శ్రీకాకుళం, సెప్టెంబర్ 8: ఆకాశం వైపు ఎదురుచూసిన రైతులకు వరుణదేవుడు కరుణించాడు. శనివారం జిల్లా అంతటా కుండపోత వర్షం కురిసింది. వర్షాధార మండలమైన రణస్థలంలో 59.2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా 1.4 మిల్లీమీటర్లు సరుబుజ్జిలిలో వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లి పంట కాలువల్లో నీటి ప్రవాహం ఒక్కసారి పెరిగింది. ఇప్పటికే మడ్డువలస రిజర్వాయర్‌లో నీటి ప్రవాహం పెరగడంతో నాగావళిలో వరద ఉద్ధృతంగా ఉంది. దీనికి తోడు భారీ వర్షం నమోదు కావడంతో ఖరీఫ్‌లో వరిసాగు చేసే రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లావేరులో 53.2 మిల్లీమీటర్లు, నందిగాంలో 50.2, పలాస, సీతంపేట, వంగర, మందస మండలాల్లో 40.2 శాతం వర్షం కురిసింది. మెళియాపుట్టిలో 38.4, ఇచ్ఛాపురంలో 25.4 మిల్లీమీటర్లు నమోదు కాగా జి.సిగడాంలో 26.6, బూర్జ 39.4, సంతకవిటి
22.2 మిల్లీమీటర్లు, జలుమూరులో 20.9, టెక్కలి 38.4 మిల్లీమీటర్లు ఇలా దాదాపు అన్ని మండలాల్లో వర్షం భారీగా కురిసింది. జిల్లా అంతటా 19.1 శాతం సాధారణ వర్షపాతం నమోదైంది.
రైతుల్లో ఆనందం
వర్షాలు కురుస్తుండడంతో ఇప్పటికే ఖరీఫ్ సాగు పూర్తి చేసిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉబాలు, ఎదలకున్న తెగుళ్లు నయమవుతాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 2.10 లక్షలు హెక్టార్లలో ఖరీఫ్ సీజన్‌లో సాధారణంగా వరిసాగు చేయడం పరిపాటి. ఇటీవలి కాలంలో నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయడంతో అన్నదాతలు అనుకున్న స్థాయిలో ఉబాలు పూర్తి చేయలేకపోయారు. అకాలవర్షాలు కారణంగా అరకొర నాట్లు పూర్తిచేసిన రైతులకు ఈ వర్షం వరంగామారింది. ఇప్పటికే శివారు ప్రాంతాల్లోని ఆయకట్టు రైతులు వరిపై ఆశలు వదులుకుని ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించారు. అటువంటి వారికి కూడా ఈ వర్షం ఎంతో ఊతమిచ్చింది. నిత్యం విద్యుత్‌కోతలతో ఉక్కిరిబిక్కిరి అయిన అన్నదాతలకు మరింత మేలు చేకూరింది. వ్యవసాయ పంపుసెట్లు ఆధారంగా వరి నాట్లు పూర్తి చేసిన రైతులు ఈ వర్షాన్ని రూపాయిల వర్షంగా అభివర్ణించారు. ఉక్కపోత, విద్యుత్‌కోతతో సతమతమైన పౌరులకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. ఒక్కసారి వాతావరణం చల్లబడడంతో సామాన్యులు సైతం ఊపిరి పీల్చుకుంటున్నారు. మెట్ట ప్రాంత రైతాంగం కూడా వేరుశెనగ, మొక్కజొన్న, కంది వంటి వాణిజ్య పంటలు సాగు చేసే రైతుల పాలిట కురిసిన వర్షం కల్పతరువుగా మారిందని వారంతా సంబరపడుతున్నారు. దిగుబడి అధికంగా ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం పట్టణంలో ఆర్టీసి కాంప్లెక్సు, రిమ్స్‌లతోపాటు వివిధ ప్రధాన రహదారుల్లో నీరు పొంగిపొర్లింది. ప్రయాణికులు, రోగులు అనేక అవస్థలకు గురయ్యారు.
ఉద్యమ రూపంలోనే సంపూర్ణ అక్షరాస్యత
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, సెప్టెంబర్ 8: జిల్లాలో అక్షరాస్యతా కార్యక్రమం ఉద్యమరూపం వహించాలని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ పిలుపునిచ్చారు. 46వ అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని బి.ఆర్.అంబేద్కర్ ఆడిటోరియంలో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరక్షరాస్యతా శాపం నుండి విముక్తి కలగాలన్నారు. జిల్లాలో 6.80 లక్షల మంది నిరక్షరాస్యులుగా ఉన్నారని చెప్పారు. సాక్షర భారత్ రెండోదశ కార్యక్రమం జిల్లాలో ప్రారంభమైందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి అక్షరాస్యతలో ప్రథమ స్థానంలో నిలవాల్సిన అవసరం ఉందన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఉపాధి హామీ వేతనదారులు ఇందులో ప్రధానంగా తీసుకున్నామన్నారు. ఈ విధంగా మొదటి పర్యాయం 1.10 లక్షల మందిని అక్షరాస్యులుగా చేస్తామని చెప్పారు. జిల్లాలో 40 వేల స్వయం సహాయక సంఘాల్లో ఐదు లక్షలమంది సభ్యులు ఉన్నారన్నారు. 2013 డిసెంబర్ నాటికి సంపూర్ణ అక్షరాస్యతా సాధనకు ప్రణాళిక సిద్ధం చేశామని స్పష్టం చేశారు. అక్షరాస్యతా వలంటీర్లు, విద్యార్థులతో పాటు విద్యావలంటీర్లు అక్షరాస్యతా కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ప్రతీ విద్యావలంటీరు కనీసం పదిమందికి చదువు చెప్పాలన్నారు. రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహన్‌రావు సూచించిన విధంగా విశ్రాంత ఉద్యోగులు సేవలు పొందేందుకు వారితో సంప్రదిస్తామని కలెక్టర్ వెల్లడించారు. స్వచ్ఛంద సేవా సంస్థలు, యువజన సంఘాలు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. పల్లెకుపోదాం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో మొదటగా అక్షరాస్యతా ర్యాలీలు, సాక్షర భారత్ కేంద్రాల వరకు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. పంచాయతీ లోక్‌శిక్షాసమితిలో యువజన సంఘాలు చేరాలని సూచించారు. పైడిభీమవరానికి చెందిన ఎం.అప్పలసూరమ్మ, సోంపేటకు చెందిన ఎస్.గౌరమ్మ వంటివారు ముదురు వయసులోనే అక్షరాస్యులుగా మారి తనకు
ప్రేరణ కలిగించారని కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. మా అమ్మ కూడా తెలుగు నేర్చుకోవడం ప్రారంభించారని జిల్లా కలెక్టర్ తెలియజేస్తూ సభలో స్పూర్తిని కలిగించారు. విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌గా పనిచేసిన ఆమె ఆంగ్లం, హిందీలో మంచిపట్టు సాధించారని, తెలుగును నేర్చుకోవాలన్న కుతుహలంతో ఉన్నారని చెప్పారు. సభకు అధ్యక్షతన వహించిన ఎజెసి ఆర్.ఎస్.రాజ్‌కుమార్ మాట్లాడుతూ తెలుగేతర వ్యక్తిగా ఉన్న కలెక్టర్ ఆంగ్లపదం లేకుండా తెలుగులో మాట్లాడటం ప్రతీ ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. మహిళ అక్షరాస్యతా కుటుంబానికి వెలుగు నింపుతుందన్నారు. నూతనంగా అక్షరాస్యులుగా మారిన వారు సాక్షర భారత్ కేంద్రాల్లో పేపర్లు, పుస్తకాలు చదువుతుండాలని సూచించారు. జెడ్పీ సిఇఒ డా.పి.సుధాకరరావు మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి మహిళా కార్యక్రమాల్లోను, మహిళా అక్షరాస్యతా రాజకీయాల్లో మహిళల పాత్రపై స్పష్టంగా పేర్కొన్నారని గుర్తుచేశారు. డిఆర్‌డిఏ పిడి రజనీకాంతరావు మాట్లాడుతూ 40 వేల సంఘాల్లో ఐదులక్షల మంది సభ్యులు ఉన్నారన్నారు. సంఘాల్లో ప్రతీ ఒక్కరూ అక్షరాస్యులుగా మారితే వారి రికార్డులు సక్రమంగా నిర్వహించే అవకాశం ఉంటుందన్నారు. రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహన్‌రావు మాట్లాడుతూ అక్షర దానం, రక్తదానం, నేత్రదానం ఎంతో ముఖ్యమైందన్నారు. జిల్లాలో ప్రతీ ఏడాది 35 వేల రక్తయూనిట్లు అవసరమని, పదివేల యూనిట్లు మాత్రమే రక్తదాన శిబిరాల ద్వారా లభ్యమవుతున్నాయని తెలిపారు. జిల్లాలో 146 నేత్రాలు సేకరించామని, తద్వారా 286 మందికి ప్రపంచాన్ని చూసే భాగ్యం కలిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్య శాఖ ఉపసంచాలకులు కె.నాగేశ్వరరావు, డ్వామా పిడి కల్యాణచక్రవర్తి, డిఇఒ అరుణకుమారి, డిప్యూటీ డిఇఒ మల్లేశ్వరరావు, రాజీవ్ విద్యామిషన్ పిఒ నగేష్, సాంఘిక సంక్షేమశాఖ ఉపసంచాలకులు అచ్యుతానందగుప్త, బిసి సంక్షేమాధికారిణి ఆర్.వి.నాగరాణి లు మాట్లాడారు. తొలుత పాతబస్టాండు వద్ద నుంచి అదనపు జాయింట్ కలెక్టర్ ఆర్.ఎస్.రాజ్‌కుమార్ అక్షరాస్యతా శోభాయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి అంబేద్కర్ ఆడిటోరియం వరకు శోభాయాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో సాక్షర భారత్ మండల , గ్రామ సమన్వయకర్తలు, అక్షరాస్యులుగా మారిన అభ్యర్థులు పాల్గొన్నారు.
బొమ్మాళి.. వదలా!
టెక్కలి, సెప్టెంబర్ 8: నేటి ఆధునిక ప్రపంచంలో శ్రాస్త విజ్ఞానం పోటీతత్వంతో దూసుకుపోతోంది. విద్యా, వైజ్ఞానిక, ఆర్థిక, అభివృద్ధి రంగాల్లో మానవ పరిజ్ఞానం ముందుకుసాగుతోంది. అయితే నేటికి మూఢనమ్మకాల ముసుగులో సర్వం కోల్పోయి ఉన్నఊరుకు దూరంగా కాలం గడుపుతున్న వారున్నారంటే ఆశ్చర్యం కలుగకమానదు. మూఢనమ్మకాలు ప్రాణాలను సైతం బలిగొన్నాయంటే నేటి శాస్ర్తియ పరిజ్ఞానంపై ప్రజలకున్న అవగాహన ఏమిటో తెలుస్తుంది. నిజమే నమ్మరాని నిజాలు మన చుట్ట్టూ ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఇటువంటి మూఢనమ్మకాలతో కాలగర్భంలో కలసిన ఈ గ్రామ పరిస్థితి ఇది.
బతకడం కోసం మరో ప్రదేశానికి వలసలు వెళ్లి ఖాళీ అయిన గ్రామాలను చూసి ఉంటాం. కాని దెయ్యాలు, భూతాలు ఉన్నాయంటూ గ్రామానికి గ్రామమే లేకుండా పోయిందంటే ఆశ్చర్యపడక తప్పదు. టెక్కలి మండలంలో నర్సింగపల్లి పంచాయతీ అక్కవరంసీతాపురం గ్రామాన్ని పరిశీలిస్తే పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తాయి. ఈ గ్రామం పంచాయతీ పరిధిలోని మ్యాప్‌లో నిక్షిప్తమై ఉన్నా ఈ గ్రామంలో ఏ ఒక్కరు నివాసం ఉండరు. ప్రస్తుతం ఈ గ్రామానికి వెళ్తే పూర్తిగా భూస్థాపితమైన రెండు మూడు నివాసాలు తప్పా మరొకటి కనిపించదు. గతంలో అక్కవరంసీతాపురం గ్రామంలో కొంత మందికి తెలియని వ్యాధిసోకి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారని అప్పటి నుండి గ్రామానికి ఏదో భూతం ఆవహించిందని మరికొందరు కూడా ఆ భయానికి మంచం పట్టారని గ్రామంలో ఉంటే తమను కూడా బలి తీసుకుంటుందన్న పుకారు గ్రామస్థుల్లో బలంగా నాటుకుపోయింది. మరోపక్క
చుట్టు పక్కల ఉండే గ్రామాల ప్రజలు ఈ వార్తలతో భయపడి ఆ గ్రామ వాసులను వెలివేశారు. దీంతో ఈ గ్రామంలో ఉన్న ప్రజానీకం భయభ్రాంతులకు గురై ఉన్న ఊరిని విడిచి దూరప్రాంతాలకు వలసపోయారు. కాని ఒక అవ్వ మాత్రం గ్రామంలో ఒక పూరె గుడిసెలో ఉండేదని, ప్రస్తుతం ఆమె కూడా గత కొద్ది నెలల కిందట మృతి చెందిందని చుట్టు పక్కల గ్రామాల ప్రజలు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ గ్రామంలో ఉండే నివాసాలు మట్టిలో కలసి పోయి చుట్టూ మొక్కలు మొలిచి వన ప్రాంతంగా మారింది. గ్రామానికి చెందిన వారు వివిధ ప్రాంతాల్లో నివాసముంటున్నా, వారి ఆస్తులు ఇక్కడే ఉన్నా ఈ ప్రాంతానికి రావడానికి వారు సాహసించడం లేదు. గ్రామంలో భూతం ఆవహించిందని, వెళ్లకపోవడమే మంచిదనే అభిప్రాయంలో ఉన్నట్లు పరిసర గ్రామాల ప్రజలు చెబుతున్నారు.
కిడ్నీ రోగులను ఆదుకోండి
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, సెప్టెంబర్ 8: జిల్లాలోని ఉద్దానం ప్రాంతమైన కంచిలి, కవిటి, సోంపేట, పలాస, వజ్రపుకొత్తూరు, ఇచ్ఛాపురం మండలాల ప్రజలను కిడ్నీవ్యాధుల నుండి ఆదుకోవాలని దేశ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు శ్రీకాకుళం ఎంపి కిల్లి కృపారాణి విజ్ఞప్తి చేశారు. శనివారం ఉదయం ప్రధాని కార్యాలయంలో ఎంపి కృపారాణి డాక్టర్ సెల్ అధ్యక్షుడు కిల్లి రామ్మోహనరావులతో ఆయనను కలిసి ఉద్ధానం ప్రాంతంలో కిడ్నీవ్యాధులతో అక్కడ జనం పడుతున్న బాధలను వివరించారు. ఈ వ్యాధులకు సంబంధించి ప్రతీ సంవత్సరం శ్రీకాకుళం రిమ్స్‌లో నెప్రాలజీ కేసులు వెయ్యికు పైగా నమోదు అవుతున్నాయని, డయాలసిస్ కేసులు 900కు పైగా రికార్డవుతున్నాయని వివరించారు. కిడ్నీ వ్యాధులు 60 శాతం దేశంలో సగటు ఉంటే ఒక్క ఉద్దానం ప్రాంతంలో 20 శాతం నమోదవుతున్నాయన్న విషయాన్ని ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రతీ నెలా ఆ ఆరు మండలాల నుండి సగటు ఆరు నుంచి ఏడుగురు కిడ్నీవ్యాధితో బాధపడుతున్నారని, అంతేకాకుండా 12 సంవత్సరాల లోపు చిన్నారులు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్న విషయాన్ని తెలియజేశారు. ముఖ్యంగా గ్రామీణ మంత్రిత్వ శాఖ నుండి మంచినీటి కోసం ఉద్దానం ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఆయా మండలాల ప్రజలను కిడ్నీవ్యాధుల నుండి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ సందర్భంగా 1950లో ఏర్పాటు చేసిన శ్రీకాకుళం జిల్లా నేటివరకు వెనుకబడిన జిల్లాగానే ఉందని వివరించారు. శ్రీకాకుళం పట్టణం జిల్లా కేంద్రంగా ఉన్నప్పటికీ మానవాళి మనుగడకు అవసరమైన సాధారణ వసతులు, రోడ్లు, డ్రైనేజీ సెంట్రల్ లైటింగ్ లేదన్న విషయాలను కూడా ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లాలోని ఆమదాలవలస, నరసన్నపేట, పలాస, టెక్కలి, ఇచ్ఛాపురం వంటి పట్టణాలకు ఎటువంటి వౌళిక వసతులు లేక ప్రజలు తీవ్రమైన అవస్థలకు గురవుతున్నారని, సాధారణ వౌలిక వసతులు కల్పనకు శ్రీకాకుళం పట్టణానికి జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం, పురా నుండి అదనపు నిధులు మంజూరుచేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాలకు, పల్లెలకు కలుపుతూ పిఎంజిఎస్‌వై నిధులు నుండి రోడ్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ నిధులను మంజూరు చేసినట్లయితే జిల్లా సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని ప్రధానమంత్రికి వివరించగా ఆయన సానుకూలంగా స్పందించి నిధులు మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు ఎం.పి కృపారాణి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
పోలీసు అభ్యర్థుల సర్ట్ఫికేట్ల పరిశీలన
ఎచ్చెర్ల, సెప్టెంబర్ 8: ఇటీవల జరిగిన పోలీసు ఎంపికల్లో శ్రీకాకుళం జిల్లా నుండి ఎంపికైన 1165 మంది అభ్యర్థుల సర్ట్ఫికేట్లను ఈ నెల 11 నుంచి 13వ తేదీవరకు పరిశీలిస్తున్నట్లు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కె.వి.వి.గోపాలరావు ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ఎ.ఆర్.గ్రౌండ్స్‌లో ఉదయం పదిగంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఎంపికైన అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్ట్ఫికేట్లతో హాజరు కావాలని సూచించారు. సివిల్, ఎఆర్, ఎపిఎస్‌పి, ఎసిఆర్, సిపిఎల్, ఎస్‌పిఎఫ్, ఫైర్‌మెన్‌కు ఎంపిక కాబడిన అభ్యర్థులు విధిగా హాజరు కావాలని వెల్లడించారు. పై తేదీల్లో హాజరైన అభ్యర్థులకు రెండు అటెస్టేషన్ ఫారాలు అందజేస్తామని చెప్పారు. వారు ఆయా ఫారాలు సర్ట్ఫికేట్ల పరిశీలన సమయంలో లేదా ఈ నెల 14వ తేదీలోగా ఎఆర్ గ్రౌండ్స్‌లో కార్యాలయానికి అందించాలని ఎస్పీ సూచించారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
శ్రీకాకుళం(రూరల్), సెప్టెంబర్ 8: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తున్నామని పిఆర్‌టియు రాష్ట్ర అధ్యక్షుడు పి.వెంకటరెడ్డి అన్నారు. పి.ఆర్.టి.యు జిల్లా శాఖ 23వ కౌన్సిల్ సమావేశం ఆర్ట్స్ కళాశాల సిల్వర్ జూబ్లీ ఆడిటోరియంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ 398 మంది ఉపాధ్యాయుల రెగ్యూలర్‌కు సంబంధించి త్వరలో జీవో రానున్నట్లు తెలిపారు. ఏది సాధించాలన్నా పిఆర్‌టియు సంఘం నుంచే సాధ్యమన్నారు. తెలుగు పండిట్లకు సంబంధించి ఐదువేల పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని, అలాగే పిఇటిలను స్కూల్ అసిస్టెంట్ కేడర్‌కు పెంచాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలియజేశారు. మూడు డిమాండ్లకు త్వరలో జీవో జారీ కానున్నట్లు తెలిపారు. ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ తదితర అంశాలపై ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు కీలకపాత్ర వహించారన్నారు. ఉద్యోగులందరికీ హెల్త్‌కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేసినట్లు స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల అకౌంట్లన్నీ జిల్లా ట్రెజరీ ఆఫీస్‌ల వద్ద ఉండాలని సూచించారు. అంతర్ జిల్లా బదిలీలకు ప్రయత్నం చేస్తున్నామని, సీనియర్ ఉపాధ్యాయులకు న్యాయం జరగాలన్నారు. బదిలీల్లో అందరికీ లాభం చేకూరే విధంగా పి.ఆర్.టి.యు కృషి చేసిందని చెప్పారు. కంట్రిబ్యూటరీ పింఛను విధానం రద్దుచేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు మెడికల్ రీయింబర్స్‌మెంట్ వర్తింపజేయాలన్నారు. ప్రతీ ప్రాథమిక పాఠశాలలో హెచ్.ఎం. పోస్టులు మంజూరు చేయాలని, అందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఎమ్మెల్సీలు కె.జనార్ధనరెడ్డి, గాదె శ్రీనువాసులనాయుడులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షులు బైరి అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.రవీంద్ర, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బి.పోలీసు, ఉప విద్యాశాఖాధికారి కొత్తకోట అప్పారావు, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ జి.యోగానంద్, జిల్లా ప్రధాన కార్యదర్శి వి.హరిశ్చంద్రుడు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వరహాలనాయుడు, ఎ.సూర్యనారాయణ, వై.్భస్కరరావు, ఎన్.శరత్‌బాబు, రవికుమార్, రాజశేఖరరావు, వై.బి.ఎస్.ప్రసాదరావు, జి.దుర్గారావు, భాస్కరరావు, రమేష్‌కుమార్, బాబూరావు, ఎస్.కృష్ణమూర్తి, ఆర్.అప్పలనర్సయ్య, జి.వేణుగోపాలరావు, ఎస్.రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను, ఉత్తమ సేవలందించి పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులను సన్మానించారు.
అగ్రికెమ్‌ను శాశ్వతంగా
మూసేవరకు పోరాటం
* మాజీ మంత్రి తమ్మినేని
ఎచ్చెర్ల, సెప్టెంబర్ 8: పరిసర గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే నాగార్జున అగ్రికెమ్ రసాయనిక పరిశ్రమను శాశ్వతంగా మూసేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని మాజీ మంత్రి తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. శనివారం చిలకపాలెం శివాలయంలో అగ్రికెమ్ పోరాట కమిటీ ప్రతినిధులు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులు ఈ నెల 11న హైదరాబాద్‌కు రావాలని ఆహ్వానించడంపై వీరంతా కార్యాచరణ రూపొందించుకున్నారు. పోరాట కమిటీ ప్రతినిధులంతా రాష్ట్ర రాజధానికి పయనమయ్యేందుకు సమీక్షించారు. 15 గ్రామాలకు చెందిన నాయకులు 20 మందితో కలసి హైదరాబాద్ పయనం కావాలని నిర్ణయించారు. కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారుల వద్ద పరిశ్రమను శాశ్వతంగా మూసివేయాలని, కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని, సమీప గ్రామాలలో ప్రజాభిప్రాయాలను సేకరించాలన్న డిమాండ్లను వినిపించాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా దేశం అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, మాజీ జెడ్పీటిసి సనపల నారాయణరావు, స్వామి శ్రీనివాసానంద, మాజీ సర్పంచ్లు, ఎం.మురళీధర్‌బాబా, చిలక రాము, గట్టెం రాములు, బిజెపి జిల్లా కార్యదర్శి సువ్వారి వెంకటసన్యాసిరావు, సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కలిశెట్టి అప్పలనాయుడు, అంబటి శ్రీనివాసరావు, డొంక అప్పలరాజు, డొంక రమణ, కూన రామం, గాడు నారాయణరావు, చిలకగోవిందరావు తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా సుదర్శనయాగం
ఎచ్చెర్ల, సెప్టెంబర్ 8: శ్రీ వైష్ణవ కృష్ణాష్టమిని పురస్కరించుకుని మండలంలోని కేశవరావుపేట పంచాయతీ కింతలిమిల్లు సమీపాన ఉన్న శ్రీరంగనాధ ఆశ్రమంలో కొలువైన శ్రీ కల్యాణవేంకటేశ్వర స్వామిసన్నిధిలో శనివారం వైభవంగా సుదర్శనయాగం సాగింది. ఈ సందర్భంగా స్వామివారికి భక్తులు సహస్రఘటాభిషేకాన్ని కన్నులపండువగా నిర్వహించారు. సామూహిక విష్ణుసహస్త్ర నామస్తోత్ర పారాయణం గావించారు. అత్యంత వైభవంగా వేదపండితులు సుదర్శనయాగాన్ని నిర్వహించారు. శ్రీకృష్ణ జననం ఉపన్యాసాన్ని భక్తులకు పొన్నాడ మధుసూధనరావు ఉపన్యసించారు. బాలకృష్ణునికి ఊయల సేవ మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. మంగళాశేసనం, తీర్ధగోష్టి, ప్రసాదవినియోగం చేపట్టారు. ఉదయం ఆరుగంటల నుంచి స్వామి సన్నిధిలో భక్తులు సందడి నెలకొంది. ఆలయ ధర్మకర్త గురుగుబెల్లి జగన్నాధస్వామి, శ్రీమాన్ భాష్యం రాఘవాచార్యులు నేతృత్వంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. కేశవరావుపేట మాజీ సర్పంచు పైడి భాస్కరరావు, పైడి రామన్న, పలువురు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నేత్రదానంతో కళ్లు సజీవం
శ్రీకాకుళం(రూరల్), సెప్టెంబర్ 8: నేత్రదానం వల్ల మరణానంతరం కూడా కళ్లు సజీవంగా ఉంటాయని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ అన్నారు. నేత్రదాన పక్షోత్సవ ముగింపు కార్యక్రమం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం వద్ద శోభాయాత్రను కలెక్టర్‌ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శోభాయాత్రలో కలెక్టర్ పాల్గొంటూ నేత్రదానంపై అవగాహన కలిగించారు. వైద్యులు, విద్యార్థులు, ప్రజలు శోభాయాత్రలో పాల్గొని సర్వేయాంద్రియానం, నయనం ప్రధానం అంటూ నినాదాలు చేస్తూ ప్రజలను చైతన్య పరిచారు. మంత్రి వెంకటస్వామి నేత్రదానంపై నినాదాలు ముద్రించిన ప్రత్యేక దుస్తులను ధరించి ఆకర్షణీయంగా నిలిచింది. నేత్రదానం చేసేందుకు ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోను నేత్రదానంపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు చర్యలు చేపడతామన్నారు. నేత్రదానం ప్రజాఉద్యమంగా కొనసాగాలని సూచించారు. నేత్రదానం చేసేందుకు ముగ్గురు జిల్లా అధికారులు ముందుకు రావడంపై ఆయన ప్రశంసించారు. అనేక గ్రామాల నుండి నేత్రదానానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. జిల్ల అంధత్వ నివారణ సంస్థ జిల్లా ప్రాగ్రామ్ అధికారి డా.ఎం.వి.రమణకుమార్ మాట్లాడుతూ గత నెల 25వ తేదీ నుండి నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మండల, గ్రామస్థాయిలో శోభాయాత్రలు, సమావేశాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ ఎం.శారద, రెడ్‌క్రాస్ సంస్థ చైర్మన్ పి.జగన్మోహన్‌రావు, క్షేత్రప్రచారాధికారి డా.కొండలరావు, ఇంటాక్ సమన్వయకర్త దూసి ధర్మారావు, ఎన్‌జిఒ సంఘ అధ్యక్షుడు హనుమంతు సాయిరాం, జెసిఐ అధ్యక్షులు పాలిశెట్టి మధుబాబు, ఎలియన్స్ క్లబ్ ప్రతినిధి హనుమంతు మురళీ, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ దవళ భాస్కరరావు, యోగాగురు రామారావు, పైడితల్లి, విజయనర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.
జాబ్‌కార్డుదారులందరికీ వందరోజుల ‘ఉపాధి’
ఎచ్చెర్ల, సెప్టెంబర్ 8: ఉపాధి హామీ పథకం వర్తింపజేస్తూ జాబ్‌కార్డులు అందజేసిన వారందరికీ వందరోజులు పని కల్పించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కల్యాణచక్రవర్తి తెలిపారు. స్థానిక టిటిడిసిలో క్షేత్రసహాయకుల శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు సూచనలు అందించారు. వచ్చే ఏడాది పనుల నిర్వహణకు గాను ఈ నెలాఖరు నుంచే గ్రామాల్లో పనులను గుర్తిస్తామన్నారు. ప్రతీ శనివారం క్షేత్రసహాయకులు గ్రామాల్లోకి వెళ్లి వేతనదారుల నుంచి పనుల కోసం వినతులు స్వీకరించాలన్నారు. ఆన్‌లైన్ ద్వారానే చెక్కు మెజర్‌మెంట్, చెల్లింపులు వంటి ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. పది కేంద్రాల్లో పనులు ప్రణాళికపై క్షేత్రసహాయకులకు శిక్షణను అందిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది కొత్తగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను ఉపాధి హామీపథకంలో చేపడతామన్నారు. గత ఏడాది 3.10 లక్షలు కుటుంబాలకు ఉపాధి కల్పించామని, 78 వేల కుటుంబాలకు వందరోజుల పని కల్పించినట్లు తెలిపారు. ప్రతీ కుటుంబానికి వంద రోజుల పని కల్పించాలని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. మత్స్యకార గ్రామాలకు చెందిన జాబ్‌కార్డుదారులు సమీప గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉపాధి పనుల్లో భాగస్వామ్యమై ఉపాధి పొందాలని సూచించారు. ఈయనతోపాటు ఎపిడి ఎం.శైలజ, అప్పలసూరి, రిసోర్సు పర్సన్లు స్వర్ణకుమారి, సత్యమూర్తిలు ఉన్నారు.
నిరాశలో వేరుశనగ రైతు
జలుమూరు, సెప్టెంబర్ 8: మెట్ట ప్రాంతాల్లో ఈ ఏడాది వేసిన వేరుశెనగ అధిక దిగుబడిని ఇస్తుందని ఆశించిన రైతుకు అకాలంగా కురిసిన చిన్నపాటి వర్షాలు నిరాశకు లోనుచేసాయని పలువురు రైతులు దిగులు చెందుతున్నారు. గతంలో ఎకరాకు పది నుండి 12 బస్తాల వరకు దిగుబడి వచ్చిందని, నేడు ఆరు బస్తాల వరకు దిగుబడి తగ్గిపోతుందని యలమంచిలి, సవిరిగాం, పాగోడు, రావిపాడు తదితర పంచాయతీ పరిధి రైతులు స్పష్టం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో సాగైన వేరుసెనగ పంట పదుల సంఖ్యలో దిగింది. ఎకరాకు 20 కిలోల విత్తనాలు వేసి నాలుగు తడుపులు అందించి చీడపీడల నివారణకు అధికారుల సూచనల మేరకు పాటించి సాగుచేస్తే మంచి దిగుబడి వచ్చిందని వారు తెలిపారు. బయట మొక్కలు చూస్తే దట్టంగా ఎంతో దిగుబడి వస్తుందనే ఆశ కలిగించిందని, కాని వర్షం తమ పొట్టకొట్టిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక మొక్కకు పది నుండి 20 కాయలు, గుత్తులు, గుత్తులుగా దిగుబడి వచ్చేదని, నేడు మొక్కకు కాపు తగ్గడంతో పాటు పిందెలు, పిందెలుగా మిగిలాయని రైతులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా పంటసాగుపై ఆసక్తి తగ్గడానికి అడవి పందులే కారణమని పలువురు రైతులు వాపోతున్నారు. పంటలో సగభాగము పందుల వల్లే నాశనమవుతున్నందున ఈ ఏడాది వందలాది ఎకరాల్లో పంటను వేయలేదని పలు గ్రామాల రైతులు చెబుతున్నారు.
పెరుగుతున్న డయేరియా రోగులు
సారవకోట, సెప్టెంబర్ 8: మండలంలో కొత్తూరు గ్రామంలో గురువారం వెలుగుచూసిన డయేరియా శుక్రవారం సరికి ఉధృతరూపం దాల్చిన విషయం తెలిసిందే. శనివారం మరో ఇద్దరు డయేరియాతో స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో చేరారు. తొలుత దీనిపై స్పందించిన పంచాయతీ విస్తరణాధికారి వెంకటరాజు, గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రభాకరరావులు గ్రామాన్ని సందర్శించి హరిజనవాడ వద్ద పేరుకుపోయిన మురికినీరు తొలగించడానికి డ్రైనులలో నిలువ ఉన్న చెత్తను తొలగించడానికి శ్రీకారం చుట్టారు. ఇంతవరకు నిధులు లేవంటూ చెప్పిన అధికారులు పరిస్థితి విషమించడంతో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టడం గమనార్హం. కాగా రెండు నెలలుగా వినియోగించని బ్లీచింగ్ బస్తాలను బయటకు తీసి బావులను క్లోరినేషన్ చేయించారు. బుడితి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తారని సిబ్బంది శనివారం ఉదయం నుండి గ్రామంలో హడావుడి చేశారు. వైద్యాధికారులు కానరాకపోవడంతో చివరకు మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక వైద్యాధికారి జి.సదాశివ తన సిబ్బందితో హాజరై వైద్య పరీక్షలు నిర్వహించారు. తహశీల్దార్ జన్ని రామారావు గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామానికి చెందిన జర్జాన సమీర్ అనే బాలుడు తీవ్రస్థాయిలో డయేరియా వ్యాధికి గురికావడంతో ట్రాలీబండిపై స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆ తదుపరి చుక్క అప్పారావు కూడా చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. ఇలా మూడవ రోజు కూడా ఒకరి తరువాత ఒకరు డయేరియాతో ఆసుపత్రికి క్యూ కడుతుండడంతో ప్రజలు భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరిగినా క్షేత్రస్థాయి వైద్య సిబ్బంది మాత్రం గ్రామంలో డయేరియా పూర్తిగా అదుపులోకి వచ్చిందని చెప్పడం కొసమెరుపు.