Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

వర్షంలోనూ మంత్రి గంటా సుడిగాలి పర్యటన

$
0
0

కశింకోట, సెప్టెంబర్ 14: మండలంలోని జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం వర్షంతోనే సుడిగాలి పర్యటన చేశారు. కొత్తపల్లి, బుచ్చెయ్యపేట, పేరంటాలపాలెం గ్రామస్థులతో మంత్రి గంటా ముఖాముఖీగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొంతమంది స్థానికలు పలు సమస్యలను మంత్రి ఎదుట ఏకరవు పెట్టారు. హౌసింగ్ స్కీంలు ఇవ్వడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందన్నారు. రోడ్లు, డ్రైనేజీలు లేవని, మట్టిరోడ్ల్లపైనే నడవ వలసి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కువమంది తమకు రేషన్‌కార్డులు లేవని, ఉన్నవి రద్దు చేశారని, అలాగే పింఛన్లు సరిగ్గా ఇవ్వడం లేదని, అర్హులైన తమకు పింఛన్లు అధికారులు మంజూరు చేయడం లేదని వృద్దులు మంత్రి ఎదుట ఏకరవు పెట్టారు. దీంతో మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు. అలాగే హౌసింగ్ స్కీంలో అవకతవకలు లేకుండా మంజూరు చేయాలన్నారు. రేషన్‌కార్డులు అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని, పింఛన్ల్లకు నూతనంగా దరఖాస్తు చేసుకున్నవారికి కూడా త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి గంటా ఆదేశించారు. అయితే గ్రామస్థులు వర్షంలో ఉన్నా మంత్రికి గొడుగు ఉండటంతో ‘మీతో-మేము’ కార్యక్రమం సాఫీగా సాగింది. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌పార్టీ నాయకులు విశాఖ డెయిరీ డైరెక్టర్ మలసాల రమణారావు, కాయల మురళీధర్, ఉగ్గిన రమణమూర్తి, నిమ్మదల సన్యాశినాయుడు, మలసాల కుమార్‌రాజా, మజ్జి ప్రసాదరావు, గొంతిన గంగాధర్, తిర్రునూకునాయుడు, అద్దంకి సతీష్, కర్రి సత్యనారాయణ పాల్గొన్నారు.

అన్‌రాక్ కార్మికులు నిర్వాసితుల సమస్యలపై
ప్రభుత్వం తక్షణం స్పందించాలి
* దేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు అయ్యన్నపాత్రుడు
మాకవరపాలెం, సెప్టెంబర్ 14: అన్‌రాక్ కార్మికులు, నిర్వాసితుల సమస్యలపై ప్రభుత్వం తక్షణం స్పందించకుంటే నిరవధిక ఆందోళన చేస్తామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఈమేరకు మండలంలోని రాచపల్లి సమీపంలోగల కామేశ్వరమ్మ ఆలయం వద్ద శుక్రవారం అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వాసితులు, కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్‌రాక్ కర్మాగారం నిర్మాణం కోసం ఈ ప్రాంతంలో రైతుల నుంచి భూసేకరణ చేసి ఇప్పటికి నాలుగు సంవత్సరాలు కావస్తున్నా నిర్వాసితులకు పూర్తిస్థాయిలో ప్యాకేజీ ఇవ్వలేదన్నారు. అలాగే కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయలేదని, పి.ఎఫ్. , ఇ.ఎస్.ఐ. వంటి సౌకర్యాలు కూడా అమలు చేయలేదని ఆరోపించారు. గతంలో దీనిపై ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చలు చేసినప్పుడు ఈ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కాని ఇప్పటివరకు వాటిని పరిష్కరించలేదన్నారు. రాచపల్లి గ్రామానికి సమీపంలో అన్‌రాక్ రిఫైనరీ పెద్దపెద్ద చెరువుల తవ్వకాలు చేయడం వలన సమీప గ్రామాలకు మంచినీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. భారీగా చెరువులు లోతుగా తవ్వకాలు జరపడం వలన గడిచిన నాలుగు నెలలుగా ప్రజలు మంచినీటి జలాలు అడుగంటి ఇబ్బందులు పడుతున్నారన్నారు. చెరువుల నిర్మాణంపై జాయింట్ కలెక్టర్, అఖిలపక్షాల ఆధ్వర్యంలో కమిటీ వేసి చెరువుల నిర్మాణాలు సక్రమంగా జరుగుతున్నాయా, లేదా అని 15 రోజులకోసారి నిర్మాణ పనులు పరిశీలించాలన్నారు. ఈనెల 17వ తేదీన కార్మికులు, నిర్వాసితుల సమస్యలపై స్థానిక తహశీల్దార్ కార్యాలయంవద్ద ఆందోళన చేస్తామని, దీనిపై స్పందించకుంటే ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన చేపడతామని, అయినప్పటికీ స్పందించకుంటే రిఫైనరీ ప్రాంతంలో నిరవధిక ఆందోళన చేస్తామని అయ్యన్న హెచ్చరించారు. ఈ సమావేశంలో దేశం పార్టీ మండలాధ్యక్షుడు రుత్తల శేషుకుమార్, సి.పి. ఐ.నాయకుడు పాలపర్తి తాతబ్బాయి, బాలేపల్లి వెంకటరమణ, బి.జె.పి. జిల్లా యువమోర్చా కార్యదర్శి నగిశెట్టి గంగబాబు, సి. ఐ.టి.యు. నాయకుడు వనుం శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఐస్‌గెడ్డ జలపాతం పరవళ్ళతో పరవశం
సీలేరు : సీలేరు సమీపంలో ఉన్న ఐస్‌గెడ్డ జలపాతాలు ఉరక లేస్తుండడంతో పర్యాటకుల మనస్సులు దోచుకుంటున్నాయి. జి.కె.వీధి మండలం సీలేరు ప్రధాన రహదారిలో జలపాతాలు ఇటీవల ఏకధాటిగా వర్షాలు కురుస్తుండడంతో ఎతె్తైన కొండల పైనుంచి జాలువారే జలపాతాలు కిందకు రావడంతో ఆ దృశ్యాలను చూసేందుకు సందర్శకులు వస్తున్నారు. ఈ సుందర దృశ్యాలను గతంలో ప్రభుత్వ అధికారులు పరిశీలించి జి.కె.వీధి మండల ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా రూప కల్పన చేసేందుకు అనేకసార్లు సర్వేలు నిర్వహించారు. సర్వేలు నిర్వహించిన అధికారులు వాటి అమలుకు ఈరోజు వరకు స్పందించలేదు. సీలేరు ఐస్‌గెడ్డ జలపాతాల వద్ద సందర్శకులు వచ్చేటప్పుడు కనీస ఉండేందుకు షెల్టర్ కూడా లేకపోవడంతో వర్షంలోనే సందర్శకులు వాటిని తిలకిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా రూపకల్పన చేసి పర్యాటకులకు దోహదపడతారని గిరిజనులు కోరుతున్నారు.

అరకు అందాలు అద్భుతం
* కార్మిక శాఖ కమిషనర్ రామాంజనేయులు
అరకులోయ, సెప్టెంబర్ 14: అరకులోయ పరిసర ప్రాంతాల అందాలు అద్భుతమని రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ రామాంజనేయులు పేర్కొన్నారు. కుటుంబ సమేతంగా అరకులోయను ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా తన ను కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ప్రకృతి ప్రసాదించిన అందాలతో పాటు చల్లని వాతావరణంతో కూడుకుని ఉండే అరకులోయ అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు. ఈ ప్రాంతం ప్రకృతి దృశ్యాలు తనను మంత్రముగ్ధులని చేసినట్టు ఆయన చెప్పారు. కొడాయికెనాల్, కాశ్మీర్, డెహ్రాడూన్, ఊటీ అందాలకు దీటుగా అరకులోయ అందాలు ఉన్నాయని ఆయన కొనియాడారు. విశాఖ మహా నగరపాలక సంస్థ కమిషనర్‌గా పనిచేసినప్పుడు అరకులోయను సందర్శించాలని ఎన్నోసార్లు అనుకున్నప్పటికీ పని ఒత్తిడి వలన సందర్శించ లేకపోయినట్టు ఆయన చెప్పారు. తన కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఈ ప్రాంతాన్ని సందర్శించి అరకులోయ అందాలను తిలకించడం అదృష్టంగా బావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. అరకులోయను పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పర్యాటకుల తాకిడి అధికంగా ఉండే ఈ ప్రాంతంలో ఇం డోర్ స్టేడియంతో పాటు ఔట్‌డోర్ స్టేడియం నిర్మాణం చేపడితే మరింతమంది పర్యాటకులు అరకులోయకు వచ్చే అవకాశం ఉందని రామాంజనేయులు అభిప్రాయపడ్డారు. అంతకుముందు కుటుంభ సభ్యులతో కలిసి ఆయన పద్మాపురం ఉద్యానవన కేంద్రాన్ని సందర్శించి టాయి ట్రైన్‌లో విహరించారు. స్థానిక గిరిజన సాంస్కృతిక మ్యూజియంలో పొందుపరిచిన గిరిజన కళాకృతులను తిలకించారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి కె.శ్రీకాంత్ ప్రభాకర్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

తండ్రీకొడుకుల మృతి
నర్సీపట్నం, సెప్టెంబర్ 14: పట్టణ పొలిమేర్లలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండేళ్ళ కుమారుడితోసహా తండ్రి దుర్మరణం చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భార్య తీవ్రగాయాలతో బయటపడింది. తండ్రీకొడుకులిద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో ఆసుపత్రి ఆవరణ బంధువుల రోదనలతో తీవ్ర విషాదం నెలకొంది. పలువురిని కంట తడిపెట్టించిన ఈ ప్రమాద సంఘటన వివరాలిలా ఉన్నాయి. గొలుగొండ మండలం పాకలపాడు గ్రామానికి చెందిన ఎల్లేటి అప్పారావు(30) , భార్య విజయ(28),కుమారుడు పండు(2)లు కలిసి మోటారు బైక్‌పై మాకవరపాలెం మండలం గిడుతూరు గ్రామంలో ఉన్న అత్తవారింటికి బయలుదేరారు. నర్సీపట్నం సమీపంలోని నెల్లిమెట్ట వద్దకు వచ్చేసరికి నర్సీపట్నం వైపు నుండి ఎదురుగా వస్తున్న టాటా ఎ.సి వ్యాన్ బైక్‌ను ఢీకొనడంతో ముగ్గురు తూలిపడిపోయారు. ఈ ప్రమాదంలో రెండేళ్ళ పండు తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కొన ఊపిరితో ఉన్న తండ్రి అప్పారావును 108 వాహనంలో ఏరియా ఆసుపత్రికి తరలించగా, కేవలం పది నిమిషాల వ్యవధిలో మృతి చెందాడు. భార్య విజయకు గాయాలయ్యాయి. ఈమెకు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసి కెజిహెచ్‌కు తరలించారు. రోడ్డు ప్రమాదంలో అప్పారావు , రెండేళ్ళ కుమారుడు పండు మృతి చెందారనే సమాచారం తెలుసుకున్న పాకలపాడు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. మృత దేహాలను చూసి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అప్పారావుకు మూడేళ్ళ క్రితం వివాహం జరిగింది. ఇతనికి తల్లి, అత్త, మామయ్య ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అప్పారావు, పండుల మృతదేహాలను పోస్టుమార్టం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
* ఆనందంగా కొడుకు పుట్టిన రోజు జరుపుకున్న దంపతులు
అప్పారావు,విజయ దంపతుల కుమారుడు పండు రెండవ పుట్టిన రోజు గురువారం రాత్రి ఇంటి వద్ద ఆనందోత్సాహాలతో జరుపుకొన్నారు. ఇంకా పేరుకూడా పెట్టని బాబుతో కలిసి శుక్రవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. పుట్టింటికి ఎంతో సంతోషంతో వెళ్తున్న వారిని విధి వెక్కిరించింది. రెండేళ్ళ బాబుతోపాటు భర్త ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. రెండేళ్ళబాబు చనిపోయాడనే విషయం తెలియని విజయ తన కమారుడు ఎలా ఉన్నాడని అడగడం పలువురిని కంట తడిపెట్టించింది.

గిరిజనుడి దారుణ హత్య
హుకుంపేట, సెప్టెంబర్ 14: ః మండలం ఎం.గనే్నరుపుట్టు గ్రామంలో ఓ గిరిజనుడు శుక్రవారం దారుణ హత్యకు గురయ్యాడు. గనే్నరుపుట్టుకి చెందిన వంతాల సుబ్బారావు(30) తన పంట పొలానికి నీళ్లు పెడుతుండగా సమీప గ్రామమైన డూరువీధికి చెందిన కోడా మత్స్యలింగం ఆకస్మికంగా పారతో దాడిచేసి కిరాతకంగా నరికివేశాడు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన సుబ్బారావు అక్కడికక్కడే మృతి చెందాడు. సుబ్బారావును హత్య చేసిన మత్స్యలింగం మృతదేహం వద్దనే కూర్చొని ఉండగా గ్రామస్థులు ఆయనను తాళ్లతో కట్టి బంధించి పోలీసులకు అప్పగించారు. అయితే సుబ్బారావును ఎందుకు హత్య చేసింది తెలియరాలేదు. వీరిద్దరి మధ్య ఎటువంటి తగాదాలు లేవని గ్రామస్థులు చెబుతున్నారు. మత్స్యలింగం అప్పుడప్పుడు మతి స్థిమితం లేనట్టు ప్రవర్తిస్తుంటాడని, ఇందులోభాగంగానే హత్య చేసి ఉండవచ్చునని భావిస్తున్నారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి సుబ్బారావు మృతదేహాన్ని శవ పంచనామాకు తరలించారు. పాడేరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గఫూర్ ఆధ్వర్యంలో హుకుంపేట సబ్ ఇన్‌స్పెక్టర్ రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జిల్లా విలువిద్య ఎంపిక పోటీలు ప్రారంభం
పాడేరు, సెప్టెంబర్ 14: పట్టుదలతో కృషిచేస్తే సాధించలేనిది ఏదీ లేదని ఆంధ్రా యూనివర్శిటీ స్పోర్ట్స్ బోర్డ్ చైర్మన్ కె.శ్యాంబాబు అన్నారు. స్ధానిక కేంద్రీకృత ఆశ్రమోన్న త బాలుర పాఠశాలలో క్రీడా మైదానంలో జిల్లా విలువిద్య ఎంపిక పోటీల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. గిరిజన ప్రాంతంలో విలువిద్యలో పలువురు విశేష ప్రతిభ కనబరుస్తున్నారని చెప్పారు. ఈ ప్రాంత విలువిద్యా క్రీడాకారులు శక్తివంచన లేకుండా కృషి చేస్తే ఉన్నత శిఖరాలు అధిరోహించగరలని తెలిపారు. క్రీడలపై మక్కువతోపాటు సాధించాలనే తపన ఉన్నట్టయితే విజయం దానంతట అదే వరిస్తుందని ఆయన సూచించారు.
క్రీడాకారులు మనసు లగ్నం చేసి విలువిద్యను సాధన చేయాల్సి ఉంటుందని తెలిపారు. పోటీలలో సీనియర్ విభాగం నుండి ఎన్.వెంకరావు, బి.సోమరాజు, జూ నియర్ విభాగంలో సి.హెచ్.ఆర్.కె.కొండలరావు ఈనెల 22వ తేదీనుండి విశాఖలో జరుగు ఆంతర్జాతీయ విలువిద్య ర్యాం కింగ్ పోటీలలో ప్రవేశం పొందుతారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి పి.సత్యనారాయణ, పి.ఎం.ఆర్.సి. ఎ.ఎం.ఒ.కె.రాజబాబు, ప్రధానోపాధ్యాయులు జి.వి.వి.ప్రసాద్, జి.రమేష్‌బాబు, వ్యా యామ ఉపాధ్యాయులు ఎస్.సింహాచలం, టి.సద్ధు, కె.అప్పలరాజు, కె.రవికుమార్, టి.సూర్యనారాయణ, ఎస్.రాధాకృష్ణ, టి.సుబ్బారావు, టి.శివకుమార్, కె.శివప్రసాద్ పాల్గొన్నారు.

మండలంలోని జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం వర్షంతోనే సుడిగాలి పర్యటన చేశారు
english title: 
ganta

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>