శ్రీకాకుళం, సెప్టెంబర్ 14: మండల యువజన అధ్యక్షులంతా సమిష్టిగా పార్టీ పటిష్ఠతకు కృషిచేయాలని వైఎస్సార్‌సిపి శాసన సభ ఉపనేత, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యుల సమావే శం నాగావళి హోటల్‌లో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుతర బాధ్యత జగన్మోహన్‌రెడ్డి అప్పగించారన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. దివంగత సిఎం వైఎస్ నిరంతరం ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకుని సమస్యల పరిష్కార దిశగా కృషిచేసారన్నారు. తనకు ఈ గౌరవం వచ్చిందంటే వై.ఎస్సే కారణమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు పుట్టగతులు ఉండవని, జగన్మోహన్‌రెడ్డిని వంచించి జైలులో పెట్టించారని ఆరోపించారు. జగన్ వంటి సమర్ధుడైన నాయకుడు కావాలన్న దృక్పథం ప్రజల్లో ఏర్పడిందన్నారు. యువజన నాయకులంతా పట్టుదలగా పనిచేయాలని, చేసినంత కాలం సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. జగన్మోహన్‌రెడ్డికి ప్రజల అభిమానం ఉందని, కార్యకర్తలంతా సం ధాన కర్తలుగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. మూడు జిల్లాల కో-ఆర్డినేటర్ బాల వజ్రబాబు మాట్లాడుతూ యువజన అధ్యక్షులంతా తమ బాధ్యతలు పూర్తిస్థాయిలో నిర్వర్తించాలన్నా రు. వైఎస్సార్‌సిపి కష్టాల్లోంచి పుట్టిన పార్టీ అని, జగన్ ముఖ్యమంత్రి అయితే వైఎస్ పాలన తిరిగి వస్తుందన్నారు. జగన్మోహన్‌రెడ్డికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. టిడిపి నామరూపాల్లేకుండా పోయిందని పేర్కొన్నారు. భవిష్యత్ అంతా యువతదేనన్నారు. వైఎస్సార్ సిపిలో పనిచేసే వారికి గుర్తింపు లభిస్తుందని, గ్రామస్థాయిలో గ్రామకమిటీ జాబితా తయారు చేయాలని సూచించారు. జిల్లా యువజన అధ్యక్షుడు హనుమంతు కిరణ్‌కుమార్ మాట్లాడు తూ మండలాధ్యక్షులంతా యువతను భాగస్వామ్యం చేయాలన్నారు. పార్టీలో సమర్ధవంతంగా పనిచేసి మంచి ఫలితాలు చూపించాలన్నారు. ఈ సమావేశంలో పి.ఎం.జె.బాబు, దుప్పల రవీంద్రబాబు, మహిళా అధ్యక్షురాలు బొడ్డేపల్లి పద్మజ, వజ్జ బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
మత్స్యకారుల స్థితిగతులపై
ఆస్ట్రేలియా బృందం అధ్యయనం
వజ్రపుకొత్తూరు, సెప్టెంబర్ 14: మత్స్యకారుల జీవన విధానం స్థితిగతులపై శుక్రవారం హుకుంపేటలో ఆస్ట్రేలియా ఆర్ ఎంఐటి యూనివర్శిటీకి చెందిన పిజి విద్యార్థులు హేరీ, బ్రోన్, క్లేర్ మత్స్యకార మహిళలతో మాట్లాడారు. స్వయంశక్తి సంఘాల అభివృద్ధి, మత్స్యకారుల జీవనస్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. బ్రేడ్స్ సంస్థ వల్ల మహిళ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్న విషయాన్ని కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా యూనివర్శిటీ విద్యార్థినులు విలేఖరులతో మాట్లాడారు. ఇండియా సాంప్రదాయం ముఖ్యంగా గ్రామీణ జీవన విధానం తమకు ఎంతగానో నచ్చిందన్నారు. ఇక్కడ మహిళలు ఐక్యత తమ దేశ విధానం కంటే చాలా బాగుందని, పచ్చని వాతావరణం, చల్లనిగాలి, సముద్రపుఅలలు తమను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. మహిళలు చీరకట్టు, బొట్టు తమను ఆకట్టుకున్నట్లు చెప్పారు. ఇక్కడ ప్రజలు ఆర్థిక విధానం కుదట పడాల్సి వుందని వారు చెప్పారు. ఆస్ట్రేలియాలో ఆర్‌ఎంఐటి యూనివర్శిటీలో సోషయాలజీ, సైకాలజీలో పిజి ఫైనల్ చదువుతున్న తాము మత్స్యకార జీవన విధానం, స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ఇండియాకు వచ్చినట్లు వారు పేర్కొన్నారు. ఇప్పటి వరకు గుణుపల్లి, బైపల్లి, కంచిలి మండలం, శ్రీరాంపురం, బెండిగేటు, బ్రెడ్స్ ఫెడరేషన్ ప్రతినిధులతో సమావేశమై మత్స్యకారులు స్థితిగతులు వివరాలు సేకరించడం జరిగిందన్నారు. బ్రేడ్స్ ఆర్థిక సహాకారంతో మహిళలు ఏ విధంగా అభివృద్ధి చెందారనే అంశాన్ని కూడ తెలుసుకున్నారు. వీరితోపాటు బ్రెడ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు రాంబాబు, రమేష్, జగన్నాధబెహరా, ఫెడరేషన్ ప్రతినిధులు ఎం.జ్యోతి, విజయకుమారి, ఎం.్భనుమతి, మాజీ సర్పంచ్ ఎస్.పెంటయ్య, గ్రామ కమిటీ నాయకుడు వంక రామచంద్రరావు, స్వయంశక్తి సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.
వంశధార నిర్వాసితుల ఇళ్ల తొలగింపు
హిరమండలం, సెప్టెంబర్ 14: రిజర్వాయర్ నిర్మాణానికి ఆటంకం ఏర్పడడంతో అధికారులు నిర్వాసితుల గృహాలు తొలగించేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం హిరమండలం పంచాయతీ పరిధిలోని గొట్టాబ్యారేజి సమీపంలో గృహాలు తొలగింపు చర్యలు అధికారులు చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వాసితులు అడ్డుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి అడ్డుకున్నారు. దీంతో పరిస్థితులు ఉద్ధృతంగా మారాయి. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. రిజర్వాయర్ గట్టు నిర్మాణానికి ఆటంకం ఏర్పడడంతో గొట్టాబ్యారేజి సమీపంలోని కోరాడ బిట్ నెంబరు ఐదులోని పరిహారం చెల్లించిన గృహాలను తొలగించేందుకు నిర్ణయించారు. భూ సేకరణ యూనిట్ 1 ప్రత్యేకాధికారి హెచ్ వి జయరాం, వంశధార ఇఇ రాంబాబు, పోలీసులు, తహశీల్దార్ చంద్రశేఖర్ ఇళ్ళతొలగింపు ప్రాంతాలకుచేరుకున్నారు. గుర్తించిన తొమ్మిది గృహాలను పొక్లైనర్‌తో తొలగించేందుకు ప్రయత్నిస్తుండగా నిర్వాసితులు అక్కడకు చేరుకుని అడ్డుకున్నారు. నిర్వాసితులకు పరిహారం తక్కువగా ఉందని అధికారుల వద్ద ప్రస్తావించినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారులు ఇచ్చి న హామీలు అమలు కాలేదని అటువంటి పరిస్థితుల్లో ఇళ్ళతొలగింపులు అన్యాయమని ఆందోళన చేపట్టారు. దీంతో ఎస్‌ఐ తిరుపతిరావు కలుగజేసుకుని అధికారులతో మాట్లాడాలని సూచించారు. అనంతరం అధికారులు పోలీసు బందోబస్తు మద్య ఇళ్ళతొలగింపు కార్యక్రమం చేపట్టారు.
తొలగింపునకు కలెక్టర్ ఆదేశాలు
రిజర్వాయర్ గట్టు నిర్మాణానికి ఆటంకం ఏర్పడడంతో కోరాడబిట్ 5లోని పరిహారం చెల్లించిన ఇళ్ళ ను తొలగించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు వంశధార భూసేకరణ అధికారి హెచ్‌వి జయరాం పేర్కొన్నారు. పరిహారం చెల్లించిన గృహాలనే తొలగిస్తారన్నారు. దీంతో నిర్మాణాలకు అవకాశం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. నిర్వాసితుల సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.
ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
ఎచ్చెర్ల, సెప్టెంబర్ 14: ఈ ఏడాది బిఇడి కోర్సులో చేరే అభ్యర్థులకు అంబేద్కర్ యూనివర్శిటీలో శుక్రవారం వెబ్ కౌనె్సలింగ్‌ను ఇన్‌చార్జి వైస్ ఛాన్సలర్ భగవత్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎడ్‌సెట్ కౌనె్సలింగ్ నిర్వహించడం మొదటిసారి కావడం అభినందనీయమన్నారు. ఇదే మాదిరిగా లాసెట్ కౌనె్సలింగ్‌ను కూడా క్యాంపస్‌లోనే నిర్వహించేందుకు సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించనున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి ఎడ్‌సెట్ కౌనె్సలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులకు పూర్తి సౌకర్యాలు సమకూర్చామన్నారు. కేవలం రిజిస్ట్రేషన్, సర్ట్ఫికెట్ల పరిశీలన ప్రక్రియ మాత్రమే నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 28లోపు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. అలాగే 30, వచ్చే నెల ఒకటవ తేదీల్లోగా సీట్లు కేటాయిస్తామన్నారు. సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన కళాశాలలో రిపోర్టు చేయాలని సూచించారు. కౌనె్సలింగ్‌కు హాజరైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి 200 రూపాయలు, బిసి, ఒసి అభ్యర్థుల నుంచి 400 రూపాయలు రుసుము వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈయనతోపాటు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.కృష్ణమోహన్, ఎడ్‌సెట్ చీఫ్ కో-ఆర్డినేటర్‌గా ప్రొఫెసర్ చంద్రయ్య, కో-ఆర్డినేటర్‌గా ప్రొఫెసర్ ఉదయ్‌భాస్కర్, హెచ్.సుబ్రహ్మణ్యం, మాధవరావులు పర్యవేక్షిస్తున్నారు. మొదటిరోజైన శుక్రవారం ఫిజిక్స్ అభ్యర్థుల సర్ట్ఫికెట్లను పరిశీలించారు. హాల్‌టిక్కెటు, ర్యాంకు కార్డు, ఎస్.ఎస్.సి మార్కుల లిస్టు, ఇంటర్ మార్కుల జాబితా, డిగ్రీ మెమో స్టడీ సర్ట్ఫికేట్‌తోపాటు ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రాలను పరిశీలిస్తున్నారు.
మంత్రి అవినీతిపై శాసనసభలో ప్రస్తావిస్తాం: టిడిపి
శ్రీకాకుళం, సెప్టెంబర్ 14: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు అవినీతిపై రాను న్న శాసన సభ సమావేశాల్లో తమ పార్టీ ద్వారా చర్చలో ప్రస్తావింపజేస్తామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి(బాబ్జీ) అన్నా రు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన అఖిలపక్షం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు కృషిచేసిన త్యాగధనుల ఆలోచనలకు భిన్నంగా రాష్టమ్రంత్రి ధర్మాన ప్రసాదరావుపై చార్జిషీటు దాఖలైన విషయాన్ని గుర్తుచేశారు. చార్జిషీటు దాఖలైన 33 రోజులకు జిల్లాకు విచ్చేసిన ఆయన మందిమార్బలంతో కార్యక్రమం ఏర్పాటు చేసి తాను మంత్రిగా రాలేదని, శాసన సభ్యునిగా జిల్లాకు వచ్చానని తెలియజేసిన విషయాన్ని మరిచిపోరాదన్నారు. శాసన సభ్యునిగా ఉన్న ధర్మానకు మంత్రి హోదాలో జరగాల్సిన సౌకర్యాలు జరుగుతుంటే ఎందుకు స్వీకరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇటీవలి రోడ్లు పరిశీలనలో ఒక అవినీతి పరునిగా ధర్మాన వెళ్తుంటే ప్రజలు ఛీ కొడుతున్నారన్నారు. ఇవన్నీ మరిచి ధర్మాన చంద్రబాబునాయుడును విమర్శించడం విడ్డూరంగా ఉందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత సామాన్యునికి ప్రభుత్వ పాలకులు అందుబాటులో లేకుండా పోయారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్‌కు దారాదత్తం చేయడం కేబినెట్ నిర్ణయమని, ప్రతి ప్రభుత్వం ఇలానే చేస్తుందంటున్న ధర్మానను ఏ ప్రభుత్వంలోనైనా చార్జిషీటు దాఖలైన సందర్భాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. మంత్రి అవినీతిపై, అనైతిక చర్యలపై నిలదీయాలని, తమ నాయకుడు చంద్రబాబునాయుడుకు తెలియజేసి శాసన సభలో ప్రస్తావింపజేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో రైతు సంఘం నాయకులు రంథి అయ్యప్ప, దేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పి.వి.రమణ, అధికార ప్రతినిధి కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా ప్రచార కార్యదర్శి ఎస్.వి.రమణమాదిగ, ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు, బస్వా రాజేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నార్త్‌జోన్ విజేత విశాఖపట్నం
బలగ, సెప్టెంబర్ 14: ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో శుక్రవారం జరిగిన నార్త్‌జోన్ సీనియర్ మహిళా క్రికెట్ ఎంపికల్లో విజేతగా విశాఖపట్నం నిలిచింది. విశాఖపట్నం, తూర్పుగోదావరి జట్ల మధ్య ఉదయం జరిగిన పోటీలో జరిగింది. టాస్ గెలిచి ఫీల్డింగ్‌ను తూర్పుగోదావరి ఎంచుకోగా, విశాఖపట్నం బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 25 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. జట్టులో ఎస్.హిమబిందు 53 పరుగులు, కె.నిరోషిని 11 పరుగులు, కె.స్వాతి తొమ్మిది పరుగులు చేశారు. తూర్పుగోదావరి బౌలర్లు కె.శ్రావణి రెండు వికెట్లు, ఎ.సూర్యకుమారి ఒక వికెట్ సాధించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన తూర్పుగోదావరి జట్టు 25 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కేవలం 59 పరుగులు చేసింది. జట్టులో పి.కళ్యాణి పది పరుగులు, కె.లక్ష్మి పది పరుగులు చేశారు. విశాఖ బౌలర్లు ఎ.సమత మూడు వికెట్లు, కె.జ్యోతి ఆరు వికెట్లు, కె.నిరోషిని ఒక వికెట్ తీశారు. దీనితో 65 పరుగుల తేడాతో విశాఖపట్నం విజయాన్ని సొంతం చేసుకుంది. మధ్యాహ్నాం శ్రీకాకుళం, విజయనగరం జట్ల మధ్య పోటీ జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీకాకుళం 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేయగల్గింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన వియనగరం 10.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 25 పరుగులు చేసింది. అయితే వర్షం కురియడంతో వి.జె.డి మెథడ్ ప్రకారం శ్రీకాకుళం జట్టు 17 పరుగులు తేడాతో గెలుపొందినట్లు ప్రకటించారు. మొత్తం పాయింట్ల ప్రకారం విశాఖపట్నం అధికంగా ఉండడంతో విజేతగా ప్రకటించారు.