శ్రీకాకుళం, సెప్టెంబర్ 14: ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు పసిగట్టే పనిలో గత కొద్ది రోజులుగా జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ పడ్డారు. తనతో ఉన్న సిబ్బందికి కూడా ఆయన ఎటువెళ్తుంది తెలియజెప్పకుండానే ఏరోజుకారోజు పర్యటనలు చేస్తున్న కలెక్టర్ శుక్రవారం గార మండలంలో అంపోలు పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసారు. గార మండల స్థాయి అధికారులకు సమాచారం లేకుండానే ఆయన ఒక్కరిగా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు డీ - వార్మింగ్ కార్యక్రమం ఆరోగ్యశాఖ చేస్తున్న తీరుతెన్నులతోపాటు, ఉపాధ్యాయులు ఆ కార్యక్రమం పట్ల ఏ విధంగా స్పందిస్తున్నారన్న విషయాలు తెలుసుకునేందుకు గుట్టుచప్పుడుకాకుండా తనిఖీలు నిర్వహించారు - అక్కడ పిల్లలకు ఇచ్చే హెల్త్‌కార్డులపై మొదటి పేజీల్లో ఉపాధ్యాయులు నింపాల్సిన కాలమ్స్ కూడా నింపలేని పరిస్థితులను గమనించిన కలెక్టర్ పిల్లల డీ-వార్మింగ్ మాటఎలా ఉన్నా ఉపాధ్యాయులకు మాత్రం డీ-వార్నింగ్ బాగా వంటపట్టింది. అసంతృప్తి, ఆవేశంతో కలెక్టర్ గురువులకు అర్ధగంటసేపు క్లాసు ఇవ్వగా, వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది పనితీరుపై నిప్పులుచెరిగారు. పాఠశాల స్థాయి పిల్లలో నెలకొనే మాల్ న్యూట్రిషన్, ఎనీమియాలను అరికట్టేందుకు గాను ఏడాదికి రెండు విడతలుగా డీ వార్మింగ్ డేను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇందులో భాగంగానే శుక్రవారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ! ఈ సందర్భంగా ఆయన పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలకు సరైన ఆటస్థలం ఉందా... అంటూ విద్యార్థులను అడిగారు. విద్యార్థులకు ఇచ్చే హెల్తు కార్డుల్లోని మొదటి పేజీలో పాఠశాల ఉపాధ్యాయులు నింపాల్సిన కాలమ్ కొన్నింటిలో ఖాళీగా ఉండడంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేసారు. ఇటు వంటి పొరపాట్లు జరగకుండా చూడాలని అక్కడి ఉపాధ్యాయులకు క్లాస్ తీసుకున్నారు. అనంతరం విద్యార్థులకు ఆల్బెండజోల్-400 మాత్రలును వేయిస్తూ తాను కూడా కొందరు విద్యార్థులకు వేసారు. విద్యార్థులతో మధ్యాహ్న భోజనాన్ని సహపంక్తిగా చేసిన కలెక్టర్ అక్కడి వంటశాలను పరిశీలించారు. వంటశాలకు పక్కా భవనంకోసం 75వేల రూపాయలును మంజూరు చేసారు. ఆదేవిధంగా 8వ తరగతి విద్యార్థులు నేలపై కూర్చుని పాఠాలు నేర్చుకుంటున్న వైనాన్ని పరిశీలించి బల్లలు ఏర్పాటుకై నిధులు మంజూరు చేస్తామన్నారు. ముందుగా పాఠశాల రికార్డులను పరిశీలించారు. సుమారు 35 లక్షల రూపాయలు నిధులతో నిర్మించే నూతన భవనాన్ని కలెక్టర్ పరిశీలించారు. మాజీ ఎం.పి.పి. గొండు రఘురాం, డైట్ ప్రిన్సుపాల్ బి. మల్లేశ్వరరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భరత్ తదితరులు ఉన్నారు. సాధారణంగా జిల్లా ఉన్నతాధికారులు పర్యటనలో కింది స్థాయి అధికారులు తప్పని సరిగా ఉం టారు. అలాంటిది జిల్లా కలెక్టర్ అంపోలు ఆకస్మిక పర్యటన మండల స్థాయి అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది. కలెక్టర్ ఆకస్మిక పర్యటన పై మండల స్థాయి అధికారులకు సమాచారం లేకపోవడంతో సమాచారం తెలుసుకున్న అధికారులు కాసింత ఉలిక్కిపాటు చెందారు.
ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు పసిగట్టే పనిలో
english title:
collector
Date:
Saturday, September 15, 2012