్తుల గురించి బలంగా కార్టూన్లలో చెప్పవచ్చని ఆమె అంటారు. ఆమె కాలేజీకి వెళ్ళకపోయినా అదే అవగాహనతో కాలేజ్ గర్ల్ పేరిట ఒక కార్టూన్ శీర్షికను కొన్నాళ్ళ పాటు నిర్వహించారు. అదే విధంగా మామూలు కార్టూన్లతో పాటు ఆమె ధారావాహికగా శ్రీ-మతి, కవయత్రి-రచయత్రి, ఇద్దరు అమ్మాయిలు, నవగ్రహం-అనుగ్రహం కార్టూన్ ఫీచర్లు నిర్వహించారు.
ఆమె తన ప్రతిభతో అప్పట్లో కలెక్టర్ దయాచారి చేతుల మీద ప్రత్యేక అవార్డు, తమిళనాడు గవర్నర్ సి. రంగరాజన్ ద్వారా మద్రాస్ తెలుగు అకాడమీ వారి ఉగాది పురస్కారం వంటివి అందుకున్నారు.
‘మెరుపు’
రచయితలకు విజ్ఞప్తి
మొదటి ఏడాది పూర్తయి, రెండో ఏట ప్రయోజనకరంగా నడుస్తున్న ‘మెరుపు’ ఉత్తరాంధ్ర సాహిత్యవేదికకు మీ నుండి రచనలు, కార్టూన్లు, వ్యాసాలు కోరుతున్నాము.
* కథలు మూడు ఎ-4 సైజు పేజీలకు మించకుండా పం పించాలి.
* కవితలు ఒక ఎ-4 సైజు పేజీకే పరిమితం అయి ఉండాలి.
* కార్టూన్లు ఇండియన్ ఇంక్, లేదా రంగుల్లో అయినా సరే పంపవచ్చు.
* రచన/కార్టూన్ స్వీయ సృజన అనే హామీ పత్రం తప్పనిసరి.
* పుస్తకాలు సమీక్ష కోరి పంపేవారు రెండు ప్రతులు పంపాలి.
* మీ ప్రతి రచనతోను మీ పూర్తి చిరునామా, ఫోన్ నెంబరు, ఈ-మెయిల్ అడ్రస్ జతపరచడం మర్చిపోవద్దు.
మనోగీతికలు మనోగీతికలు మనోగీతికలు మనోగీతికలు మనోగీతికలు
అప్పులు
సేద్యం... స్వేద సాగర మథనం
హాలాహలం... హలధారికి
అమృతభాండం... దళారికి
* * *
గొప్ప కంపెనీల విత్తనాలు
గుప్పెడు జల్లినా చాలు
కుప్పలుగా మొలుస్తాయి...
పొలం నిండా అప్పులు
- డివిజి శంకర్రావు
క్షమ
రాముడు నడచినా
రావణుడు - నడచినా
భరించావు-
అమృతం పోసినా
హాలాహలం
హరించావు
పర్వతాలను-
మహావృక్షాలను ధరించావు -
పిడుగు పాటులను,
ప్రళయ ఘోషలను జీర్ణించావు
ఓ! ధరణీలలామా!
అందుకే నీవు క్షమామూర్తివి
- విద్వాన్ ఆండ్ర కవిమూర్తి
స్ఫూర్తి
సమాజం మారాలని
నిందిస్తూ కూర్చోకు
ఎవరో వచ్చి
ఏదో చేస్తారని
ఎదురు చూడకు
ఏ మార్పు అయినా
నీతోనే మొదలని
ముందడుగు వేస్తే
ప్రతి ఒక్కరూ
నీలాగే భావిస్తే
స్వచ్ఛందంగా అందరూ
ప్రగతినే కాంక్షిస్తే
భారతావని కాదా
బంగారు గని
ఇరుగు పొరుగు దేశాలకు
స్ఫూర్తిప్రదాయని!
- ప్రసాద్
ప్రత్యక్ష దైవం అమ్మ!
జాబిలమ్మా! నీకా చలువ ఎక్కడిదని అడిగితే
అమ్మ కథలలో నిత్యం ఉండి ఆ చలువ సోకిందని చెబుతుంది
కోయిలమ్మ నీకా రాగమేంటని అడిగితే
అమ్మ లాలి పాటలు నేను విన్నానని గర్వంగా బదులిస్తుంది
గోరుముద్దని నీకా రుచెక్కడిదని అడిగితే
అమ్మలోని తీయదనం నాలో నిండిందని బదులిస్తుంది
ఆకలిని అమ్మ ఉన్నప్పుడు కనిపించవెందుకని అడిగితే
అమ్మో! నీ దరికి రానివ్వదని భయపడిపోతుంది
కడుపును కోవెలగా మార్చి
నీకు ప్రాణప్రతిష్ట చేసిన బ్రహ్మ కద అమ్మ
తన శ్వాసను నీకు ఊపిరిగా చేసి బతుకునిచ్చిన దైవం కద అమ్మ
నవమాసాలు నిండి పురిటి నొప్పులతో గిలగిల్లాడినా
ఆ నొప్పితో నేస్తం కట్టిన అమ్మ నువ్వు కనులు తెరవక ముందే
నీకు ఊసులు చెప్పే స్నేహితురాలే కదా అమ్మ
తన తుది శ్వాస వరకు నిత్యం నీకోసం ప్రార్థించి నిత్యారాధన చేసే అమ్మ
అందుకే అమ్మ ఆ దేవుడికి తుది రూపం
ఈ పుడమిపై అందరికీ ఆమే ప్రత్యక్ష దైవం!
- మేఘనాథ్ సనపల
పాతరేస్తున్నాం
ఆకులురాలే కాలంలో
కోకిల కూతలేస్తే
ఏం బావుంటుంది...
వర్షాకాలంలో రోడ్లు వేసినట్లుగా!
ఇసుక మాఫియాలతో...
పదవుల పొట్లాటలతో
హత్యా ఆత్మహత్యా అత్యాచారాలతో
అనుదినం సతమతమయ్యే
మానవాళి క్రీళులతో
నెట్, ఇంటర్నెట్ కంప్యూటర్ల గోలలతో
జనం జావగారి పోతుంటే...
కడలి పొంగులతో సునామీ విజృంభించదా???
భూమాత పొడల్లో నీళ్ళు ఇంకి
భూగర్భజలాలు అడుగంటవా???
వృక్షసంపదలను సంరక్షించుకోలేక
‘వినాశకాలే విపరీత బుద్ధి’ని
నిజం చేస్తున్నాం
వెనె్నల లోగిలిలో ఇళ్ళు
కట్టుకోవాలన్న ఆశలకు
బానిసలమై వెనె్నలను చెరిపివేస్తూ...
టాబ్లెట్ల భోజనానికి దగ్గరరౌతున్నా
సాంప్రదాయాలకు పాతరేస్తున్నాం!!
--ఈవేమన
నిర్వహణ:
- రామతీర్థ ramateertha27@gmail.com
ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ-మెయిల్ అడ్రస్‌కు పంపించండి.
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9. ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17.,